
రేవంత్ 'కుర్చీ'పై కన్నేసింది ఎవరు?
పదేళ్ల తర్వాత అధికారం వచ్చినా 2028 ఎన్నికల్లో తిరిగి గెలుపొందాలన్న పట్టుదల చాలామంది కాంగ్రెస్ పార్టీలో కానరావడం
-ఎస్.కే.జకీర్,
''వినే వాళ్ళ కన్నా చెప్పే వాళ్ళు ఎక్కువయ్యారు.పైగా నా కుర్చీపైనే కొంతమందికి ఆశ.నేనొక కుర్చీపై కూర్చొని ఎదురుగా మరో కుర్చీ చూపి కూర్చోమని చెబితే కొందరు వినే పరిస్థితిలోలేరు.అయితే నా పక్కనే కుర్చీ వేసుకొని కూర్చొవాలనువారు,లేదా నా కుర్చీపైనే మరొక కుర్చీ వేసుకొని కూర్చోవాలనుకుంటున్నవాళ్ళు కనిపిస్తున్నారు''! అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 15 న ఢిల్లీ మీడియా ప్రతినిధులతో మాటా మంతీలో ఆవేదన వ్యక్తం చేశారు.
''రేవంత్ లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు.మా ప్రభుత్వంపై ఏర్పడిన వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకోవడంలో రేవంత్ విజయం సాధించారు.ఆయన పీసీసీ అధ్యక్షుడు కాగానే కేసీఆర్ హయాంలో జరిగిన అనేక వ్యవహారాలపై కూపీ లాగి,సమస్త సమాచారాన్ని తన దగ్గర పెట్టుకున్నారు.రేవంత్ ను మేము తక్కువ అంచనా వేసాం. రేవంత్ కాకుండా మరొకరు ఎవరైనా సీఎం అయి ఉంటే ఆరు నెలల్లోనే ప్రభుత్వం కుక్కలు చింపిన విస్తరి అయ్యేది''! అని బిఆర్ఎస్ పార్టీకి చెందిన అత్యంత కీలక నాయకుడు ఒకరు కొద్ది రోజుల కిందట అదే ఢిల్లీ మీడియాతో మాటా మంతీలో అన్నారు.ఆ కీలక నేత ఎవరో ఊహించడం కష్టమేమీ కాదు.పైగా ఇదంతా పత్రికలలో రాయకూడదని కూడా ఆ నేత విజ్ఞప్తి చేసినట్టు ఢిల్లీ సీనియర్ జర్నలిస్టు చెప్పారు.
రేవంత్ చేసిన వ్యాఖ్యలకు, బిఆర్ఎస్ 'కీలక' నేత వ్యాఖ్యలకు ఖచ్చితంగా లింకు ఉన్నది.'మాకు దక్కనిది మరొకరికి దక్కకూడదు' అనే ధోరణితో కొందరు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ పై అసూయా ద్వేషాలతో లోలోపల రగిలిపోతున్న ఇద్దరో,ముగ్గురో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు గూఢచారి వర్గాలకు ఉప్పందింది. వాళ్ళు, కూర్చున్న కొమ్మను నరుక్కుంటే ఏమి జరుగుతుందో తెలియని మూర్ఖులు కాదు.అయినా సరే,కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తులు,శక్తులు, గ్రూపులు కాంగ్రెస్ లో తక్కువేమీ లేరు.కానీ పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు దాన్ని సుస్థిరంగా నిలబెట్టుకోవడం, 2028 ఎన్నికల్లో తిరిగి గెలుపొందాలన్న పట్టుదల చాలామంది కాంగ్రెస్ పార్టీలో కానరావడం లేదు.అందుకే ఏ విషయాన్నయినా తేలిగ్గా తీసుకుంటున్నారు.రేవంత్ రెడ్డిని బిఆర్ఎస్,బీజేపీ నాయకులు నిత్యం దూషిస్తుండగా కొందరు 'చోద్యం' చూస్తున్నారు.మరికొందరు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు.
2018,2023 ఎన్నికలకు ముందు,'ఎవరెవరు' ఎర్రవెల్లి ఫార్మ్ హౌజ్ తో టచ్ లో ఉన్నారో,కేటీఆర్ తో ఢిల్లీ,హైదరాబాద్ ఎయిర్పోర్ట్ విఐపి లాంజ్ లలో ముచ్చట్లు పెట్టారో రాహుల్ గాంధీ దగ్గర పక్కా సమాచారం ఉన్నదని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.రేవంత్ కు పార్టీలో ప్రాధాన్యం పెరుగుతున్న కొద్దీ 'పాత కాంగ్రెస్','తెలుగుదేశం కాంగ్రెస్ ' అంటూ ఒక వివాదానికి మూడేండ్ల కిందటే పురుడుపోసిన సదరు 'సీనియర్ నేతల' వెనుక ఎర్రవెల్లి డైరెక్షన్ ఉన్నట్టు అప్పట్లోనే విమర్శలు వచ్చాయి.కేసీఆర్ అధికారంలోకి వస్తేనే బాగుంటుందని బిఆర్ ఎస్ నాయకులు మాత్రమే అనుకుంటూ ఉన్నారని అనుకోవడం పొరబాటు.వారితో పాటు రేవంత్ రెడ్డి పట్ల అసంతృప్తి ఉన్న కొందరు సీనియర్లూ ఉన్నారనే ప్రచారం ఢిల్లీ దాకా చేరింది.కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగే ముఖ్యమైన నిర్ణయాలు,రేవంత్ ఆలోచన సరళి,వ్యూహరచనను ప్రత్యర్థులకు చేరవేసే 'ఉత్తమ నాయకుల' బ్యాచ్ ఉన్నట్టు తెలియవచ్చింది.
