ఇప్పుడు మాదిగలకు మిగిలిన ‘ఆప్షన్’ అదొక్కటే...!
x

ఇప్పుడు మాదిగలకు మిగిలిన ‘ఆప్షన్’ అదొక్కటే...!

దళితులకు రాజ్యాధికారం’ అనే నినాదం నిజం కావడానికి వున్న అన్ని దారులు మూసుకుపోయాయి. ఇపుడు మాదిగ దండోరా ముందుకు పోయే మార్గమేమిటి?


భవిష్యత్తులో ‘దండోరా’ (Madiga Dandora) కొనసాగింపును ‘ఎంఆర్పీఎస్.’ (MRPS) తమ యువతరానికి ఎలా అప్పగించ బోతున్నది? అన్నప్పుడు, గతాన్ని భవిష్యత్తును కలుపుకుని మరీ ఇందుకు సమాధానం కోసం మనం చూడవలసి ఉంటుంది. ఎందుకంటే, ముప్పై ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు వీరి పోరాటం సాగాక, అదిప్పుడు ప్రతి పనిస్థలంలోను మాదిగ (Madiga)లకు ఉనికి సమస్యగా మారింది. అక్కడ ‘ఎస్సీ’కి కేటాయించినవి ఇన్ని అంటే- ‘వాళ్ళలో మాదిగ ఒక్కరైనా ఉన్నారా?’ అని వాళ్ళు వెతుక్కునే పరిస్థితికి చివరికి వారి పట్ల ఈ నిరాకరణ చేరింది. మళ్ళీ ఇందులో మాదిగ మహిళల పరిస్థితి నాలుగు మెట్లు దిగువన ఉంది.

దాంతో ‘దండోరా’ కేవలం ‘ఎబిసిడి’ల సాధన (sub-categorization) కోసమే అని ఆ ఉద్యమ నాయకత్వం కూడా ఇప్పుడు అనుకోవడం లేదు. ఇదే కాలంలో జరిగిన రాష్ట్ర విభజనతో, మాదిగల సమస్యకు రెండు చోట్ల ఉన్న రెండు వేర్వేరు స్వరూప స్వభావాలు కూడా ప్రస్పుటంగా తెరపైకి వచ్చాయి. అది ఏ జాతి అయినా ఈ దేశచరిత్రలో అది అంతర్భాగం కనుక, బ్రిటిష్ పరిపాలనలో 200 ఏళ్ళపాటు ఆంధ్రప్రదేశ్ ఉండడం, అదే కాలంలో తెలంగాణ నిజాం పాలనలో ఉండడం వంటివి 1947 తర్వాత చరిత్ర విడిచివెళ్లిన గతకాలపు కాదనలేని వాస్తవం. దాంతో, రెండు రాష్ట్రాల మాదిగల మధ్య ప్రాంతీయ సంబంధిత జీవన వైవిధ్యాలు ఏవో కొన్ని ఉన్నప్పటికీ, వర్గీకరణ డిమాండ్ విషయం వద్దకు వచ్చేసరికి వారు ఒక్కటిగా వున్నారు.

అయితే ఈ వ్యాస పరంపరలో తరుచూ చేస్తున్న ‘కాలం’ ప్రస్తావనకు ఇక్కడ బలమైన కారణముంది. అది ఏ ఉద్యమమైనా వాటి నాయకులు కూడా మనుష్యులే కనుక, వారి ప్రవర్తనలో ఉండే హెచ్చుతగ్గులు మాట ఎలా ఉన్నప్పటికీ; ఒక సామాజిక ఉద్యమంగా మాత్రం ‘దండోరా’ను నడుస్తున్న చరిత్ర నుంచి ఎవరూ వేరు చేయలేరు. ఈ మాట అనడానికి బలమైన కారణం ఉంది. అది అర్ధం కావడానికి నెదర్లాండ్ యూనివర్సిటిలో జరుగుతున్న పరిశోధనలు గురించి మనకు తెలియాలి.

