తెలుగు రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రి సాధ్యమనేనా ?
x
వెనకబడిన కులాలకు అధికారం ఎలా వస్తుంది?

తెలుగు రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రి సాధ్యమనేనా ?

ఒకవైపు బిసిలు భరించలేనంతగా ఖరీదైన ఎన్నికలు. మరోవైపు ప్రాంతీయ పార్టీల పాలన. అయినా సరే తెలుగు రాష్ట్రాల్లో బిసి ముఖ్యమంత్రి సాధ్యమే అంటున్నారు డా. కేశవులు. ఎలా?


( డాక్టర్. బి. వి. కేశవులు)

1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఉన్నత వర్గాల నాయకులే సీఎం పీఠం ఎక్కుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి కూడ ఇప్పటి వరకు ఒక్క బీసీ నాయకుడు ముఖ్యమంత్రి కాలేదు. ఆ అవకాశం కూడ దక్కడం లేదు. రెండు రాష్ట్రాలలో జనాభాలో సగానికి పైగా బీసీ కులాలు ఉన్నప్పటికీ రాజ్యాధికారానికి దూరంగానే ఉండాల్సి వస్తోంది. సామాజిక గౌరవం కోసం సామాజిక శక్తుల కదలికలు పలు రూపాల్లో ఉన్నాయి. పౌర సమాజంలో ఆలోచన శక్తి బలంగా ఉన్నది. సమస్యల ఆలోచనలు, సామాజిక కదలికలకు తోడై ఐక్యంగా ఉద్యమిస్తే తెలంగాణ పరిస్థితి విప్లవాత్మక మార్పులకు తెర తీస్తుంది. కానీ తెలంగాణలో పార్టీలు బీసీలను అధికారానికి అంతులేని దూరాలకు నెట్టివేశాయి.

బిసిలకు దక్కని పదవి అదే

భాషా ప్రాతిపదికన దేశంలో ఏర్పడిన మొట్ట మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆనాడు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో సగానికంటే ఎక్కువ బీసీ కులాలు ఉన్నప్పటికీ కూడ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు వచ్చారు. తర్వాత నీలం సంజీవరెడ్డి నియమితులయ్యారు. 1956 నుంచి నేటివరకూ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ లో నేటి వరకు 26 సార్లు ముఖ్యమంత్రి పదవి అవకాశాలు రాగా 25 సార్లు ఉన్నత వర్గాల వారే ముఖ్యమంత్రి పదవి లో కూర్చున్నారు. కేవలం ఒకే ఒక్కరే దళిత నాయకుడు. ఆయన దామోదరం సంజీవయ్య. ఆయన కూడా రెండేండ్లు మాత్రమే బలవంతంగా పదవిలో కొనసాగారు. 26 మంది అగ్ర కులాలకు చెందిన ముఖ్యమంత్రుల్లో 14 మంది రెడ్లు కాగా, అయిదు సార్లు కమ్మలు ఉన్నారు. మిగతా వారిలో ఇద్దరు బ్రాహ్మణులు, మూడుసార్లు వెలమలు, ఒకరు వైశ్య దళిత వర్గాలనుంచి ఒక్కొక్కరు ఉన్నారు. జనాభాలో చాలా తక్కువ శాతం ఉన్నా వీరందరూ ముఖ్యమంత్రులు కాగలిగారు కానీ, సగానికి పైగా ఉన్న బీసీల నుంచి ఒక్కరు కూడా సీఎం పదవిని చేపట్టకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. బీసీలు రాజకీయంగా ఎదగకపోవడానికి చేతివృత్తుల ద్వారా జీవనం సాగించడం,సామాజికంగా,ఆర్ధికంగా సాంస్కృతికంగా అనుకున్న స్థాయిలో ఎదుగలేకపోవడం, నూటికి 80 శాతం మంది యావరేజ్ స్థాయిలోనే ఉండిపోయారు. ఈ రోజుల్లో రాజకీయాల్లో రాణించాలంటే ఇపుడు మరొక కొత్త అర్హత అమలులోకి వచ్చింది. అది కోట్లు ఖర్చు పెట్టగలిగే స్థితిలో ఉండాలి. ఒకరు ఎమ్మెల్యేగా గెలవాలంటే కనీసం 50 కోట్ల రూపాయలను ఎన్నికల్లో ఖర్చు పెట్టగలగే స్థాయి ఉండి తీరాల్సిందే. అందుకే ప్రస్తుతం ముఖ్యమంత్రులు మొదలుకుని ఎమ్మెల్యేల వరకూ దాదాపు అందరూ వందల కోట్లున్న కోటిశ్వరులే కావడం గమనించదగ్గ అంశం. అభ్యర్థులు ఎన్నికల కమిషన్ కు సమర్పిస్తున్న అఫిడవిట్ల ప్రకారం ఎమ్మెల్యేలో కోటీ శ్వరులే ఎక్కువగా ఉంటున్నారు. ఈ కోటీశ్వరులలో కూడా అగ్రకుల కోటీశ్వరులే ఎక్కువ. బీసీలంటే ఇప్పటికీ చేతివృత్తులు చేసే వారిగానే చూస్తున్నారు. వారిలో కోటీశ్వరులెలా ఉంటారు.

