
తెలంగాణ విత్తన చట్టం మ్యానెఫెస్టోకే పరిమితమా ?
గ్రామీణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి వేగంగా పూనుకోవాలి.
రాజ్యాంగంలో షెడ్యూల్ 7 ప్రకారం వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం. పంటల ఉత్పత్తి, వ్యవసాయ విద్య , పరిశోధన , మార్కెట్లు , ధరలు ఈ జాబితాలో ఉన్నాయి. కానీ గత మూడు దశాబ్ధాలలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలను తమ కబ్జాలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి.
రాష్ట్రాల నుండీ పంటల ఉత్పత్తి ఖర్చులను సేకరిస్తున్నా, సమగ్ర ఉత్పత్తి ఖర్చులకు, 50 శాతం కలిపి ధరలు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తరాలు రాస్తున్నా, కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా, కేవలం పంట సాగు ఖర్చులకు 50 శాతం కలిపి మాత్రమే కనీస మద్ధతు ధరలను ప్రకటిస్తున్నది. వ్యవసాయానికి అవసరమైన ఎరువుల సబ్సిడీ కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉండడం వల్ల గత పదేళ్ళలో క్రమంగా ఎరువుల ధరలు పెరుగుతూ పోయాయి. 2020 లో మోడీ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి, కార్పొరేట్ కంపనీలకు అనుకూలంగా ఉండేలా మూడు చట్టాలను తీసుకు వచ్చింది.
అందులో ఒకటి ఒకే దేశం- ఒకే మార్కెట్ పేరుతో తెచ్చిన వ్యవసాయ మార్కెట్ చట్టం. నిజానికి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీల చట్టం ( APMC ) రాష్ట్ర పరిధిలో ఉన్న అంశం. కేంద్రం తెచ్చిన రెండవ చట్టం కాంట్రాక్టు వ్యవసాయ చట్టం. నిజానికి కాంట్రాక్టు వ్యవసాయం కూడా అప్పటి వరకూ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ చట్టం పరిధిలో ఉండేది.
కేంద్రం తెచ్చిన మూడవ చట్టం – నిత్యావసర సరుకుల చట్టం లో సవరణ. నిజానికి ఈ చట్టం కూడా రాష్ట్రాల పరిధిలో ఉండేది. కానీ ఈ మూడు చట్టాలు తేవడం ద్వారా, మోడీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా, కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించింది.
ఈ మూడు కార్పొరేట్ అనుకూల చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాపితంగా రైతులు వీరోచితంగా పోరాడారు. 750 మందికి పైగా రైతులు ప్రాణ త్యాగాలు చేశారు. చివరికి రైతు ఉద్యమం ఫలితంగా మోడీ ప్రభుత్వం మూడు చట్టాలను వెనక్కి తీసుకుంది.
కానీ గత రెండేళ్లుగా మోడీ ప్రభుత్వం కార్పొరేట్ లకు అనుకూలంగా మళ్ళీ కొత్త చట్టాలను, విధానాలను తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా కనీస మద్ధతు ధరలకు చట్టబద్ధత కల్పిస్తూ చట్టం చేయడానికి సిద్దం కాని మోడీ ప్రభుత్వం , 2025 లోనే జాతీయ వ్యవసాయ మార్కెట్ ల విధానం, జాతీయ సహకార విధానం, ఇప్పుడు తాజాగా విత్తన బిల్లు తీసుకు వచ్చింది.
విద్యుత్ రంగాన్ని కూడా పూర్తిగా ప్రైవేట్ రంగానికి అప్పగించడానికి, రాష్ట్ర డిస్కం, ట్రాన్స్కో, జెన్ కో లను ప్రైవేట్ పరం చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఒత్తిడి తీసుకు వస్తున్నది. కేంద్ర ప్రభుత్వం నుండీ రాష్ట్రాలకు సహాయం చేయడానికి దీనిని ఒక షరతుగా విధిస్తున్నది.
