ఆంధ్రాలో తటస్ఠ ఓటర్లు జగన్‌వైపా, కూటమివైపా?
x

ఆంధ్రాలో తటస్ఠ ఓటర్లు జగన్‌వైపా, కూటమివైపా?

ఏపీలో సంఖ్యాపరంగా అతి పెద్ద వర్గం బీసీలు. వివిధ రాజకీయపార్టీలు బీసీ మంత్రాన్ని జపిస్తుంటాయిగానీ, రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీ మాలలవంటి కులాలలాగా బీసీలు గంపగుత్తగా ఒకవైపు ఓట్లు వేయటం జరగదు.


(శ్రావణ్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్)


ఏపీలో సంఖ్యాపరంగా అతి పెద్ద వర్గం బీసీలు. వివిధ రాజకీయపార్టీలు బీసీ మంత్రాన్ని జపిస్తుంటాయిగానీ, రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీ మాలలవంటి కులాలలాగా బీసీలు గంపగుత్తగా ఒకవైపు ఓట్లు వేయటం జరగదు. ఎందుకంటే బీసీలు అంటే యాదవ, గౌడ, శెట్టిబలిజ, పద్మశాలి, మత్స్యకార వంటి అనేక వెనుకబడిన కులాల సమాహారం. రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీల లాగా బీసీలను ఒక్కటిగా కనెక్ట్ చేసే యూనిఫికేషన్ ఫ్యాక్టర్ ఏదీ ఉండదు. అయితే ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. బీసీలపై ప్రేమ వలనో, వారి ఓట్లపై ప్రేమవలనోగానీ, జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో వారికి పెద్దపీట వేశాడు. కొన్నిచోట్ల తన కులాభిమానాన్ని కూడా పక్కనపెట్టి రెడ్ల స్థానాలలో బీసీలకు టిక్కెట్లు ఇచ్చాడు.

ఎస్‌సీ మాలలు

సంఖ్యాపరంగా బీసీల తర్వాత అతి పెద్ద వర్గాలు - ఎస్‌సీ మాలలు, కాపులు. ఎస్‌సీ మాలలు దాదాపుగా నూటికి నూరు శాతం జగన్మోహన్ రెడ్డికే మద్దతిస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. జగన్‌కు పుట్టుక వలన అసంకల్పితంగా సంక్రమించినవి మూడు - ఒకటి కన్వర్టెడ్ క్రిస్టియన్ కావటంవలన ఎస్‌సీల మద్దతు, రెండు వైస్ రాజకీయ వారసత్వం(ముస్లిమ్‌లకు రాజశేఖరరెడ్డి నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించటం వంటి పనుల వలన బదిలీ అయిన అభిమానం). మూడోది రెడ్డి వర్గం మద్దతు.

కాపులు

కాపులు దాదాపు 20 శాతంపైగా ఉంటారు. 35-40 నియోజకవర్గాలలో ఫలితాలను నిర్దేశించేస్థాయిలో ఉంటారు. 2019లో పూర్తిగా టీడీపీకి వ్యతిరేకంగా వేశారు. దానికి రెండు కారణాలు. ఒకటి - అప్పటికి కాపులలో మంచి ఇమేజ్, గౌరవం ఉన్న ముద్రగడను ఒక తీవ్రవాదిలాగా టీడీపీ ప్రభుత్వం విపరీతమైన వేధింపులకు గురిచేయటం, మరోవైపు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన బరిలో ఉండటం. అయితే పవన్‌కు కూడా కాపులు గంపగుత్తగా వేయలేదు. అతను ఒక సీరియస్ పొలిటీషియన్ అనిపించకపోవటం, అతని చర్యలు టీడీపీకి అనుకూలంగా ఉన్నట్లు అనిపించటం వలన కాపు యువత జనసేనకు వేశారుగానీ, పెద్దవాళ్ళు వైసీపీకే వేశారు.

