మళ్లీ దుఃఖిస్తోన్న బెజవాడ !
x

మళ్లీ దుఃఖిస్తోన్న బెజవాడ !

కొత్త కన్నీళ్లు తుడువడానికి మనుషులుగా స్పందిద్దాం


-పి. ప్రసాద్ (పిపి)

మళ్లీ దుఃఖిస్తోన్న బెజవాడ కొత్త కన్నీళ్లు తుడువడానికి మనుషులుగా స్పందిద్దాం.

మొన్నటి వరద ముంపు ఓ జనజీవన విధ్వంసం. నిన్నటి వరద సహాయక సందడి ఆ నెత్తురోడుతున్న విధ్వంసపు గాయం మీద ఓ పొలిటికల్ ఆయింటుమెంట్ పూత. ఆ రెండు దశల ప్రచార సందడి ముగిసింది. మూడు రోజుల క్రితం మూడో దశ మొదలైనది.

బెజవాడలో ఆరిన ఇళ్లను బాధితులు తిరిగి తమ నిశ్శబ్ద కన్నీటితో తడుపుతున్నారు. అవి అనాధల రోధనలుగా, నిస్సహాయుల వేదనలుగా, దుర్బలుల ఆక్రందనలుగా మారాయి. ఈ మూడోదశలో దుఃఖిత బెజవాడ మీడియా దృష్టిలో పడలేదు. కారణం ఏమోగానీ సోషల్ మీడియా దృష్టికి కూడా నోచుకోలేదు.

తాజా బెజవాడ బాధితుల హాహాకారాలు వరద నుండి బయటకు తెచ్చే బోట్ల కోసం కాదు. అన్నం పొట్లాల కోసం కాదు. వాటర్ బాటిల్స్ కోసం కాదు. అందుకేనెమో ఈసారి ఎవరికీ పట్టనిదై పోయింది.

ఈ దుఃఖం మొన్నటి జీవన విధ్వంసం పై కాదు. ఏడ్చినా తిరిగిరాని గృహ వస్తుసామాగ్రి కోసం కాదు. వాటిని బెజవాడ అధిగమించుతోంది. "కాలం గాయాన్ని మానిపిస్తుంది" అనే సామెత ఊరకనే రాలేదేమో! సిన్సివిటీని వదిలి రెసిస్టన్స్ ని బెజవాడ పెంచుకుంటోంది. ఇంతలో మరోదెబ్బ తగిలింది.

ఏండ్ల తరబడి భార్యాభర్తలు శ్రమించి కష్టార్జితంతో పొందిన డబుల్ కాట్, బీరువా, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, గిన్నెలూ, పళ్ళాలు కోల్పోయిన దుఃఖం ఒక ఎత్తు. దానికి రెసిస్టన్స్ పవర్ పొందే లోపు తగిలిన దెబ్బ మరో ఎత్తు! పంక్తిలో విస్తరివేసి వడ్డించుతూ తన వరకూ రావడానికి ముందు మెతుకు లేదని పంక్తి నుండి లేపివేస్తే ఎలా ఉంటుంది? ఆకలి మాట తర్వాత సంగతి. అవమానం తోడవుతుంది. ఇది భౌతిక గాయమే కాకుండా మానసిక గాయం కూడా!

కవులూ, కళాకారులూ, కధా రచయితలూ నేడు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తే విషాద గాధలు, చరితలు, పాటలు ఆశువుగా పెల్లుబుకుతాయి. ఏ వీధికి వెళ్లినా బాధిత ప్రజల రోధనలే కాక శాపనార్ధాలూ, తిట్లూ వినిపిస్తాయి. బాధిత ప్రజల్లో స్వయంగా ప్రభుత్వం కల్పించిన ఆశల్ని ప్రభుత్వమే చిదిమివేస్తోన్న నాటకాన్ని దర్శించే అవకాశం ఉంది. సాహిత్య కేంద్రమైన బెజవాడ స్పందిస్తుందని ఆశిద్దాం.

ప్రజలను గాయపరిచే కత్తి కనబడదు. అయింటుమెంట్ పూసే చేతులు కనబడవు. ఈ దశలో బాధితల గొంతు తడి గుడ్డతో నులిమివేసే శీతల హత్యా దృశ్యం కనిపిస్తుంది. అందుకు సూక్ష్మ చూపు గల దృష్టి కోణం కూడా ఉండాలి.

