భారత్-చైనా సంబంధాలలో మెరుపులు, మరకలు
x

భారత్-చైనా సంబంధాలలో మెరుపులు, మరకలు

ఎవరి దగ్గర ఏ వస్తువులు ఎంతకు కొనాలో కూడా పెత్తందారుగా అమెరికా ప్రవర్తిస్తున్న తరుణంలో భారత చైనా సంబంధాలపై ఒక పరిశీలన

ఆధునిక భారత్, చైనా దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలు అవుతున్నది. ఇద్దరి మధ్య సంబంధాలు అనేక నిమ్నోన్నతాలకు గురి అవుతున్నాయి. ప్రస్తుతం నెలకొని వున్న పరిస్థితిని పరిశీలించి చూద్దాము.

2020 గల్వాన్ ఘర్షణ ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీసిన తర్వాత ఈ మధ్య సహకార సంబంధాలు పునఃనిర్మించు కోవటానికి రెండు దేశాల లోను కొన్ని ప్రయత్నాలు మొదలయ్యాయి. మిలిటరీ అధికారుల బృందాలు, కొన్ని ప్రత్యేక యంత్రాంగాలు నిరంతరం సంభాషణలు కొనసాగిస్తూనే వున్నాయి. అయితే ఈ సంవత్సరం జులై 15న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ భేటీ అయ్యారు.

ఇటీవలి వివాదం తరువాత ఈ స్థాయిలో ప్రత్యక్ష చర్చలు జరగడం ఇదే తొలిసారి. షాంఘై సహకార సంస్థ [ఎస్ సి ఓ] విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భం గా వీరు కలుసుకున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ అంతర్జాతీయ శాఖ మంత్రి లియు జియాన్ చావోను కూడా శ్రీ జైశంకర్ బీజింగ్ లో కలిశారు. "మారుతున్న ప్రపంచ క్రమం, బహుళ ధ్రువత్వం ఆవిర్భావం గురించి, నిర్మాణాత్మక మైన భారత్-చైనా సంబంధా ల గురించి మాట్లాడామని శ్రీ జైశంకర్ తెలిపారు. అంతకు ముందు జూన్ 26 న భారత రక్షణ శాఖామంత్రి రాజనాథ్ సింగ్ కూడా చైనాలో పర్యటించారు. అది కూడా ఎస్ సి ఓ రక్షణమంత్రు ల సమావేశం కోసమే. అక్కడ ఆయన ఆపరేషన్ సింధూర్, ఉగ్రవాద చర్యలు గురించి ప్రస్తావించారు కాని ద్వైపాక్షిక సంబంధాల గురించి అంతగా చర్చ జరుగ లేదు.

జూలై 7న బ్రెజిల్ లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో మోదీ- జిన్ పింగ్ లు ముఖాముఖీ కలుసుకునే అవకాశం కలుగుతుందని భావించారు అయితే ఆ సమావేశానికి జిన్ పింగ్ హాజరు కాకపోవడంతో ఈ సమావేశం కార్యరూపం దాల్చలేదు.

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ 18 ఆగస్టున భారత్ కు వచ్చి మన విదేశాంగ మంత్రి జైశంకర్ తో, జాతీయభద్రతా సలహాదారు అజిత్ దోవల్ తోను, ప్రధాని మోడీ తొను ఈ సంభాషణా క్రమాన్ని కొనసాగించారు. “గత 75 ఏళ్ల అనుభవాల నుండి నుంచి ఇరు పక్షాలు పాఠాలు నేర్చుకోవాలని, సరైన వ్యూహాత్మక దృక్పథాన్ని పెంపొందించు కోవా లని, ప్రత్యర్థులు గా లేదా వైరి శక్తులుగా కాకుండా ఒకరినొకరు భాగస్వాములుగా, సదవకాశాలుగా భావించాలని” వాంగ్ యీ ఉద్ఘాటించారు. ఈ ఆగస్టు 31న ఎస్ సీవో శిఖరాగ్ర సదస్సు కోసం మోదీ ని చైనా కు ఆహ్వానించారు. ఆయన ఆ సమావేశం లో పాల్గొనటానికి అంగీకరించారు. ఈ మేరకు ఏర్పాట్లు చక చకా జరుగుతున్నాయి. ఇలా భారత్ చైనాల మధ్య ఒక స్నేహ వాతావరణం నెలకొంటున్నది. ఈ పరిణామాల వెనుక ఎన్నో జాతీయ, అంతర్జా తీయ పరిస్థితుల ప్రభావం వున్నది.

