ఎబికె సాహిత్యకీయాల హరివిల్లుకు అనేక రంగులు
x
ఆగస్టు 1 హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఎబికెని సన్మానిస్తున్న ప్రఖ్యాత జర్నలిస్టు సంజయ్ బారు (ఫోటో: మాడభూషి శ్రీధర్)

ఎబికె సాహిత్యకీయాల హరివిల్లుకు అనేక రంగులు

ఎబికె సాహిత్య సంపాదకీయాల మీద సీనియర్ జర్నలిస్టు కల్లూరి భాస్కరం ప్రత్యేక వ్యాసం


అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్ అనే పేరు ఎంతమంది విని ఉంటారు? ఉహూ...దగ్గరి బంధువులు తప్ప చాలామంది విని ఉండరు. అదే, ఎబికె ప్రసాద్ అనే ఒకింత పొట్టిపేరునైతే చాలామందే విని ఉంటారు. పత్రికారంగానికి వస్తే ఎబికె అనే పొడి అక్షరాలతోనే ఆయనను ప్రేమగానూ, గౌరవంగానూ పిలుచుకుంటాం. పత్రికలతో ఎబికె గారి అనుబంధం ఆరు దశాబ్దాలకు పైనే. ఇంతకాలంలోనూ ఆయన ఎన్నో పత్రికలు మారి ఉండవచ్చు; కొత్త పత్రికలను ప్రారంభించి సారథ్యం వహించి ఉండవచ్చు; కానీ అంతిమంగా పత్రికాప్రపంచాన్ని క్షణకాలం కూడా విడవకుండా అందులో పాలూ నీళ్లలా కలసిపోయి జీవించారు; మామూలుగా జీవించడం కాదు, నిత్యనూతనంగా చైతన్యయుతంగా ఆ ప్రపంచం వెంబడే ప్రవహించారు; రోజూ కొత్త కొత్తగా వచ్చే పత్రికలానే తన భావప్రపంచాన్ని నవీనం, పునర్నవీనం చేసుకున్నారు; తన జ్ఞాన, విజ్ఞానాలకు కొత్త సొగసులు అద్దుకున్నారు; కొత్త విన్యాసాలు పోయారు. తెలుగుపత్రికారంగమనే వినీలాకాశంలో తళుకులీనే తారగా చరిత్రపుటలకెక్కవలసిన పేరు ఎబికె.

సమకాలీనపత్రికారచయితల్లో ఎబికె గారికి ఉన్నంత విస్తృతమైన అధ్యయనం ఉన్నవారు మరొకరు లేరనే చెప్పాలి. అంత విరివిగా, అంత వైవిధ్యవంతంగా రాసినవారూ లేరు. వ్యాసమే అయినా, సంపాదకీయమే అయినా -రాతలో ఆయనది పెద్ద పన్నా. స్థలకాలాలనే హద్దులే కనుక లేకపోతే ఆయన రాత నిరవధికంగా సాగిపోతూనే ఉంటుంది. ఆయన వ్యాసాలను అనేకం పేజీకి ఎక్కించిన అనుభవం ఈ వ్యాసకర్తకు ఉంది. ప్రతిసారీ, ‘ఈసారికి ఇది పూర్తిగా పోనీ’ అని నోట్ పెట్టేవారు, ఫోన్ చేసి చెప్పేవారు. స్థలపరిమితి రీత్యా దానిని పూర్తిగా పోనివ్వడం అసాధ్యమని ఆయనకూ తెలుసు. కానీ తన రాత పట్ల ఆయన ప్రేమ మోహాలు అలా ఉంటాయి. ఏ రచయితకైనా తన రచన పట్ల అలాంటి ప్రేమ మోహాలు ఉండవలసిందే. లేకపోతే అతను నిజమైన రచయితే కాదు. ఎబికె గారు నికార్సైన రచయిత.