ఈ ఐదేళ్ళలో జరిగిన పరిణామాలతో కాపులలో మార్పు వచ్చింది. ఓడిపోయినా కూడా పవన్ కార్యక్షేత్రంలో నిలబడి ఉండటం, కోట్ల రూపాయల సొంత డబ్బును కౌలురైతులకు, ఆపన్నులకు విరాళమివ్వటంతో అతనికి కాపులలో చిన్నా, పెద్దా అందరినుంచి మద్దతు విపరీతంగా పెరిగింది. మునుపెన్నడూ లేనిస్థాయిలో పవన్ వైపు కాపు ఓటు సంఘటితం అయింది. అయితే పొత్తు సందర్భంగా అతను బాగా దిగిపోయి 21 సీట్లకు ఒప్పుకోవటంతో ఈ వర్గంలో బాగా అసంతృప్తి ప్రజ్వరిల్లింది. కానీ, గత కొద్దిరోజులుగా ఆ అసంతృప్తి చల్లారిందనే చెప్పాలి. పవన్‌కు చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు ఇస్తున్న గౌరవం, జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఒకే ఒక్క లక్ష్యంతో పొత్తు ఏర్పాటులో కీలక పాత్ర వహించాడన్న ఘనత దక్కటంతో సంతృప్తి చెందారు. ఈ సారి కూటమికి గంపగుత్తగా వేయబోతున్నారు. ఏపీలో కాపులు ఎటువైపు ఉంటే ప్రభుత్వం అటువైపు అన్న సంగతి తెలిసిందే.

యువత

పోలింగ్‌లో అత్యధికంగా పాల్గొనే వర్గం యువతే. ఫస్ట్ టైమ్ ఓటర్స్ కూడా కొత్తగా వచ్చి చేరతారు. వీరిలో కూడా ఆయా పార్టీల అభిమానులు ఉంటారు. అయితే ఉడుకురక్తం కారణంగా ఆదర్శాలు, నిజాయితీలకు ప్రాధాన్యమిస్తారు. ఇక్కడ వైసీపీ ప్రభుత్వానికి మైనస్ పాయింట్ ఏమిటంటే - ఒకటి రెండు విషయాలలో అవినీతి కళ్ళకు కట్టినట్లు విస్పష్టంగా కనిపించటం. మద్యం విషయంలో పిచ్చి పిచ్చి బ్రాండ్‌లు దర్శనమివ్వటం, డబ్బు చెల్లింపుల సమయంలో డిజిటల్ పేమెంట్స్ తీసుకోకుండా నగదు మాత్రమే స్వీకరించటం వంటి విషయాలు చూసినవాడికి ఎంత అమాయకుడికైనా ఏదో మతలబు ఉంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు ఇసుక వ్యవహారంలో కూడా అవినీతి ఇలాగే స్పష్టంగా తెలుస్తోంది. ఇక, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని, మెగా డీఎస్సీని ప్రకటిస్తానని 2019 ఎన్నికలముందు భారీ వాగ్దానాలు చేసిన జగన్, చివరి నిమిషంలో తూతూ మంత్రంగా మినీ డీఎస్సీని ప్రకటించటం కూడా యువతలో, నిరుద్యోగులలో అసంతృప్తికి కారణమయింది.

ప్రభుత్వోద్యోగులు

ప్రభుత్వోద్యోగులు ఏవైపు ఉన్నారో ప్రత్యేకించి చెప్పనవసరంలేదు. వారిలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎంత ఉందో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సందర్భంగా అందరికీ అర్థమయింది. తీవ్రమైన ఎండను కూడా లెక్కచేయకుండా పోలింగ్‌లో పాల్గొన్నారు. జగన్ వారికి ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కటం, గత 59 నెలల పాలనలో చివరి నెలలో మాత్రమే ఒకటో తేదీన జీతం అందుకోవటం వంటి విషయాలు వారి ఆగ్రహానికి కారణమయ్యాయి. ప్రభుత్వ టీచర్‌లు, ప్రభుత్వ పెన్షనర్‌లు అంగన్‌వాడీలలో తీవ్ర అసంతృప్తి ఉంది. వీరిలో అత్యధిక ఓట్లు కూటమికే పడతాయి.

