సైబర్ వసంత కోకిల
x

సైబర్ వసంత కోకిల

జూకంటి జగన్నాథం ‘ఉగాది’ కవిత



ఎన్ని సీసీ కెమెరాలున్నా

చిక్కని పొలిటికల్ గజదొంగ

సంపదను కాజేసిన మాటల మరాఠీ

అసలు సిసలైన లఫంగ

ఎటువంటి కాలం వచ్చిందని

గతంలోకి ప్రయాణం చేయకండి

వసంతం ఫార్మేట్ సైట్లోకి

ఉగాది పాస్వర్డ్ తో లాగిన్ కండి

గూగుల్ బాటలో ఊరును

వెతుక్కుంటున్న కండ్లున్న గుడ్డోన్ని

నగరంలో ఇంగ్లీషు నాలిక లేని

మాటలు వచ్చి మాట్లాడరాని ఎడ్డోన్ని

తల్లి నుంచి బిడ్డను వేరు చేసినట్టు

గోసగోసోలె చూస్తున్న

ఊరు ఉసురు తీరు గురించే

నేనియ్యాల్ల మాట్లాడుతున్నాను

క్షతగాత్రమైన గ్రామాలు

గరళాన్ని మింగుతున్న పొలాలు

అయితే అనావృష్టి కాకుంటే అతివృష్టి

మా ఊరు కాట కలిసి పోయింది

లొకేషన్ పెట్టి గూగుల్ కంఢ్లతో వెతికినా

నగరంలో చిరునామా వెలిసి పోయింది

ఎటు చూస్తే ఆటు

కలుపు మొక్కల్లా సెల్ టవర్లు

పక్షులకు సిగ్నల్స్ దస్తూరీతో

రాసిచ్చిన డైయింగ్ డిక్లరేషన్లు

అది వగలమారి కన్నీళ్ళ ఆపతి మొక్కు

ఇది ఎన్నాళ్లైనా తుమ్మితే ఊడే ముక్కు

ఎవని కడుపు కిందికి

వాడు తోడుకునే పందికొక్కు

పెనం మీంచి పొయ్యిలో పడ్డ

సామాన్యుని బతుక్కు రంధే దిక్కు

గ్రాఫిక్స్ లో చిగురించే వసంత వనాలు

గూగుల్ లో గొంతెత్తే కోకిల గానాలు

వసంతాల సంతోషాన్ని

వెంటబెట్టుకోరాని చోట

విదూషక కవి కోకిల ఏ.ఐ.

పాడుతుంది పాట ఇచ్చోట

ఈ కవిత నచ్చితే

షేర్ చేయండి లైక్ చేయండి

సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి

---జూకంటి జగన్నాథం

Read More
Next Story