ఎబికె సన్మాన సభలో ప్రసంగిస్తున్న సంజయ్ బారు (ఫోటో : మాడభూషి శ్రీధర్)


వస్తువైవిద్యం

ఆయన సంపాదకీయాలలో కనిపించే అపారమైన వస్తువైవిధ్యం గురించి చెప్పుకునే ముందు ఆయన శైలి గురించి చెప్పుకోవాలి. ఆయనది పూర్తిగా తనదైన శైలి. అది హఠాత్తుగా కురిసి వెలిసిన వడగళ్ళవానలా బడబడల చప్పుడు చేస్తుంది. ఆ చప్పుడులో ఆయన గొంతు, ఆ గొంతులోని మైమరుపు; తనదైన అనుభూతిని ఆలోచనను పాఠకులతో పంచుకునేటప్పుడు ఒక రచయితలో కట్టలు తెంచుకునే సృజనోత్సాహం మన చెవిని విడవకుండా తాకుతూ ఉంటాయి. ఆయన వాక్యం ఒక్కోసారి అలతి పదాలతో చిన్నదిగానూ ఉంటుంది; ఒక్కోసారి గొలుసుకట్టుగానూ సాగిపోతూ ఉంటుంది. అదే సమయంలో అది ఏకపక్షంగా ఏదో నూరిపోస్తున్నట్టుగా కాక, పాఠకునితో సంభాషిస్తున్నట్టూ ఉంటుంది. ఒక విషయాన్ని, లేదా తన ఒకానొక అభిప్రాయాన్ని నొక్కి చెప్పడానికి ఆయన అనేక గతులు పోతారు; అనేక సంగతులు వేస్తారు; అనేక దారులు తొక్కుతారు; జడివానలాంటి వరుస వాక్యాలతో మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తారు. యతి, యమకమూ, గమకమూ, ప్రాస, అనుప్రాసలను మధ్యమధ్య మెరిపిస్తూ పోవడం ఆయన శైలిలో విడదీయరాని భాగం.

ఉదాహరణకు, గురజాడ గురించి రాస్తూ, ‘ఛాందసవాదులను, వాదాలను పల్టీలు కొట్టించిన సాంస్కృతిక భాస్కరుడు’ అంటారు. ఇంకో చోట ‘రాగాన్ని రంభగా మలచుకున్నవాళ్లు’ అంటారు. వృత్తాలు, ఆవృత్తాలు; వ్యాసాలు, వ్యాసార్థాలు; ఉబుసుపోకకూ కాదు, ఊదరకోసమూ కాదు; కారణం లేని తోరణం ఉండదు; జాళువా రచనల కవి జాషువా; వివక్షను విపక్షం చేయడానికి ప్రయత్నించింది; దర్శకత్వం ఆదర్శకత్వం వహించిన సంఘాలు; ప్రాప్తకాలికంగానే భావితరాలపై కూడా మొహరు వేసుకుపోయిన మహనీయులు; చంద్రలత తన నవలను ఆత్మీయంగా, ఆంధ్రీయంగా తీర్చిదిద్దింది; సారమతి భూమి సాగుదారు రైతు; (నారాయణరెడ్డి)వచనంలో కూడా గతి తప్పని లయా, ఆ లయలో అంతర్లయా అడుగులో అడుగై ముందడుగై సాగుతాయి; ఒకచోట సినారె కవనఝరి శాంతంగా, వేరొకచోట అవిశ్రాంతంగా, మరొక పట్టులో ప్రళయభీకరనాదంగా ప్రచండవాదంగా దర్శనమిస్తుంది; (ముకుందరామారావు కవితాసంపుటిలోని ప్రతికవితా) ఇజం ప్రిజాన్ని దాటి నిజం హజం సరిహద్దులను నిర్ణయించగలది; ఇది గురుపరంపర కాదు, చెడు పరంపర; అగ్రవర్ణాలకు చెందినా నేటి ఉగ్రవర్ణాలైన దళితులకు చెందిన; స్త్రీ ఆటబొమ్మ కాదు. సింగారాల అంగారవల్లరీ కాదు. పులి, ఆడపులి, బెబ్బులి; క్రీనీడల మధ్య క్రేనీడల మధ్య; అతడు చరణదాసుడు కాడు ఆచరణదాసుడు; దోపిడీపైన నిలువుదోపిడీపైన ఆధారపడిన పెట్టుబడిదారీవ్యవస్థ...ఇలా వాక్యాలలో అనువైన చోటల్లా యతో, ప్రాసయతో, అనుప్రాసో పడకపోతే అది ఎబికె శైలి కాదు.

