ఆహార భద్రత కోసం రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వాలి ?
x

ఆహార భద్రత కోసం రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వాలి ?

ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో 2011 నాటికి రాష్ట్ర జనాభా 3,38,07,794 కాగా, మొత్తం 91,68,231 కుటుంబాలకు రేషన్ కార్డులు ఉండేవి.

ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో 2011 నాటికి రాష్ట్ర జనాభా 3,38,07,794 కాగా, మొత్తం 91,68,231 కుటుంబాలకు రేషన్ కార్డులు ఉండేవి. వివిధ కారణాల వల్ల వీటిలో 2,46,324 కార్డులు గతంలో రద్ధయ్యాయి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ వెబ్ సైట్ అందిస్తున్న వివరాల ప్రకారం ప్రస్తుతం రాష్ట్ర మొత్తం జనాభా 3,81,00,000 మందికి గాను ( 2021 జనాభా గణన చేయలేదు,ఇది అంచనా మాత్రమే ) రాష్ట్రంలో 89,96,075 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో జాతీయ ఆహార బధ్రత చట్టం క్రింద కేంద్రం ఖాతాలో 1,91,80,788 మంది లబ్ధి దారులకు 54,44,911 రేషన్ కార్డులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మరో 35,51,000 కార్డులు జారీ చేయగా, వాటి క్రింద 90,01,000 మంది లబ్ధిదారులుగా ఉన్నారు. అంత్యోదయ అన్న యోజన, అన్నపూర్ణ కార్డులు సహా మొత్తం రేషన్ కార్డుల ద్వారా ప్రస్తుతం రాష్ట్రంలో లబ్ధిదారులు 2,81,63,759 మందన్నమాట. గత పదేళ్ళలో వివిధ కారణాలతో 5,98,000 కార్డులను రద్ధు చేసి, కొత్తగా 6,47,479 జారీ చేశారు. అంటే ఈ పదేళ్ళలో అదనంగా ఇచ్చిన కార్డులు కేవలం 49,478 కార్డులు మాత్రమే.

కేంద్ర ప్రభుత్వం ప్రతి మనిషికి నెలకు ప్రస్తుతం ఐదు కిలోల ఉచిత బియ్యం ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ నుండీ అదనంగా ఖర్చు భరించి, ప్రతి మనిషికి నెలకు మరో కిలో బియ్యం ( 6 కిలోలు) అదనంగా ఇస్తున్నది.

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు నిండిన సందర్భంగా అమృతోత్సవాలు జరుపుకున్నప్పటికీ, వివిధ పార్టీల ప్రభుత్వాలు దేశంలో అమలు చేసిన ఆర్ధిక, పారిశ్రామిక, వ్యవసాయ విధానాల వలన దేశంలో మెజారిటీ ప్రజల జీవన ప్రమాణాలు పెరగకపోగా ఆర్ధిక అంతరాలు మరింత తీవ్రమయ్యాయి. జీడీపీ, GSDP ఆధారిత ప్రజల తలసరి ఆదాయం గణనీయంగా పెరగినట్లు ప్రభుత్వాలు చెప్పుకున్నప్పటికీ, దేశంలో పేదరికం, ఆకలి, నిరుద్యోగం తగ్గడం లేదు.

ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు మన దేశం ఇంకా చాలా దూరంలో ఉంది. అనేక అంతర్జాతీయ సూచీలలో మన దేశం బాగా వెనుకబడి ఉండడమే కాదు, ప్రతి సంవత్సరం దాని సంఖ్య క్రిందికి పడిపోతున్నది.

అనారోగ్య మరణాలు, అకాల మరణాలు పెరిగిపోతున్నాయి. స్త్రీలలో రక్తహీనత పెరుగుతున్నది. పిల్లలలో కూడా రక్తహీనత, ఎదుగుదల స్తంభించి పోవడం కనపడుతున్నది. ఆహార బధ్రత చట్టం క్రింద క్యాలరీలను ( కార్బోహైడ్రేట్స్ ) రేషన్ కార్డులపై నెలకు బియ్యం, గోధుమల లాంటివి నెలకు ఐదు కిలోలు ఉచితంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ( PDS ) ద్వారా పంపిణీ చేస్తున్నప్పటికీ, నిజమైన పోషకాహార బధ్రత మెజారిటీ ప్రజలకు ఇప్పటికీ అందలేదు.

పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెలు, కూరగాయలు, పండ్లు, పాలు, మాంసం ద్వారా పోషక విలువలు అందాలి. కానీ వాటి ధరలు గణనీయంగా పెరిగి పోయాయి. ప్రజల కొనుగోలు శక్తి ఆ స్థాయిలో పెరగలేదు. అందువల్లనే ఆకలి సూచీలో మన దేశపు స్థాయి మరింత క్రిందికి దిగజారిపోయింది.

2013 లో ఆహార బధ్రత చట్టం వచ్చినప్పటికీ ప్రభుత్వాలు ఒకవైపు బియ్యం, గోధుమలు లాంటి ఆహార ధాన్యాలు పంపిణీ చేయడం తప్ప, మరిన్ని పోషక విలువలు కలిగిన ఆహారం రేషన్ కార్డులపై అందించడానికి పూనుకోవడం లేదు. మరోవైపు పేద ప్రజలలో కొనుగోలు శక్తి లేక పోషక విలువలు కలిగిన ఆహార వినియోగం క్రమంగా తగ్గి పోతున్నది.

భారత దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా , లక్షల కోట్లు ఖర్చు పెట్టి, ప్రజలకు చవక ధరలకు ఆహారాన్ని అందిస్తున్నామని చెప్పుకుంటున్నప్పటికీ, దేశ జీడీపీ లో ఆహార సబ్సిడీపై కేంద్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చు వాటా 2014-2015 లో 0.9 శాతం కాగా, అది 2024-2025 నాటికి 0.6 శాతానికి పడిపోయింది. కరోనా కాలంలో ఒక్క సంవత్సరం 2020-2021 లో మాత్రమే అది జీడీపీ లో 2.7 శాతానికి చేరింది. నిజానికి కేంద్ర ప్రభుత్వం జీడీపీ లో కనీసం 5 శాతం కేటాయించినా అన్ని ముఖ్యమైన ఆహార ఉత్పత్తులు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు సబ్సిడీ ధరలపై అందించవచ్చు. అప్పుడే ప్రజల ఆకలి తీరి, ఆరోగ్యకర సమాజం నిర్మాణం అవుతుంది.

1999-2000 మరియు 2022-2023 మధ్య కాలంలో తలసరి ఆహార ధాన్యాల వినియోగం గ్రామీణ ప్రాంతాలలో నెలకు 12.7 కిలోల నుండీ 9.6 కిలోలకు పడిపోయింది. నగర,పట్టణ ప్రాంతాలలో 10.4 కిలోల నుండీ 8.1 కిలోకు పడిపోయింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 వ రౌండ్ నివేదిక ప్రకారం 15-49 వయస్సు కలిగిన మహిళలలో 50 శాతం మహిళలు, 48 శాతం పురుషులు మాత్రమే పప్పు ధాన్యాలను వినియోగిస్తున్నారు. కేవలం 49 శాతం మహిళలు, పురుషులు మాత్రమే పాలు, పెరుగు లాంటివి వినియోగిస్తున్నారు.

ఆహార అలవాట్లలో, వినియోగంలో వచ్చిన మార్పులు కొంత కారణమైనప్పటికీ, మొత్తంగా భారత దేశ గ్రామీణ ప్రజలు ఎంచుకున్న ఆహార ఉత్పత్తులపై పెట్టే నెల వారీ తలసరి ఖర్చు 2011-12 లో ధాన్యం (బియ్యం,గోధుమలు) పై ఖర్చు వాటా 10.8 శాతం ఉండగా , 2022-2023 నాటికి అది 4.9 శాతానికి పడి పోయింది. పప్పు ధాన్యాలపై ఖర్చు 2.9 శాతం నుండీ 2 శాతానికి పడిపోయింది. పాలు,పాల ఉత్పత్తులపై ఖర్చు వాటా 8 శాతం నుండీ 8.3 శాతానికి పెరిగింది. పండ్లపై ఖర్చు వాటా 2.8 శాతం నుండీ 3.7 శాతానికి పెరిగింది. గుడ్లు, చేపలు, మాంసం పై ఖర్చు వాటా 4.8 శాతం నుండీ 4.9 శాతానికి పెరిగింది.