బీసీల్లో ఐక్యత ఏ మాత్రం లేకపోవడం. వేల జనాభా కలిగిన గ్రామాలలో బీసీ కులాలు 80 శాతం ఉన్నప్పటికి కనీసం గ్రామ సర్పంచ్ కాలేకపోతున్నారు. కానీ 5 శాతం ఉన్న ఉన్నత వర్గాల వారు మాత్రం పెత్తనం చెలాయిస్తున్నారు...

ప్రాంతీయ పార్టీలలో మరీ ఘోరం

ఇంచు మించు అన్నీ ప్రాంతీయ పార్టీలన్నీ కూడ కుటుంబ పార్టీలు కావడం, పార్టీ పూర్తీగా కుటుంబ సభ్యుల నియంత్రణ లో ఉండటం వలన సామాజిక న్యాయం జరిగే అవకాశం చాలా తక్కువ. కేసిఆర్ తరువాత కేటీఆర్ ముఖ్యమంత్రి , వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తర్వాత తన భార్యా లేదా పిల్లలు కావడం మినహా మరెవ్వరికీ అవకాశాలు రావడం అరుదు. ఆ పార్టీలలో బిసిలు ముఖ్యమంత్రి కావాలనే కలకనడం కూడా సాధ్యం కాదు. 2023 లో బీజేపి బిసి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసినప్పటికీ బీజేపి, బి అర్ యస్ లు సన్నిహిత మిత్రులనే ప్రచారం, కేసిఆర్ పాలనపై గల వ్యతిరేకత మూలంగా బీజేపి బీసీ నినాదం కంటే కేసిఆర్ పాలన కు చరమ గీతం పాడాలనే గట్టి నిర్ణయానికి వచ్చి ఇరు పక్షాలను అధికారానికి దూరంగా ఉంచారు.

ఆంధ్ర ప్రదేశ్ లో అదే పరిస్థితి

ఆంద్రప్రదేశ్ లో టీడీపీకి ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలను తమవైపు తిప్పుకునేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బీసీల కోసం పది మందికి పైగా మంత్రి పదవులు, అసెంబ్లీ స్పీకర్, 56 కార్పొరేషన్లను,పలు కార్పొరేషన్ల డైరెక్టర్లుగా బీసీలకు పెద్దఎత్తున అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్సీలుగా, రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడు కావడంతో ఉద్యమ ఊపు తగ్గి, ఉద్యమానికి క్రమక్రమంగా దూరం కావడం తో బీసీ నేతలపై జనం నమ్మకం కోల్పోతున్నారు. బీసీ లు ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఆచరణలో అది కనిపించడంలేదన్న విమర్శ ఉంది.

ఐక్యంగా ఉద్యమిస్తే..

ఎన్నికలొస్తే రాజకీయ పార్టీలు బీసీల జపం చేయడం అలవాటైపోయింది. కులవృత్తులు చేసుకునే జనసమూహమే బీసీ వర్గాలైనందున, అనాదిగా వారిని ఓటు బ్యాంకుగా చూడటం ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు అలవాటైపోయింది. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు బీసీ కులాలకు లేకపోవడం వల్ల బీసీ లు తీవ్రంగా నష్టపోతున్నారు. సమతౌల్యం పేరుతో వొడి పోయే స్థానాలలో కొన్ని సీట్లు ఇచ్చినా, అందులో కూడ గెలిచినవారికి సమప్రాధాన్యం తక్కువే. మంత్రి పదవుల్లో కూడ అరకొరనే అయినప్పటికీ స్వతంత్ర అధికారం అంతగా ఏమీ ఉండదు.

బిసిలకు అధికారం అసాధ్యం కాదు

ప్రాంతీయ పార్టీలు అధికారం ఉన్న చోట బీసీ కులాలకు పెద్దగా అధికారం ఉండదు. బిసి లు కొన్ని పదవుల్లో ఉన్నప్పటికీ నేతిబీరకాయ చందంగానే ఉంటుంది సుమా! రాజకీయ అధికారం లేకుండా బీసీ వర్గాల అభివృద్ధి సాధ్యంకాదనేది జగమెరిగినసత్యం.. రాజ్యాంగం కల్పించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయానికి ఈ పార్టీ లు ఏ మాత్రం కట్టుబడి లేవు. రాజకీయ నాయకుల మాటలకు చేతలకు ఏమాత్రం సంబంధం లేదు. ఆశలు చూపించడం తప్ప ఆచరణ శూన్యం. అధికారులు కూడా అదే కుల ఆధిపత్య శక్తుల నుంచి రావడంతో అభివృద్ధి, అవకాశాలు, అధికారం ఎదిగిన కులాల హక్కుగా మారిపోయింది. రాజకీయ అధికారం లేకుండా బీసీ వర్గాల అభివృద్ధి సాధ్యంకాదనే నగ్న సత్యాన్ని గ్రహించి, అందుకు వ్యక్తిగత స్వార్థ రాజకీయాలు వదిలి వెనుకబడిన తరగతుల అభివృద్ధికి ఐక్యంగా ఉద్యమిస్తే ఇపుడ అడ్డొస్తున్నడబ్బు వంటి బలహీనతలను అధిగమించవచ్చు. ఐక్యత సాధిస్తే బీసీ నేతలు అధికారం అందుకోవటం అసాధ్యమేమీ కాదు కదా !

(డాక్టర్. బి. వి. కేశవులు. ఎండీ.చైర్మన్ ; తెలంగాణ మేధావుల సంఘం)

Read More
Next Story