
ఇంతకూ ఈ నదీజలాల వివాదం ఎవరికోసం?
ఈ చలికాలంలో తెలంగాణ శాసనసభలో, బయటా మంటలు.. సమావేశాలు ముగిసినా పరస్పర ఆరోపణలతో నదీజలాలు ఇంకా మరిగిపోతున్నాయి!
-యం. ఉదయభాను
మౌలికసమస్యలనుంచి పక్కదారి పట్టించటానికీ, ఎన్నికల ప్రయోజనాల కోసమూ మళ్ళీమళ్ళీ ప్రాంతీయతత్వాన్ని పాలకులు రెచ్చగొడుతున్నారు. ప్రజలు దీన్నిఅర్థంచేసుకోవాలి.
ఈ చలికాలంలో తెలంగాణ శాసనసభలో, బయటా మంటలు.. సమావేశాలు ముగిసినా పరస్పర ఆరోపణలతో నదీజలాలు ఇంకా మరిగిపోతున్నాయి! ఆయా పార్టీల నేతలు మీరు ద్రోహులంటే మీరే ద్రోహులని నిందించుకొంటున్నారు. ఆ వేడి ఆంధ్రప్రదేశ్ కీ పాకింది. విడిపోయి, అన్నదమ్ముల్లా కలిసిఉందాం అని చెప్పిన నేతలు ఇరు తెలుగురాష్ట్రాల్లో – విడిపోయి పుష్కరం దాటిపోయినా - ప్రాంతీయ విద్వేషాల్ని రగిలిస్తేనే తమకు రాజకీయంగా, ఓట్లపరంగా లాభం అని ఇంకా భావిస్తున్నారు. మనకి దాయాది తగవే ‘మహా’ భారతం కదా! శాసనసభలపై ‘కౌరవసభ’ అన్న ఆరోపణలూ చేస్తున్నారు. ప్రతిజ్ఞలతో సవాళ్ళతో నిత్యం మీడియాలో ఈ రాజకీయ ‘మహాభారత్’ ధారావాహికగా సాగుతున్నది. ఈ తగవు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. హేమాహేమీలైనవారు వాదిస్తుంటే, ‘న్యాయం’ చెప్పలేక, మీరూ మీరూ మాట్లాడుకొని పరిష్కరించుకొంటే బాగుంటుందికదా అని న్యాయమూర్తులు విదురనీతి సలహాలిస్తున్నారు. పరిష్కరించేసుకొంటే ఎన్నికల కురుక్షేత్రంలో రెచ్చగొట్టటానికి ఒక అంశంతగ్గిపోతుందికదా అని ఆయా పార్టీలనేతలు భావిస్తున్నారు.
ఇంతకూ ఈ జలవివాదాల్లో కొట్టుకుపోకుండా ఇందులో రాష్ట్ర ప్రయోజనాలూ, ప్రజల శ్రేయస్సూ ఉన్నాయా, ఏ మేరకు? అని జనం పరిశీలించుకోవాలి. దానికే ఈ ప్రయత్నం. ఈవ్యాసకర్త తరతరాలుగా తెలంగాణలో పుట్టిపెరిగిన కుటుంబానికి చెందిన వాడు; తెలుగు ప్రజల సమైక్యతనూ, సర్వతోముఖ ప్రగతినీ కోరుకొనే రచయిత అని గమనించప్రార్థన.
‘దేశమంతా ఒకేజాతి, ఒకేప్రజ’ అంటూనే ప్రాంతీయవాదం...