ప్రభుత్వ సాయం కంటే ప్రజలు, స్వచ్ఛంద సంస్థల సాయమే ఎక్కువ కావడం కొత్త రికార్డ్! కార్పొరేట్ల కోసం తప్ప ప్రజల కోసం సర్కార్లు ఖర్చు చేసే అవసరం లేదనే ప్రపంచ బ్యాంకు విధానానికి ఇదొక మచ్చుతునక! ప్రజల కోసం వారి నుండే యూజర్ చార్జీల్ని వసూళ్లు చేసే నీతికి రోల్ మోడల్! ప్రపంచీకరణ విధానాల్ని వరద నిధులకు సైతం వర్తింపజేసిన ఘనతని ఈ సర్కారు దక్కించుకుంది. ప్రజల కోసం ప్రజలే ₹400 కోట్లు ఇస్తే ప్రభుత్వం ₹200 కోట్లు ఇచ్చి ప్రపంచ బ్యాంకు దృష్టిలో క్రెడిట్ కొట్టేసింది.

ఈ ఆపద సమయాల్లో ప్రజల కోసం భారీ, భూరి సాయాలు చేసే బాధ్యత ప్రభుత్వాలదైతే ప్రజల కోసం ప్రజలు ఉడతా భక్తి సాయం చేయాలనే పాత నిర్వచనాన్ని తిరగ రాయడం ఉదార విధానాల చరిత్రలో ఓ కొత్త రికార్డ్. ₹600 కోట్లలో ₹400 కోట్లు విరాళాల ద్వారా సేకరించడం ఓ సరికొత్త రికార్డ్! మన రాష్ట్ర ప్రజల ఓట్ల ద్వారా ఢిల్లీ పీఠం పై నిలబడ్డ మోడీ ప్రభుత్వం పై వత్తిడి తేగలిగే అవకాశం ఓ ఎండమావియే. రెండు వేల కోట్ల వరద సాయం మోడీని కోరాలనే రాష్ట్ర ప్రజల ఆశకి ప్రాణం పోసే స్థితి లేదు. పైగా తెలుగు వారి నెత్తుటి త్యాగ ఫలం విశాఖ ఉక్కుని ఇదే అదునుగా బలిపెట్టే జూదం ప్రారంభించిన క్రీడ ఓ దుష్ట చరిత్ర అవుతుంది.

వరద సహాయ ప్యాకేజిని ప్రకటించాక వ్యూహాత్మకమో, యాదృచ్ఛికమో కనకదుర్గమ్మ వైపు నుండి తిరుపతి వెంకన్న వైపు దృష్టి మళ్లించడం వరద అధ్యాయం ముగించి మరో అధ్యాయాన్ని తెరవడమేమో! వరద అధ్యాయాన్ని ముగించే కౌటిల్య క్రీడలో బెజవాడ మూల్యం చెల్లిస్తున్నదేమో! ఇది తడిగుడ్డతో గొంతుకోసే ఓ నిశ్శబ్ద హంతక విధానమేమో!

ముంపు ప్రాంతాల్లో నేడు ఏ వీధికి వెళ్లినా ప్రభుత్వ సాయం అందడం లేదనే ప్రజాఘోషతో పాటు ప్రజల శ్రేయస్సు కోసం తమకి ముఖ్యమంత్రి ఇస్తుంటే ఎన్యుమరేటర్లు శిఖరం వలె అడ్డుపడుతున్నారనే మాట వినిపిస్తోంది. నేడు ప్రభుత్వం పెద్ద విజయం సాధించింది. వెయ్యు కోట్లకి పైగా సాయం చేయాల్సిన బాధ్యత వదిలేసి దానాల సొమ్ములో 66 శాతం (₹400 కోట్లు) నిధికి 33 శాతం (₹200 కోట్లు) కలిపి, ప్రజల మనస్సుల్లో దానకర్ణ ముద్రను వేసుకుంది. ఎన్యుమరేటర్లని బాధితుల మనస్సుల్లో పెద్ద దుష్టులుగా చిత్రించి తాను పొలిటికల్ క్రెడిట్ కొట్టేసింది.

గ్రౌండ్ ఫ్లోర్ కి ₹25,000 నష్టపరిహారం "అదర్ ఫ్లోర్" పేరిట ఎగవేసింది. ఎవరిది గ్రౌండ్ ఫ్లోర్, ఎవరిది అప్ స్టెయిర్స్ తెలియనిది కాదు. ఎన్యుమరేటర్లకి జనం పై ఈ కక్ష ఎందుకుంటుంది?

