నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుంటే ప్రభుత్వాలకు పట్టదా ?
x

నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుంటే ప్రభుత్వాలకు పట్టదా ?

కన్నెగంటి రవి విశ్లేషణ: పంటలకు ధర రాలేదని రైతులు, ధరలు మండుతున్నాయని వినియోగదారులు సతమతమవుతున్నారు. మరి కొండెక్కుతు నిత్యావసరల ధరల వెనక కారణం ఏంటి?


నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతుండడం, కుటుంబాలపై ఆర్ధిక భారం పడడం, దేశవ్యాపితం గానే కాదు. తెలంగాణ లో కూడా పేద, మధ్యతరగతి ప్రజలకు నిత్య జీవితానుభవం అయిపోయింది. ధరలు పెరుగుతున్నట్లు కనిపిస్తుంది కానీ, ఎందుకు పెరుగుతున్నాయో, ఏ పరిస్థితులు, ఏ వ్యక్తులు, ఏ సంస్థలు అందుకు కారణమో ప్రజలకు అర్థం కావడం లేదు. .

ఒకవైపు పంటలు పండిస్తున్న గ్రామీణ రైతులు తమకు వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదనీ , ఎంత కష్టపడినా న్యాయమైన ధరలు తమకు అందడం లేదనీ వాపోవడం మనం చూస్తుంటాం. మరో వైపు వినియోగదారులు( ఇందులో గ్రామీణ , పట్టణ వినియోగదారులు కూడా ఉంటారు) పెరుగుతున్న ధరల భారాన్ని మోయలేక సతమతమవుతూ ఉంటారు. కారణాలేమిటి?

ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ప్రధానంగా ఉంది. రైతులు పండించే పంటలకు కనీస మద్ధతు ధరలు లేని కూరగాయలు, పండ్లు, పాలు లాంటి ఇతర నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది.

తెలంగాణ లో 2023 డిసెంబర్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ పై రాయితీ ఇస్తూ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగ దారులకు రాయితీపై ఉచిత విద్యుత్ అందిస్తున్నప్పుడు, పేద, మధ్యతరగతి కుటుంబాలు సంతోషించాయి. కానీ ఈ సంతోషం కాస్తా నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో ఆవిరి అయిపోయింది.

ఈ ధరల పెరుగుదలతో రైతులు, వినియోగదారులు కూడా దోపిడీకి గురవుతున్నప్పుడు బాగుపడింది ఎవరు? తప్పకుండా వ్యాపారులు, మధ్య దళారీలు , పారిశ్రామికవేత్తలు. ఈ పరిణామాన్ని నివారించడానికే కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లో ఉన్న, 1955 నిత్యావసర సరుకుల చట్టాన్ని అమలు చేయాల్సి ఉంటుంది . నిత్యావసర సరుకుల ధరలపై పర్యవేక్షణ చేస్తూ, ధరల భారాన్ని ప్రజలపై తగ్గించడానికి చౌక ధరలకు సరుకులను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకోవాల్సి ఉంటుంది. ధరల స్థిరీకరణ నిధి పేరుతో బడ్జెట్ లో నిధులు కూడా పెట్టుకునేది అందుకే. కానీ కేంద్ర ప్రభుత్వం ధరల పెరుగు దలపై ఎటువంటి చర్యలు చేపట్టకుండా మౌనంగా చూస్తున్నది. లేదా వ్యాపారులకే మరింత లాభాలు దక్కేలా , ఎగుమతి దిగుమతి విధానాలను అమలు చేస్తున్నది.

నిజానికి కేంద్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఈ పనిని పర్యవేక్షించడానికి “ ధరల పర్యవేక్షణ డివిజన్ (PMD) “ ఉంటుంది. ఎంచుకున్న నిత్యావసర సరుకుల ధరల పై పర్యవేక్షణ చేయడమే ఈ డివిజన్ ప్రధాన కర్తవ్యం. ప్రతి రోజూ 22 రకాల సరుకుల హోల్ సేల్ , రిటైల్ ధరలను సేకరిస్తూ, సంస్థ వెబ్ సైట్ లో ఉంచడం ఈ డివిజన్ ప్రధాన పని. భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తే, వాటిని నియంత్రించడానికి ఈ డివిజన్ ప్రభుత్వాలను అలర్ట్ చేస్తుంది.

కొన్ని సరుకులు మార్కెట్ లో అందుబాటులో తగిన విధంగా లేనప్పుడు , ఆ సరుకు ధరలు బాగా పెరిగిపోకుండా, వినియోగదారులకు ఊరట లభించేలా, తగిన చర్యలు ఈ డివిజన్ చేపట్టాల్సి ఉంటుంది.