కేంద్రం తీసుకు వస్తున్న విధానాలపై, బిల్లులపై, రాష్ట్రాలు కేవలం తమ అభిప్రాయాలు, సూచనలు, సవరణలు కేంద్రానికి పంపడం కాదు, రాష్ట్రాల అధికారాలను హరించే కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించాలి. తమ హక్కులను కాపాడుకోవడానికి వివిధ రూపాలలో పోరాడాలి. ఆయా అంశాలపై రాష్ట్ర స్థాయిలో చట్టాలను, విధానాలను తీసుకు రావడానికి వేగంగా పూనుకోవాలి. రాష్ట్ర స్థాయిలో సమగ్ర వ్యవసాయ విధానం, శాస్త్రీయ పంటల ప్రణాళిక, విత్తన చట్టం, పంటల బీమా పథకం తెస్తామని ఎన్నికల మానిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం అటువైపు అడుగులు వేయలేదు. గత ప్రభుత్వ వైఖరికి భిన్నంగా, రాష్ట్రంలో 36 శాతంగా ఉన్న కౌలు రైతులను గుర్తిస్తామన్న ఎన్నికల హామీని కూడా అమలు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రస్తుత వైఖరిని మార్చుకోవాలి. గ్రామీణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి వేగంగా పూనుకోవాలి.
ఈ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం విత్తన బిల్లు - 2025 పేరుతో ఒక డ్రాఫ్ట్ ను ప్రజల ముందు ఉంచింది. ఈ బిల్లుపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కూడా కోరింది. 2025 డిసెంబర్ 10 లోపు ఈ డ్రాఫ్ట్ బిల్లుపై అభిప్రాయాలు చెప్పాలని గడువు కూడా విధించింది. తెలంగాణ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీడ్స్ కార్పొరేషన్ కార్యాలయంలో ఇప్పటికే, వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగింది.
రైతు స్వరాజ్య వేదిక, తెలంగాణ రైతు సంఘం, భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు, అనేక మంది రైతులు హాజరైన ఈ సమావేశంలో లోతైన చర్చ జరిగింది. విత్తన బిల్లులో ఉన్న అంశాలను, సమస్యలను, డాక్టర్ దొంతి నరసింహా రెడ్డి గారు వివరించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారికి సమావేశం తరపున ఒక మెమోరాండం కూడా అందించారు.
ఇదే అంశంపై ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 28 న మరో సమావేశం జరగనుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ, రైతు సంఘాలు, వ్యవసాయ రంగా నిపుణులు, రైతులు పాల్గొంటున్న ఈ సమావేశం కేంద్ర విత్తన బిల్లుపై తన అభిప్రాయాలను క్రోడీకరించి పంపనుంది.
ఈ సందర్భంగా కొన్ని అంశాలు కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లాలని రైతు సంఘాలు భావిస్తున్నాయి.
మొదట విత్తన బిల్లు ఉద్దేశ్యాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. దీనిని భారతదేశంలో సాగు, ఉత్పత్తి కోసం ఉద్దేశించిన ప్రైవేట్, ప్రభుత్వ విత్తనాల నాణ్యతను మాత్రమే నియంత్రించడం ప్రధాన లక్ష్యంగా ఉండేలా సవరించాలి.
ఈ బిల్లులో ఉన్న సెక్షన్ 1 (3) (బి) లో ‘ఒక బ్రాండ్ పేరుతో విక్రయించినప్పుడు తప్ప’ అనే అంశం సాధారణ రైతులను వేధించే అవకాశం ఉంది. దీనికి బదులుగా, విత్తన రకాలు, రైతుల హక్కుల పరిరక్షణ చట్టం, 2001 ను పూర్తిగా అమలు చేసి, ఆ చట్టాన్ని విత్తన బిల్లు 2025 తో అనుసంధానించాలి.
వ్యవసాయంలో కీలకపాత్ర పోషిస్తున్న మహిళా రైతులను కూడా దృష్టిలో ఉంచుకుని బిల్లులో లింగ వాడకాన్ని (He/His) సరిచేయడానికి, 'his / her' మరియు 'he/her' అని మార్చాలి. 'ఒక వ్యక్తి' (a person) అని రాయడం ఇంకా మంచిది.
