కవిత వ్యాఖ్యలలో తప్పు ఏముంది ?
x

కవిత వ్యాఖ్యలలో తప్పు ఏముంది ?

కవిత గారి వ్యాఖ్యలు సరైనవా? రాజకీయ వ్యూహమా లేదా తండ్రిగారికి తనయ ద్రోహమా ?

నిజంగా కేసీఆర్ చెడ్డపేరు తెచ్చుకున్నది ఎవరి వల్ల ? సన్నిహితులు లేదా కుటుంబ సభ్యుల వల్లనా?


తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనానికి కారణమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత గారు ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రజల్లోనూ పెద్ద చర్చకు దారితీశాయి. ఫలితంగా బిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెన్షన్ కావడం, తదనంతరం పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, ఏం ఎల్ సి పదవికి రాజీనామా చేయడం తెలిసిందే ! అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రజల గుండెల్లో ఒక ఆశ, ఒక కల, ఒక గర్వం నిండిపోయింది. కేసీఆర్ అనే నాయకుడి పేరు ఆ కలలకు ప్రతీకగా మారింది. ఆయనను ప్రజలు తెలంగాణ తండ్రిగా పొగిడారు.
కానీ కేవలం పదేళ్లలోనే ఆ గర్వం కుంగిపోయి, అవినీతి, వంశ రాజకీయాలు, కుట్రలు, విభేదాలు, ప్రజల నమ్మకద్రోహం – ఇవన్నీ తెలంగాణ రాజకీయాల నూతన స్వరూపంగా మారాయి. ఇప్పుడేమో కవిత బహిరంగ వేదికపైనే “నా నాన్న పక్కన ఉన్న కొందరు ద్రోహుల వల్లే ఆయన చెడ్డపేరు తెచ్చుకున్నారు” అని చెప్పడం – ఇది ఒక వ్యక్తిగత ఆవేదన మాత్రమే కాదు. ఇది తెలంగాణ రాజకీయాల్లో నూతన యుగానికి సంకేతం. కవిత తన వ్యాఖ్యల్లో స్పష్టంగా చెప్పింది" “కేసీఆర్ జనం కోసం పని చేశారు, కానీ ఆయన పక్కనున్న కొందరు వ్యక్తులు మాత్రం తమ ఆస్తుల పెంపుకోసమే పని చేశారు. మాజీ ఎంపీ సంతోష్, హరీశ్ రావు వల్లే కేసీఆర్ కి చెడ్డపేరు వచ్చింది. వారు నాపై ఎన్నో కుట్రలు చేశారు. అయినా నేను నోరు మెదపలేదు” అని. ఈ ఆరోపణలు కేవలం వ్యక్తిగత అసహనం కాదు. ఇవి తెలంగాణ రాజకీయాల్లో కుటుంబ రాజకీయాల పతనానికి ముందుమాట.
ఉద్యమం నుంచి అధికారానికి – కేసీఆర్
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ప్రజలతో కలిసిపోయి, “జల–నీల–నిలు” కోసం నిస్వార్థంగా పోరాడిన నాయకుడిగా కనిపించాడు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత – అదే నాయకుడు అధికారంలోకి వచ్చి, కుటుంబం చుట్టూ కేంద్రీకృతమైన పాలనను మొదలుపెట్టాడు. ప్రాజెక్టుల పేరుతో భారీ అవినీతి, కాలేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూమ్ హౌసింగ్, రైతు బంధు, రైతు బీమా, ఈ ప్రాజెక్టులన్నీ మొదట్లో మంచి ఉద్దేశ్యాలతో ప్రకటించబడ్డాయి. కానీ అమలులోకి వచ్చినప్పుడు అవినీతి, టెండర్ల దోపిడీ, నాణ్యతలేమి కేసీఆర్‌కి మచ్చలు తెచ్చాయి. కేసీఆర్ వ్యక్తిగత ఇమేజ్ దెబ్బతినడం, ఉద్యమకాలం లో “సూటిగా మాట్లాడే” వ్యక్తి, అధికారంలో “మౌననేత”గా మారిపోవడం, ప్రజల సమస్యల కంటే కుటుంబ పాలనను బలపరచడం
ఇదంతా కలిపి కేసీఆర్‌పై “ప్రజల కోసం కాదు, కుటుంబం కోసం” అనే ముద్ర వేసింది.కేవలం 5–6 ఏళ్లలోనే ఖర్చు మూడు రెట్లు పెరగడం వెనుక అవినీతి, దుర్వినియోగం మాత్రమే కారణం. 2023లో మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడంతో ఈ ప్రాజెక్టు జాతీయ అవమానంగా మారింది.
మారథాన్ నుంచి... హరీశ్
