-ఎడమ సమ్మిరెడ్డి
తెలంగాణాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. సంఖ్యాపరంగా అధికారంలో గల కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను సాధించింది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో పంచాయతీ ఎన్నికలు జరగ్గా, సిద్ధిపేట మినహా మిగతా 30 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మద్ధతు తెలిపిన అభ్యర్థులు భారీ సంఖ్యలోనే విజయం సాధించారు. మొత్తం 12,733 పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరగగా, 7,010 పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు గెలుపొందారు. విపక్ష బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల్లో 3,502 మంది సర్పంచ్ పదవులకు ఎన్నికయ్యారు. అదేవిధంగా బీజేపీకి చెందిన వారు 688 పంచాయతీల్లో, ఇతరులు 1,505 పంచాయతీల్లో సర్పంచ్ లు విజయం సాధించారు. సంఖ్యాపరంగా పరిశీలించినపుడు అధికార పార్టీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించిందని చెప్పక తప్పదు. ఇదే జోష్ లో ఎంపీటీసీ, జెడ్పీటసీ, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. అయితే ఈ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి, ముఖ్యంగా కాంగ్రెస్ కంచుకోటల్లో, కీలక మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇస్తున్న సంకేతం ఏమిటి? ఇదీ ఇప్పుడు తెలంగాణా రాజకీయాల్లో జరుగుతున్న చర్చ.
ఫలితాల్లో ఆధిక్యతను ప్రదర్శించిన అధికార పార్టీపై రాజకీయ చర్చ జరగడమేంటనే ప్రశ్న ఉత్పన్నం కావడం సహజమే. కానీ సంఖ్యను చూసి అధికార పార్టీ సంబరపడేంత దృశ్యం ఈ ఫలితాల్లో లేదని మాత్రం నిష్కర్షగా చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈనెల 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా జరిగిన సంగితి తెలిసిందే. అన్ని దశల్లోనూ అధికార పార్టీ ఆధిక్యతను ప్రదర్శించింది. అదే దశలో విపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తిగా డీలా పడే ఫలితాలు లేకపోవడమే పంచాయతీ ఎన్నికల ‘పల్లె’ రాజకీయంలో ఆసక్తికర అంశం. బీఆర్ఎస్ ఉనికికే స్థానం లేని జిల్లాల్లో ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు గణనీయ సంఖ్యలో విజయం సాధించడం గమనార్హం. ముఖ్యంగా కొందరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అధికార పార్టీ ‘చేదు ఫలితాలను చవి చూసిందంటే ఆశ్చర్యం కాదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పిన జిల్లాల్లోని మంత్రులు సైతం ఇటువంటి వ్యతిరేక ఫలితాలను చూసి కాస్త కంగారు పడాల్సిన ఘటనలు కనిపిస్తుండడం ఈ సందర్బంగా ప్రస్తావనార్హం.
రాష్ట్ర ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్న ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు డిప్యూటీ సీఎం సహా ముగ్గురు మంత్రులకు కాస్త మింగుడుపడని ఫలితాలు ఉన్నాయంటే నమ్మక తప్పదు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోని బోనకల్, చింతకాని, ముదిగొండ మండలాల్లోని చిరుమర్రి, రావినూతల, గోవిందాపురం, పందిల్లపల్లి, ముదిగొండ వంటి అనేక కీలక పంచాయతీలను బీఆర్ఎస్, సీపీఎం పార్టీలు బలపర్చిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. మధిర, ఎర్రుపాలెం మండలాల్లో మాత్రమే ఆధిక్యతతో కూడిన ఫలితాలు వచ్చాయి.
అదేవిధంగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలో మాత్రమే పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గంలోని మిగతా ప్రాంతాలన్నీ మున్సిపల్ పరిధిలో ఉండడం గమనార్హం. రఘునాథపాలెంలోని 32 పంచాయతీల్లో 11 స్థానాలను బీఆర్ఎస్ గెలుపొందింది. ఈ మండలంలో డబ్బు ప్రభావం కూడా భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలను తలపించేవిధంగా జరిగిన ఎన్నికల్లో రూ. వెయ్యి నుంచి రూ. 5,000 వరకు డబ్బు పంపిణీ జరిగింది. కేవలం 400 వరకు ఓట్లు గల చెరవు కస్నాతండా పంచాయతీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన వారు ఇక్కడ ఓటు విలువను భారీగా పెంచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మండలంలో ఓటు విలువ రూ. 10,000 వరకు పెంచి, పంచడంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు సక్సెస్ అయ్యారనే ప్రచారం జరిగింది.