నవంబర్ 2023 లో చైనా, భారతదేశాల మధ్య థింక్-ట్యాంక్ ల నుండి, సాంస్కృతిక మార్పిడిని పెంచాలని, రెండు దేశాల మధ్య నేరుగా ప్రయాణించే విమానాలను పునరుద్ధ రించాలని, చైనా పౌరులకు భారత్ వీసా ఆంక్షలను సడలించాలని ప్రతిపాదనలు వచ్చాయి. ఇప్పటి వరకు భారత్ ఈసూచనలు పాటించలేదు. కొన్ని సమస్యలు ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలకు సంబంధించినవి కాగా, చైనాతో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి భారత్ విముఖత చూపుతున్నట్లుగా వున్నది. కాగా 2024 అక్టోబర్లో కజాన్లో భారత్, చైనా నాయకుల మధ్య జరిగి న అధికారిక సమావేశం తరువాత, ద్వైపాక్షిక సంబంధాలు నెమ్మదిగానే అయినా క్రమంగా పుంజుకుంటున్నాయి

చైనాకు వ్యతిరేకంగా అమెరికా వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణ చేస్తున్నసమయంలోనే భారత్-అమెరికా సంబంధాలు బాగా పెరిగాయి. వారితో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం వల్ల అమెరికాకు, భారతదేశానికి కూడా చాలా ఉపయోగకరంగా వుంటుందని ప్రచారం చేయబడ్డది. అందుకు మన దేశంలో చైనా వ్యతిరేకతను బాగా రెచ్చగొట్టారు. దాని వల్ల భారత్ కు ఒనగూరే ప్రయోజనాల మాట ఏమోగానీ ఈ భాగస్వామ్యానికి పునాది "చైనాను సమతుల్యం చేయడం". “చైనాని కట్టడి చేయటం” అనేది ప్రాధమిక వ్యూహాత్మక పరిగణన. మన పాలకులు అమెరికా ముందు ఎంత వంగి వున్నా వారిని మరింత లొంగదీయడానికే అమెరికా పూనుకుంటున్నది. తన ఇష్టానుసారంగా భారత్ నడవాలని కోరుకుంటున్నది. అందువల్ల భారత్ ఎంత సేవ జేస్తున్నప్పటికి, కొన్నిసందర్భాలలో భారత్ ప్రదర్శించే కొద్దిపాటి స్వతంత్రతను కూడా అమెరికా సహించలేక కన్నెర్ర జేస్తున్నది. దిగుమతి సుంకాలు పెంచి వాణిజ్య ఆంక్షలు విధిస్తున్నది. మనం ఎవరి దగ్గర ఏ వస్తువులు ఎంతకు కొనాలో కూడా అమెరికాయే నిర్ణయించే పెత్తందారి స్థితికి చేరుకున్నది. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేసి వారిని ఆర్ధికంగా నిలబెట్టటం వల్ల ఆ నిధులతో ఉక్రేయిన్ పై రష్యా యుద్ధం కొనసాగించేలా భారత్ తోడ్పడుతున్నదని అమెరికా పదే పదే ఆరోపిస్తున్నది. భారత్ చైనాల మధ్య వున్న వివాదాలను రెచ్చగొట్టి వారి మధ్య సయోధ్య, సహకారం లేకుండా చేస్తున్నది.