సంక్షేమ పథకాల లబ్దిదారులు

తండ్రిని మరిపించేలా ఎన్నికల వ్యూహాలలో, ఎత్తుగడలలో ఆరితేరిన జగన్మోహన్ రెడ్డి ఈ వర్గాన్నే నమ్ముకున్నాడు. దేశంలోనే, ఏ రాష్ట్రంలో లేనివిధంగా సంక్షేమ పథకాలద్వారా ఓటర్లకు డబ్బు పంచాడు. ఒకరకంగా చెప్పాలంటే, పోలింగ్ సందర్భంగా అభ్యర్థులు ఓట్లు కొనుగోలు చేసినట్లు, ఈ ఐదేళ్ళలో ప్రభుత్వ డబ్బుతో తన పార్టీకోసం ఓట్లను కొనుగోలు చేశాడు. ఖచ్చితంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ ద్వారా కొంత మంచి జరిగింది. ముఖ్యంగా కరోనా సమయంలో సంక్షేమ పథకాల ద్వారా వచ్చిన డబ్బు రోజువారీ కూలీలకు, నిరుపేదలకు బాగా సహాయపడింది. అయితే, బటన్‌లు నొక్కి ఈ పథకాలకు లక్షల కోట్లు విరజిమ్మటంవలన రాష్ట్ర అభివృద్ధిలో సమతౌల్యం లోపించింది. ఎక్కడెక్కడ ఉన్న నిధులన్నీ సంక్షేమానికే వాడేశారు. ప్రభుత్వోద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్‌ల జీతాలు ఏనాడూ ఒకటో తేదీన పడలేదు. నిధులకోసం పన్నులు విపరీతంగా పెంచేశారు. రోడ్ల పరిస్థితి దారుణం.

అయితే ఇంతగా ప్రభుత్వ పథకాలు అందుకున్న లబ్దిదారులు ఎంతమంది విశ్వాసపాత్రత ప్రదర్శించి వైసీపీకి ఓటేస్తారా అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న. దీనికి ప్రతికూలంగా పరిణమించే విషయాలు రెండు కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న పథకాలకంటే ఎక్కువ మొత్తంలోనే ఇస్తామని, పథకాలు ఆపబోమని కూటమి నేతలు ప్రకటించటం ఒకటి కాగా, పది రూపాయలు ఇస్తూనే, పన్నులు, మద్యం రేట్లు పెంచి వంద రూపాయలు గుంజుకుంటున్నారు అనే వాదన రెండోది. ఏపీ ప్రజలు చైతన్యవంతులు కావటంతో, జగన్ ఈ పథకాలు ఇచ్చేది తమపై ప్రేమతో కాదని, ఓట్లకోసమేనని, తన జేబులోనుంచి సొంత సొమ్ము తీసి ఏమీ ఇవ్వటంలేదని, జనం డబ్బునే ఇస్తున్నాడని బహిరంగంగానే చెబుతున్నారు.

తటస్థ ఓటర్లు

ప్రతి ప్రధాన రాజకీయ పార్టీకి విశ్వాసపాత్రులైన ఓటర్లతో కూడిన సంప్రదాయక ఓట్ బ్యాంక్ అనేది తప్పకుండా ఉంటుంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వీరి ఓటు అప్రయత్నంగా తమ పార్టీకే పడిపోతుంది. వీరు రాజకీయాలను నిశితంగా గమనిస్తుంటారు. బలమైన రాజకీయ అభిప్రాయాలు ఉంటాయి. కానీ, ఫలితాన్ని నిర్దేశించేది వీరు కాదు, తటస్థ ఓటర్లు. వీరికి బలమైన రాజకీయ అభిప్రాయాలు ఉండవు. పోలింగ్ సమీపిస్తుండగా, చివరి పది - పదిహేను రోజులలో తమ చుట్టూ ఉన్న వాతావరణం/ఊపు/గాలి/వేవ్ ఎటు ఉంటే వారు అటు మళ్ళుతారు. 2019 ఎన్నికల్లో వీరు వైసీపీకి వేశారు. అమరావతిని రాజధానిని చేయటం టీడీపీ వారి సొంత సామాజికవర్గానికి లబ్ది చేకూర్చటానికేనని ఎక్కువమంది నమ్మటం, ఆ రాజధానిని కూడా తలకు మించిన భారంతో నిర్మించాలని పూనుకుని, దానిని కొలిక్కి తీసుకురాలేకపోవటం, రైతుల రుణమాఫీని సరిగ్గా చేయకపోవటం వంటి కారణాలతో ఒక్క ఛాన్స్ అన్న జగన్‌కు అవకాశమిచ్చారు.

