మాల, మాదిగలు కలసి చేయాల్సిన ఉద్యమాలు మర్చిపోరాదు...
భిన్న స్వరం: ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు, జనాభా లెక్కలు కోసం, న్యాయవ్యవస్థలో రిజర్వేషన్ల సామాజిక మాల మాదిగలు సమిష్టిగా ఉద్యమాలు చేపట్టాల్సిన సమయం వచ్చింది
-జువ్వాల బాబ్జి
ఇటీవల షెడ్యూల్ కులాల షెడ్యూలు తెగల వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది . 565 పేజీలున్న ఈ సుదీర్ఘ తీర్పులోని చాలా అంశాలు తీర్పును ఆవేశంగా వ్యతిరేకించే వారికి గాని లేదా దానిని స్వాగతించే వారికి గాని చాలామందికి తెలియదని నా ఉద్దేశం.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ఆయా రాజకీయ పార్టీలు ప్రకటనలు ఇస్తున్నారు.రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రకటనలను సామాజిక ఉద్యమాలను విభజించే దిశగానే పరిశీలించాల్సి ఉంటుంది. అసలు షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం గురించి మాట్లాడాలంటేనే అది ఒక సంక్లిష్టమైన సమస్యగా అర్థం చేసుకోవాలి. మాల,మాదిగ కులాలు భవిష్యత్తులో ప్రైవేటు రంగంలో లేదా పెరిగిన జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల కోసం కలిసికట్టుగా పోరాడే అవకాశాలు తక్కువనే అనుకోవాలి.
సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించే మాల సామాజిక వర్గం సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుపుతున్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాలలంతా ఐక్యంగా ఈనెల 21వ తారీకున జరిగిన భారత్ బంద్ లో పాల్గొని పెద్ద ఎత్తున తమ నిరసనను తెలియజేశారు . అసలు షెడ్యూల్డ్ కులాల వారిని ఏ.బి.సి.డిలు గా విభజించడానికి ముందు రెండు తెలుగు ప్రభుత్వాల దగ్గర ఉన్న శాస్త్రీయమైన సమాచారం ప్రజల ముందు చర్చకు పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.రెండు వర్గాలలో ఉన్న అనుమానాలు భయాలు నిరుత్తి చేయాల్సి ఉంది.
ఎందుకంటే సుప్రీంకోర్టు ధర్మాసనం లో సభ్యులుగా ఉన్న ఏడు మంది న్యాయమూర్తులలో జస్టిస్ గవాయి క్రీమీ లేయర్ పరిధిలోకి వచ్చే షెడ్యూల్డ్ కులాల వారిని గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవలసిన జాగ్రత్తలగురించి చాలా స్పష్టంగా చెప్పారు. ముందుగా మనం మాదిగ దండోరా పోరాటంలో భాగంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం నియమించిన రిటైర్డ్ జస్టిస్ పి రామచంద్రరాజు కమిషన్ గురించి మాట్లాడుకోవడం మంచిది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల ఏబిసిడి వర్గీకరణ కోసం నియమించిన జస్టిస్ పి రామచంద్ర రాజు కమిషన్ నిబద్ధతను ఒకసారి పరిశీలించాల్సి ఉంది . ఆ కమిషన్ నివేదిక పైన అప్పట్లోనే మాల సామాజిక వర్గం అనేక అనుమానాలను లేవనెత్తింది. అంతేకాకుండా నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా రామచంద్ర రాజు కమిషన్ ఇచ్చిన రిపోర్టు తన అసంతృప్తిని వెళ్లబుచ్చింది.