మన సరిహద్దు రాష్ట్రం తమిళనాడు నుంచి వెళ్లి అక్కడ ‘భారత రాజకీయ రంగంపై సామాజిక ఉద్యమాల ప్రభావం’ అంశంపై పనిచేస్తున్న యువస్కాలర్లు- విగ్నేష్ కార్తీక్, షన్ముఘ సుందరం చేస్తున్న పని గురించి మనకు తెలియాలి. వాళ్ళు అంటున్నారు- ‘ఈ సెప్టెంబర్ తో (1925-2024) తొలి ద్రవిడ అత్మగౌరం శతాబ్ది వందేళ్లు పూర్తి చేసుకుంది, అని గుర్తు చేస్తూ- ‘రగిలిన అత్మగౌరవ ఉద్యమ జ్వాలను కొనసాగిద్దాం’ (Keeping the fire of the self-respect movement going) శీర్షికతో వీరిద్దరూ ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక సంపాదక పేజీలో ఇటీవల ఒక వ్యాసం రాసారు.

“దక్షణాదిన ‘డిఎంకె’ ప్రభావంతో మొదలైన అత్మగౌరం ఉద్యమం గడచిన యాభై ఏళ్లలో బలపడి శక్తివంతమైన రాజకీయ నాయకత్వంలో కూడా అది తన ఉనికిని కాపాడుకుంటూ దేశంలో ‘ఫెడరల్ వ్యవస్థ’ ప్రాతిపదికన ‘సంకీర్ణ’ ప్రభుత్వాలు ఏర్పడడానికి తొలి బీజాలు వేసింది” అని ఈ యువ స్కాలర్లు అంటున్నారు. ఇక్కడే మనకు తమిళ నేత అన్బుమణి రాందాస్, ఆయన పార్టీ ‘పత్తాలి మక్కల్ కచ్చి’ (PMK) 2004-2009 మధ్య కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా రాందాస్ తీసుకున్న పుగాకు ఉత్పత్తులు పైన ‘ప్రమాదం’ గుర్తులు ముద్రించే నిర్ణయం, ఇవన్నీ ఒక ప్రత్యేకమైన ‘కేస్ స్టడీ’ మాదిరిగా ఇటువంటప్పుడు మనకు గుర్తుకు వస్తాయి...

ఒకే కులస్తులు సభ్యులుగా వున్న ఈ పార్టీ అటువంటి స్థాయికి చేరడం వెనుక కధనం ఏమిటో మాదిగలకు అర్ధం కావాలి. ఉత్తర తమిళనాడులో కేవలం రెండు మూడు జిల్లాల్లో ఉండే బి.సి. కులం ‘వన్నియార్’ ఆ కుల సంఘాన్ని వారి నాయకులు రాజకీయ పార్టీగా మార్చారు. ఒక దశలో వీరు తీవ్రంగా ఉద్యమిస్తూ హింసను ప్రోత్సహిస్తూ, అప్పటి ప్రభుత్వాలను చాలా విసిగించారు. ఎట్టకేలకు 1980లో ‘మోస్ట్ బ్యాక్ వర్డ్ క్యాస్ట్’ (Most Backward Caste) గా గుర్తింపు పొంది రాష్ట్రం ప్రభుత్వంలో విద్యా, ఉద్యోగాల్లో అవకాశాలు పొందారు. అది అక్కడ ఆగలేదు 2020లో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ముందు తమకు 20 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఈ పార్టీ డిమాండ్ పెట్టింది.

ఇప్పుడు ఇక్కడ మాదిగల విషయానికి వస్తే, వారి డిమాండ్ ప్రభుత్వం తమకు ఏదో చేయాలనో, లేదా ఆధిపత్య వర్గాలు తమకు వచ్చే మేలుకు అడ్డుపడుతున్నాయి అనో కాదు. ఉన్నదాన్ని అందులో మాకు వచ్చే వాటా మాకు ఇవ్వండి అని మాదిగలు అంటున్నారు. కానీ తమ తోటి మాలలు ‘వద్దు’ అంటే, ‘రాజ్యం’ చేష్టలుడిగి నిస్సహాయం కావడం చూసాక, వారిప్పుడు ఇది అయితే చాలు, అని దీన్ని ఇక్కడితో సరిపెట్టేద్దాం అనే యోచనలో లేరు.