అయితే అఈ తటస్థులపై ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రభావం చూపబోతోందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ యాక్ట్ ద్వారా వారసత్వంగా వచ్చిన స్థిరాస్థులపై హక్కులను, ఒరిజినల్ పత్రాలను జగన్ ట్యాంపర్ చేసే అవకాశం ఉందని కూటమి నేతలు చేస్తున్న ప్రచారం జనంలోకి బలంగా వెళ్ళిపోయింది. మొదట తనదైన శైలిలో ఆ విమర్శలను పట్టించుకోని జగన్‌కు, రెండు మూడు రోజులు గడిచేటప్పటికి జరిగిన నష్టం తెలిసివచ్చింది. అప్పుడు డేమేజ్ కంట్రోల్ మొదలుపెట్టేటప్పటికీ, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ప్రతి విమర్శలతో కౌంటర్ దాడి మొదలుపెట్టినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దానికి తోడు జగన్ చేసిన ఒక పిచ్చిపని కూటమికి కలిసివచ్చింది. ప్రచారదుగ్ధతో అన్ని చోట్లా వైసీపీ రంగులు, జగన్ ఫోటోలు వేసినట్లే పాస్ పుస్తకాలపై, ఆస్తి పత్రాలపై జగన్ ఫోటో వేశారు. జగన్‌కు క్లీన్ ఇమేజ్ ఉంటే జనం దానిని పట్టించుకోకపోయేవారు. అతనికి ఉన్న ఫ్యాక్షన్ నేపథ్యం, కేసుల చరిత్ర దృష్ట్యా కూటమి ఆరోపణలను జనం తేలిగ్గా కొట్టిపారేయటంలేదు.

తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ముందు మేడిగడ్డ పిల్లర్లు కుంగటం ఎలాగైతే కేసీఆర్‌ను దెబ్బతీసిందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా జగన్‌ను దెబ్బకొట్టే అవకాశాలు కనబడుతున్నాయి. మరోవైపు తెలంగాణలో ధరణి, ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే పోలికలను కూడా కొందరు తీసుకొస్తున్నారు.

వాస్తవానికి ఎన్నికల వ్యూహాలలో, ప్రచారంలో చంద్రబాబుకంటే ఖచ్చితంగా జగన్ పదిరెట్లు ముందంజలో ఉన్నాడు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని ఎన్ టీవీ, టీవీ9, 10 టీవీలను కూడా తన అధీనంలోకి తీసుకుని ఆ ఛానల్స్‌లో కూటమికి సంబంధించిన నేతల ప్రచారాలను ఏమాత్రం కనిపించకుండా చేసి, పచ్చ ఛానల్స్‌గా పిలవబడే ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 లను న్యూట్రలైజ్ చేసేశాడు. అయితే ప్రచార దుగ్ధతో చేసిన తప్పు చివరి క్షణంలో అతని కొంప ముంచేటట్లు కనబడుతోంది. అదే నిజమైతే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని లాస్ట్ నెయిల్ ఇన్ ది కాఫిన్ అని అనవచ్చేమో.


(The Federal seeks to present views and opinions from all shades of the spectrum. The information, ideas or opinions in the articles are of the author and do not necessarily reflect the the views of The Federal)




Read More
Next Story