అర కొర సమాచారం పై ఆధారపడిందని, సరైన సమగ్రమైన విషయ సేకరణ లేదని, కాబట్టి వివిధ స్థాయిలో ఒక శాస్త్రీయ పద్ధతిన షెడ్యూల్ కులాల అభివృద్ధి, వారి వెనుక పాటు తనం, షెడ్యూల్ కులాల మధ్య ఉన్న వ్యత్యాసాలను సేకరించమని అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసింది. జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ హడావిడిగా షెడ్యూల్ కులాల వారికి సంబంధించి లేదా 59 కులాలలో ఆయా కులాల వారు పొందుతున్న రిజర్వేషన్ల గురించి తీసుకున్న సమాచారాన్ని పరిశీలిస్తే విద్య సంస్థలు నుండి 1995 నుండి తీసుకున్నారు.అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో షెడ్యూల్డ్ కులాల ఉద్యోగుల వివరాలను 1990 సంవత్సరం నుండి తీసుకున్నారు. దానిని బట్టే అర్థమవుతుంది జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఇచ్చిన రిపోర్టు అసంబద్ధమైనదని .
రిజర్వేషన్లు గురించి రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 సంవత్సరం లెక్కలు తీయాల్సి ఉంది కదా? అంతేకాకుండా 59 షెడ్యూల్డ్ కులాలలో ఎంతమంది అభివృద్ధి చెందారు? ఎంతమంది అభివృద్ధి చెందుతూ ఉన్నారు? ఎంతమంది అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడిపోయి ఉన్నారు ?వారి ఆర్థిక స్థితిగతులు , ఆవాసాలు ,ఇండ్లు ,ఆరోగ్యం విద్య ,ఉపాధి ,భూములు, ఉద్యోగాలు ఈ వివరాలన్నీ సేకరించాలి కదా?
కానీ కమిషన్ ఆ విధంగా చేయలేదు. కేవలం అప్పటి ప్రభుత్వ మెప్పుకోసం సమాచార సేకరణ చేసి 28 మే 1997 నాడు అసమగ్రమైన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారనిపిస్తుంది.
ఆ వెంటనే 1997 -98 సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ జరిపింది. అయితే ,ఈ షెడ్యూల్ కులాల వర్గీకరణ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కానీ ,కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విద్యాసంస్థల్లో సీట్లకు గాని వర్తించదని ప్రభుత్వ ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొన్నారు . ఈ విషయాన్ని మాల, మాదిగ కులాలు అర్థం చేసుకోవాలి.
అంటే చంద్రబాబు నాయుడు కు షెడ్యూల్ కులాలలో వర్గీకరణ వ్యవహారం అంత సులువైన వ్యవహారం ాదు అనేది తెలుసు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాదిగ దండోరా పోరాటానికి మద్దతు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ లేదా, జనసేన పార్టీ ,కమ్యూనిస్టు పార్టీలు గమనించవలసింది ఏమిటంటే తీర్పు ద్వారా జాతీయస్థాయి సంస్థలలో విద్య అవకాశాలు పొందటానికి లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందటానికి షెడ్యూల్ కులాల లో ఏబిసిడి వర్గీకరణ జరపడానికి అవకాశం లేదు.
దానికి సమగ్రమైన ఒక జాతీయ స్థాయి విధానం రూపొందించాల్సి ఉంటుందని గ్రహించాలి .ఇది తెలిసి కూడా అన్ని రాజకీయ పార్టీలు సాధ్య అసాధ్య లు మరిచి షెడ్యూల్ కులాల మధ్య వైషమ్యాలు పెంచే విధంగా ప్రకటనలు చేయటం విచారకరం. రామచంద్ర రాజు కమిషన్ తెచ్చిన నివేదికపై నేషనల్ ఎస్సీ కమిషన్ నోట్ రూపంలో తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. అస్పష్టమైన సమాచారం ఆధారంగా , కమిషన్ రిపోర్టును ప్రామాణికంగా తీసుకుని షెడ్యూల్ కులాల వర్గీకరణ జరపమని ఆదేశించలేమని స్పష్టం చేసింది. అయినా కానీ అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెల 1997లో షెడ్యూల్ కులాలను ఏబిసిడిలు గా వర్గీకరిస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది.