బిఆర్ఎస్ కీలక నాయకుడు ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు ఆయన మనసులో మాట అయినా,అయిష్టంగానే నిజాన్ని అంగీకరించినా అటువంటి 'విక్రమార్కులు' కాంగ్రెస్ పార్టీలో లేకపోవడం ఆ పార్టీ దురదృష్టం.రేవంత్ రెడ్డి కనుక ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే కాంగ్రెస్ పార్టీ 'కుక్కలు చింపిన విస్తరి'వలె మారిపోయేదనడంలో సందేహం లేదు.సీఎం పదవి రేవంత్ రెడ్డికి ఆయాచితంగా
వచ్చిందేమీ కాదన్న సంగతి సోకాల్డ్ 'సీఎం కాగల అర్హతలు' ఉన్నట్టు భావిస్తున్న నాయకులకు కూడా తెలుసు.రేవంత్ సీఎం కాకుండా ఉండేందుకు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేశారో,'ప్రత్యర్థి' రాజకీయపక్షం కోరికను నెరవేర్చడానికి,ఎన్ని పాట్లు పడ్డారో రాహుల్ గాంధీకి,కేసీ.వేణుగోపాల్ కూ,ఇతర ఏఐసీసీ ముఖ్యులకూ తెలుసు.
ఆ ప్రయత్నాలన్నింటినీ భగ్నం చేసి రేవంత్ రెడ్డిని సీఎల్పీ నాయకునిగా ఎన్నుకోవలసిందిగా పార్టీ హైకమాండ్ ఆదేశించింది.అలా హైకమాండ్ సీఎం పదవి విషయంలో పట్టు విడుపులు లేని వైఖరిని ప్రదర్శించకపోతే పరిస్థితి మరోలా ఉండేది.''కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీయే.ఇక ఇందులో కొత్త,పాత అనేది ఏముంటుంది.రేవంత్ రెడ్డి సమర్ధతను పార్టీ గుర్తించింది.వేరే,ఇతర అంశాలు ఏమైనా ఉంటే మాట్లాడండి.ముఖ్యమంత్రి పదవికి ఎవరు అర్హులో హైకమాండ్ నిర్ణయిస్తుంది'' అని 2023 డిసెంబర్ లో ఫలితాల తరవాత సీఎం పదవి కోసం ఢిల్లీలో 'లాబీయింగ్'ప్రయత్నాలు చేసిన నాయకులకు రాహుల్ గాంధీ చురకలు అంటించినట్టు ఢిల్లీ మీడియా వర్గాలు చెబుతున్నవి.'కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడితో తలపడేందుకు అచ్చం కేసీఆర్ లాగానే ఆలోచించి,కేసీఆర్ లాగానే వ్యూహరచన చేసినందుకే రేవంత్ సక్సెస్ అయ్యారు' అన్నది బిఆర్ఎస్ అంతర్గత టాక్.
కాంగ్రెస్ సీనియర్ నాయకులలో పదవీ వ్యామోహం మినహాయిస్తే,నిజంగానే సీఎం పదవి వరించి ఉంటే ఎట్లా నిలదొక్కుకునేవారో,ఎలా అతిత్వరగా విఫలమయ్యేవారో జనానికి తెలియనిది కాదు.కేసీఆర్,రేవంత్ ల మధ్య ముఖాముఖి యుద్ధంగానే అసెంబ్లీ ఎన్నికలు జరిగినట్లుగా ప్రత్యర్థులు ఒప్పుకుంటున్నారు కానీ సొంత పార్టీ సీనియర్లు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు.''యాక్సి డెంటల్ సీఎం'' అని కేటీఆర్ బహిరంగంగా అంటుంటారు.కాంగ్రెస్ సీనియర్లుగా చెప్పుకునే వాళ్ళు మాత్రం అదే విషయాన్ని మనసులో అనుకుంటారు.బయటకు చెప్పరు.'రేవంత్ రెడ్డికి ఏమీ తెలియదు.కనుక మేం చెబితే ఆయన వినాలి' అనే పద్దతిలో వ్యవహరిస్తుండడం పార్టీలో ఐక్యతకు భంగం కలిగిస్తుంది.'సీఎం రేవంత్ కు,మంత్రులకు పొసగడం లేదు' అని ఒక వైపు బిఆర్ఎస్ ప్రచారం చేస్తూనే ఉన్నది.అలాంటి ప్రచారానికి సదరు సీనియర్లు స్వయంగా అస్త్రాలు అందించడాన్ని ఎలా అనుకోవాలి?
''కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మాటే నాకు వేదవాక్కు.ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేయడమే నా కర్తవ్యం'' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.తెలంగాణ కాంగ్రెస్ లోని పురాతన నాయకులు ఎవరైనా ఇలాంటి మాట చెప్పగలిగారా? అంటే చెప్పలేరు.''తను చెప్పిందే చేస్తా ఎన్ని కష్టాలొచ్చినా భరిస్తా.రాహుల్‌గాంధీతో నాకు గ్యాప్ అసత్య ప్రచారం.పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచీ ఈ ప్రచారం జరుగుతోంది.రాహుల్‌గాంధీ ఏం చెప్పారో అది మాత్రమే చేస్తా.దానివల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను.ఇది నా వ్యతిరేకుల పైశాచిక ఆనందం.అది ఎప్పటికీ నెరవేరదు''.అని రేవంత్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.రేవంత్ కు రాహుల్ గాంధీ అపాయింట్ మెంటు ఇవ్వడం లేదనీ,ఇక ఆయన పనయిపోయిందనీ అనుకుంటున్న వారందరికీ ఢిల్లీలో రాహుల్,రేవంత్ గంటకు పైగా సమావేశం కావడం జీర్ణించుకోలేని సన్నివేశం.
మంత్రివర్గ విస్తరణ విషయంలో సీఎం రేవంత్ ను కొందరు సీనియర్లు ముప్పుతిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే.ఏకాభిప్రాయ సాధనలో సీఎం విఫలం కావడం వెనుక వారే కారణం.తమ మద్దతుదారులు,లేదా అనుచరులను క్యాబినెట్ లోకి తీసుకురావాలన్నది వారి లక్ష్యం.జిల్లాలు,సామాజికసమీకరణలు,ప్రజలలో పలుకుబడి,కార్యకర్తల మద్దతు తదితర అంశాలు పరిగణనలోకి తీసుకొని ఈ ప్రక్రియను పూర్తి చేయవలసి ఉన్నది.ఇది కత్తి మీద సాము లాంటి వ్యవహారం.మంత్రి పదవి ఆశించి భంగపడేవారు కారాలు,మిరియాలు నూరడమూ,ధనబలమూ తోడైతే అసమ్మతి కార్యకలాపాలకు పాల్పడడం సహజ పరిణామమే.సీఎం పదవిలో ఉన్నవారు అలాంటి ఉపద్రవాలకు నిరంతరం అప్రమత్తంగా ఉండవలసిందే.
“నేను ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ తరఫున చిట్ట చివరి ముఖ్యమంత్రి అయినా ఫర్వాలేదు.కానీ,కులగణన మాత్రం ఈ దేశానికే రోడ్ మ్యాపు అవుతుంది.బీసీలకు కొన్ని దశాబ్దాలుగా దక్కని మేలు జరుగుతుంది. కుల గణన ద్వారా బీసీలకు పట్టం కడుతున్నాం'' అని రేవంత్ వ్యాఖ్యా నించారు.కులగణన ద్వారా రేవంత్ కు క్రెడిట్ లభిస్తుందేమోనని కాంగ్రెస్ సీనియర్లు లోలోపల బెంగ ఉన్నది.''బీసీలు ఎక్కువగా ఉన్నందున వారికే ఈ సీటు దక్కినా నాకు ఇబ్బంది లేదు'' అని ప్రకటించడానికి చాలా దమ్ము కావాలి.బీసీ వర్గాల ఓటుబ్యాంకులను కాంగ్రెస్ వైపునకు రేవంత్ హైజాక్ చేస్తున్నట్టుగా బిఆర్ఎస్ ఆందోళనకు గురవుతోంది.రానున్న రోజుల్లో బీసీ నాయకుడికి ముఖ్యమంత్రిపీఠం ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నట్టుగా విశ్లేషణలు సాగుతున్నాయి.
గతంలో ఎస్సీలకు సీఎం సీటు ఇస్తానన్న కేసీఆర్ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు.బీసీలకు సీఎం సీటు ఇస్తామని నేరుగా చెప్పకపోయినా రేవంత్ వ్యాఖ్యల ఆంతర్యంపై పెద్దఎత్తున చర్చ సాగుతోంది.కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎస్.సి,బీసీ నేతలెవరికీ తమ వర్గాల వ్యక్తి ముఖ్యమంత్రి కావడం ఇష్టం ఉండదు.దానిక్కారణం ఆయా వర్గాల వాళ్ళు అలాంటి పదవిని కాపాడుకోలేరని,హ్యాండిల్ చేయలేరని,అగ్ర కులాలవారైతేనే పాలనా వ్యవహారాలు చక్కబెట్టగలరని అనుకుంటారు.ఈ విషయాలు మనకు బహిరంగంగా చెప్పరు.
(ఎస్.కే.జకీర్, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్)