ప్రపంచంలో అతి పెద్ద రాతి వినాయక విగ్రహం కనిపించింది తెలంగాణ లోనే...
x
తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా ఆవంచ దగ్గిర కొండను తొలిచి సృష్టించిన తొండపయ్య

ప్రపంచంలో అతి పెద్ద రాతి వినాయక విగ్రహం కనిపించింది తెలంగాణ లోనే...

తెలంగాణలో వినాయక ఆరాధన ఎపుడు మొదలయ్యిందో చెబుతున్నారు చరిత్రకారుడు డా. ద్యానవల్లి సత్యనారాయణ


వక్రతుండ మహాకాయ!

సూర్యకోటి సమప్రభ!

అలనాటి అతిపెద్ద గణపతి

అంటూ సాగే పాటను మనం వినాయక చవితి పండుగ సమయంలో వింటుంటాం. మరి ఆ పల్లవిలోని పదాలకు అర్థమేమిటి? వాటికి నిదర్శనమైన వినాయక విగ్రహం ఎక్కడుందని ఎప్పుడైనా ఆలోచించారా?

ఇంతకీ ఆ పల్లవికి అర్థమేమిటంటే... వంకర తొండంతో, భారీ శరీరంతో ఉ ండే గణపతి దేవుడు కోటి సూర్యుల ప్రభలతో ప్రకాశిస్తాడు అని. అలాంటి గణపతి విగ్రహం మహబూబ్ నగర్ జిల్లాలోని ఆవంచ గ్రామంలో ఉంది.

హైదరాబాద్-బెంగళూరు రహదారిలో 95 కిలోమీటర్ల ప్రయాణం తరువాత వచ్చే జడ్చర్లకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆవంచ. ఈ గ్రామానికి ఉత్తరంలో పంట పొలాల మధ్యనుంది ఈ భారీ వినాయక విగ్రహం. స్థానికులు దీన్ని 'ఎంకయ్య గుండు' అని పిలుస్తారు. గుండ్రంగా ఉన్న ఈ గుండు ఎత్తు సుమారు 25 అడుగులుండగా, వెడల్పు సుమారు 15 అడుగులుంటుంది. ఈ గుండునే శిల్పులు ఉండ్రాళ్ళయ్యగా చెక్కారు.

900 ఏళ్ళ తొండపయ్య

ఎప్పుడు ఆ విగ్రహాన్ని చెక్కారు? అనే ప్రశ్న వేయదల్చుకున్నారా? మీ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడానికి ఇప్పటివరకైతే శాసనాధారం గాని, సాహిత్యాధారం గాని దొరకలేదు. కాబట్టి సమకాలిక శిల్పాలశైలి అధ్యయనం ఆధారంగా ఆ విగ్రహ కాలాన్ని రాబట్టవలసి ఉంటుంది.

ఆవంచ ప్రాంతం చుట్టు పక్కలా ఉన్న మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లోని పలు ప్రాంతాలను సుమారు వేయేళ్ళ కిందట కందూరు చోడులు అనే రాజవంశీకులు పరిపాలించారు. వారు 11, 12 శతాబ్దాల్లో కట్టించిన దేవాలయాలు, చెక్కించిన శిల్పాలు వారి రాజధాని నగరాలైన ఆమన్ గల్లు, కోడూరు, కందూరు, పానగల్లు, | మల్లేశ్వరం మొదలైన నగరాల్లో ఉన్నాయి. ఆ నగరాలకు ఈ ఆవంచ దగ్గరలో ఉన్న | కారణంగా ఆ నగరాల్లోని శిల్పాలతో ఈ భారీ వినాయక శిల్పానికి ఉన్న పోలికల | దృష్ట్యా, ఈ వినాయక విగ్రహాన్ని కూడా కందూరు చోడ రాజులే సుమారు తొమ్మిది వందల ఏళ్ళ కింద చెక్కించారని చెప్పవచ్చు.