దేశ నగర, పట్టణ ప్రజలు ఎంచుకున్న ఆహార ఉత్పత్తులపై పెట్టే నెల వారీ తలసరి ఖర్చులో, 2011-12 లో ధాన్యం (బియ్యం,గోధుమలు) పై వాటా 6.7 శాతం ఉండగా , 2022-2023 నాటికి అది 3.7 శాతానికి పడి పోయింది. పప్పు ధాన్యాలపై ఖర్చు వాటా 2 శాతం నుండీ 1.4 శాతానికి పడిపోయింది. పాలు,పాల ఉత్పత్తులపై ఖర్చు వాటా 7 శాతం నుండీ 7. 2 శాతానికి పెరిగింది. పండ్లపై ఖర్చు వాటా 3.4 శాతం నుండీ 3.8 శాతానికి పెరిగింది. గుడ్లు, చేపలు, మాంసం పై ఖర్చు వాటా 3.7 శాతం నుండీ 3.6 శాతానికి తగ్గింది.

దేశంలో నిరుపేదలను గుర్తించి, అంత్యోదయ అన్న యోజన (AAY) కార్డులను ఇవ్వడానికి 2004 ఆగస్ట్ 3 న అప్పటి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, 2017 లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆహార బధ్రత చట్టం రూల్స్ ,తెలంగాణ విడుదల చేసింది. ఈ రూల్స్ ప్రకారం ఈ క్రింది క్యాటగిరీల వారికి తప్పకుండా అంత్యోదయ అన్న యోజన కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది.

1. భూమిలేని వ్యవసాయ కూలీలు, సన్నకారు రైతులు,గ్రామీణ చేతి వృత్తుల వారు- కుండలు చేసేవారు, కల్లు గీసేవారు, చేనేత కార్మికులు, కంసాలు లు, వడ్రంగులు, బస్తీలలో జీవించేవారు, పోర్టర్ లు ,కూలీలు , రిక్షా తొక్కేవారు , బండి లాగే వారు , పండ్లు,పూలు అమ్మేవారు, పాములు పట్టేవారు, చెత్త ఏరుకునేవారు, చెప్పులు కుట్టేవారు, గ్రామీణ,పట్టణ ప్రాంతాలలో ఇటువంటి అనేక రకాల పనులు చేసే దినసరి కూలీలు

2. వితంతువులు కుటుంబ పెద్దగా ఉండడం, దీర్ఘకాలిక రోగులు, వికలాంగులు, సామాజిక ,ఇతర కుటుంబ సభ్యుల అండలేని 60 సంవత్సరాలు నిండిన పురుషులు లేదా స్త్రీలు , ఒంటరి పురుషులు

3. అత్యంత వెనుకబడిన ఆదివాసీ తెగలకు చెందిన కుటుంబాలు

కుటుంబ సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా, కుటుంబానికి కనీసం 35 కిలోల బియ్యం ఇవ్వాలనేది ఈ కార్డు ఉద్దేశం. కానీ మన రాష్ట్రంలో అంత్యోదయ అన్న యోజన కార్డులకు అర్హులైన కుటుంబాలు ఎక్కువే ఉన్నా, ఇప్పటి వరకూ జారీ చేసింది కేవలం 5,66,701 మాత్రమే.

సమగ్ర కుటుంబ సర్వే నివేదిక పై మార్చ్ 2019లో చేసిన ప్రభుత్వ ప్రెజెంటేషన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు పొందడానికి అర్హులెవరు ?

దళిత కుటుంబాలు, అత్యంత వెనుకబడిన ఆదివాసీ తెగల (PVTG)కుటుంబాలు, ఇతర గిరిజన కుటుంబాలు, దినసరి కూలీ కుటుంబాలు ( దినసరి వేతన కుటుంబాలు , వ్యవసాయ కూలీలు, వలస కూలీలు) , ఇంట్లో ఒక్క రూమ్ ఉన్న కుటుంబాలు, మట్టితో కట్టిన ఇల్లు, తాత్కాలిక షెల్టర్, పాక్షికంగా ధ్వంసం అయిన రెండు గదుల ఇల్లు ఉన్న కుటుంబాలు, అనాధలు ఉన్న కుటుంబాలు, వికలాంగులు ఉన్న కుటుంబాలు ( PWD),శాశ్వత నివాసం లేని సంచార జాతుల కుటుంబాలు,ఇతర చోట్ల శాశ్వత నివాసం ఉన్న సంచార జాతులు, ఇప్పటికీ వృత్తిలో ఉన్న చేతి వృత్తుల కళాకారులు

రేషన్ కార్డుకు అర్హులను నిర్ణయించడంలో రావాల్సిన మార్పులేమిటి?