₹25,000 ఇవ్వాల్సిన గ్రౌండ్ ఫ్లోర్ కి ₹10,000 కి పరిమితం చేసింది. చాలా మందికి ఆ ₹10,000 కూడా లేదు. ఇంత దారుణం ఎన్యుమరేటర్ల వల్ల జరిగిందా?

అప్ స్టెయిర్స్ నివాసులకు ₹10,000 ఇవ్వాలి. అందులో సగం మంది వరకు టూ వీలర్ కి ₹3,000 ఇచ్చి ₹10,000 ఇవ్వలేదు. ఇదేం దారుణం?

ఇక టూ వీలర్స్ కథ కూడా ఇలాంటిదే. రాసుకెళ్లిన సగం బండ్లకి నష్ట పరిహారం లేదు.

ముఖ్యంగా ఆటో డ్రైవర్ల కథ మరింత ఘోరం. అందరిలాగే ఇళ్లల్లో సామాగ్రితో పాటు నిత్య జీవనోపాధి సాధనమైన ఆటోను కూడా నష్టపోయారు. వారిది అందరికంటే దారుణం. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఎగవేత కోసం ఇన్సూరెన్స్ కంపెనీలు దిగాయి. ఇన్సూరెన్స్ వున్నా లబ్ది పొందలేనిస్థితి కూడా ఉంది. ఆటోలు పూర్తిగా పాడై పోయాయి. ఆటోకు ₹లక్షకి మించి రిపేరుకి అవుతుంది. ప్రకటించిన సాయం ₹10,000 మాత్రమే. అదీ ఆచరణలో అమలు జరగడం లేదు.

పొరపాట్లు నూటికి ఒక్కరికే జరిగితే ఎన్యుమరేటర్ల వల్ల అనుకోవచ్చు. ఐదు శాతం జరిగాయంటే అనుకోవచ్చు. ఓ ఎన్యుమరేటర్ ప్రాంతంలో జరిగాయంటే అనుకోవచ్చు. అన్ని ముంపు ప్రాంతాల్లో, అందరు ఎన్యుమరేటర్ల ద్వారా ఇలా జరిగాయంటే రాజకీయ వ్యూహం కాదా? ఈ సందేహం రాదంటారా?

తెరపై పబ్లిసిటీ కోసం ఒక వ్యూహం, తెర వెనుక మరో వ్యూహం రూపొందాయా? ₹1000 కోట్ల లెక్కింపుకి రానివ్వకుండా, సగానికి సగం కుదింపుకై ఎన్యుమరేటర్లకి వ్యూహాత్మకంగా తెర వెనుక గైడ్ లైన్స్ వున్నాయా? ఇది ముగిసిన అధ్యాయం కాదనీ, ఎవరికి అందలేదని దృష్టికి వస్తే దిద్దుబాటు చేస్తామనే ఆప్షన్ ఇచ్చి ఉంటే సందేహం కలిగే వీలుండదు. ఎమ్మెల్యేలు సహా ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తుదకు పాలక పార్టీనేతలు చెబుతున్న మాటలు దిద్దుబాటుకు ఇక ఏ అవకాశం కూడా లేదనేదే!

ప్రతి వాలంటీరు తన యాభై ఇళ్లల్లో ప్రతిపేరు గుర్తే. గ్రౌండ్ ఫ్లోర్ ఎవరిదో అప్ స్టెయిర్స్ ఎవరివో తెలుసు. వీరి సాయం తీసుకోకుండా దూరప్రాంతాల సిబ్బందిని ఎన్యుమరేటర్లగా వివరాల సేకరణ చేపట్టి ఎవరి ప్రాంతాలకు వారిని పంపింది. ఎన్యుమరేటర్లని తిట్టుకున్నా వారి చెవులకు వినబడవు. సచివాలయాలకి వెళ్లి మూడు రోజుల నుంచి లబోదిబో అంటున్నా స్థానిక సిబ్బంది ఏం చేస్తుంది? రాసిన వాళ్ళు ప్రజలకు కనబడరు. కళ్ళకు కనిపించే సిబ్బంది రాసిన వాళ్ళు కాదు.

అవకతవకల్ని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చేవీలు ఎమ్మెల్యేలకి సైతం లేదు. తమకు మొర పెట్టుకునే వారికి ఎమ్మెల్యేలతో సహా ప్రజాప్రతినిధులు తమ నిస్సహాయతని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు.

