
యూనివర్సిటీ పార్ట్ టైం అధ్యాపకులు వెట్టిచాకిరి కూలీలేనా!
‘బోధన కోసం రెగ్యులర్, కాంట్రాక్ట్, పార్ట్ టైం అధ్యాపకుల్ని నియామిస్తారు. ఒకే పని భారం ఉన్నా వేతనాల చెల్లింపులో ముగ్గురి మధ్య భారీ వ్యత్యాసం ఉంటుంది.’
విద్యా నిలయాలుగా విరాజిల్లిన విశ్వవిద్యాలయాలు పాలకుల పట్టింపు లేని వైఖరితో నేడు సమస్యలకు నిలయాలుగా మారి తమ ప్రతిష్టను కోల్పోతున్నాయి. అనేక సామాజిక సమస్యలకు చర్చా వేదికలుగా, నూతన ఆవిష్కరణలకు పరిశోధనలకి ప్రయోగశాలలుగా, ప్రభుత్వ విధాన నిర్ణయాలలో భాగస్వాములుగా తమ ప్రత్యేకతను నిలబెట్టుకున్న విశ్వవిద్యాలయాలు నేడు అనేక సమస్యలతో పూర్వవైభవాన్ని కోల్పోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో అధ్యాపక నియామకాలు ఒకటి. విశ్వవిద్యాలయాల పరిపుష్టికి కొత్తగా నియామకాలు ఎలా చేపట్టాలి అనేది ఒక సమస్య అయితే, ఇప్పటికే దశాబ్దానికి పైగా విశ్వవిద్యాలయాలలో కాంట్రాక్ట్, పార్ట్ టైం ప్రాతిపదికన పనిచేస్తున్న వందలాదిమంది అధ్యాపకులను ఏమి చేయాలనేది ప్రభుత్వం ముందున్న ఒక సంక్లిష్ట సమస్య.
విశ్వవిద్యాలయాలలో అధ్యాపక నియామకాలు చేపట్టటానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్. 21 ద్వారా మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో మా ఉద్యోగ భద్రత కి ఎలాంటి హామీ ఇవ్వకుండా, మా సమస్యలకు పరిష్కారం చూపించకుండా జీవోని ఎలా విడుదల చేస్తారని కాంట్రాక్ట్, పార్ట్ టైం అధ్యాపకులు జీవోకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన బాట పట్టారు.
విశ్వవిద్యాలయాలలో బోధన కోసం రెగ్యులర్, కాంట్రాక్ట్ మరియు పార్ట్ టైం ప్రాతిపదికన అధ్యాపక నియామకాలు చేపడతారు ముగ్గురుకి ఒకే పని భారం కానీ వేతనాల చెల్లింపులో మాత్రం భారీ వ్యత్యాసం ఉంటుంది. ఉన్నత విద్యార్హతలు, అత్యున్నత డిగ్రీలు, జాతీయ రాష్ట్ర స్థాయి అర్హత పరీక్షలలో ఉత్తీర్ణులై అన్ని అర్హతలు ఉన్న వారిని రోస్టర్ పాయింట్ తో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ పర్యవేక్షణలో వైస్ ఛాన్సలర్ నామినీ చేత ఇంటర్వ్యూలను నిర్వహించి యుజిసి మార్గదర్శకాలతో పార్ట్ టైం అధ్యాపకులను నియమించుకొని బోధనతో పాటు పరీక్షల, ల్యాబ్ ల నిర్వహణ, మూల్యాంకనం లాంటి అన్ని రకాలైన సేవలకి వారిని ఉపయోగించుకుంటూ సంవత్సరంలో ఆరు నెలలకు మాత్రమే వేతనాలు చెల్లిస్తూ వెట్టి చాకిరీ చేసే ఒక బాండెడ్ లేబర్ గా పార్ట్ టైం అధ్యాపకుల జీవితాలు మారినా అటు విశ్వవిద్యాలయ అధికారులు కానీ ఇటు ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు విశ్వ విద్యాలయాలలో ఫుల్ వర్క్ లోడ్ తో పని చేసే పార్ట్ టైం అధ్యాపకులను ఆటోమేటిక్ గా కాంట్రాక్ట్ అధ్యాపకులుగా అప్ గ్రేడ్ చేయటం వలన కొంత ఉద్యోగ భద్రతతో పాటు ప్రతినెలా ఒక నిర్దిష్ట పరిమాణంలో వేతనం లభించేది కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత నాటి టిఆర్ఎస్ ప్రభుత్వం 2014లో విశ్వవిద్యాలయాలలో ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి కొత్త నియామకాలు చేపట్టారాదని ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన ఆ సర్క్యులర్ ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ అధికారులు, విశ్వవిద్యాలయ అధికారులు పార్ట్ టైం అధ్యాపకులకి న్యాయంగా రావలసిన కాంట్రాక్ట్ అప్ గ్రేడేషన్ ని నిలిపివేయడం వలన విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులకి మరింత అన్యాయం జరిగింది.