చట్టం అమలు తేదీల విషయంలో (సెక్షన్ 3) వివిధ తేదీలలో నోటిఫై చేయబడే నిర్దిష్ట నిబంధనలను బిల్లులోనే ముందుగా పేర్కొనాలి. అటువంటి భిన్నమైన నోటిఫికేషన్‌లకు వీలుగా ఒక విధానాన్ని రూపొందించాలి.
ఈ చట్టం ప్రకారం వివిధ నిర్వచనాలను కూడా సమగ్రంగా సవరించాలి. బిల్లులో సెక్షన్ 2(ఎ) ప్రకారం వ్యవసాయం నిర్వచనాన్ని పాడి పరిశ్రమ, ఆక్వాకల్చర్, ఉద్యానవన పంటలు, పశువుల పెంపకం, రైతు నిర్వహించే మార్కెట్ కోసం సన్నాహాలు, నిల్వ లేదా రవాణా కార్యకలాపాలను కూడా చేర్చడానికి వీలుగా విస్తరించాలి. కంటైనర్ నిర్వచనం నుండి “దాని నాణ్యతను ప్రభావితం చేయకుండా” అనే పదాన్ని తొలగించాలి.
ట్రాన్స్‌జెనిక్ ఈవెంట్‌లు, DSI లేదా GSD లను మినహాయించడానికి, వాటి నిర్వచనాలను విడిగా చేర్చాలి. ట్రాన్స్‌జెనిక్ విత్తనాల లక్షణాల నిర్వచనాలను విడిగా ఇవ్వాలి. వాటిలో ఉండే చట్ట విరుద్ధ లక్షణాల అంశాన్ని విడిగా పరిష్కరించాలి.
నమోదు చేయని లేదా ఆమోదించబడని ఏదైనా విత్తనాన్ని నకిలీ విత్తనం అని నిర్వచించాలి.
మొలకెత్తే కనీస పరిమితులు, ఇతర ప్రమాణాలను చేరుకోని ఏదైనా విత్తనాన్ని సబ్-స్టాండర్డ్ విత్తనం అని నిర్వచనాన్ని విస్తరించాలి.
సెక్షన్ 19 ప్రకారం సాంకేతికత నిర్వచనంలో జీన్ ఎడిటింగ్, CRISPR, మరియు టెర్మినేటర్ సాంకేతికత వంటి తాజా సాంకేతికతలను కూడా చేర్చాలి.
వ్యవసాయం ప్రధానంగా రాష్ట్ర పరిధి లో ఉండే అంశం కాబట్టి, కేంద్ర విత్తన కమిటీ కూర్పు (సెక్షన్ 4.4.1) లో రాష్ట్ర ప్రభుత్వాల తరపున అన్ని రాష్ట్రాల వ్యవసాయ కార్యదర్శులను చెరచేలా బిల్లును సవరించాలి.
బయోటెక్నాలజీకి సంబంధించిన మొదటి షెడ్యూల్ పార్ట్ A, (i) ను పూర్తిగా తొలగించాలి.
కేంద్ర కమిటీ విధులను (సెక్షన్ 5) 'రాష్ట్ర విత్తన నమోదు, దాని అమలు సమీక్ష' కు మాత్రమే పరిమితం చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు (సెక్షన్ 28) విషయంలో, కేంద్ర, రాష్ట్ర విత్తన కమిటీల మధ్య అధికారాల పునఃకేటాయింపు స్పష్టంగా చేయాలి.
రాష్ట్ర విత్తన కమిటీలకు (సెక్షన్ 10) వారి రాష్ట్రానికి తగిన విత్తన రకాలను నమోదు చేసే అధికారాన్ని ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ ఉప-కమిటీ (సెక్షన్ 7) దరఖాస్తులను పరిశీలించడానికి అదనపు సమాచారాన్ని కోరడం, స్వతంత్ర సమీక్షలు నిర్వహించడం వంటి అధికారాలను కలిగి ఉండాలి.