కాంగ్రెస్ పాలనలో అన్యాయం జరిగిన ప్రతి సామాజికవర్గం దేశమంతా తమ సొంత రాజకీయ గుర్తింపు కోసం గడచిన ముప్పై ఏళ్ళలో సొంత కుంపట్లు పెట్టుకుని, ప్రాంతీయ అస్తిత్వంతో బలపడడం చూస్తున్నదే. ఇప్పుడు ఒకప్పటి- ‘దళితులకు రాజ్యాధికారం’ అనే నినాదం నిజం కావడానికి వున్న అవకాశాలు కూడా అవి అన్నీ దారులు మూసుకుపోయాయి. అప్పట్లో అందరూ కలిసివచ్చి ఉంటే, ఇది 1994లోనే ‘బిఎస్పీ’ (BSP) కాన్షీరాం (Kanshi Ram) నాయత్వంలో జరిగి ఉండాలి. అయితే, ఎపి ‘ఎస్సీ’లకు అప్పట్లో ఆ ‘బస్’ ఎలా ‘మిస్’ అయింది ‘లోపల’ జరిగిన సంగతులు తెలిసినవారు ఇప్పటికీ ఇంకా కొందరు ఉన్నారు.

అలా ఒక జాతీయ పార్టీ, ‘అంబేద్కరిజాన్ని’ శాస్త్రీయ సామాజిక శాస్త్ర అధ్యయనం చేసి మరీ రాజకీయాల్లోకి వచ్చిన నాయకత్వం దానికి ఉన్నప్పటికీ, ‘బహుజన సమాజ్ పార్టీ’ వంటివి పలుసార్లు అధికారంలోకి వచ్చిన ఉత్తర ప్రదేశ్ లాంటి చోట కూడా క్షీణతకు చేరింది. అధికారం కోసం సిద్ధాంత సారూప్యత లేని పార్టీలతో పొత్తులు కారణంగా దానికి ఈ రోజు ఈ పరిస్థితి దాపురించింది. రాష్ట్రాల వారీగా వున్న సామాజిక వర్గాల జనభా మేరకు రాజకీయం చేసే పద్దతి ఆ పార్టీకి లేదు. ‘పిడుక్కీ బియ్యానికి ఒక్కటే మంత్రం’ అన్నట్టుగా ‘బెహెన్ జీ‘ చెబుతారు మేము చేస్తాము’ అని ఆ పార్టీ నాయకులు చెబుతుంటారు.

సరే, ముప్పై ఏళ్ళుగా ఇక్కడ ‘దండోరా’ ఉద్యమంతో ముడిపడి ఆక్రోశంతో వున్న మాదిగ కులస్తులకు ‘బిఎస్పి’ ఏదైనా ఒక స్వాంతన కలిగే మాట ఇచ్చిందా అంటే, అటువంటిదేమీ కనిపించదు. కనుక తమదైన స్వంత రాజకీయ కార్యాచరణ ‘ప్లాన్’ చేసుకోవడం ఒక్కటే మాదిగలకు ఈ దశలో మిగిలిన పరిష్కారం అవుతుంది. ఇటీవల హైదరాబాద్ లో ఇదే అంశంపై జరిగిన ఒక చర్చా వేదికపై ఖమ్మం ప్రముఖుడు డా. ఎం.ఎఫ్. గోపీనాద్ మాట్లాడుతూ- ‘మాలలు రాజకీయ ప్రత్యామ్నాయం వెతుకుతున్నట్టుగా చెబుతూ, బి.సి.లు తమతో కలవడానికి సిద్దంగా ఉన్నట్టుగా ఆయన సభలో వెల్లడించారు.

దీనర్ధం మాదిగలను వారు తమతో కలుపుకోవడానికి సిద్దంగా లేరు, అనే విషయాన్ని వారి సమక్షంలోనే అక్కడ ఆయన చెప్పడం జరిగింది. కొంతమేర వామపక్ష నేపధ్యం కూడా వున్న మాల ప్రముఖుడు ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పినప్పుడు, రెండు తెలుగు రాష్ట్రాలలోని మాదిగలు తమ సొంత రాజకీయ కార్యాచరణకు ‘ప్లాన్’ చేసుకోవడం ఒక్కటే, వారికి మిగిలిన చివరి ‘ఆప్షన్’ అవుతుంది.

(సశేషం)

Read More
Next Story