అతి తక్కువ వేతనాలతో విశ్వవిద్యాలయాలలో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న పార్ట్ టైమ్ అధ్యాపకులు నాలుగు పదుల వయసు దాటిన వారే, చేస్తున్న ఉద్యోగంతో వస్తున్న వేతనంతో కుటుంబాలను పోషించలేక పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వలేక పోతున్నామనే ఆందోళన భవిష్యత్తుపై బెంగతో వస్తున్న కన్నీళ్లను కనురెప్పల మాటునే అదిమి తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తూ వేలాదిమంది విద్యార్థులకు అత్యుత్తమమైన విద్యాబోధన అందిస్తున్నారు. భద్రత లేని ఉద్యోగం సంవత్సరంలో 6 నెలలు అది కూడా నెలనెలా రాని చాలీచాలని జీతం వచ్చినా తీరని అవసరాలతో పార్ట్ టైం అధ్యాపకుల జీవితాలను కదిలిస్తే కన్నీటి గాధలే కనిపిస్తున్నాయి.
ఒక పార్ట్ టైం అధ్యాపకుడి పసిబిడ్డ అనారోగ్యం పాలైతే లక్షల రూపాయలు పెట్టి బిడ్డను బ్రతికించుకోలేక అతను పడిన బాధ వర్ణనాతీతం, మరొక పార్ట్ టైం అధ్యాపకురాలు భర్త చనిపోతే వస్తున్న జీతంతో తన బిడ్డలను పోషించలేక పనిచేస్తున్న విద్యాసంస్థకే ఫినాయిల్ అమ్ముతూ బ్రతుకునీడుస్తున్న ఉదంతం, కాకతీయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఒక పేద పార్ట్ టైం అధ్యాపకుడు విధులు నిర్వహించి ఇంటికి వచ్చి మరణిస్తే విశ్వవిద్యాలయం కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి సహాయం ఆ కుటుంబానికి చేయకపోవటం చూస్తుంటే పార్ట్ టైం అధ్యాపకుల జీవితాలు వ్యవస్థ మిగిల్చిన ఒక విషాదంగానే కనిపిస్తున్నాయి.
పనిచేయటానికి (విద్యాబోధన) పనికి వస్తున్న మేము అవకాశాలకు పనికిరామా అనే ఆవేదన పార్ట్ టైం అధ్యాపకుల మనసుని కలిసి వేస్తుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాలలో అధ్యాపక నియామకాల కోసం విడుదల చేసిన జీవో నెంబర్. 21 మార్గదర్శకాలలో పార్ట్ టైం అధ్యాపకుల సర్వీసెస్ కూడా పరిగణలోకి తీసుకోకపోవడం పార్ట్ టైం అధ్యాపకులను మరింత ఆవేదనకి, ఆందోళనకి గురిచేస్తుంది. విశ్వవిద్యాలయాలలో వివక్షతకి అత్యంత శ్రమ దోపిడికి గురవుతున్న పార్ట్ టైం అధ్యాపకుల పట్ల విశ్వవిద్యాలయాలు ప్రభుత్వం వ్యవహరిస్తున్న ఉదాసీన వైఖరి భారత రాజ్యాంగ స్ఫూర్తికి, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కనిపిస్తుంది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హార్వర్డ్ విశ్వవిద్యాలయ స్వయం ప్రతిపత్తిని తన చేతులలోకి తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు హార్వర్డ్ విశ్వవిద్యాలయ అధ్యక్షులు అలెన్ గార్భర్ వ్యవహరించిన స్ఫూర్తితో తమ స్వయం ప్రతిపత్తి కలిగిన అధికారాలతో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ లు పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలను పరిష్కరించే చొరవ తీసుకోవాలి. విశ్వవిద్యాలయాలను ప్రక్షాళన చేయటమంటే ఉద్యోగాల భర్తీ మాత్రమే కాదు విద్యా బోధన చేస్తున్న అధ్యాపకులకి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దటం కూడా అని ప్రభుత్వాలు గుర్తించకపోవడం శోచనీయం.
రెగ్యులర్ అధ్యాపకుల రిటైర్మెంట్ వయోపరిమితిని 60 నుండి 65 సంవత్సరాలకు పెంచిన ప్రభుత్వం విశ్వవిద్యాలయాలలో శ్రమ దోపిడీకి గురవుతున్న పార్ట్ టైం అధ్యాపకుల సమస్యల పట్ల స్పందించకపోవడం ప్రజా పలనా అనిపించుకుంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వలన నష్టపోయిన పార్ట్ టైం అధ్యాపకులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రజా ప్రభుత్వానిదే.
1976లో భారత ప్రభుత్వం ఆమానవీయ వెట్టి చాకిరి నిర్మూలన కోసం చట్టం చేసినా అత్యున్నత విద్యా సంస్థ అయిన విశ్వవిద్యాలయాలలో వెట్టి చాకిరి ఆనవాళ్లు కనిపించటం ప్రజా ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగిలిపోతుంది, కాబట్టి సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని పార్ట్ టైం అధ్యాపకుల సమస్యను అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేక కమిటీని నియమించాలి.
రాష్ట్రవ్యాప్తంగా 12 విశ్వవిద్యాలయాలలో ప్రస్తుతం పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులకి మినిమం టైమ్ స్కేల్ తో ఉద్యోగ భద్రతను కల్పిస్తూ సుదీర్ఘ బోధనా అనుభవం, విషయ నిపుణత కలిగి ఉన్న పార్ట్ టైం అధ్యాపకులకి అధ్యాపక నియామకాలలో ప్రథమ ప్రాధాన్యత కల్పించాలి. విశ్వవిద్యాలయాలలో అత్యంత వివక్షత కి అన్యాయానికి గురవుతున్న పార్ట్ టైం అధ్యాపకుల సమస్యల పట్ల డిమాండ్ల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఆశిద్దాం.