రాష్ట్రాలకు నోటిఫికేషన్/ డీనోటిఫికేషన్ (సెక్షన్ 6) అధికారం కింద ప్రమాణాల సమీక్ష తో పాటు, వాటి రద్దు ను చేర్చాలి. విత్తనం మొలకెత్తే కనీస పరిమితులను (సెక్షన్ 6 (ఎ)) కమిటీ సిఫార్సు చేయవచ్చు , కానీ నిర్దిష్టం చేయకూడదు. విత్తనం మొలకెత్తే గరిష్ట పరిమితులను నిర్ణయించడం రైతులకు మరింత సహాయకరంగా ఉంటుంది. బిల్లులో రైతుల ప్రతినిధుల (సెక్షన్ 4 (4)(iv)) సంఖ్యను స్పష్టం గా పేర్కొనాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు స్థానిక రైతు ప్రతినిధులను గుర్తించడంలో పాత్ర ఉండాలి. వారి అర్హతలు, ప్రమాణాలు ప్రజల దృష్టికి తేవాలి.
రాష్ట్ర విత్తన రిజిస్టర్‌లు (సెక్షన్ 12 (1)) తప్పనిసరిగా నిర్వహించాలి. డీమ్డ్ రిజిస్ట్రేషన్ కాల వ్యవధిని 3 సంవత్సరాల బదులు 6 నెలలకు తగ్గించాలి (సెక్షన్ 13.ఎ). రిజిస్ట్రేషన్ చెల్లు బాటును 5 సంవత్సరాలుగా తగ్గించాలి. పునః-రిజిస్ట్రేషన్ (సెక్షన్ 14) కోసం క్షేత్ర పనితీరు, రైతుల నుండి అభిప్రాయాలను కూడా పరిగణనలో ఉంచుకోవాలి. సెక్షన్ 15 లో బయోసేఫ్టీ, పర్యావరణం/ఆరోగ్యానికి హాని కలిగించే వాణిజ్య దోపిడీని నిరోధించడానికి అవసరమైతే, విత్తనాలను రిజిస్ట్రేషన్ నుండి మినహాయించే నిబంధనను చేర్చాలి.
విత్తన పనితీరు మూల్యాంకన కేంద్రాలకు (సెక్షన్ 16) ICAR, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాల వంటి ప్రభుత్వ సంస్థలకు మాత్రమే గుర్తింపు ఇవ్వాలి. విదేశీ ధృవీకరణ ఏజెన్సీలను గుర్తించే నిబంధనను తొలగించాలి. విత్తన ఉత్పత్తి దారుల గుర్తింపు (సెక్షన్ 17.8) విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను ఉల్లంఘించే ఈ సెక్షన్‌ను తొలగించాలి. విత్తన డీలర్లు (సెక్షన్ 18) విక్రయించిన ప్రతి ప్యాకెట్ యొక్క మూలం/ఆధారం, పని తీరు రికార్డును నిర్వహించాలని నిర్దేశించాలి.
విత్తన రైతుల సమస్యలకు (సెక్షన్ 2 (16) నుండి మినహాయింపు) ఈ బిల్లులో పరిష్కారం కనపడలేదు. బిల్లులో విత్తన రైతుల హక్కులను నిర్ధారించి, వారిని నిర్వచించాలి. వారికి విత్తన ఇన్‌స్పెక్టర్ల నుండి రక్షణ కల్పించాలి. ఫ్రూట్ నర్సరీ (సెక్షన్లు 24, బదులు ఉద్యానవన నర్సరీ అనే పదాన్ని పునరుద్ధరించాలి. విత్తన నాణ్యత నియంత్రణ (సెక్షన్ 26) విషయంలో, వివిధ దశల్లోని విత్తనాల కోసం ప్రమాణాలు అభివృద్ధి చేసి, నాణ్యత నియంత్రణ యంత్రాంగాలను ఉత్పత్తి, రవాణా, నిల్వ మరియు పంపిణీ కి సంబంధించిన ప్రతి దశలో నిర్దిష్టంగా చెప్పాలి.