అయితే ఈనాడు మనం ఒక అంశం తప్పనిసరిగా గుర్తించాలి. చైనా లేకుండా లేక చైనాను విస్మరించి ఆసియా లో ఏ రక్షణ చక్ర నిర్మాణమూ, [సెక్యూరిటీ ఆర్కిటెక్చర్] లేదా ఇండస్ట్రియల్ చైన్ నిర్మించినా అది మనజాలదు. "చైనా ను సమతుల్యం చేయడం" అనే లక్ష్యానికి అంతిమ ఫలితం ఆ ప్రయత్నంలో అమెరికాకు సహకరించే దేశాలు తమ స్వప్రయోజనాలను కోల్పోవడం. భారత్ విషయంలోనూ అంతే. చైనా పట్ల అమెరికా వ్యూహాన్ని అనుసరించడం వల్ల దక్షిణాసియాలో, ప్రపంచంలో తన స్థానాన్ని పెంచుకోవడానికి భారతదేశానికి కాస్త ప్రయోజనం చేకూరే మాట వాస్తవమే కావొచ్చు. కానీ భారతదేశం ఒక ప్రధాన ప్రపంచ శక్తిగా ఎదగడం ఈ పరాధీనత వల్ల సాధ్యం కాదు. ఆ సామర్థ్యం దేశం స్వతంత్రంగా తీసుకునే సంస్కరణలు, అభివృద్ధి పథంలో సాధించే విజయాలు, ఇతర దేశాలతో తన సంబంధాలను నిర్వహించుకునే తీరు పై కీలకంగా ఆధారపడి ఉంటుంది. అందువల్ల భారత్ తన విధానాలను పునఃసమీక్షించడం అవసరం.

అమెరికా విధిస్తున్న వాణిజ్య సుంకాల వల్ల ఏర్పడ్డ అనిశ్చితి నేపథ్యంలో, ఇండో-యూఎస్ వాణిజ్య ఒప్పందం ఇంకా కుదరని స్థితిలో; భారత చైనాల మధ్య ఉన్నత స్థాయిలో జరుగుతున్న ప్రస్తుత సమావేశాలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. భారత్ చైనా వైపు కాస్త మొగ్గు చూపవలసి వస్తోంది. మారిన ప్రపంచ రాజకీయ ఆర్ధిక సంక్షో భాలలో భారత్, చైనాకు ఆర్ధికంగా చేరువ కావలసిన ఆగత్యం ఏర్పడింది. ఇందులో పెద్ద రహస్యం కూడా ఏమీలేదు. ఇరు దేశాలు పరస్పర ప్రయోజనాల రీత్యా తమ విభేదాలను అధిగమించి స్నేహ సంబంధాలు నెలకొల్పుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. దీనితో అమెరికాలో కూడా కొన్ని చర్చలు మొదలయ్యాయి. చైనాను ఎదుర్కో వాలంటే అమెరికాకు భారత్ వంటి మిత్రుడు తప్పనిసరి గా వుండాలని నిక్కీ హేలీ లాంటి అమెరికా మాజీ దౌత్య వేత్తలు బహిరంగంగా చెబుతున్నారు. “ఆసియాలో చైనా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయగల ఏకైక దేశం భారత్ తో వాణిజ్య వివాదాలు పెట్టుకోవడం వ్యూహాత్మక తప్పిదం అవుతుందని, భారత్ ను స్వేచ్చాయుత ప్రజాస్వామిక భాగస్వామిగా చూడాలి తప్ప చైనా లాంటి శత్రువుగా పరిగణించకూడదని” ఆమె అంటున్నారు.