ఒకసారి ప్రకటించిన తర్వాత తిరిగి తలకాయ పెట్టకూడదనే పేరిట వ్యూహాత్మక అవకతవక విధానం ఉద్దేశ్యపూర్వకంగానే కొనసాగిస్తోందా?

ఈ సందేహాలు బాధితుల మనస్సుల్లో ఇంకా రాలేదు. క్రమంగా దిగువ నుండి ఎగువకు ప్రజల అసంతృప్తి మళ్లుతోంది. ఎన్యుమరేటర్లతో ప్రారంభమై, ప్రభుత్వ శాఖల అధికార్లకు ప్రాకి, ఎమ్మెల్యే వరకు తాకుతోంది. స్త్రీలు ఎమ్మెల్యే ఆఫీసులకు చీమల బారులు కడుతోన్న దృశ్యాలు ప్రారంభమయ్యాయి. నేటి రాజకీయ భక్తిభావం రేపు ఏమవునో! ఎన్యుమరేటర్ల నుండి ఎమ్మెల్యేల వరకూ వ్యాపించి ముఖ్యమంత్రిని సేఫ్ సైడ్ లో ఉంచుతుందో! లేదా వీటికి మూల కారణం గ్రహించి ప్రభుత్వ విధానం పైకి ప్రజల ఆగ్రహం మళ్లుతుందో! అదే జరిగితే, ఈ అవకతవకల పై అనివార్యంగా దిద్దుబాటు చర్యల్ని చేపట్టకతప్పని భౌతిక స్థితిని ప్రభుత్వానికి సృష్టించి తీరుతుంది.

ప్రజలకు ప్రాతినిధ్యం వహించే శక్తులు క్రియాశీల రంగప్రవేశం చేసి ప్రజల్ని చైతన్యవంతం చేస్తే పరిస్థితి మారుతుంది. కమ్యూనిస్టు ఉద్యమ నేపధ్య చరిత్ర గల బెజవాడ అందుకు పూనుకుంటుందని ఆశిద్దాం.

ప్రధానంగా ఆటో డ్రైవర్ల సమస్యల గూర్చి నిన్న 27న విజయవాడలో ఇఫ్టూ చొరవతో కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది. పై అవకతవకలకి ఎన్యుమరేటర్లు కారణం కాదనే భావం వ్యక్తమైనది. తెరవెనుక లబ్దిదార్ల సంఖ్యని కోత పెట్టే ప్రభుత్వ వైఖరి ఫలితమని కార్మిక సంఘాలు భావించాయి. ఈ పరిస్థితుల్లో ఉద్యమ నిర్మాణ ఆవశ్యకత ఉందని కూడా రౌండ్ టేబుల్ మీటింగ్ అభిప్రాయపడింది.

సాయం ప్రకటించడంలో, ఆచరణలో అందించడంలో ఆటో డ్రైవర్లకు జరిగిన తీవ్ర అన్యాయం పై ఉమ్మడిగా ధర్నా చేయాలని ఈ రౌండ్ టేబుల్ మీటింగ్ లో కార్మిక సంఘాలు తీర్మానించాయి. ఈ దురన్యాయం మీద ఒకచోట నిరసనోద్యమం ప్రారంభమైతే, క్రమంగా బాధిత ప్రజలని కార్యరంగంలోకి తేవచ్చనే ఆశాభావం వ్యక్తమైనది. ఈ అవగాహనా వెలుగులో రేపు 29-9-2024 ఆదివారం ధర్నా చౌక్ లో ఆటో కార్మికుల ధర్నా చేపట్టారు.

ఈ ధర్నాలో తమభార్యల్ని భాగస్వాముల్ని చేయడానికి ప్రయత్నించాలని కూడా రౌండ్ టేబుల్ సమావేశం ముగిసిన తర్వాత క్రియాశీలురైన ఆటో డ్రైవర్ల మనస్సుల్లో ఓ కొత్త ఆలోచన కలిగింది. తమలో తాము సమాలోచన చేసి ఓ ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజంగా ఫలిస్తే కొత్త ఒరవడి క్రిందికి వస్తుంది. కనీసం 50 మంది స్త్రీలు హాజరైనా అదో వినూత్నమైన కార్యక్రమంగా మారుతుంది. కార్మిక సంఘాల ఉద్యమంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్లు కూడా అవుతుంది. వేచి చూద్దాం.