‘ప్రాంతం కాదు, మాకు దేశమంతా ఒక్కటే, వికసిత భారత్ మన లక్ష్యం’ అని చెప్పే బీజేపీకూడా ఇందులో తక్కువ తినలేదు. కృష్ణాజలాల పంపిణీలో ‘తెలంగాణకు తీరని అన్యాయం’ చేసిన కాంగ్రెసు, బీఆరెస్ పార్టీలు అసెంబ్లీలో ‘దొంగనాటకాలు’ ఆడుతున్నాయనీ, ఆంధ్రప్రదేశ్ అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్నదనీ తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి బండిసంజయ్ జనవరి2నాడు ఒక ప్రకటన విడుదలచేసారు. ఆయన ప్రాంతీయతత్వం రెచ్చగొట్టటానికి అన్న పై మాటల్నికేంద్రంలో కీలక మద్దతిచ్చి, తమప్రభుత్వాన్ని కాపాడుతున్న ‘వంశపారంపర్య’ పాలకులైన మిత్రులు చంద్రబాబుకానీ, పవన్ కళ్యాణ్ కానీ అంగీకరించరు. ఆంధ్ర ‘ప్ర్రాంతీయ’ బీజేపీ నేతలూ, ముఖ్యంగా రాయలసీమనుంచి ఎన్నికై, తొలిసారిగా మంత్రికూడా అయిన సత్యకుమార్ సైతం ఆయనతో అంగీకరించరు. తెలంగాణ కాంగ్రెసు వాదనలతో ఆంధ్ర కాంగ్రెసువారు -ప్రత్యేకించి ‘రాయలసీమ వాదులు’- ససేమిరా అంగీకరించరు. ఎవరి నాటకాలు వారివి! జలవివాదాలు వస్తే (ఉదా. తమిళనాడు-కర్ణాటక కావేరి వివాదంపైనా) మన ‘జాతీయవాద’ బీజేపీతో పాటు అఖిలభారత పార్టీలన్నీ ప్రాంతీయపార్టీలైపోయి, జుట్లుపట్టుకొని కొట్లాడుతాయి! కనీసం అలా నటిస్తాయి. మనకి నిత్యం ఏదోఒకఎన్నికలు వస్తాయి కాబట్టి, వారికి అదేపని!
ఆయా వాదనల్లోకి పోకుండా ఇరుప్రాంతాల సామాన్య ప్రజలూ, తమ ప్రయోజనాలకోసం ఐక్యంగా, కాస్తలోతుగా ఆలోచించవలసిన కొన్ని విషయాలని చూద్దాం.
బియ్యం ఉత్పత్తిలో దేశంమొత్తంలో - విభజనతర్వాత కూడా - రెండు తెలుగురాష్ట్రాలూ మిగులురాష్ట్రాలుగా ముందంజలోనే ఉన్నాయి. ‘తెలంగాణకు’ తీరని అన్యాయం అని బండిసంజయ్ అన్నారుకానీ, 2014 రాష్ట్ర విభజనతర్వాత తెలంగాణలో నీటిపారుదలగల భూమి (మాగాణి, gross) బాగా పెరిగి, 62 లక్షల నుంచి 2021-22 నాటికే 135 లక్షల ఎకరాలకు రెట్టింపైంది. అందులో మోదీగారి పాత్రఏమీ లేదు, కేంద్రనిధులూ లేవు. ధాన్యం ఉత్పత్తి కూడా అదేకాలంలో సుమారు 46 నుంచి 202 లక్షల టన్నులకు పెరిగింది; వరిపంట వెయ్యద్దుబాబూ అని రెండురాష్ట్రాల ప్రభుత్వాలే సూచించటమూ లోగడ చూసాం. అలాటప్పుడు ఇంకాఇంకా ప్రాజెక్టులు కడతాం అంటూ జలవివాదాలు సృష్టించటం ఎందుకు, కంట్రాక్టర్లనూ, వారిపోషణలో ఉండే నేతలనూ మేపటానికితప్ప?
దేశంలో- తెలుగురాష్ట్రాల్లోనూ - వ్యవసాయం ఇప్పటికీ ప్రధానవృత్తిగా ఉంది, కానీ రైతుల బాధలు తీరటంలేదు. ‘కొనబోతే కొరివి, అమ్మబోతేఅడివి’. ముఖ్యంగా పేదరైతులూ కౌలుదారులూ ఆత్మహత్యలతో, రుణభారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బొత్తిగాభూమిలేని రైతుకూలీలు సరేసరి! పై కారణాలవల్ల ప్రజలు -ముఖ్యంగా యువతరం- వ్యవసాయం నుండి దూరమవుతున్నారని కన్పడుతూనే ఉన్నది. ఈ ప్రధాన సమస్యగూర్చి ఏ పార్టీలోనూ సరైన ఆలోచనా, ఆచరణా లేవు. ఏ ప్రభుత్వమూ ఖచ్చితమైన చర్యలు తీసుకోటం లేదు.