ఏదేమైనా, చైనా భారత్ దేశాల మధ్య అపార్థాలు, తప్పుడు అవగాహనలను నివారించడానికి- పరస్పర సదవ గాహనను పెంపొందించడానికి- థింక్ ట్యాంకుల చర్చలు, సాంస్కృతిక మార్పిడిలు కీలకం. చర్చల ద్వారా చైనా, భారత్ పరస్పర అవగాహనను బలోపేతం చేసుకోవాలని అనేక మంది భావిస్తున్నారు. ట్రంప్ సుంకాల నేపధ్యంలో భారత్ కు చైనా అండగా నిలుస్తున్నది. అమెరికా విధించిన 50% సుంకాలను దారుణమైన చర్యగా ఖండించింది. మరి అమెరికా చైనాపై 150% టారిఫ్ విధించినప్పుడు ఇండియా కిమ్మనకుండా, పెరిగిన సుంకాల వల్ల చైనాలో కంపెనీలు దెబ్బ తింటాయని, అక్కడి నుంచి తరలి వెళ్లీ పోతాయని, వాటిలో కొన్నయినా భారత్ కు వస్తాయని అంచనా వేసింది. అందువల్ల అమెరికా చేస్తున్న దారుణాన్ని ఖండించక పొగా తనకు ప్రయోజనం చేకూరుతుందని వేచి చూసింది.

భారత్- రష్యా ల మధ్య వాణిజ్యం రెట్టింపు చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించుకోగా, ఇప్పుడు చైనా కూడా తమ మార్కెట్ల లోనికి భారత్ కు స్వాగతం పలుకుతున్నది. “భారత్ చైనాలు పరస్పర అనుమానాస్పద ధోరణిని వీడి, వ్యూహాత్మక విశ్వాసాన్ని నెలకొల్పుకోవాలి, తమ అభివృద్ధి వ్యూహాలను పెంపొందించుకోవాలి, వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి” అని డిల్లీలోని చైనా రాయబారి ఫైయ్ హోంగ్ ప్రకటించారు.

అమెరికా ఎత్తుగడలకు, ఆధిపత్య ధోరణులకు భిన్నంగా ప్రపంచంలో ఒక సరైన క్రమాన్ని ఏర్పరచడానికి చైనా వ్యూహ రచన చేస్తున్నది. మార్చి 15, 2023 న అధ్యక్షుడు జిన్పింగ్ బీజింగ్ లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ -ప్రపంచ రాజకీయ పార్టీల మధ్య ఉన్నత స్థాయి సంభాషణలో “గ్లోబల్ సివిలైజేషన్ ఇనిషియేటివ్ [ నాగరికతల మధ్య సంభాషణ] అనే కొత్త భావనను ప్రవేశ పెట్టారు. గ్లోబల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ లను పోలిన గ్లోబల్ సివిలైజేషన్ ఇనిషియేటివ్, నేటి అల్లకల్లోల కాలంలో చైనా నాయకులు ప్రతిపాదించిన ఒక కొత్త పరివర్తన తత్వం. ప్రపంచ పాలనపై కొత్త భావనకు, కొత్త క్రమానికి అది ప్రాతినిధ్యం వహిస్తుంది.

తూర్పు-పశ్చిమ; దక్షిణ-ఉత్తర దేశాల మధ్య వైవిధ్యమైన రాజకీయ వ్యవస్థలు, అభివృద్ధి నమూనాలు, విభిన్న మైన మత సంస్కృతులు, వైరుధ్యాలు సంఘర్షణలకు దోహదం చేస్తాయి. సమాన స్థాయిలో చర్చల ద్వారా నాగరిక తల మధ్య అంతరాలను పూడ్చాలని, దేశాలు,నాగరికతల మధ్య పరస్పర అవగాహన, సమ్మిళితత్వాన్ని పెంపొం దించాలని చైనా కోరుకుంటోంది. ఇది సామూహిక పెరుగుదల, పురోగతి, సృజనాత్మకతను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. గ్లోబల్ సివిలైజేషన్ ఇనిషియేటివ్ అనేది ప్రపంచ పాలన, ప్రపంచ శాంతిని ఉద్దేశించిన స్థూల-స్థాయి భావన మాత్రమే కాదు; ఇది నిర్దిష్ట వ్యూహాలను, మార్గాలను కూడా కలిగి ఉన్నది.