ఈ విభాగం , బియ్యం, గోధుమలు, గోధుమ పిండి, శనగ పప్పు , కంది పప్పు, మినప పప్పు, పెసర పప్పు, మసూర్ పప్పు, చక్కర, బెల్లం, వేరు శనగ నూనె, ఆవ నూనె, వనస్పతి, పామాయిల్, పొద్దు తిరుగుడు నూనె, సోయా నూనె, ఉప్పు, టీ పొడి, పాలు, ఆలు గడ్డ, ఉల్లి గడ్డ, టమాటా లాంటి 22 సరుకుల ధరలను పర్యవేక్షిస్తుంది. దేశ వ్యాపితంగా 550 మార్కెట్ సెంటర్ ల నుండీ ఈ ధరలను సేకరిస్తుంది. జాతీయ స్థాయిలో NIC సంస్థ వీటిని నిర్వహిస్తుంది. రాష్ట్ర స్థాయిలో పౌర సరఫరాల శాఖ ఈ ధరల సేకరణకు బాధ్యత వహిస్తుంది. 2021 జనవరి 1 నుండీ మొబైల్ యాప్ ద్వారా ఈ ధరల సేకరణ చేస్తున్నారు. ఈ డాటా సేకరణలో సిబ్బంది మోసాలకు పాల్పడకుండా, ఎంచుకున్న మార్కెట్ సెంటర్ నుండీ ఈ డాటా ను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ధరల నుండీ రాష్ట్ర సగటు ధరలు గణించి, రోజు, వారం, నెల, సంవత్సరానికి పోల్చి చూస్తారు. మొత్తంగా నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలలో వస్తున్న మార్పులను అర్థం చేసుకోవడానికి అధికారికంగా నిర్వహించే ప్రక్రియ ఇది.

కేవలం ఈ మార్కెట్ సెంటర్స్ నుండే కాకుండా, 162 భారత ఆహార సంస్థ (FCI) కార్యాలయాలు, 17 నాఫెడ్ సంస్థ క్షేత్ర స్థాయి కార్యాలయాలు కూడా బియ్యం, గోధుమలు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, టమాటా, కంది పప్పు, శనగ పప్పు, మినప పప్పు, పెసర పప్పు, మసూర్ పప్పు, చెక్కర లాంటి మరో 11 సరుకుల ధరలను సేకరించి పంపుతాయి. మార్కెట్ కేంద్రాల నుండీ వచ్చిన సరుకుల ధరలతో వీటని పోల్చి చూస్తారు. పంటల సాగు విస్తీర్ణంలో మార్పులు, , అంతర్జాతీయ మార్కెట్ లో ఈ ఉత్పత్తుల ధరలు లాంటివి కూడా పరిశీలిస్తారు.

తెలంగాణలో గత మూడు సంవత్సరాలలో ఈ 22 సరుకుల ధరల పెరుగుదల, తగ్గుదలలో వచ్చిన మార్పులను పరిశీలిస్తే, నిత్యవసరాల ధరలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో స్పష్టంగా అర్థమవుతుంది.


2022 సెప్టెంబర్ 24 న కిలో 41.67 రూపాయలు ఉన్న సగటు బియ్యం ధరలు 2024 సెప్టెంబర్ 24 న 55 రూపాయలకు చేరుకున్నాయి. గోధుమ ధరలు 34.67 రూపాయల నుండీ 40.06 రూపాయలకు, గోధుమ పిండి ధరలు కిలో 40 రూపాయల నుండీ 44.30 రూపాయలకు పెరిగాయి.

శనగ పప్పు ధరలు కిలో 69.50 నుండీ 89.10 రూపాయలకు, కంది పప్పు ధరలు కిలో 105.83 రూపాయల నుండీ 162 రూపాయలకు, పెసర పప్పు ధరలు కిలో 101.33 నుండీ 114.70 రూపాయలకూ , మినప పప్పు ధరలు కిలో 110 రూపాయల నుండీ 126.50 రూపాయలకూ పెరిగాయి. మసూర్ పప్పు, చక్కర, పాలు,బెల్లం, టీ పొడి ధరలలో పెద్దగా మార్పు లేదు.

మరో విషయం మనం గమనించాలి. పౌర సరఫరాల శాఖ దేశ వ్యాపితంగా సేకరిస్తున్న నిత్యావసర సరుకుల ధరలకూ, రోజు రోజుకూ విస్తరిస్తున్న కార్పొరేట్ మార్కెట్ విక్రయిస్తున్న నిత్యావసర సరుకుల ధరలకూ మధ్య తీవ్ర వ్యత్యాసం ఉంటున్నది.

