గద్దర్ సంస్మరణ సభ అక్కడే ఎందుకు జరిగింది?
x

గద్దర్ సంస్మరణ సభ అక్కడే ఎందుకు జరిగింది?

హుస్నాబాద్ స్థూపం మాయంకాలేదు, మనసుల్లో పదిలమైంది...


-రమణాచారి


గద్దర్ సంస్మరణ సభ ఈనెల 6న హుస్నాబాద్ లో జరిగింది. హుస్నాబాద్ లో చారిత్రక నిర్మాణమై నిలిచి, పేల్చివేయబడి శిధిలమైన స్థూపం వద్ద సభను నిర్వహించారు. మూడు దశాబ్దాల క్రితం విప్లవకారుల స్మృతిలో నిర్మించిన స్థూపం ఆవిష్కరణలో పాల్గొన్న గద్దర్ ను అక్కడే స్మరించుకోవడం సబబు అని భావించిన నిర్వహణ కమిటీ చొరవతో సభను స్థూపo వద్ద ఘనంగా జరిపింది. కంపచెట్లతో పడావు పడిపోయిన ప్రాంతాన్ని దశాబ్దాల కాలం తర్వాత శుభ్రం చేసి సభ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
అమరుల త్యాగాలు ఎప్పుడు గుబాళిస్తూనే ఉంటాయి. నిలువెత్తు సాక్షాలుగా స్థూపాల రూపంలో ప్రేరణ ఇస్తూనే ఉంటాయి. పోరాట, ఉద్యమ స్ఫూర్తిని పల్లెలలో సజీవంగా చాటుతూనే ఉంటాయి అమరుల త్యాగాల పోరాట స్ఫూర్తిని గుండెలలో నింపుతూనే ఉంటాయి. చెరిపి వేయలేని చరిత్రకు సాక్ష్యాలుగా ప్రేరణ కలిగిస్తుంటాయి. అలాంటి వాటిలో అత్యంత ఖ్యాతి పొందినది హుస్నాబాద్ అమరుల స్థూపం. చైనాలోని తీయనాన్మెన్ స్క్వేర్ లో నిర్మించిన స్థూపం తర్వాత ఆసియా ఖండంలో నిర్మించిన అతి పెద్ద రెండవ స్తూపం హుస్నాబాద్లో నిర్మించిన విప్లవ అమరుల స్థూపం. 1989 నుండి ఏడాది పాటు పీపుల్స్ వార్ పార్టీ సానుభూతిపరులు, రైతు కూలీలు పైసా పైసా పోగేసి నిర్మించిన స్థూపం అది. ఆసియా ఖండంలోనే అతి పెద్ద రెండవ స్థూపంగా 88 అడుగుల ఎత్తులో అత్యంత ప్రతిష్టాత్మకంగా వేలాది మంది శ్రమదానంతో, ప్రేమగా నిర్మించుకున్న స్థూపం అది.
స్థూప నిర్మాణం జరిగి నేటికీ 33 ఏళ్లు. పదేళ్లలోనే గ్రీన్ టైగర్స్ పేరుతో స్థూపాన్ని డైనమెట్లతో పేల్చి వేశారు. ఆ శిథిలాలు మాత్రం పోరాట వీరుల త్యాగాలను గుర్తు చేస్తూనే ఉంటాయి. నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి పీపుల్స్ వార్ పార్టీ కి స్వేచ్ఛ కాలం ప్రకటించడంతో, ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సంద రాజమౌళి పర్యవేక్షణలో హుస్నాబాద్ స్థూప నిర్మాణం జరిగింది. అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టి,చర్చకు వీలు కల్పించిన ఈ స్థూపాన్ని అమరుడు పులి రాములు తండ్రి పులి మల్లయ్య ఆవిష్కరించాడు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రజా గాయకుడు గద్దర్, విప్లవకవి వరవరరావు, పౌర హక్కుల నేత బాలగోపాల్ వంటి ప్రముఖులు, జననాట్యమండలి నుండి డప్పు రమేష్, రాజనర్సింహ లాంటి కళాకారులు ఎందరో పేరు గల ప్రముఖులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఆస్మరణ అజరామరంగా కదలాడుతూనే ఉన్నది.కూలిన శిధిలాల మధ్యకు వెళ్ళిన అమరుల, బంధుమిత్రుల కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న ప్రజల భావోద్వేగం తో కూడిన ఆందోళన వారి ముఖాల్లో ప్రస్ఫుటంగా ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది.