"ప్రపంచ నాగరికతల వైవిధ్యాన్ని గౌరవించడం" ఈ చొరవ యొక్క సారాంశం, "సమస్త మానవాళి యొక్క ఉమ్మడి విలువలను ప్రోత్సహించడం" ప్రధాన లక్ష్యం, "నాగరికతల వారసత్వం, ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వడం" దాని ఆచరణాత్మక విధానం, "అంతర్జాతీయ సాంస్కృతిక మార్పిడి, సహకారాన్ని బలోపేతం చేయడం" దాని అమలు యంత్రాంగంగా పనిచేస్తుంది.

వివిధ నాగరికతల మధ్య మార్పిడి, పరస్పర అధ్యయనం మాత్రమే కాకుండా, నాగరికతలోనే విభిన్నసైద్ధాంతిక బృందాల మధ్య సంభాషణ, కలయికలను కూడా కలిగి ఉంటుంది, ఇది బాహ్య ప్రపంచం పట్ల చైనా ప్రజల బహిరంగ సమ్మిళిత దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. "ఆధునికీకరణ" అనేది ఒక ప్రక్రియ, ఆధునికీకరణకు చైనా మార్గం నిరంతర మెరుగుదల. అభివృద్ధి పథంలో ఒక మేలి మలుపు. ఇతర దేశాల అధునాతన అనుభవాలు, పద్ధతుల నుండి నిరంతరం నేర్చుకోవడం అవసరం అని చైనా నాయకత్వం ప్రబోధిస్తున్నది. అందుకే చైనా పంచ శీల సూత్రాల ఆధారంగా ఇద్దరికీ ప్రయోజనం కలిగించే రీతిలో తన విదేశాంగ విధానాలను సుసంపన్నం చేసుకుంది. భారత్ పట్ల కూడా చైనా ఇదే వైఖరిని ప్రదర్శిస్తున్నది.

నాగరికతల మధ్య మార్పిడి, పరస్పర అధ్యయనం మానవ చరిత్రలో ఒక సాధారణ విషయం. చైనా నాగరికత ప్రారంభం నుండి ఇతర నాగరికతలతో సలిపిన నిరంతర చర్య, ప్రతిచర్యలతో నిరంతర అభ్యాసం ద్వారా అభివృద్ధి చెందిందని అనేక ఋజువులు దొరుకుతున్నాయి. పురాతన కాలంలో, భారతీయ నాగరికత చైనా నాగరికతకు మార్పిడి, అవగాహన యొక్క ప్రాధమిక అంశంగా పనిచేసింది. నాగరికత అభివృద్ధి, విస్తరణలో లోతైన సానుకూల పాత్ర పోషించింది. అనేక మంది ప్రముఖ భారతీయ సన్యాసులు వారి బోధనలను వ్యాప్తి చేయడానికి చైనాను సంద ర్శించారు, ప్రముఖ చైనీస్ సన్యాసులు ఫాహియాన్, జువాన్జాంగ్ బౌద్ధ గ్రంథాలను పొందడానికి భారతదేశానికి వచ్చారు. ఈ చారిత్రిక కథనాలు విస్తృతంగా ప్రచారంలో వున్నాయి కూడా. "బౌద్ధ సామ్రాజ్యం యొక్క రికార్డులు" "పశ్చిమ ప్రాంతాల రికార్డులు" వంటి చారిత్రక క్లాసిక్స్ మనకు మిగిలాయి, పురాతన చరిత్ర ద్వారా సమాజాన్ని అర్థం చేసుకోవడానికి అవి ప్రజలకు ఖచ్చితమైన ప్రత్యక్ష సాక్ష్యాలను అందించాయి.