భారతదేశంలోనే భారీ విగ్రహం

1893లో బొంబాయిలో బాల గంగాధర్ తిలక్ ప్రారంభించిన గణపతి ఉత్సవాలు కొద్ది సంవత్సరాల్లోనే హైదరాబాద్ లో ఆర్య సమాజ్ వారిచే ప్రారంభించబడి గత రెండు వందల సంవత్సరాలుగా భారతదేశంలోనే భారీ వినాయక విగ్రహ ప్రతిష్టకు ఖైరతాబాద్ లో) నిదర్శనంగా నిలుస్తున్నాయి. హైదరాబాద్/తెలంగాణ ఘనత ఇంతటితోనే ఆగిపోలేదు. అంతకు ముందు ఏడు వందల సంవత్సరాల కిందనే ఈ ఆవంచ భారీ వినాయక విగ్రహం భారీ విగ్రహ రూపకల్పనకు బీజం వేసి నేటికీ తన స్థానాన్ని నిలబెట్టుకుంటూనే ఉంది. అనంతపురం జిల్లా లేపాక్షిలో ఉన్న పది అడుగుల ఎత్తైన బసవన్న విగ్రహాన్నే | ఇప్పటివరకూ భారీ విగ్రహంగా చెప్తూ వస్తున్నారు. దాని కంటే మూడు రెట్లు ఎత్తైనది. ఐదు శతాబ్దాల ముందటిదైన ఈ ఆవంచ వినాయకుని గురించి చెప్పుకోకపోవడం. విడ్డూరం!

ఈ వినాయక విశిష్టత

తెలంగాణలో వెయ్యేళ్ళ కిందట హిందూ మతంలోనే షణ్మతాలు (ఆరు రకాల దైవాలు) వర్ధిల్లాయి. అందులో ఒకటి గాణాపత్యం. అంటే ఈ మత శాఖకు చెందిన భక్తులకు ప్రధాన దైవం గణపతి. అతని తల్లిదండ్రులైన శివుడు (శైవం), పార్వతి (శాక్తేయం) కూడా వారికి ప్రధాన దైవాలు కారు. అంతగా వారు గణపతి పూజకు ప్రాధాన్యమివ్వటానికి ఈ ఆవంచ భారీ గణపతి విగ్రహం కూడా ఒక ప్రధాన కారణమని ఎవరికైన సులభంగానే అర్థమౌతుంది.

మహాకాయునికి మహర్దశ

ఈ మహాకాయునికి త్వరలోనే మహర్దశ పట్టనుందని ఇటీవలి పరిణామాల కారణంగా తెలుస్తున్నది. కొద్ది సంవత్సరాల కిందట మహారాష్ట్రలోని ఒక భక్త సమాజం ఒక కోటి రూపాయల పెట్టుబడితో ఈ వినాయకుడికి ఒక భారీ గుడిని కట్టిద్దామని ప్రణాళిక సిద్ధం చేసుకుందట. ఈ ఆవంచ గ్రామానికే చెందిన ఎం.ఎల్.ఎ. లక్ష్మారెడ్డిగారు కూడా ఐదేళ్ళ కిందటే రాష్ట్ర పురావస్తు నిపుణులు డా॥ఈమని శివనాగిరెడ్డిగారికి ఈ విగ్రహాన్ని చూపించి అభివృద్ధి ప్రణాళికలు సూచించుమన్నారట.

మొత్తమ్మీద వినాయకుడికైతే తాత్కాలిక రేకుల షెడ్డు నిర్మాణమైంది... రెండేళ్ళ కింద. దాన్నిప్పుడు విప్పి కుప్ప పెట్టారు. బోరు తవ్వించారు. విగ్రహం చుట్టు పక్కల 9 ఎకరాల భూమి సేకరించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా రెండేళ్ళ కిందట ఈ విగ్రహాన్ని సందర్శించారని స్థానికులు చెప్పారు. కాబట్టి ఈ భారీ వినాయకుడికి, ఆ దేవుడిని సందర్శంచే భక్తులకు మహర్దశ పట్టినట్లేనని ఆశావహులు భావిస్తున్నారు.

విగ్రహ రూపు రేఖలు

ఈ వినాయకుడు "సూర్యకోటి సమప్రభ" అన్నట్లు ఉదయించే సూర్యునికి ఎదురుగా హుందాగా కూర్చుని తొండంతో ఉండ్రాలు/లడ్డు తింటున్నట్టున్నాడు. ఇతని చెవులలోని నరాల గీతలు కోటి సూర్యకిరణాలలాగా ప్రకాశిస్తున్నట్లు ప్రతిబింబిస్తున్నాయి. వినాయకుడి బొజ్జ చుట్టూ పడగ విప్పిన నాగుపాము బంధం అందంగా శిల్పించబడింది. మొత్తంగా చూస్తే ఈ వినాయకుడు తన ప్రసన్న వదనంతో మన సర్వ విఘ్నాలను తొలగించి మనకు శాంతిని ప్రసాదిస్తున్నట్లు కన్పిస్తున్నాడు. ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే!

Read More
Next Story