దశాబ్దాలుగా పాలక వర్గాలు బుడమేరుకి శాశ్వత వరద నివారణ చర్యలు చేపట్టలేదు. ముందస్తు వరద హెచ్చరికలని ప్రభుత్వం నుండి చేయలేదు. తామే ప్రకటించిన సాయం కూడా అవకతవకల పేరిట కోత పెడుతోంది. చరిత్ర గల బెజవాడ మౌనం వహిస్తుందా లేదా గొంతెత్తి నిలదీస్తుందా?

కౌడ్ బరస్ట్ స్థితిని బట్టి వరద ముంచెత్తనున్నట్లు ఆగస్టు 30 శుక్రవారం తెల్సినా ప్రభుత్వం అప్రమత్తం కాలేదు. వెలగలేరు గేట్లు ఎత్తక ముందే ప్రోటోకాల్ ప్రకారం శనివారం అప్రమత్తం చేయలేదు. గేట్లు ఎత్తాక అప్రమత్తం చేసినా సామాన్లు తరలించుకునే వారు.

ఓ ప్రజలారా, మరికొన్ని గంటల్లో మీ ఇళ్ళల్లోకి వరద రానుంది, వెంటనే సామాన్లు సర్దుకొని మేము ఏర్పాటు చేసే పునరావాస కేంద్రాలకి చేరండి, భయపడకండి, మీ తరపున ప్రభుత్వం ఉంది అంటూ ముందస్తు హెచ్చరిక చేయాల్సిన కనీస ధర్మాన్ని ప్రభుత్వం నిర్వర్తించలేదు.

ఓ ప్రజలారా, మీ ప్రభుత్వం నన్ను నియంత్రించే విధిని నిర్వర్తించలేదు. మిమ్మల్ని హెచ్చరించేవిధి చేపట్టలేదు. అనివార్యంగా మీ ఇళ్ళని ముంచెత్తక తప్పని స్థితి నాకు ఏర్పడింది. ఇప్పుడు నేను మీ ఇళ్ళకి చేరుకున్నా. మీరు వెంటనే వెళ్లకపోతే మిమ్మల్ని ముంచెత్తుతా అంటూ మన ఇళ్లకొచ్చి వరద హెచ్చిరించాకే మన ప్రజలు కట్టుబట్టలతో వెళ్లారు. ఇదీ "ప్రజాస్వామ్య వ్యవస్థ" లో రాష్ట్ర రాజధానిలో ప్రజలకు ప్రభుత్వం చేసిన ఘనకార్యం.

గ్రౌండ్ ఫ్లోర్ వారికి ₹25,000 ఎగవేస్తున్నప్పుడు, అప్ స్టెయిర్స్ వారికి ₹10,000 ఇవ్వనప్పుడు, రాసుకున్న టూ వీలర్లకు కూడా ₹3,000 ఇవ్వనప్పుడు, ఆటోలకు నష్ట పరిహారం పెంచకపోగా, ఇచ్చిన హామీల్ని అమలు చేయనపుడు, ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇప్పించడానికి ఎమ్మెల్యేతో సహా ఎవరూ సహకరించడానికి సుముఖత వ్యక్తం చేయనపుడు, గొప్ప చరిత్ర గల బెజవాడ మౌనంగా వుంటుందా?

వరద సాయం అధికారికంగా ప్రకటించిన రోజుతో అదొక "ముగిసిన అధ్యాయం" గా మారిందనీ, అందులో జరిగే అవకతవకలకు తమ ప్రభుత్వ బాధ్యత లేదనీ, వాటికి కేవలం ఎన్యుమరేటర్లు కారకులనీ లక్షలాది దుఃఖిత ప్రజలకు ఎక్కడ చెప్పుకొనే అవకాశం లేకుండా చేస్తే బెజవాడ మౌనం వహిస్తుందా?

గెలుపు ఓటములు తర్వాత మాట. అది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. కానీ ఇదో ముగిసిన అధ్యాయంగా భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డు ఎక్కడం ఓ పెద్ద విజయమే. అదో ప్రజాస్వామ్య ధర్మం. బెజవాడ ఆటో యూనియన్లు ప్రజాస్వామిక ధర్మం ప్రకారం రేపు ధర్నా చౌక లో గొంతెత్తి చాటనున్నాయి. లోకం ఎదుట అది తెరిచిన అధ్యాయమని చాటి చెప్పబోతున్నాయి. వారితో గొంతు కలుపుదాం.

(పి. ప్రసాద్ (పిపి) IFTU రాష్ట్ర అధ్యక్షులు)



Read More
Next Story