ఈక్రమంలో పట్టణాలకు వలసలు పెరిగి, అక్కడా చాలినంత ఉపాధి, ఆదాయాలూలేక పట్టణపేదరికమూ, సరైన ఏర్పాట్లులేక కాలుష్యమూ, ఫలితంగా అనారోగ్యమూ, వైద్యఖర్చులూ పెరుగుతున్నాయి. వీటికి నీటిపారుదలకొరత కారణంకాదని (వరిపంట ఎకరాలూ, ఉత్పత్తి పెరిగిన) లెక్కలు పైన చూసాం. పెరుగుతున్న జనం-ముఖ్యంగా చదువు’కొన్న’ లక్షలాది యువతరం- అవసరాలకు తగినట్టుగా ఉపాధిని పెంచే పరిశ్రమలు పెరగటంలేదు. అసమతుల, అస్తవ్యస్త, అనారోగ్యకర నగరీకరణలో భాగంగా ఓలా ఊబర్ ఆటో డ్రైవర్లుగా, స్విగ్గీ, జోమాటో, అమెజాన్ తదితర డెలివరీ బాయిస్ గా, మాల్స్ లో సిబ్బందిగా డిగ్రీలూ బీటెక్కులూ ఎంబీఎలూ చేసిన యువతసైతం లక్షలాదిగా పనిచేస్తున్నారు. దుమ్ములో ధూళిలో అనారోగ్యకర పరిస్థితుల్లో, స్పీడ్ డెలివరీకోసం భద్రతను బలిపెట్టి, ఒళ్ళు హూనం చేసుకొని ‘గిగ్ వర్కర్స్’ గా అర్ధరాత్రివరకూ పనిచేస్తున్నారు. అయినా వారికి హైదరాబాదులో (ఉదా. నిర్మాణరంగ) కూలీలకు లభించే కనీస ఆదాయం కూడా గ్యారంటీ లేదు. తమసమస్యలపై కొత్త సంవత్సరం ముందు తొలిసారిగా (?) అసంఘటితంగానే అయినా వారు సమ్మె కూడా చేసారు. 8 గంటల పనిదినం అన్ననియమాన్ని తుంగలో తొక్కి, ఇప్పుడు ఆ దోపిడీనే రెండు రాష్ట్రప్రభుత్వాలూ చట్టబద్ధం చేసాయి. మన యువజనం సంపద అంటూ చాలా కాలంగా ఊదరగొట్టిన ‘డీమోగ్రాఫిక్ డివిడెండ్’ ఏమోకానీ, చదువు’కొన్న’ నిరుద్యోగ-చిరుద్యోగ యువత తల్లిదండ్రులకూ, సమాజానికీ భారంగా మిగిలిపోతున్నారు.
పైన పేర్కొన్నవేవీ నీటి పారుదల పెంపుతో పరిష్కారమయ్యేవి కాదన్నది స్పష్టమే. అయినా అదే కీలకసమస్య అన్నట్టుగా ఈ ప్రచారం ఎందుకు, ఎవరికోసం అని ఆలోచించాలి.
వ్యవసాయప్రధాన దేశానికి సిగ్గుచేటు!
వ్యవసాయమూ, రైతాంగ జనాభాయే మన ప్రధాన సంపద. అయినా - పెట్రోలియం అంటే వేరు కానీ- వంటనూనెల దిగుమతులూ పెరిగిపోతున్నాయి: 2021-22 నుంచి నేటివరకూ ఏటా 140 నుంచి 160 లక్షల టన్నుల వరకూ నూనెలను మనదేశం దిగుమతి చేసుకొంటున్నది. వాటి విలువ 1. 71 లక్షల కోట్ల నుంచి 2 లక్షల కోట్ల రూ.ల దాకా ఉన్నది. పప్పుధాన్యాల దిగుమతులూ 2021-22 లో 27 లక్షల నుంచి 2023-24లో 47 లక్షల టన్నులకు పెరిగిపోయాయి. వాటి విలువ 3,750 కోట్ల రూ. లకు పెరిగింది. ముఖ్యపోషకపదార్థాలైన నూనెగింజలూ, పప్పుధాన్యాలూ ప్రధానంగా మెట్టపంటలు; వాటికి పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులూ, వేలకోట్ల పెట్టుబడులూ అవసరంలేదు. యుద్ధసామగ్రిని కూడా ఎగుమతి చేస్తున్నాం అని అట్టహాసంచేసే మోదీగారి కేంద్రప్రభుత్వం వీటి గురించి మౌనం వహిస్తున్నదేమీ? ఇది సిగ్గుచేటు. ఈ విషయాన్ని ‘బడామీడియా’ కూడా ఎందుకు గట్టిగా ప్రశ్నించటం లేదు? ‘నమో నమో’ అంటూ భజనచేస్తే ఈ సమస్యలు తీరవుకదా!