విత్తన ధర నియంత్రణ (సెక్షన్ 27) నిబంధనలను “చేయవచ్చు కు బదులుగా చేయాలి” అని స్పష్టంగా ఉండేలా సవరించాలి. అత్యవసర పరిస్థితులలో అనే పదాన్ని తొలగించాలి. రాష్ట్ర విత్తన కమిటీకి విత్తన ధరలను నిర్ణయించే అధికారాలు ఉండాలి.
రైతులకు పరిహారం (సెక్షన్ 21) విషయంలో, జిల్లా స్థాయిలో పరిహార కమిటీని ఏర్పాటు చేయాలి. జరిమానాలను పంట నష్టాల, విత్తన సరఫరాదారు వ్యాపార టర్నోవర్ ఆధారంగా పరిహారాన్ని నిర్ణయించాలి.
విత్తన ధృవీకరణ ఏజెన్సీలుగా (సెక్షన్ 29) రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాల క్రింద ఉన్న విత్తన విభాగాలన్నింటినీ ఆటోమేటిక్‌గా గుర్తించాలి. విత్తన పరీక్షా ప్రయోగశాలల (సెక్షన్ 34) పనితీరును ప్రతి విత్తన కమిటీ సమీక్షించాలి. వీటి కోసం రైతుల నుండి కూడా నమూనాలను సేకరించాలి. విత్తన విశ్లేషకులు, ఇన్‌స్పెక్టర్ల పనితీరును కూడా రాష్ట్ర విత్తన కమిటీలు సమీక్షించాలి.
విత్తనాల దిగుమతి (సెక్షన్ 40) విషయంలో, ట్రాన్స్‌జెనిక్ విత్తనాలను ఎట్టి పరిస్థితులలో దిగుమతి చేయకూడదు అని స్పష్టంగా జోడించాలి. దిగుమతి చేసుకునే రకాలకు 'స్థానిక' పరీక్షల డేటా తప్పనిసరి చేయాలి. అలాగే విత్తనాల ఎగుమతి (సెక్షన్ 41) నిబంధనను సవరించి, దేశ ఆహార భద్రతపై ప్రతికూల ప్రభావం చూపని సందర్భంలో మాత్రమే ఎగుమతిని అనుమతించాలి.
ఈ విత్తన బిల్లులో నేరాలకు జరిమానాలను (సెక్షన్ 42) మొత్తం వ్యాపార టర్నోవర్‌పై ఇంత శాతం అని నిర్ణయించాలి. నమోదు చేయని విత్తనాన్ని విక్రయిస్తే, కనిష్టంగా 5 సంవత్సరాల జైలు శిక్ష, 5 లక్షల నుండి 25 లక్షల రూపాయల వరకు జరిమానాతో శిక్షించబడుతుందని నిబంధనను జోడించాలి. కంపెనీల ద్వారా నేరాలు (సెక్షన్ 44 ) విషయంలో ఉన్నతాధికారులు తప్పించుకోకుండా ఉండటానికి సెక్షన్ 40 (1) ను తొలగించాలి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల అధికారం (సెక్షన్ 45, 46) విషయంలో, రాష్ట్ర ప్రభుత్వాల స్వయం ప్రతిపత్తిని కాపాడటానికి సెక్షన్ 45 (1) ను తొలగించాలి. చట్టం నుండి మినహాయింపు (సెక్షన్ 47) పొందే సంస్థలను నిర్వచించి, మినహాయింపుల కోసం పారదర్శక విధానాన్ని నిర్దేశించాలి.
ప్యాకేజీ విత్తనాలకు 'ప్రమాదకరమైన' లేబులింగ్ తప్పనిసరి చేయాలి. విత్తనాల లైసెన్సింగ్ లేదా ధృవీకరణలో పర్యావరణ, కార్మిక ప్రమాణాల ను కంపనీలు తప్పని సరిగా పాటించేలా అనుసంధానించాలి.