శీర్షికల్లోనూ యతిమైత్రినో, మాటవిరుపునో, ప్రాస చెమక్కునో, చమత్కారాన్నో పొదగనిదే ఆయన కలంకారీ పూర్తికాదు: కొత్త శతాబ్ది ముఖద్వారానికి ముస్తాబులు, భారతీయనవలాకాశంలో అరుంధతీ నక్షత్రం, కరిబియన్ కవిసమ్రాట్ వాల్కాట్, విశ్వాసాల ముకుందమాల- ‘వలసపోయిన మందహాసం’, చెమరించిన కన్నుల నుంచి చివురించిన కవి చెమన్, ముద్రణారంగానికి మురిపాల మూట, ఫెమినిస్టు కథాసాహిత్యంలో ఓ ‘పద్మ’వ్యూహం, కలత మబ్బులూ, కన్నీటి చారికలు డి.వి. కథలు, జీవనసమరానికి చిత్రలిపి అజంతా ‘స్వప్నలిపి’, పీడనపై పడగెత్తిన ‘శ్వేత’నాగు, సమైక్యతారాగానికి ‘శివశంకరి’ తానం పల్లవి, ప్రపంచభాషల్లో తెలుగే వేగవతి, తెలుగుపద్యానికి తొలిపూజ ‘తరువోజ’, లఘుచిత్రాలలో ‘గురు’జాడ, పాలకులకు ‘పెద్దబాలశిక్ష’ పాపిలాన్, చిత్రకళలో మోహన్ పలికించిన ‘చక్షూరాగాలు’, బౌద్ధిక ‘మాంత్రికుడు’ మన అమెరికా అల్లుడు, తెలంగాణంలో ‘నారాయణత్రయం’- అలాంటివి కొన్ని.

ఎబికె భాషకు సంబంధించి చేరా మాటలనే ఉదహరించుకుంటే, అంతర్జాతీయవిషయాలను కూడా జాతీయస్పృహతో, తెలుగు నుడికారంలో చెప్పే నేర్పు ఆయనకుంది. శోభాడే గురించి రాస్తూ, ‘వస్తువినియోగానికి ఆమె వ్యతిరేకం. అవి స్త్రీపురుష సంబంధాల్లో కట్టుకొయ్యలుగా మారకూడదని మాత్రమే ఆమె ప్రబోధం’ అన్న వాక్యాలను చేరా ఉటంకిస్తారు. ఆర్థర్ మిల్లర్ రాసిన ‘డెత్ ఆఫ్ ఎ సేల్స్ మన్’ అనే రెండంకాల నాటకం గురించి రాస్తున్నాసరే; అందులో ఉట్టికెగరలేనివాడు స్వర్గానికి నిచ్చెన వేయడం, బుద్ధిజాడ్యం(పెర్వర్షన్), బాగోతం, స్వాతివానకు ఎదురుచూసే ముత్యపు చిప్ప వంటి సామెతలు, నుడికారాలూ దొర్లవలసిందే. ‘నాబొందో’ అన్నది కూడా ఎబికె గారి వాక్యాలలో తరచు కనిపించే తెలుగు‘ధనా’ల్లో ఒకటి. తను పాశ్చాత్యదేశీయుడైనా తెలుగువారి ఆడబడుచును పెళ్లాడడమే కాకుండా అరవిందయోగి తాత్వికతవైపు ఆకర్షితుడై దానితో మమేకమై మథించిన మైకేల్ మియోవిక్ గురించి రాస్తున్నప్పుడు ‘మన అమెరికా అల్లుడు’ అని నోరారా అనవలసిందే. రవీంద్రనాథ్ టాగోర్, రాహుల్ సాంకృత్యాయన్, కమలాదాస్, మహాశ్వేతాదేవి, అరుంధతీరాయ్, తస్లీమా నస్రీన్, అనటోల్ ఫ్రాన్స్, రాబర్ట్ ఫ్రౌస్ట్, ఎజ్రాపౌండ్, రాబర్ట్ లోవెల్, మేరీ మెకార్ది, డిలాన్ థామస్, డెరిక్ వాల్కాట్, గిన్స్ బర్గ్, సిల్వియా ప్లాత్, సీమన్ ద బోవర్, ఆర్థర్ మిల్లర్, గంతర్ గ్రాస్, జె. కె. రోలింగ్ వగైరా దేశవిదేశీకవిరచయితల గురించి, వారి రచనల గురించి రాసినా ప్రస్తావించినా ఆ వాక్యాలలోనూ తెలుగు నుడికారపు తళుకులద్దుతూ దాదాపు వాళ్ళను కూడా తెలుగువాళ్ళుగా మార్చి అయినవాళ్లను చేయగల ఇంపుసొంపులు ఆయన సొంతం.