మనదేశంలో హరితవిప్లవం పంజాబ్ హర్యానాలకూ, తెలుగురాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోని వివిధప్రాంతాలకూ పరిమితమైంది. దానివలన ఆహారధాన్యాల దిగుమతులు తగ్గినాయి, మంచిదే. హరితవిప్లవం ప్రధానంగా గోధుమలకూ, వరికీ పరిమితమైంది. ఈ ప్రయోజనాలూ, పరిణామాలూ, అనర్థాలూ కూడా (వంశ పారంపర్య) కాంగ్రెసు హయాంలోనే జరిగాయి, నిజమే. వారిని నిందిస్తూ, ఇంకా ప్రధానంగా ఆ దారిలోనే గత 12 ఏళ్లుగా మోదీపాలన సాగటం వల్ల ఎరువుల, పురుగుమందుల దిగుమతులూ విపరీతంగా పెరిగి, గ్రామాల్లో సైతం భూమి, నీటి కాలుష్యం తదితర- అనేక సమస్యలూ, వ్యాధులూ పెచ్చరిల్లుతున్నాయి. వాటిని మితిమీరి వాడినంత మాత్రాన (Law of diminishing returns) పంటలూ, ఆదాయాలూ పెరగవు. కాగా ఖర్చులూ అప్పులూ పెరిగి, వ్యవసాయం నష్టదాయకంగా మారింది; ఈ సమస్యను విస్మరించి గిట్టుబాటుధరల గూర్చి మాట్లాడటం అనర్థదాయకం. ముఖ్యంగా హరితవిప్లవ, వాణిజ్యపంటల ప్రాంతాల్లో- అందులోనూ తెలుగురాష్ట్రాల్లో- సమస్యలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. కొన్నివివరాలు చూడండి:
ఆయుధాల ఎగుమతి-ఎరువుల దిగుమతి!
మనదేశం ఆయుధాల ఎగుమతిలో ఎలా ముందంజవేస్తున్నదో ఈమధ్య చాలా ప్రచారం సాగుతున్నది. కానీ నొక్కిచెప్పాల్సినది ఇదీ: ఎక్కువ మొత్తంలో, ఎప్పుడూ లేనంతగా, ఎలాంటి నియంత్రణ లేకుండా, రసాయనిక ఎరువుల్నీ పురుగుమందుల్నీ దేశం దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల విదేశీమారక ద్రవ్యం ఎక్కువగా ఖర్చవుతోంది. గత ఏడాది ఎరువులకై సుమారు 1.75 లక్షలకోట్ల రూ, పురుగు మందులకై 55వేల కోట్లరూ. ఖర్చయింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పతనంవల్ల ఈ భారం ఇంకా పెరగనున్నది. మనదేశంలో ముడిసరకులేని ఫాస్ఫేట్ ఎరువుల దిగుమతి అనివార్యం అనుకొన్నా, మనదేశంలోనే ఉత్పత్తిచేసుకోగల యూరియా దిగుమతులూ కొనసాగటమే కాదు, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి: గతంతోపోలిస్తే 32 లక్షల నుంచి 2024-25 ఏప్రిల్-నవంబర్ సమయంలో 71 లక్షల టన్నులకు పెరిగాయి. ‘మేకిన్ ఇండియా’ అన్న మోదీపాలన అట్టహాస ప్రచారం మధ్యనే దేశీ యూరియా ఉత్పత్తి తగ్గింది. ఈ తగ్గుతున్న ఉత్పత్తి, పెరుగుతున్న దిగుమతులను మరుగుపరిచి, యూరియా సరఫరాపై పరస్పరం రాజకీయ ఆరోపణలు చేసుకొంటున్నారు. వ్యవసాయకూలీల, కౌలురైతుల సంఖ్య పెరిగిపోయింది
పై కీలక సమస్యల్ని విస్మరించి, శాసనసభలూ, మీడియా, మేధావులూ ఇరిగేషనుపై ఆరోపణలూ సవాళ్ళతో చర్చలు జరపటం ఎవరికోసం అని లోతుగా ఆలోచించాలి. రెండుతెలుగు రాష్ట్రాల్లోనూ స్వంతభూమిలేని వ్యవసాయకూలీల, కౌలురైతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నది. గ్రామీణజనాభాలో సగానికిపైగా ఇలాటి గ్రామీణపేదలేనని లెక్కలు చూపెడుతున్నాయి. తెలంగాణ సాయుధపోరాట ప్రభావంతో పోరాట విరమణ తర్వాత కౌలుదార్ల రక్షణకై చేసిన చట్టాలు ఉమ్మడిరాష్ట్రంలోనూ, ఆతర్వాతా