ఇక ప్రభుత్వంలో నెంబర్ 2 గా ప్రాచుర్యంలో గల రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సైతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు సెగ్మెంట్ లో గట్టి షాక్ తగలిందనే చెప్పాలి. నియోజకవర్గంలో కీలకంగా భావించే నేలకొండపల్లి మండలంలోని మూడు మేజర్ పంచాయతీల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు సర్పంచ్ లుగా గెలుపొందారు. మండలం కేంద్రమైన నేలకొండపల్లి, ఆ పక్కనే గల రాజేశ్వరపురం, చెరువు మాదారం మేజర్ పంచాయతీల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఏడు వేల ఓట్ల నుంచి రెండున్నర, మూడు వేల ఓట్లు గల ఈ పంచాయతీల ఫలితాలు నియోజకవర్గ వ్యాప్తంగా భవిష్యత్తులో ప్రభావితం చేస్తాయనడానికి పలు నిదర్శనాలు ఉన్నాయి. కాంగ్రెస్ కంచుకోటగా పేరుగాంచిన పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం ఎం. వెంకటాయపాలెం, పొన్నెకల్ పంచాయతీల్లో కనీసం వార్డు సభ్యున్ని గెలిపించుకోలేని పరిస్థితిని అధికార పార్టీ చవి చూడడం గమనార్హం.
ఇక ప్రభుత్వంలో మరో కీలక మంత్రిగా పేరు తెచ్చుకున్న ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలోనూ కొన్ని కీలక ప్రాంతాల్లో అధికార పార్టీ అనూహ్యంగా దెబ్బ తిన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మచ్చుకు ఓ ఘటనను పరిశీలిస్తే.. ములుగు నియోజకవర్గంలోనే అత్యంత కీలకంగా భావించే ఏటూరునాగారం మేజర్ పంచాయతీని బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి భారీ ఆధిక్యతతో గెలుపొందారు. సీబీఐ మాజీ డైరెక్టర్ కాకులమర్రి విజయరామారావు సోదరుడైన కాకులమర్రి చక్రధర్ రావు కోడలు శ్రీలత ఇక్కడ పోలైన 8,333 ఓట్లలో 3,230 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించడం గమనార్హం.
డిప్యూటీ సీఎం సహా ఈ నలుగురు సచివుల నియోజకవర్గాల్లోని ఫలితాలను ఉదహరించడానికీ ప్రత్యేక కారణం లేకపోలేదు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పిన ఖమ్మం జిల్లాలోనేగాక, అదే బాటలో పయనించిన వరంగల్ జిల్లాలోని పలు కీలక పంచాయతీల్లో అధికార పార్టీకి జీర్ణం కాని విధంగా వెలువడిన ఫలితాలు మున్ముందు రాజకీయాలను ప్రభావితం చేస్తాయనే వాదన వినిపిస్తోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా కొత్తగూడెం, ఖమ్మం, భద్రాచలం నియోజకవర్గాల్లో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించగలిగింది. కేసీఆర్ స్వయంగా ఎంతగా ప్రచారం చేసినా, ఎన్ని వ్యూహాలు పన్నినా ఏ ఎన్నికలోనూ సింగిల్ సీటుకు మించి దక్కని ఖమ్మం జిల్లాలో సర్పంచ్ పదవుల్లో బీఆర్ఎస్ పార్టీకి లభించిన ఫలితాలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ ఫలితాల ప్రభావం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఎలా ఉండబోతోంది? ఆ తర్వాత మరో మూడేళ్లకు జరిగే అసెంబ్లీ ఎన్నికలనాటికి ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణాలో పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ, ‘ఈ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి ఏకపక్షమేమీ కాదు. అలాగని విపక్ష పార్టీకి పూర్తి సానుకూలమూ కాదు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెందిన పరిస్థితీ కాదు. ఓ రకంగా చెప్పాలంటే పలుచోట్ల ఎదురైన వ్యతిరేక, చేదు ఫలితాలు అధికార పార్టీ నాయకులకు దిద్దుబాటుకు అవకాశాన్నిచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా భాసిల్లుతున్న ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ సాధించిన ఫలితాలపై ఆ పార్టీ నేతలు సమీక్షించుకోవాల్సిన సందర్భమిది. సరిదిద్దుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. లేనిపక్షంలో అనుభవించేది అధికార పార్టీ నేతలే’ అని వ్యాఖ్యానించారు.