అయితే నేడు చాలావరకు, చైనా గురించి భారతదేశ ఉన్నత వర్గాలు, ప్రజల మధ్య గల అవగాహన మూడవ పక్షం యొక్క దృక్పథంపై ఆధారపడి ఉంటున్నది. పాశ్చాత్య మీడియా అందించే వార్తలు కథానాలపై ఆధారపడి భారత వ్యూహ కర్తలు, ఆలోచనాపరులు చైనా పట్ల తమ దృక్పథాన్ని ఏర్పర్చు కుంటున్నారు. భారత్ ఒకవైపు చైనా జర్నలిస్టులకు ప్రవేశం నిరాకరిస్తూ, చైనాకు సంబంధించిన నిజమైన సమాచారాన్ని కోల్పోతున్నది. ఈ పరిస్థితి వల్ల చైనా పట్ల భారతీయ ప్రజలు అవగాహన కంటే అపార్థాన్నే ఎక్కువగా కలిగి వుంటున్నారు.

చైనా వలె, భారతదేశం కూడా పాశ్చాత్య నాగరికతకు భిన్నమైన నాగరికత గల రాజ్యం, ఇది జాతీయ పునరుజ్జీవ నాన్ని సాకారం చేయడం, పురాతన వైభవాన్ని పునరుద్ధరించడం ద్వారా ప్రపంచ శక్తిగా మారాలని కోరుకుంటున్న ది. అయితే, ఒక గొప్పశక్తిగా ఎదగడానికి, దాని నాగరికతను పునరుద్ధరించడానికి, చైనాను నియంత్రించడానికి, ప్రపంచ సరఫరా గొలుసులో దాని స్థానాన్ని తాను భర్తీ చేయడానికి ఇతర ప్రధాన శక్తులతో చేతులు కలిపే వ్యూహా న్ని భారతదేశం అవలంబిస్తున్నది. దానికి బదులుగా, చైనాతో పరస్పర అవగాహనతో ఉమ్మడి పురోగతి మార్గా న్ని అన్వేషించాలి.

చైనా, భారత్ పొరుగు దేశాలు. వాటి స్థానాలను మార్చలేము. తరలించలేము. ప్రధాని మోదీ ఇటీవల లెక్స్ ఫ్రీడ్ మన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా, "మనం గడిచిన శతాబ్దాల చరిత్రను వెనక్కి తిరిగి చూసుకుంటే, మన మధ్య నిజమైన సంఘర్షణ చరిత్ర లేదు. ఇది ఎల్లప్పుడూ ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడం ఒకరినొకరు అర్థం చేసు కోవడంగా సాగింది. మన మధ్య సహకారం ఇరువురికీ ప్రయోజనకరమే కాదు, ప్రపంచ సుస్థిరత, శ్రేయస్సుకు కూడా ఎంతో అవసరం. 21 వ శతాబ్దం ఆసియా శతాబ్దం కాబట్టి, భారత్ చైనా లు ఆరోగ్యకరమైన, సహజమైన మార్గంలో పోటీ పడాలని మేము కోరుకుంటున్నాము. పోటీ చెడ్డ విషయం కాదు, కానీ అది సంఘర్షణగా మారకూడదు. విభేదాలకు బదులుగా, మేము సంభాషణకు ప్రాధాన్యత ఇస్తాము, ఎందుకంటే చర్చల ద్వారా మాత్రమే మేము రెండు దేశాల ఉత్తమ ప్రయోజనాలకు ఉపయోగపడే స్థిరమైన సహకార సంబంధాన్ని నిర్మించగలము"

అలాగే, చైనా-భారత్ లు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని, పరస్పరం ముందుకు సాగాలని, అడ్డంకులను అధిగమించాలని, సహకారాన్ని విస్తరించాలని, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చడంలో సానుకూలంగా వేగ వంతమైన చర్యలు తీసుకోవాలని వాంగ్ పేర్కొన్నారు. నేటి ప్రపంచంలో, శతాబ్దం పాటు సాగిన పరివర్తనలు వేగం పుంజుకుంటున్నాయి. ఐక్యరాజ్యసమితిని స్థాపించి 80 ఏళ్లు పూర్తయిన ఈ చారిత్రక దశలో మానవాళి భవిష్యత్తు కోసం నిర్ణయాత్మకమైన దిశను నిర్ధారించుకోవాలసి వుంది. అయితే ఏకపక్ష బెదిరింపులు పెరుగుతున్నాయి. వీటివల్ల స్వేచ్ఛావాణిజ్యం కుంటుపడి, అంతర్జాతీయ వ్యవస్థ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నది.