ఈ తెనిగింపు కేవలం నుడికారం దగ్గరే ఆగదు. ఏ సమకాలీన, లేదా ముందుకాలానికి చెందిన తెలుగేతర, విదేశీయ కవిరచయితల గురించి రాస్తున్నా సరే; అందులోకి అలనాటి నన్నయ, నాచనసోమన, శ్రీనాథుల మొదలుకొని నిన్నటి విశ్వనాథవరకు మన వాళ్ళనందరినీ చేయిపట్టుకుని తీసుకొచ్చి భావధారలో, ఆలోచనల తీరులో సామ్యాలు, సొగసులు ఎత్తిచూపనిదే ఎబికె కలం తృప్తి చెందదు; ఆయన రచనోత్సాహం పారం ముట్టదు. ఉదాహరణకు, ‘మై సెంచరీ’ అనే పేరుతో ఒక శతాబ్దికాలం మొత్తాన్ని సొంతం చేసుకుంటూ పుస్తకం వెలువరించిన ప్రసిద్ధ జర్మన్ రచయిత, నోబెల్ పురస్కారగ్రహీత గంతర్ గ్రాస్ గురించి రాస్తూ; ఆయనలానే ‘ఈ శతాబ్దం నాది’ అని ప్రకటించుకున్న మన మహాకవి శ్రీశ్రీని తీసుకొస్తారు. అంతేకాదు, అక్కడితో తృప్తి చెందకుండా, “ఏదో సందర్భంలో ఒక తెలుగుకవి ‘సాలగ్రామఖనిన్ జనించెనుగదా జాత్యల్పపాషాణముల్’ అన్నట్టుగా గ్రాస్ ‘శతాబ్దం’లో అల్పమైన సంఘటనలు కూడా ప్రాధాన్యం పొందాయి” అని చెబుతూ ‘పాండురంగమాహాత్మ్య’కర్త అయిన తెనాలి రామకృష్ణుని కూడా తీసుకొచ్చి గంతర్ గ్రాస్ పక్కన కూర్చోబెట్టే ఉబలాటం ఎబికెది.

అలాగే, కరిబియన్ కవి, నోబెల్ పురస్కారగ్రహీత, ‘సముద్రమూ దాని ఆటుపోటులూ జీవనసమరానికి ప్రతిబింబాలై అమితంగా ప్రభావితం చేసిన’ వెస్టిండీస్ కవి డెరిక్ వాల్కాట్ గురించిన సంపాదకీయాన్ని, ‘కలశపాథోరాశి గర్భవీచీమతల్లి కడుపార నెవ్వాని కన్నతల్లి’ అనే నన్నయ పద్యపాదంతో శ్రుతి చేస్తారు. “చెట్టు పుట్ట, చేను, చెలక, ఏరు, సెలయేరు, నదీనదాలు, సంద్రాలు, సూర్యాస్తమయాలు-ఒకటేమిటి చరాచరకోటి కవిని కవ్వించి గిలిగింతలు పెట్టగల కావ్యవస్తువులవుతా”యంటూ, ఆంధ్రుల ఆదికవి ఏ సముద్రం వద్దనో కాపువేసి ఉండకపోతే చంద్రుని రాకను అంత అందంగానూ, ఆర్ద్రంగానూ చెప్పగలిగేవాడు కాడంటారు. ఆ వెంటనే, “మన జాతీయకవితాశాఖను అమితంగా పుష్పింపజేసిన కలకంఠాలలో ఒకరైన విశ్వనాథ లాంటివాళ్లు కూడా- గోదావరి, తుంగభద్ర, పెన్న, కృష్ణాతరంగాలతో సయ్యాటలాడకపోతే అంతటి అక్షరశిల్పులు అయుండేవారు కారు” అని చెప్పి మన కవిసమ్రాట్ నూ లాక్కొస్తారు. వాల్కాట్ రచన ‘ఓమరస్’ గురించి రాసేటప్పుడు ‘యులిసిస్’ రచయిత జేమ్స్ జాయిస్ నే కాదు; వాల్మీకి రామాయణాన్ని, హోమర్ ‘ఇలియడ్’, ‘ఒడెస్సీ’లనూ ప్రస్తావిస్తారు.

