కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కొడ్స్ ఏమి చెబుతున్నాయి?
x
Source: Prevention web

కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కొడ్స్ ఏమి చెబుతున్నాయి?

ఈ కోడ్స్.. దేశంలోని కార్మికవర్గాన్ని ఆధునిక బానిసలుగా తయారు చేసేందుకేనా.


కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం పెట్టుబడి దారుల, కాంట్రాక్టర్ల ప్రయోజనాలు, లాభాల కోసం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 2019-2020 సంవత్సరాలలో తీసుకోని వచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ ను నిశితంగా పరిశీలిస్తే దేశంలోని కార్మికవర్గాన్ని ఆధునిక బానిసలుగా తయారు చేసేందుకే అని స్పష్టంగా తెలుస్తుంది. ప్రజలంతా కరోనా కల్లోలంతో అల్లాడుతున్న సమయంలో కేంద్ర సర్కార్ ఈ చర్యకు పాల్పడ్డది.

కేంద్ర సర్కార్ నాలుగు లేబర్ కోడ్ లలో ఒకటైన వేతనాలకోడ్ ను 2019లోనే పార్లమెంట్ లో అమోదింపజేసుకున్నది. మిగతా మూడు కోడ్ లు అయినా పారిశ్రామిక సంబంధాల కోడ్,సామాజిక భద్రత కోడ్, విధి నిర్వహణలో భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ లను 2020లో పార్లమెంట్ లో ఎటువంటి చర్చకు అవకాశమివ్వకుండా, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు సభను బాయ్ కాట్ చేసిన సందర్భంలో ఏకపక్షంగా, నిరంకుశంగా అమోదింపజేసుకున్నది.

లేబర్ కోడ్ ల రూపంలో కార్మికవర్గం సాగుతున్నదాడిని అర్థం చేసుకునేందుకు ప్రతి ఒక్కరు కేంద్రం గుట్టుచప్పుడు కాకుండా తెచ్చిన ఈ లేబర్ కోడ్ ల గురించి పూర్తి స్థాయిలో అధ్యయనం చెయ్యాల్సిన అవసరం ఉంది.

1)పారిశ్రామిక సంబంధాల కోడ్

నాలుగు కోడ్ లలో పారిశ్రామిక సంబంధాల కోడ్ చాలా కీలకమైనది.ఈ కోడ్ "ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్"ను చట్టబద్దం చేసింది.దీనితో శాశ్వత ఉద్యోగాల వ్యవస్థ స్థానంలో తాత్కాలిక ఉద్యోగాల వ్యవస్థను నెలకొల్పటానికి బాటలు వేసింది.రెగ్యులర్ ఉద్యోగ భద్రతకు ముప్పు తెచ్చింది. ఈ విధానంలో యజమాని, కార్మికుడు కుదుర్చుకున్న రాత పూర్వకమైన ఒప్పందం ప్రకారం నిర్ణయించ బడిన కాలనికి పనిలో పెట్టుకుంటారు. ఒప్పంద కాలం ముగిసిన వెంటనే ఉద్యోగం నుండి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే తొలిగించవచ్చు. యాజమాన్యాలకు కార్మికులను ఆధునిక బానిసలుగా ఉంచేందుకు ఈ "ఫిక్సిడ్ టర్మ్ ఎంప్లాయిమెంట్" పద్ధతి దారి తీస్తుంది.

ఈ పారిశ్రామిక సంబంధాల కోడ్ ప్రకారం సూపర్ వైజర్ గా నియమించబడి నెలకు 18,000 రూపాయలు జీతం దాటిన వారు కార్మిక కేటగిరిలోకి రారు. అంటే వీరికి ఉన్న అనేక కార్మిక హక్కులు రద్దు చేసి యాజమాన్యలకు ప్రయోజనం చేకూర్చడమే అవుతుంది. ప్రభుత్వ రంగసంస్థలు మరియు అనేక ప్రైవేట్ కంపెనీలలో నెలకు 18వేల కంటే ఎక్కువ జీతం పొందుతున్న కార్మికులు చాల ఎక్కువ సంఖ్యలో ఉంటారు.వీరిని చట్ట పరిది నుండి మినహాయించడం వలన కార్మికులకు ఉన్న హక్కులను కోల్పోతారు. దీనితో వారి ఉద్యోగ భద్రత కూడ రద్దు అవుతుంది.