హరీశ్ రావు ఎప్పుడూ గ్రౌండ్ లెవల్ లో కనిపించే నాయకుడు. ఆకలి దీక్షలు, పాదయాత్రలు, ఘోర నిరసనలు – అన్నింటిలోనూ ముందు వరుసలో ఉన్నాడు. 2014–2019 మధ్య ఆయనకే కాలేశ్వరం సహా ప్రధాన జల ప్రాజెక్టుల బాధ్యత. ఆ సమయంలోనే ప్రాజెక్టు ఖర్చులు అమితంగా పెరిగాయి.అవినీతి ఆరోపణలు, ప్రారంభ ఖర్చు: ₹38,500 కోట్లు, 2023 నాటికి ఖర్చు: ₹1.20 లక్షల కోట్లు పైగా, ప్రాజెక్టు నిర్మాణం కుంగిపోవడం – “భారతదేశంలోనే అతిపెద్ద ఇంజనీరింగ్ వైఫల్యం”గా మిగిలింది. కవిత ప్రశ్న, హరీశ్ ఐదేళ్లు మంత్రిగా ఉన్నప్పుడు జరిగిందేంటి? ఆయన నిర్దోషి అయితే అవినీతి ఎలా జరిగింది? ఈ ప్రశ్నకు సమాధానం లేకుండా హరీశ్ రావు రాజకీయ భవిష్యత్తుపై ఆరోపణలు కచ్చితంగా ప్రాభావం చూపిస్తాయి.
గోప్య సలహాదారు నుంచి ... సంతోష్
ఎవరు సంతోష్?, కేసీఆర్ భార్య చెల్లెలు కుమారుడు, కేసీఆర్ కి ఆరోగ్య సంరక్షకుడు, అత్యంత సన్నిహితుడు. పార్టీ వ్యూహాలలో ముఖ్యపాత్ర, బయటకు పెద్దగా కనిపించకపోయినా, లోపల అధికారాన్ని నియంత్రించిన వ్యక్తి, ఆరోపణలు, కాలేశ్వరం టెండర్లలో జోక్యం, మిషన్ భగీరథ కాంట్రాక్టులు, భూసేకరణలో మద్యవర్తిత్వం, కవిత ఆరోపణలు...సంతోష్ నాపై కుట్రలు చేశాడు.”“ఆయనే కేసీఆర్ చెడ్డపేరు తెచ్చాడు.”
ఇది కేవలం వ్యక్తిగత విమర్శ కాదు. ఇది కుటుంబ అంతర్గత పోరాటం బయటపడటమే.
కామెంట్స్ - అసలు ఉద్దేశం
కవిత తన ప్రతిష్ట కాపాడుకోవడం, ప్రస్తుతం ఆమెపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కేసులు నడుస్తున్నాయి.
తాను అవినీతి భాగస్వామి కాదని నిరూపించుకోవడానికి – “నేను కాదు, వాళ్లు ద్రోహులు” అని చెప్పడం వ్యూహం. బలి బాటలో పడ్డ ఆడపిల్లగా చూపించుకోవడం, ప్రజలలో మమకారం, సానుభూతి, జాలి సంపాదించుకోవడం, కేసీఆర్ కుటుంబం ఒకప్పుడు ఏకతాటిపై ఉన్నట్లే కనిపించింది.ఇప్పుడు మాత్రం విభేదాలు స్పష్టమయ్యాయి,కేటీఆర్ – వారసుడి హక్కు కోసం పోరాటం,హరీశ్ రావు – స్వీయ శక్తి కేంద్రం సృష్టించుకోవడం,కవిత – తనకంటూ ప్రత్యేక వేదిక (జాగృతి) నిర్మించుకోవడం,ఇది మొత్తంగా కేసీఆర్ వారసత్వాన్ని ద్రోహం చేసే దిశలో కదిలిస్తోంది.
ప్రజల దృష్టిలో వ్యాఖ్యలు
కవిత నిజంగానే ప్రజల కోసం మాట్లాడిందా? లేక తన భవిష్యత్తు కోసం? కేసీఆర్ చుట్టూ చెడు వ్యక్తులు ఉన్నారని ఇంతకాలం మౌనం ఎందుకు వహించింది? అవినీతి అడ్డుకోవడానికి ఆమె ఏ చర్య తీసుకుంది? ఈ ప్రశ్నలకు సమాధానం రాకపోతే – కవిత వ్యాఖ్యలు సాధారణ రాజకీయ నాటకంగానే మిగిలిపోతాయి.
మా డబ్బులు దోచుకున్నవాళ్లు ఒకరినొకరు నిందించుకుంటున్నారు.ఇది నిజాయితీ కాదు, అధికార పోరాటం.అసలు నేరస్తులు శిక్షపడతారా? ప్రజలు ఈ ప్రశ్నలకు సమాధానం కోరుతున్నారు.కుటుంబ విభేదాలు బహిర్గతం కావడం వల్ల బీఆర్‌ఎస్ బలహీనపడుతుంది.కాంగ్రెస్, బీజేపీకి ఇది బలాన్నిస్తుంది.
హరీశ్–కవిత మధ్య యుద్ధం కొనసాగితే – పార్టీ పూర్తిగా విభజన దిశలో నడవొచ్చు.ప్రజల డబ్బులు దోచుకున్న వారు ఒకరినొకరు నిందించుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ప్రజలు కోరేది, నిజమైన దోషులు శిక్ష పొందాలి, పారదర్శకత రావాలి, కుటుంబ రాజకీయాలపై ప్రజాస్వామ్యానికి గౌరవం కలగాలి.
చివరగా...
కవిత చెప్పిన మాటలలో పూర్తిగా తప్పేమీ లేదు. ఆమె కొన్ని నిజాలు బయటపెట్టింది. కానీ సమస్య ఏంటంటే—ఈ నిజాలు ఆలస్యంగా బయటకు వచ్చాయి. కేసీఆర్ సత్తా ఉన్నప్పుడు ఆ తప్పులను సరిదిద్దకపోవడం, ఇప్పుడు ప్రజల ముందు ఇతరులపై బాధ్యత నెట్టడం రాజకీయంగా కొంత బలహీనతగా కనిపిస్తుంది. అందువల్ల కవిత వ్యాఖ్యలు “నిజానికి దగ్గరగా ఉన్నా, రాజకీయ లాభం దిశగా మలచబడినవి” అని చెప్పవచ్చు.


Read More
Next Story