అలాగే, తస్లీమా నస్రీన్ గురించి రాసేటప్పుడు మన రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి, వోల్గా వచ్చి వాలవలసిందే. ఆ సంపాదకీయం తొలి పేరా ఎనిమిది పంక్తుల్లోనే ఫ్రాంక్లిన్ జోన్స్ , సోక్రటీస్, బెర్ట్రాండ్ రసెల్ వచ్చి కూర్చుంటారు. ప్రపంచవ్యాప్తంగా పాఠకులను వెర్రెక్కించి లక్షల ప్రతులు అమ్ముడుపోయిన జె.కె. రోలింగ్ రచన ‘హారీ పాటర్’ గురించి రాస్తున్నప్పుడు ఉన్నట్టుండి నాచన సోమన ఉత్తరహరివంశాన్ని తీసుకొచ్చి ‘గురువులు చెప్పరే చదువు, కొంత వివేకము మిమ్ము చేరదే’ అనే పద్యపాదాన్ని ఉదహరిస్తారు. ‘మదనకామరాజు కథలు, విఠలాచార్య సినిమాలు తెలిసిన తెలుగువారికి మాయలు మర్మాలతో కూడిన రచనలు అంత అబ్బురమనిపించకపోవచ్చు కానీ పశ్చిమదేశాలవారికి ఇవి నూతనద్వారాలు తెరుస్తున్నట్టున్నా’యని వ్యాఖ్యానించి పనిలో పనిగా హారీ పాటర్ గాలి తీసే యోచనా చేస్తారు.

కాగితాన్ని చుంబించినదే తడవుగా ఎబికె గారి కలం పూనకం పట్టినట్టు వేసే చిందుల చిత్రగతులు ఇంకా బహువిధాలుగా ఉంటాయి. నామసామ్యం పుణ్యమా అని నేటి సుప్రసిద్ధ రచయిత్రి అరుంధతీ రాయ్ ‘భారతీయనవలాకాశంలో ‘అరుంధతీనక్షత్రం’’ కావలసిందే. అలనాటి పురాణసృష్టి అయిన వసిష్ఠుని ఇల్లాలుగా పాతివ్రత్యధర్మానుసారం భర్తలానే కమండలాన్ని చేతధరించిన అరుంధతికి భిన్నంగా ఈ అరుంధతి కమండలాన్ని కత్తిగా, కలంగా మలచింది సుమా అని చెప్పితీరవలసిందే. ‘చరిత్రను తిరగరాసిన ఆధునిక తెలుగు మహిళ’గా వాసిరెడ్డి సీతాదేవి గురించి చెబుతూనే, అదే నామసామ్యం కారణంగా రామాయణంలోని సీత ముచ్చటా తేవలసిందే. రాముడి వెలుగులో ప్రకాశించిన నాటి సీతకు భిన్నంగా ఈ సీత స్వయంప్రకాశ అనీ, రాముడితో నిమిత్తం లేని సీత కూడా వెయిరెట్లు బుద్ధిబలసంపన్నురాలు కాగలదని రుజువు చేసిన నేటి సీత అనీ చెప్పనిదే ఎబికె కడుపు నిండదు, కలం పండదు. ఇలాంటి నామసామ్యం కారణంగానే బౌద్ధమతాచార్యుడు అశ్వఘోషుని వజ్రసూచి వజ్రాయుధమూ, ఫెమినిస్టు కథాసాహిత్యంలో కుప్పిలి పద్మ కాస్తా ‘పద్మ’వ్యూహమూ, ప్రసిద్ధ బెంగాలీ రచయిత్రి మహాశ్వేతాదేవి పీడనపై పడగెత్తిన ‘శ్వేత’నాగూ, అజంతా ‘స్వప్నలిపి’ చిత్రలిపీ అయితీరవలసిందే.