ఆహార బధ్రత రేషన్ కార్డు మంజూరు చేయడానికి ప్రధాన మార్గదర్శకం గ్రామీణ ప్రాంతంలో లక్షన్నర లోపు ఆదాయం, పట్టణ,నగర ప్రాంతాలలో 2 లక్షల లోపు ఆదాయం కలిగి ఉండడం. ఈ ఆదాయాన్ని నిర్ధారించడానికి ప్రాతిపదిక ఏమిటి? రెవెన్యూ శాఖ అధికారులు ఎంక్వైరీ చేసి ఆదాయ సర్టిఫికెట్ జారీ చేస్తారు. కుటుంబ సభ్యులు ఇచ్చే సమాచారం కాకుండా, ఈ అధికారులకు మరో రూపంలో కుటుంబ ఆదాయాన్ని తెలుసుకునే మార్గమేదైనా ఉందా ? లేదు. రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడి, ఒక కుటుంబానికి అతి తక్కువ ఆదాయం చూపిస్తూ ఇన్ కమ్ సర్టిఫికెట్ జారీ చేస్తే దానికి ఎంత క్రెడిబిలిటీ ఉన్నట్లు?

2022-2023 సంవత్సర ఇండియన్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ( PLFS)ప్రకారం స్వయం ఉపాధి కల్పించుకున్న మహిళలు గ్రామీణ ప్రాంతంలో అన్ని నెలల లోనూ ఒకే విధమైన ఆదాయం పొందడం లేదు. ఆయా నెలలలో 4,524 రూపాయల నుండీ 10,028 రూపాయల వరకూ ఆదాయం పొందుతున్నారు. పట్టణ ప్రాంతాలలో మహిళలు ఆయా నెలలలో 8,434 నుండీ 10,527 రూపాయల ఆదాయం పొందుతున్నారు. తెలంగాణలో దినసరి మగ కార్మికులు గ్రామీణ ప్రాంతంలో సగటున 496 కూలీ పొందుతున్నారు. దినసరి మహిళా కార్మికులు ఆయా నెలలలో రోజుకు 291 రూపాయల నుండీ 395 రూపాయల వరకూ కూలీ మొత్తాన్ని పొందుతున్నారు.

30 రోజులకు వేతనం గా మహిళా కార్మికులు గ్రామీణ ప్రాంతంలో ఆయా నెలలను బట్టి 9,170 రూపాయల నుండీ 20,635 రూపాయల నెలసరి వేతనం పొందుతున్నారు. పట్టణ ప్రాంతాలలో ఆయా నెలలను బట్టి నెల వేతనంగా 20,449 నుండీ 22,430 రూపాయల వరకూ పొందుతున్నారు. నిజానికి సర్వే లో బయట పడిన నెలసరి వేతనాలు అధికంగా కనిపిస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో అనేక సంస్థలలో మహిళలకు, పురుషులకు కార్మిక శాఖ నిర్ణయించిన కనీస వేతనాలు కూడా చెల్లించని పరిస్థితి ఎక్కువ సందర్భాలలో మనకు ఎదురవుతుంది.

తెలంగాణ లో ఉపాధి పొందుతున్న వారిలో గ్రామీణ ప్రాంతంలో స్వయం ఉపాధిపై 73.2 శాతం , దినసరి కూలీలుగా 13.7 శాతం, రెగ్యులర్ నెలసరి వేతనం పై 13.1 శాతం ఆధారపడి జీవిస్తున్నారు. మహిళలలో 65.4 శాతం స్వయం ఉపాధిపై, 29.4 శాతం దినసరి కూలీపై, 5.2 శాతం రెగ్యులర్ నెలసరి వేతనంపై ఆధారపడి జీవిస్తున్నారు.

పట్టణ ప్రాంతంలో ఉపాధి పొందుతున్న వారిలో మగవారిలో 37.7 శాతం స్వయం ఉపాధిపై, 9.1 శాతం దినసరి కూలీపై, 53.2 శాతం నెలసరి వేతనం పై ఆధారపడి జీవిస్తున్నారు. మహిళలలో 36.4 శాతం స్వయం ఉపాధిపై, 13.2 శాతం దినసరి కూలీపై, 50.4 శాతం నెలసరి వేతనం పై ఆధారపడి జీవిస్తున్నారు.