ఒక నాటి స్థూపం


ఆగస్టు ఆరో తారీఖున గద్దర్ సంస్మరణ సభ ఈ స్థూపం వద్దనే జరపడం ప్రాధాన్యత సంతరించుకున్నది. గద్దర్ వర్ధంతి సభ నిర్వాహణకు అధ్యక్షులుగా కవ్వ లక్ష్మారెడ్డి, కన్వీనర్ గా మేకల వీరన్న యాదవ్ లతో కమిటీ ఏర్పడి హుస్నాబాద్ స్థూపం వద్ద పెరిగిన కంపచెట్లను తొలగించి, సమాంతరంగా చదును చేసి పూర్తిగా శుభ్రం చేసి అక్కడే వర్ధంతి ఘనంగా నిర్వహించారు. మట్టిలో కోరుకుపోయిన క్వింటాళ్ల బరువున్న సుత్తి కొడవలికి ఎర్ర రంగు వేసి నిలబెట్టారు.అనేక ఆటంకాలు, తొలగని భయాందోళన మధ్య సభా వేదిక ఏర్పాటు చేసి గద్దర్ సంస్మరణ సభ నిర్వహించారు. హుస్నాబాద్ అమరుల స్థూప శిథిలాల దగ్గర నిర్వహించిన ఈ సభకు అమరుల కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ జ్ఞాపకాలను తలపోసుకున్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. స్థూపాన్ని తిరిగి నిర్మించాలని సభకు వచ్చిన ప్రజలు మంత్రికి వినతి పత్రాలు అందజేశారు. దశాబ్దాల కాలం పాటు, కంపచెట్ల మధ్య కనిపించకుండా ఉండిపోయిన స్మారక స్థూపం జ్ఞాపకాలు, రూపాన్ని ప్రజలు చూసి ఉద్విగ్నతకు లోనయ్యారు. జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.ఫోటోలు దిగారు. సెల్ఫీలు తీసుకున్నారు. కంటతడి పెట్టుకున్నారు. అయినా వారి ముఖాల్లో ఏదో తెలియని ఆనందంతోణికిసలాడింది. కమ్యూనిస్టుపార్టీలు , విప్లవ పార్టీలు తమ ఉద్యమాల్లో, పోరాటాలలో అమరుల స్మృత్యర్థం స్థూపాలు నిర్మించడం ఆనవాయితీ. ప్రజల హక్కుల కోసం, వనరుల రక్షణ కోసం, స్వేచ్ఛ స్వతంత్రాల కోసం, దోపిడీ పీడనలకు వ్యతిరేక పోరాటంలో అసువులు బాసిన వారి గుర్తులే స్థూపాలు.

తెలంగాణ సాయుధ పోరాట కాలంలో తెలంగాణలో నిర్మించిన స్థూపాలు గ్రామ గ్రామాన దర్శనమిస్తూనే ఉంటాయి. నక్సల్ బరి ఉద్యమం వేలాది స్థూపాలు నిర్మించడం చూస్తూనే ఉన్నాం. వీటిని కూల్చేసే ప్రయత్నాలు చూస్తున్నాం. అమరుల త్యాగాల గుర్తులను చెరిపేయడం కోసమే కూల్చివేయడం కూడా జరుగుతూనే ఉంది. కాకపోతే పీడిత ప్రజలతో పెనవేసుకుపోయిన వారి బాంధవ్యాలు మాత్రం జనం గుండెల్లో స్ఫూర్తిని రగిలిస్తూనే ఉన్నాయి. చెరిపేస్తే చెరగని సత్యాలుగా అమరుల స్వప్నాలు మేలుకొలుపుతూనే ఉంటాయి.


Read More
Next Story