ఉదాహరణకు తాజాగా రిలయెన్స్ వారి జియో మార్ట్ లో అమ్ముతున్న రిలయెన్స్ స్వంత రిటైల్ బ్రాండ్ గుడ్ లైఫ్ బ్రాండ్ కిలో కంది పప్పు ధర 229 రూపాయలు. అర కిలో ధర 116 రూపాయలు, పొట్టు తీయని కందిపప్పు ధర 259 రూపాయలు గా ఉంది. అలాగే వేరు శనగ పప్పు కిలో 169 రూపాయలు, పెసరపప్పు కిలో 122 రూపాయలు , మినప పప్పు కిలో 188 రూపాయలు, శనగ పప్పు కిలో 116 రూపాయలు గా ఉన్నాయి. మరో కార్పొరేట్ రిటైల్ కంపెనీ టాటా వారి టాటా సంపన్న్ బ్రాండ్ పెసర పప్పు కిలో 200 రూపాయలు, పొట్టు తీయని కందిపప్పు 288 రూపాయలు, పెసలు కిలో 188 రూపాయలు, పొట్టు తీయని శనగపప్పు 148 రూపాయలు గా ఉన్నాయి. వంట నూనెలలో ఆదానీ కంపెనీ వారి ఫార్చూన్ బ్రాండ్ సన్ ఫ్లవర్ నూనె కిలో 139 రూపాయలుగా

(పౌర సరఫరాల శాఖ వారి పొద్దు తిరుగుడు నూనె సగటు ధర 127 రూపాయలు) ఉంది. రిలయెన్స్ వారి వేరుశనగ నూనె 175 రూపాయలు (పౌర సరఫరాల శాఖ వారి వేరుశనగ నూనె సగటు ధర 160 రూపాయలు ) గా ఉన్నాయి.

అంటే పౌర సరఫరాల శాఖ సేకరిస్తున్న ధరలకూ, మార్కెట్ లో విస్తరిస్తున్న కార్పొరేట్ రిటైల్ కంపెనీల ధరలకూ మధ్య ఇంత వ్యత్యాసం ఉందంటే ప్రభుత్వం సేకరిస్తున్న సరుకుల ధరల ప్రక్రియలో ఉన్న లోపాలు కూడా అర్థమవుతున్నాయి. పైగా ఈ కార్పొరేట్ సంస్థల స్టోర్స్ లో ధరల పెరుగుదల వల్ల , మధ్యతరగతి ప్రజలపై ఎంత భారం పెరుగు తుందో మనం అర్థం చేసుకోవచ్చు. జియో, అమెజాన్ , టాటా . ఆదానీ విల్మార్, వాల్ మార్ట్, మోర్ లాంటి సంస్థలు ఆన్ లైన్ మార్కెట్ , ఆఫ్ లైన్ స్టోర్స్ ద్వారా, మార్కెట్ ను కబళించడానికి చూస్తుంటే, కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాటికి సహకారం అందిస్తున్నది. ఒక్క రోజు కూడా ఈ ధరలపై, ఈ కంపెనీలపై నియంత్రణ తీసుకు రావడానికి ప్రయత్నం చేయడం లేదు.

భారత దేశ వ్యాపితంగా కూడా ఈ 22 సరుకుల ధరలు మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2014 -2024 మధ్య 10 సంవత్సరాలలో గణనీయంగా పెరిగినట్లు పౌర సరఫరా శాఖ ప్రతి రోజూ విడుదల చేసే డాటా స్పష్టంగా బయట పెడుతున్నది. 2024 జనవరి, 2024 జనవరి మధ్య నిత్యావసర సరుకుల ధరల డాటాను అధ్యయనం చేసిన మిత్రుడు దీపాల సురేష్ factly వెబ్ పోర్టల్ లో రాసిన వ్యాసం దీనిని బయట పెట్టింది.

ఈ విశ్లేషణ ప్రకారం 2014 లో కిలో కందిపప్పు ధర 70 రూపాయలు కాగా, అది 2024 నాటికి 150 రూపాయలకు ( 115 శాతం), మినప పప్పు ధర 64 రూపాయల నుండీ 123 రూపాయలకు ( 90 శాతం) , ఉల్లిగడ్డ ధర 22 రూపాయల నుండీ 38 రూపాయలకు (69 శాతం) పెరిగాయి.

2014 జూన్, 2024 జూన్ మధ్య కాలంలో కిలో టమాటా ధరలు 18 రూపాయల నుండీ 42 రూపాయలకు (134 శాతం), కందిపప్పు ధరలు 70 రూపాయల నుండీ 161 రూపాయలకు (130 శాతం ) , శనగ పప్పు ధరలు 47 రూపాయల నుండీ 88 రూపాయలకు( 88 శాతం) పెరిగాయి. 2014-2018 మధ్య కాలంలో టమాటా ధరలు 60 శాతం పెరగగా, 2019-2024 మధ్య కాలంలో 134 శాతం పెరిగాయి.