ఆ ఆర్డినెన్స్ వ్యతిరేకిస్తూ గౌరవ ఏపీ హైకోర్టులో మాల సామాజిక వర్గానికి చెందిన ఇ.వి చెన్నయ్య కేసు వేశారు. ఆ కేసు కోర్టులో పెండింగ్లో ఉండగానే ,ఆర్డినెన్స్ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల రేషనల్లైజేషన్ మరియు రిజర్వేషన్ చట్టం- 2000గా మే లో తీసుకొచ్చారు. ఈ చట్టం ద్వారా ఏబిసిడి వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది .ఆ చట్టాన్ని కూడా మాల సామాజిక వర్గానికి చెందిన వారు ఏపీ హైకోర్టులో సవాలు చేయగా ,దానిని నవంబర్ 2000 లో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దానిపై ఆ చట్టాన్ని సవాల్ చేస్తూ ఇ.వి చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ కేసుగా సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఆ చట్టాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు మే 11 2004 తేదీన తీర్పునిచ్చింది.
ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని తప్పుపడుతూ ,రాష్ట్ర అసెంబ్లీకి అటువంటి చట్టం చేసే అధికారం లేదని ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 విరుద్ధంగా ఉందని అభిప్రాయపడింది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించింది . షెడ్యూల్ కులాల వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి ది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ లేఖ లు ది మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ను 28 మార్చి 2005 అభిప్రాయం అడుగుతూ రాసింది . ఆ క్రమంలో ది మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ తన అభిప్రాయం చెప్పమని అప్పటి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ను కోరింది .దానికి ఆయన ఇలా తన అభిప్రాయాన్ని చెప్పారు.
అటువంటి వర్గీకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేయాలంటే దోష పూరితం కానీ ఆధారాలను పరిగణనలోకి తీసుకోవాలని ,మరిన్ని ప్రమాదాలతో నింపకూడదని, అభిప్రాయపడ్డారు.అంతేకాకుండా కొన్ని రాజ్యాంగ సవరణలు తీసుకురావాలని కూడా సూచించారు. షెడ్యూలు కులాలలో ఏబిసిడి వర్గీకరణ జరపడంలో ఉన్న సమస్యలు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియనివి కావు. అలాగే ఆయా రాజకీయ పార్టీలకు కూడా తెలుసు.
అయినా గత 30 సంవత్సరాలుగా వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పక్షాలు మాల ,మాదిగల మధ్య వైరం పెంచుతూ ఉమ్మడిగా సాధించుకోవలసిన హక్కుల దూరం పెట్టగలిగారు.పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచమని పోరాడటంలో మాల మాదిగ సామాజిక వర్గాలు విఫలమయ్యాయి. ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం నిర్వీర్యం చేస్తూ, విద్య ఉద్యోగ దెబ్బతీస్తున్నారు
అయినా మాల, మాదిగ లు ప్రభుత్వాలను ప్రశ్నించలేని దయనీయ స్థితిలో ఉన్నారు. సహజ వనరులైన భూమి, అడవి కార్పొరేట్ కంపెనీల చేతుల్లో ప్రభుత్వాలు పెడుతున్నాయి . అయినా పట్టించుకోము . కనీసం నివాసానికి అవసరమైన ఇండ్ల స్థలాలు లేక మాల మాదిగ లు పడుతున్న ఇబ్బందులు గురించి అందరికీ తెలిసిందే! అయినా మీరు మీరు వర్గీకరణ కోసం కొట్టుకొని చావండి.మీ పంచాయతీ తేల్చుకున్నాక మా వద్దకు రండి! అని పాలక కులాలు, వారి అధీనంలో ఉన్న ప్రభుత్వాలు, ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న బ్యూరోక్రాట్స్ రిజర్వేషన్లు నిర్వీర్యం చేస్తూ తీసుకొచ్చే పాలసీలను ప్రశ్నించే స్థితిలో మనము లేము అనేది గ్రహించనంత కాలం షెడ్యూల్ కులాల వారు నష్టపోతూనే ఉంటారు .