280 కోట్ల కంటే ఎక్కువ జనాభాతో అభివృద్ధి చెందుతున్నరెండు అతిపెద్ద దేశాలుగా, చైనా, భారత్ లు విశ్వ దృష్టిని ప్రదర్శించాలి, ప్రధాన దేశాలుగా తమ బాధ్యతను స్వీకరించాలి. అభివృద్ధి చెందుతున్నఅనేక దేశాలకు సంఘీభావం తెలుపుతూ, స్వావలంబనకు ఉదాహరణగా నిలవాలని, బహుళ ధ్రువ ప్రపంచాన్ని, అంతర్జాతీయ సంబంధాల్లో ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి దోహద పడాలని చైనా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు.

రెండు దేశాల అగ్ర నాయకుల మధ్య ఏర్పడిన ఉమ్మడి అవగాహనలను అనుసరించి, ఉన్నత స్థాయి బృందాల మార్పిడులను కొనసాగించడానికి, పరస్పరం రాజకీయ విశ్వాసాన్ని పెంచడానికి, ఇరువురి మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి, విభేదాలను సరిగ్గా పరిష్కరించడానికి భారతదేశంతో కలిసి పనిచేయాలని, చైనా-భారత దేశ సంబంధాలలో స్థిరమైన, దృఢమైన అభివృద్ధిని ఆశిస్తున్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధులు చెప్పారు.

ఉన్నత స్థాయి సమావేశాలతో వాంగ్ పర్యటన సంబంధాల మెరుగుదలకు తోడ్పడగలదని, భారత్ ఈ సమావేశా లకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తుందని, నిర్మొహమాటంగా లోతైన, చర్చలు జరపడంలో ఇరు పక్షాల చిత్తశుద్ధిని తెలియ జేస్తుందని చైనా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనా, భారత్ రెండూ ఒకరి వైపు ఒకరు ముందుకు సాగాలి. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడానికి సానుకూలత ను మరింత వేగంగా పెంచుకోవాలి. రెండు గొప్ప తూర్పు నాగరికతల పునరుజ్జీవనం ఒకదానికొకటి బలం చేకూర్చాలి. ఇది ఆసియా, విస్తృత ప్రపంచానికి చాలా అవసరమైన ఖచ్చితత్వాన్ని, స్థిరత్వాన్ని అందిస్తుంది అని వాంగ్ పేర్కొన్నారు.

చైనా-భారత్ ఆర్థిక, వాణిజ్య సమస్యలు, తీర్థయాత్రలు, ప్రజల మధ్య సంబంధాలు, అంతర్జాతీయ నదీ ప్రవాహాల డేటాను పరస్పరం తెలియ జేసుకోవడం, సరిహద్దు వాణిజ్యం, కనెక్టివిటీ, ద్వైపాక్షిక మార్పిడిలపై ఫలవంతమైన చర్చలు జరిగాయని, ఇరు దేశాల దౌత్యవేత్తలు ప్రపంచ, ప్రాంతీయ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నారని సమావేశం అనంతరం జైశంకర్ తెలిపారు. పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వం, పరస్పర ప్రయోజనాలు అనే మూడు పరస్పర చర్యల ద్వారా సంబంధాలు ఉత్తమంగా నిర్వహించుకోవచ్చని, క్లిష్ట కాలం నుంచి ముందుకు సాగాలంటే ఇరువైపుల నుంచి నిర్మొహమాటంగా, నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది' అని భారత విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. భారత్- చైనాల మధ్య సుస్థిరమైన, సహకార పూర్వకమైన, ముందుచూపుతో కూడిన సంబంధాలను పెంపొందించడానికి చర్చలు దోహదం చేస్తాయని ప్రజలు ఆశిస్తున్నారు.

**********




Read More
Next Story