మోడీ ప్రభుత్వ మొదటి విడత పాలన ( 2014-2019) కంటే, రెండవ విడతలో ( 2019-2024 ) అన్ని నిత్యావసర సరుకుల ధరలు గణనీయంగా పెరిగాయి. నిజానికి మోడీ ప్రభుత్వం 2020 జూన్ లో నిత్యావసర సరుకుల చట్టం 1955 ను రద్ధు చేస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది. మిగిలిన రైతు వ్యతిరేక చట్టాలతో పాటు,ఈ చర్య కూడా మోడీ ప్రభుత్వం చేపట్టడానికి ఈ చట్టంలో వ్యాపారుల వద్ద సరుకుల నిలవ పై ఉన్న పరిమితులు ప్రధాన కారణం. రిటైల్ రంగంలో కార్పొరేట్ కంపెనీలు,అంతు లేకుండా దేశ వ్యాపితంగా సరుకులు కొని భారీగా నిల్వ చేసి దేశమంతా రిటైల్ వ్యాపారాన్ని విస్తరించాలనే ప్రయత్నంలో ఉన్నాయి.

వినియోగదారులకు సరఫరా అయ్యే నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా, బ్లాక్ మార్కెట్ విస్తరించకుండా ఇప్పటి వరకూ ఈ చట్టం అడ్డుగా ఉండింది. అందుకే కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం మోడీ ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్ధు చేయాలని తలపెట్టింది. కానీ అనేక త్యాగాలతో సుదీర్ఘంగా సాగిన రైతు ఉద్యమం , మోడీ ప్రభుత్వాన్ని వెనక్కు నెట్టి, ఈ నిత్యావసర సరుకుల చట్టాన్ని కాపాడుకుంది. కానీ చట్టం ఉనికిలో ఉన్నా సరే, మోడీ ప్రభుత్వం గత మూడేళ్లుగా నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించకుండా మౌనంగా ఉండడం అంటే, ఆ చట్టాన్ని రద్ధు చేయాలనే తన ప్రయత్నాన్ని అమలు చేస్తున్నట్లుగానే భావించాలి.

2014 జనవరి -2019 జనవరి మధ్య కాలంలో పౌర సరఫరాల శాఖ సేకరించిన డాటా ప్రకారం మొత్తం 22 నిత్యావసర సరుకులలో 10 సరుకుల ధరలు కిలో కు 10 శాతం కంటే తక్కువే పెరిగాయి. పెసర, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ ధరలు నిజానికి ఈ కాలంలో తగ్గాయి. మరో 9 సరుకుల ధరలు 10 నుండీ 40 శాతం వరకూ మాత్రమే పెరిగాయి.

అదే 2019 జనవరి- 2024 జనవరి మధ్య కాలంలో సేకరించిన డాటా ప్రకారం 22 సరుకులలో ఒక్క సరుకు ధర కూడా తగ్గలేదు. అన్ని సరుకుల ధరలు కనీసం 15 శాతం పెరిగాయి. 12 సరుకుల ధరలు 40 శాతం పైగా పెరిగాయి. 7 సరుకుల ధరలు 50 శాతం పైగా పెరిగాయి. ఉల్లిగడ్డ ధరలు అత్యధికంగా 110 శాతం పెరగగా, కంది పప్పు ధరలు 107 శాతం పెరిగాయి.

రైతులు పండించే పంటలకు కనీస మద్ధతు ధరలు చట్టబద్ధంగా అందించడానికి నిరాకరించే కేంద్ర ప్రభుత్వం, వినియోగదారులుగా ఉన్న ప్రజలను మాత్రం రిటైల్ సంస్థలు అవే వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి, ప్యాక్ చేసి, ధరలు భారీగా పెంచేసి దోచుకుంటుంటే సహకరిస్తున్నది.

రైతులకు చట్టబద్ధ ధరలు అందించడం ఎంత అవసరమో, వినియోగదారులపై ధరల భారం పెరిగినప్పుడు, చవక ధరలకు సరుకులు అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా , లేదా రైతు బజార్ లాంటి వ్యవస్థల ద్వారా , లేదా రైతు బంధు కార్పొరేషన్ ఆధ్వర్యంలో రిటైల్ షాపులు నిర్వహించడం ద్వారా నిత్యావసర సరుకుల ధరలను తగ్గించడానికి ప్రభుత్వాలు పూనుకోవాలి.

Read More
Next Story