ఆగ్రహ భార్గవులు

అలాగని వీటిని కేవలం శ్లేషకోసమో ప్రాస కోసమో పడే ప్రాకులాటగా భావించడం పొరబాటే అవుతుంది. అల్పాక్షరాలలో అనల్పార్థాన్ని చొప్పించినట్టుగా సంపాదకీయం వంటి మూడు నాలుగు పుటల రచనలో కూడా అర్వాచీన విషయాలు, వ్యక్తులు, పాత్రలతోకలిపి ప్రాచీనవిషయాలు, పాత్రల ప్రస్తావన తేవడం -కాలభేదాలను దాటుకుంటూ సమాజం గురించి, సంస్కృతి గురించి, దేశం గురించి ఒక సమగ్రావగాహనను పెంపొందించుకోవడానికి తప్పకుండా తోడ్పడుతుంది. ముఖ్యంగా మన పురాణేతిహాసాలతో గాఢమైన పరిచయానికి దూరమైన, దూరమవుతున్న తరాలకు ఇలాంటి కూర్పు ఎంతైనా అవసరమే. ఇది ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఎబికె గారు ‘ఆగ్రహ భార్గవులు’ అనే అర్థవంతమైన ఒక కొత్తమాటను నిఘంటువుకు అందించే వెసులుబాటునూ ఇచ్చింది. 1920లలో, 1950లలో, నాటి పరిస్థితులపట్ల అసంతృప్తి నుంచి ఉబికివచ్చిన అసహనం ఆగ్రహజ్వాలగా మారి పాశ్చాత్య కవితా, సంగీత, కళాప్రపంచంలోకి నవ్యశక్తులుగా తోసుకొచ్చిన యువతరాన్ని వారు ‘యాంగ్రీ యంగ్ మెన్’ గా పిలిస్తే, దానికి ఎబికె గారి ఆంధ్రీకరణం ‘ఆగ్రహ భార్గవులు’. ఆగ్రహానికి మరో పేరే కాక, భృగువంశానికి చెందినవాడుగా భార్గవుడనిపించుకున్న పౌరాణిక పరశురాముని మీదుగా కూర్చిన మాట ఇది. అదే సమయంలో, ‘బీట్ జెనరేషన్’ గా పిలిచిన ఈ కొత్త యువతరం మొత్తానికి వాగర్థాలు సమకూర్చిపెట్టిన ‘యుగవాణి’ గిన్స్ బర్గ్ గురించి, మన దిగంబరకవులపై అతని ప్రభావం గురించి సహా నేటి తరాలు తెలుసుకోవలసిన ఎంతో విలువైన సమాచారాన్ని ఎబికె ప్రోది చేస్తారు.

తెలుగు సంస్కృతికి బహుముఖీన సారథిగా గురజాడను చూపడంలో ఎంత మమతను, మమేకతను చూపుతారోతెలుగు పద్యానికి తొలిపూజగా తరువోజ అనే ఛందోభేదాన్ని చర్చించడంలోనూ అంత తమకాన్ని చాటతారు. చాళుక్యరాజు గుణగవిజయాదిత్యుని సేనాని పండరంగడు నేటి ప్రకాశం జిల్లా అద్దంకిలో వేయించిన దానశాసనంలో తొలిగా విరబూసి కనిపించిన తరువోజ ఆ తర్వాత నన్నయాది ప్రాచీనకవుల గంటానికి సకృత్తుగా పూసినా జానపదులు, శ్రమజీవుల పాటలలో, పదాలలో ఎలా వర్ధిల్లిందో విషయసాంద్రతతో ఎబికె వివరించుకుంటూ వస్తారు. దేనిగురించి అయినా చరిత్రలోతులు తడుముతూ సాకల్యంగా వివరించ ప్రయత్నించే పాత్రికేయతాలక్షణం ఇందులోనే కాదు; ఎబికెగారి ఇతర సంపాదకీయాలలోనూ అంతే తలస్పర్శిగా కనిపిస్తుంది. ఆపైన, భావాల బట్వాడాకు, అంటే, కమ్యూనికేషన్ కు ప్రపంచంలోని ఏ భాషకు ఎక్కువ సౌలభ్యం ఉందో గణితశాస్త్రం, గణాంకశాస్త్రాల ఆధారంగా నలభై ఏళ్లక్రితమే లెక్కగట్టి మిగతా భారతీయ భాషలన్నింటికన్నా తెలుగులిపికి, పదాలకు మాత్రమే ఆ శక్తి ఉందని నిరూపించిన తెలుగు మేధావి, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ నిపుణుడు అయిన ప్రొ. బి.ఎస్.రామకృష్ణ శోధనాంశాల గురించి అంతే విషయనిష్ఠంగానూ, లాఘవంగానూ వివరించగలరు. చివరికి జపాన్ కు చెందిన ప్రొ. యోజీ కిమూరా అనే శాస్త్రవేత్త హాసప్రక్రియాశాస్త్రం(సైన్స్ ఆఫ్ లాఫ్టర్)లో విశేష పరిశోధనలు చేసి నవ్వును కొలిచే యంత్రాన్ని కనిపెట్టిన సంగతి కూడా ఎబికె గారి వాడిచూపును తప్పించుకునే ప్రశ్నలేదు. ఆయన లఘుచిత్రాలలో గురుజాడలను గుర్తిస్తారు; న్యాయవ్యవస్థలోపాలు, పాలకుల దుర్నీతీ కారణంగా ప్రొఫెషనల్ క్రిమినల్ గా మారినా, మానవత్వాన్ని మరచిపోని ఒక ఫ్రెంచి పౌరుడు ‘పాపిలాన్’ (హెన్రీ షారియర్) స్వీయచరిత్ర వెలుగులో మన దేశంలో ప్రజానుకూలంగా, ప్రజాస్వామ్యానుకూలంగా పోలీస్ వ్యవస్థను సంస్కరించవలసిన అవసరాన్నినొక్కి చెబుతారు; పోలీసులకు ప్రత్యేకాధికారాలు కానీ, కొత్త చట్టాలు కానీ అవసరం లేదని ఉగ్గడిస్తారు; చిత్రకళలో మోహన్ పలికించిన చక్షూరాగాలకు చెవియొగ్గుతారు; ప్రసిద్ధ ఫొటో జర్నలిస్టు డి. రవీందర్ రెడ్డి(రవీందర్) ఛాయాచిత్రాలలో గురజాడ భావధారను పట్టుకుంటారు; కౌటిల్యుని అర్థశాస్త్రానికి పుల్లెల శ్రీరామచంద్రుడు విరచించిన వ్యాఖ్యానంలోని విశిష్టతను ఎత్తిచూపుతూ కౌటిలీయానికి చెందిన చరిత్రలోతుల్ని తడుముతారు. ఇలాంటివి అనేకం ఎబికె గారి అధ్యయనవాహిని ఎన్ని పాయలుగా చీలగలదో, ఎన్ని దారులు పట్టగలదో, ఎంత వైవిధ్యాన్ని ఒడిసిపట్టగలదో దిఙ్గ్మాత్రంగా కాదు, దిగంతమాత్రంగా చూపుతాయి.