ఇంకా కోడ్ లో ఉన్న 10వ అధ్యయనం ప్రకారం 300గానీ, అంత కన్నా తక్కువ ఉన్న కార్మిక సంస్థలు ప్రభుత్వ అనుమతి లేకుండా కార్మికులను తొలిగించవచ్చు. ఇది కార్మికులకు తీవ్రమైన అభద్రతను కల్గిస్తుంది.పాత చట్టం ప్రకారం కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చిన 14రోజులలోగా సమ్మె చెయ్యకూడదు. కానీ ఈ కోడ్ ప్రకారం కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చిన 60రోజులలోగా సమ్మె చెయ్యకూడదు. ఇది కార్మికుల తమ డిమాండ్లను నెరవేర్చుకోవడానికి ఉన్న శక్తి వంతమైన సాధనాన్ని బలహీనపరుచడమే అవుతుంది.

ఈ కోడ్ కార్మిక యూనియన్ విషయంలో కూడ అనేక అంక్షలు విధించడం జరిగింది.ట్రేడ్ యూనియన్ 1926 ప్రకారం కార్మికయూనియన్ లో బయటి వ్యక్తులు 50శాతం మంది బయటి వ్యక్తులు ఉండవచ్చు. కానీ ఈ కోడ్ ప్రకారం ఆఫీస్ బేరర్ల లో మూడోవంతు లేదా ఐదుగురు మాత్రమే బయటి వ్యక్తులు ఉండాలానే పరిమితులు విధించడం జరిగింది.బయటి వ్యక్తులను అయితే యాజమాన్యం బెదిరించడం సాధ్యం కాదు.అందుకే పరిమితులను విధించడం జరిగింది.మొత్తంగా ఈ కోడ్ ను పరిశీలిస్తే కార్మికులకు ఉన్న కీలకమైన అన్ని హక్కులను కాలరాయడానికే తీసుకొచ్చారని అర్ధం అవుతుంది.

2)సామాజిక భద్రత కోడ్.

సామాజిక భద్రత కోడ్ వలన చాలమంది కార్మికులు పింఛన్, ఈఎస్ఐ,పీఎఫ్ వంటి ప్రయోజనాలు అందే అవకాశాలు తగ్గిపోతాయి.అసంఘటీత కార్మికుల సంక్షేమం గురించి నిర్థిష్టమైన పథకం కానీ, అందుకు తగిన నిధుల గురించి ఈ కోడ్ లో పేర్కొనకపోవడం చాలా అన్యాయం.

ఈ సామాజిక భద్రత కోడ్ ప్రకారం ప్రస్తుతం ఉన్న 10 మంది కార్మికులు ఉన్న సంస్థలను కూడ ఈపీఎఫ్ వర్తింప చెయ్యాలనే పద్దతిని పక్కకు పెట్టి 20 అంతకుమించి ఉన్న కార్మికులు ఉన్న సంస్థలకే ఈపీఎఫ్ వర్తింపజేయ్యాలని పేర్కొనడం వలన చాలా మంది కార్మికులు ఈపీఎఫ్ పరిధిలోకి రాకుండా పోయే ప్రమాదం ఉంది.

ఉద్యోగుల ప్రావీడెంట్ ఫండ్ (పీఎఫ్ ) యజమాని, ఉద్యోగి వాటాలను 10శాంతంకు తగ్గించడం వలన ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత తీసుకునే పీఎఫ్ డబ్బులు తగ్గుతాయి.ఈ సామాజిక భద్రత కోడ్ లో పేర్కొన్న అంశాలు యాజమాన్యంకు లబ్ది చేకూర్చి, కార్మికుడి సంక్షేమాన్ని అందని ద్రాక్షగా మార్చాబోతున్నాయి అని అర్ధం అవుతుంది.

3) వేతనాల కోడ్

వేతనాలకోడ్ ను 2019లో పార్లమెంట్ అమోదించింది కానీ కనీస వేతనం నిర్ణయించడానికి ఒక ప్రాతిపదిక కూడ లేదు.