అయితే దినసరి కూలీల, స్వయం ఉపాధి శ్రామికుల ఆదాయాన్ని లెక్కించడానికి నిరంతరాయంగా చేసే ఇటువంటి సర్వే లు మాత్రమే ఆధారంగా ఉపయోగపడతాయి. కానీ అవి రెగ్యులర్ గా జరగవు.

తెలంగాణ గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రైవేట్ రంగ సంస్థలలో ముఖ్యంగా వివిధ వ్యాపార, వాణిజ్య, సేవా రంగ సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న దశలో నెలసరి వేతనం పై ఆధారపడి బతుకుతున్న వారి సంఖ్యపై ఎవరికీ స్పష్టత లేదు. అలాగే పరిశ్రమలలో పని చేస్తున్న పర్మినెంట్, క్యాజువల్, కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్యపై కూడా స్పష్టత లేదు. వివిధ రాష్ట్రాల నుండీ తెలంగాణకు తరలి వస్తున్న వలస కార్మికుల వివరాలను నమోదు చేసే యంత్రాంగం, విధానం కూడా లేదు.

ముఖ్యంగా పట్టణ,నగర ప్రాంతాలలో ప్రైవేట్ రంగంలో కార్మికుల, ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ, వారికి ఆయా సంస్థలలో నియామక పత్రాలు, వేతన రసీదులు, సాంఘిక, సంక్షేమ పథకాలు ఉండవు. పని గంటలు, సెలవులు కూడా నిర్ధిష్టంగా ఉండవు. అదనపు పని గంటలు పని చేస్తే, అదనపు వేతనం చెల్లిస్తారన్న గ్యారంటీ లేదు. ఇవన్నీ ప్రైవేట్ రంగ ఉద్యోగులకు, కార్మికులకు అందేలా చూడాల్సిన బాధ్యత కార్మిక శాఖపై ఉంది. కానీ గత మూడు దశాబ్ధాలుగా కార్మిక శాఖ ఆ బాధ్యత తనది కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నది.

ఈ నేపధ్యంలో తెలంగాణ ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందుతున్న వారి ఆదాయాలు స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఎంత మాత్రం లేదు. కాబట్టి రేషన్ కార్డు కావాలనుకున్న ప్రతి కుటుంబం మార్గదర్శకాలకు అనుగుణంగా స్వయం ప్రకటిత డిక్లరేషన్ తో, ఆదాయం చెప్పి దరఖాస్తు చేసుకుంటున్నది. ఆయా కుటుంబాల వద్దకు ఎంక్వైరీ కి వెళ్ళిన రెవెన్యూ సిబ్బంది, తమ విచక్షణతో దానిని ఆమోదించడమో , తిరస్కరించడమో చేస్తున్నారు.

కానీ నిజానికి గ్రామీణ, పట్టణ ప్రాంతలలో దినసరి కూలీలను, పీస్ రేట్లపై పని చేస్తున్న హమాలీ కార్మికులను, ఇళ్ళలో పని చేసే లక్షలాది మహిళా కార్మికులను, స్వయం ఉపాధి శ్రామికులను, ప్రైవేట్ రంగ సంస్థలలో పని చేస్తున్న కార్మికులను, ఉద్యోగులను, ప్రభుత్వ రంగ పరిశ్రమల లోనూ, ప్రభుత్వం లోనూ కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగులను, కార్మికులను, గత ఐదారేళ్లుగా కొత్తగా రంగం లోకి వచ్చిన గిగ్ అండ్ ప్లాట్ ఫారం శ్రామికులను, ముఖ్యంగా రవాణా రంగంలో వచ్చిన ఓలా , ఊబర్ లాంటి ప్రైవేట్ సంస్థలలో స్వంత కారుతో, లేదా కారు కిరాయికి తీసుకుని జీవనోపాధి ఏర్పాటు చేసుకున్న వారికి కూడా క్యాబ్ నడుపుకుంటున్న వారిని ఇతర ప్రమాణాల రీత్యా పేదరికంలో ఉన్న వారిగా పరిగణించాల్సి ఉంటుంది. (ఇప్పుడు నాలుగు చక్రాల వాహనం ఉన్న వారిని రేషన్ కార్డు మంజూరు నుండీ మినహాయిస్తున్నారు) వారికి రేషన్ కార్డు మంజూరు చేయడానికి ,ఇప్పటి వరకూ అమలైన మార్గదర్శకాలలో వెంటనే మార్పులు చేయాల్సి ఉంటుంది.