అలాగే, ‘ఒక నవ్వు, ఒక వెక్కిరింత, ఒక లేమి...’ అనే చక్కని భావస్ఫోరకమైన శీర్షికతో హాస్యం గురించి రాస్తూ మొక్కపాటి, మునిమాణిక్యం, ముళ్ళపూడిలను ‘మకారత్రయం’గా పేర్కొని; సమకాలీనసమాజాన్ని, జీవితాన్ని, విలువలను ఎంతో సమర్థంగా చిత్రించిన మార్క్ ట్వైన్, మోలియర్, ఉడ్ హౌస్ ల హాస్యంతో వారి హాస్యాన్ని పోల్చుతూ వారు దాటలేకపోయిన పరిమితులెలాంటివో నిష్కర్షగా ఎత్తిచూపుతారు. ఆపైన ఇబ్సన్, బెర్నార్డ్ షా, చెహోవ్, గోర్కీ, మపాసా, ఆస్కార్ వైల్డ్ లను కూడా ఉదహరిస్తూ, వీరిని ‘మన పెద్దలు హాయిగా చదువుకున్నారు కానీ వాటివల్ల ప్రభావితులు కాలేదు. అది వారి స్థితప్రజ్ఞకు తార్కాణం’ అని చమత్కరిస్తారు. ‘చార్లీ చాప్లిన్ సినిమాల్లో ఇంగ్లీషు హాస్యం ఉంటుంది. దానితోపాటు మానవజీవితంలోని విషాదం కూడా ఉంటుంది. మన ‘మకారత్రయం’ జీవితంలోని ఆ విషాదం జోలికి పోలేదు. వారి సమకాలికులు, వారి వారసులు కూడా ఆ పని చేయలేదు’ అంటారు. అమలిన హాస్యం రాస్తున్న వారిలో శ్రీరమణను ప్రథమునిగా ఎన్నుతూనే, ‘ఆయనకు హాస్యదృష్టి, వ్యంగ్యదృక్కోణమూ ఉన్నాయి కానీ దయ కనబడదు. మనుషుల మీద ప్రేమ అగుపించదు. గొప్ప రచయితల్లో మాత్రమే దయ, కరుణా కలిగిన హాస్యమూ, వ్యంగ్యమూ ఉంటాయి. ఆ స్థాయి వాళ్ళు తెలుగువారి భాగ్యవశాన ఇద్దరున్నారు: ఒకరు గురజాడ కాగా రెండోవారు రాచకొండ’ అని ఎంతో లోతైన, ఆలోచనాత్మకమైన విశ్లేషణ చేస్తారు. ‘జీవితానికి ఒక దృక్పథమూ, ఒక స్పష్టమైన దృష్టీ లేకపోతే గొప్ప సాహిత్యసృజన సాధ్యంకా’ దంటూ సాహిత్యంపట్ల అంతే లోతు కలిగిన తన దృష్టికోణాన్ని వెల్లడిస్తారు.