మరలా షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో మరొక ధర్మాసనంలో పరిశీలనలో ఉంది ఈ లోపుగా నైనా ఇంతకాలం రిజర్వేషన్లు అందుకోలేక వెనుకబడిపోయిన వారి లెక్కలు ఒక శాస్త్రీయ పద్ధతిలో తీయాలని వారు కూడా మనలో ఒకరు కాబట్టి వారికి అందాల్సిన రిజర్వేషన్లు వారికి అందే లాగున అంతో ఇంతో మేలు జరిగిన మాల మాదిగ వర్గాలు సమాలోచన చేయాల్సి ఉంది . ఎప్పటికైనా క్రిమి లేయర్ ను అని గుర్తించాల్సిందే . ఈ సందర్భంగా మనం ఎవరినైతే దేవుడిగా ఆరాధిస్తా మో ,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మాటలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం .
"అది 31 జూలై 1956, రాత్రంతా నిద్రపోకుండా, అంబేద్కర్ గారు తనలో తాను మదన పడిపోతూ ,ఉదయం కళ్ల వెంట నీళ్లు కారుస్తూ ఉండటాన్ని ఆయన ప్రత్యేక కార్యదర్శి దత్తు గమనించాడు. ఆందోళనతో ఆయన భయభయంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని ఒక ప్రశ్న అడిగాడు.బాబా ఎందుకు ఏడుస్తున్నారు? నేను, మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. కానీ అడగలేక పోతున్నాను. అయినా తప్పట్లేదు, ఎందుకు బాధపడుతున్నారు?" అని అన్నాడు . దానికి సమాధానంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు ఇలా అన్నారు .
"నేను నా జీవితాంతం ఒంటి చేత్తో పోరాడి తీసుకొచ్చిన ఈ చిన్న రిజర్వేషన్స్ కొంతమంది చదువుకున్న వారు అందిపుచ్చుకున్నారు. ఇంకా 90% మంది , నా జాతి ప్రజలు గ్రామాల్లో కూలీ, నాలి చేసుకునే వారికి అందలేదు . నా ఆరోగ్యం పాడయింది. వారందరికీ చేరే విధంగా ఏం చేయాలి ?ఎలా చేయాలి ? అని మదన పడుతున్నాను," అని సమాధానం చెప్పారు .
కాబట్టి షెడ్యూల్ కులాలలో వర్గీకరణను వ్యతిరేకించేవారు పై సమస్య తీవ్రతను అంబేద్కర్ను దృష్టిలో పెట్టుకుని అర్థం చేసుకోవాలి . దానిని సాధించుకోవాలి అనుకునే వారు ఇది కేవలం మాలల వల్ల జరిగిన నష్టం గా కాకుండా, గత 75 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయకుండా, మనలో మనకు గొడవలు సృష్టించి మనల్ని శత్రు శిబిరాలుగా మార్చేశారు. ఈ విభజన కుట్రలను అర్థం చేసుకోనంతకాలం రెండు శిబిరాలకు నాయకత్వం వహిస్తున్న మాల మాదిగలు మిగతా 57 కులాలకు అన్యాయం చేసిన వారు అవుతారు .
పైన నేను ప్రస్తావించిన ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల కోసం, ప్రస్తుతం షెడ్యూల్ కులాల జనాభా లెక్కలు కోసం, సహజ వనరుల్లో మన వాటా కోసం, న్యాయవ్యవస్థలో రిజర్వేషన్ల కోసం, క్రిమిలేయర్ విధానంలో ఒక శాస్త్రీయమైన సమగ్రమైన నివేదిక కోసం పోరాడాలని ఆ దిశగా సామాజిక ఉద్యమాల నిర్మాణం చేపట్టాలని ఆశిస్తున్నాను.
( రచయిత అడ్వకేట్, రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారులు యూనియన్ జంగారెడ్డి గూడెం)
Next Story