గ్రామీణ ప్రాంతంలో అయినా, పట్టణ ప్రాంతంలో అయినా ఒక పేద కుటుంబంలో భార్యా, భర్త ఇద్దరూ శ్రమ చేసుకుంటే, వారికి వచ్చే సగటు నెలసరి ఆదాయం, అలాగే సగటు సంవత్సర ఆదాయం ప్రస్తుతం రేషన్ కార్డు జారీకి పెట్టిన ఆదాయ పరిమితులను దాటిపోయే అవకాశం ఉంది. కానీ అలా స్పష్టమైన సమాచారంతో, లోతైన పరిశీలనతో రేషన్ కార్డులను తొలగించే ప్రక్రియ అమలయ్యే అవకాశం లేదు. కాబట్టి అధికారుల విచక్షణతో మాత్రమే రేషన్ కార్డుల తొలగింపు ప్రక్రియ ఇప్పటి వరకూ నడుస్తున్నది. దీనివల్ల, నిజమైన పేదలు కూడా నష్ట పోతున్నారు.

కాబట్టి గ్రామీణ ప్రాంతంలో రేషన్ కార్డు జారీకి ప్రస్తుతమున్న సంవత్సరానికి లక్షన్నర ఆదాయ పరిమితిని మూడు లక్షల రూపాయలకు, పట్టణ ప్రాంతాలలో సంవత్సరానికి ప్రస్తుతమున్న రెండు లక్షల ఆదాయ పరిమితిని మూడు లక్షల అరవై వేల రూపాయలకు పెంచాలి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఈ వేతనం లోపు ఉన్న వారికి రేషన్ కార్డు అందేలా చర్యలు చేపట్టాలి. 2025 జనవరి నుండీ నాణ్యమైన సన్న బియ్యం రేషన్ కార్డు పై ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినందున అందరూ రేషన్ కార్డును తప్పకుండా వినియోగించుకుంటారు. ఆ మేరకు ఆయా కుటుంబాలపై ఆహార ఖర్చు భారం కొంత తగ్గుతుంది.

గ్రామీణ ప్రాంతంలో భూముల విలువలు పెరిగిన మాట నిజమే కానీ, వ్యవసాయం పై ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. NSSO నివేదిక ప్రకారం 5 ఎకరాల లోపు రైతు కుటుంబ ఆదాయం నెలకు 9400 రూపాయలు మాత్రమే. పైగా చాలా కాలంగా తెలంగాణ రాష్ట్ర భూములలో మాగాణి, మెట్ట భూముల వర్గీకరణ చేయడం లేదు. కాబట్టి, రేషన్ కార్డు జారీకి ఇప్పటి వరకూ ఉన్న మాగాణి మూడు ఎకరాలు, మెట్ట ఏడున్నర ఎకరాలు అనే నిబంధన తొలగించి , 5 ఎకరాలలోపు సన్న, చిన్నకారు రైతులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలి.

ఇంట్లో ఉన్న గదుల సంఖ్యను బట్టి ఒక నిర్ధారణకు రావడం కూడా పారదర్శకంగా లేదు. ఇది కూడా అధికారుల విచక్షణపై మాత్రమే అమలయ్యే నిబంధన. సిబ్బంది అవినీతికి అవకాశం ఇచ్చే నిబంధన. కాబట్టి సిబ్బంది విచక్షణాధికారం నుండీ దీనిని తొలగించి, ఇంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధారంగా, 100 చదరపు మీటర్ల ఇళ్లను లేదా 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగం ఉండే ఇళ్లను ( రెండిటిలో ఏదైనా ) రేషన్ కార్డు పొందడానికి అర్హమైన ఇళ్లుగా పరిగణనలో పెట్టుకోవాలని వచ్చిన ఒక సూచనను చర్చకు స్వీకరించాలి.

నిజానికి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి చిన్న ఇల్లు ఉండడం ఒక హక్కుగా మారాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాపితంగా పేదల కోసం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేస్తామని అంటోంది. ఈ నేపధ్యంలో స్వంత ఇంటి విస్తీర్ణం పై రేషన్ కార్డు జారీకి నిబంధనలలో తగిన సవరణలు చేయాలి.

Read More
Next Story