హరివిల్లులో ఏడు రంగులు మాత్రమే ఉంటే ఎబికెగారి సాహిత్యసంపాదకీయరచన ఏడుపదుల రంగులను మించి ఉండే వైవిధ్యపు ఇంద్రధనువు. ఆయనకు సామ్యవాదం, పురోగమనశీలం, స్త్రీపురుషసమానత్వం, ప్రజాస్వామ్యం, మానవహక్కులు పునాదిగా తనదైన సామాజిక, రాజకీయ, ఆర్థికతాత్త్వికత ఉంది. సైద్ధాంతికంగా రాజీకి తావులేని తాత్త్వికత అది. అదేసమయంలో సమకాలీన విషయాల గురించిన ఆయన ఆలోచనాధార ఆ మౌలిక తాత్త్వికతా సూత్రాన్ని గట్టిగా గుప్పిట పట్టుకుని ఉంటూనే గాలిపటంలా, కాలికస్పృహతో కూడిన గాలుల వెంట అన్నివైపులకూ వ్యాపిస్తూ ఎగురుతుంది. ఖాకీబతుకుల గురించే కానీ, వలసపోయిన మందహాసం గురించి కానీ, చెమన్ కవిత్వం గురించే కానీ...ఆయన ఏం రాసినా సమకాలీనసామాన్యజనజీవవ్యథలకు, వేదనలకు అద్దంపట్టడానికి ప్రాధాన్యం ఇస్తారు. వ్యక్తిగత విశ్వాసాల ఇరుకులో కూరుకుపోకుండా, సైద్ధాంతికపు కురచ చూపులనుంచి ప్రపంచాన్ని చూడకుండా అన్నమయ్యకీర్తనల గురించి, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గురించి, భక్తిసంగీతం గురించి రాయడంలోనూ భావవైశాల్యాన్ని చాటుకుంటారు. తను వామపక్షభావజాలంవైపు మొగ్గు ఉన్నవారైనా అనేక వైరుధ్యాల మధ్య సమన్వయాన్ని, భిన్నకులమతావర్గాల మధ్య సామరస్యాన్ని కోరుకుంటారే తప్ప అతిని, అరాచకాన్ని సహించరు. చిన్నవయసులోనే కన్ను మూసిన త్రిపురనేని శ్రీనివాస్ గురించి రాస్తూ, అప్పుడప్పుడు శకలాలుగా కొన్ని అద్భుతభావచిత్రాలు చూపించగల శక్తి ఉన్నవాడైనా స్త్రీ-పురుషసంబంధాలపై తప్పుడు ధోరణులు వ్యాప్తి చేయడంలోనూ దిట్టగా అభివర్ణించి అతనిలోని అతిని అరాచకతను ఎత్తిచూపుతూ నిశితంగా నిర్మొహమాటంగా ఖండిస్తారు. వాసిరెడ్డి సీతాదేవి గురించి రాసినప్పుడు, ‘మితిమీరిన అతివాద ఛాయలకు, అతిమితవాద ధోరణులకూ దూరంగా, సమదర్శిగా ఉండి తన పాత్రలను చైతన్యస్వరూపులుగా తీర్చి పెట్టా’రని ప్రస్తుతిస్తారు. ఇలా ఒకవిధంగా కాదు, ఎబికె గారి సాహిత్యసంపాదకీయాలు అనేకవిధాలుగా ఆలోచనా, రచనా రంగాలలో ఉన్న ప్రతి ఒకరికీ దిగ్దర్శనం చేయించే కరదీపికలు, విలువైన వరవడులు, విజ్ఞానపు గనులు, అక్షరమైన సిరులు.




Read More
Next Story