1957 లో జరిగిన 15వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ కుటుంబ సభ్యుల సంఖ్య, కుటుంబ అవసరాల ప్రాతిపదికగా కనీస వేతనం నిర్ణయించే పార్ములాని సిపారసు చేసింది.

2016 నుండి అమలులోకి వచ్చిన 7వ పే కమిషన్ ప్రకారం కనీస వేతనం 18000 వేల రూపాయలు.దీనిపైన తేది 1-7-2024 నాటికీ 53 శాతం డీఏనీ కలిపితే కనీస వేతనం 27,540 రూపాయలు అవుతుంది.

కానీ కనీస వేతనం ఎంత ఉండాలో చెప్పేందుకు కేంద్ర సర్కార్ ఒక నిపుణల కమిటీనీ నియమించిడం జరిగింది.జులై 2019 లో ఈ కమిటీ సీఫారసు ఆధారంగా కార్మికుడికి కనీస వేతనం రోజుకు 178 రూపాయలు, నెలకు 4,628 రూపాయలు మాత్రమే. ఈ మాత్రం వేతనంతో జీవించడం ఎలా సాధ్యమో పాలకవర్గాలకే తెలియాలి. పాత చట్టం ప్రకారం కార్మికుడు రోజుకు 8గంటలు పని చెయ్యాలి.ఈ కోడ్ ప్రకారం 9గంటలు పని చెయ్యాలి. ఇది అంతర్జాతీయ కార్మిక సంస్థ కన్వెన్షన్ లో పేర్కొన్న వారానికి 48 గంటల పని దినాలకు విరుద్ధం. ఈ లేబర్ కోడ్ లో ఉన్న అంశాలు పూర్తిగా కార్మికులను శ్రమదోపిడీకి గురించేయ్యడానికే అని అర్ధం అవుతుంది.

4) వృత్తి పరమైన భద్రత, ఆరోగ్యం, వర్కింగ్ కండిషన్స్ కోడ్

ఎక్కువ మంది కార్మికులను వృత్తి పరమైన, భద్రత ఆరోగ్యం మరియు పని పరిస్థితులకు సంబందించిన రక్షణల నుండి యాజమాన్యాలు తప్పుకోవడానికి ఈ కోడ్ అవకాశం కల్పిస్తున్నది.

ఇప్పుడున్న కాంట్రాక్టు లేబర్ చట్టం ప్రకారం 20లోపు కార్మికులు ఉన్న కాంట్రాక్టర్ లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ కోడ్ ప్రకారం 50 మంది లోపు ఉన్న కార్మికులు ఉన్న కాంట్రాక్టర్ లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు.లైసెన్స్ లేని కాంట్రాక్టర్ ను చట్టం ప్రకారం కార్మికులకు లభించే హక్కులను అమలు చెయ్యాలని డిమాండ్ చేయలేము. కాబ్బటి ఎక్కువ మంది కాంట్రాక్టు కార్మికులకి హక్కులు, ప్రయోజనాలు లభించవు.

ఇప్పుడు ఉన్న కాంట్రాక్టు లేబర్ చట్టం ప్రకారం రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా కాంట్రాక్టు కార్మికులకు సమాన వేతనం ఇవ్వాలి. కానీ ఈ కోడ్ లో దీని ప్రస్తావనే లేదు.మహిళా కార్మికుల సంక్షేమం, రక్షణ గురించి సరైన విధానం రూపొందించలేదు.కావున ఈ కోడ్ లో పేర్కొన్న అంశాలు కార్మికులకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించలేవు.

పెట్టుబడి దారులు, కాంట్రాక్టర్ల ప్రయోజనాలు, లాభాల కోసం కార్మికవర్గాన్ని ఆధునిక బానిసలుగా తయారు చేసేందుకు తీసుకోని వచ్చిన నాలుగు లేబర్ కోడ్ లరద్దు చెయ్యాలని, దేశంలోని కార్మికులు, కార్మికుల సంఘాలు చేస్తున్న ప్రతి పోరాట కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది.

Read More
Next Story