కూడా కాగితాలపైనే మిగిలిపోయాయి. అంతేకాక, ఎక్కడా రికార్డులకు ఎక్కకుండా నోటిమాట కౌలే చెలామణీలోకి వచ్చింది. తెలంగాణలో 22లక్షలమంది కౌలుదారులున్నారని ఒక అంచనా. అయితే అంతకన్నా పెద్దమొత్తంలోనే ఉంటారని క్షేత్ర పరిస్థితులు చూపెడుతున్నాయి. ‘రైతుబంధు’ పేరిట కేసీఆర్ ప్రభుత్వం భూస్వాములకూ, ధనిక రైతులకూ, వ్యవసాయంతో సంబంధమేలేని భూయజమానులకూ, బేనామీలకు వందలకోట్ల రూ. దోచిపెట్టిన వైనం బైటపడింది. ప్రతిఎకరానికీ పదివేలు అన్నలెక్కన ఇవ్వటం రూపంలో అదిసాగింది. ఏ గ్రామంలో చూసినా, దాదాపు సగం జనం భూమిలేనిపేదలే; సగం సాగు కౌలుదార్ల ద్వారానే సాగుతున్నది. అయినా వారికి రైతుబంధు ఇచ్చేప్రసక్తేలేదనీ, కౌలుదార్లు రైతులు కాదంటూ తెగేసి చెప్పి, వారికి సాయం చేయ నిరాకరించారు కేసీఆర్. అలాటి పేదవర్గాలకూ రైతుబంధు ఇస్తాం అన్నరేవంత్ రెడ్డి వాగ్దానం అమలుకాలేదు. ఆంధ్రలో రాజశేఖరరెడ్డి హయాంలో కౌలుదార్లకు కార్డులిచ్చి, రుణాలూ సబ్సిడీలూ కొంత ఇస్తామన్నారు కానీ, అదంతా కాగితాలపైనే మిగిలిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో 32 లక్షల మంది కౌలుదార్లున్నారనీ, వీరిలో 70-80% మంది భూమిలేని పేదరైతులనీ అంచనా. కానీ 2020లో కేవలం 2.72 లక్షలమంది కౌలుదార్లకు మాత్రమే ‘క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డులు’ (CCRC) జారీ చేయబడ్డాయి. చట్టంచేసి ఏళ్ళుదొర్లిపోయినా భూయజమానులు రాతపూర్వక ఒప్పందం ఇవ్వడం లేదు; జగన్ కాలంలో ఆ సమస్యకు పరిష్కారంగా కొన్ని సవరణలూ, చర్యలూ ప్రతిపాదించినా, అవీ అమలుకాలేదు. ఈ విషయంపట్ల నేటి ప్రభుత్వమూ, నేతలూ తమ మౌనం, నిష్క్రియల ద్వారా యజమానుల కొమ్ముకాస్తున్నారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీల్లో ఈ గ్రామీణపేదలగురించి చర్చించేవారేలేరు; ఇందులో ఆయాపార్టీలమధ్య తేడాలేమీ లేవు.
‘రైతాంగంకోసం ఇరిగేషను’ అంటారుకానీ, నిజానికి దానివల్ల భూమిలేని గ్రామీణపేదలకు (ఏ గ్రామంలోనైనా దాదాపుగా సగం జనాభా వారిదే) ఒరిగేదేమీ లేదు. పంటలూ ఆదాయాలూ పెరిగితే, వారికీ కూలి రేట్లు పెరుగుతాయికదా అంటారు. కానీ ముఖ్యంగా అలాటిచోట్ల ట్రాక్టర్లూ, కోతయంత్రాలూ వగైరా బాగా పెరుగుతున్నాయి; మంచి పనిసీజన్లో ఇతరరాష్ట్రాలనుంచి కూలీలు వలసవస్తున్నారు. నిజానికి ప్రాజెక్టులు వస్తున్నాయని వార్తవస్తే చాలు, ఇలాటిపేదరైతుల నుంచి ధనికరైతులూ, రియల్ ఎస్టేటు వ్యాపారులూ ముందే భూములు కొనెయ్యటం మామూలే. లోగడ తెలంగాణాలో, ఈమధ్య అమరావతిలో జరిగింది అదే. మాగాణిభూముల్లో అధికభాగం భూస్వాములదీ, ధనికరైతులదేనని ఏకాస్త పరిశీలించినా స్పష్టమవుతుంది. కాల్వలద్వారా పారే నీటిపారుదల గల సాగుదార్లలో, భూముల్లో గ్రామీణపేదరైతుల వాటాతక్కువే; గ్రామీణసంపన్నులదే పైచేయి. ఈవర్గాల్లోంచే కంట్రాక్టర్లు, వ్యవసాయరంగ వ్యాపారులూ, మధ్యదళారులూ ఎక్కువమంది వస్తుంటారు. ఎరువుల, పురుగుమందుల వాణిజ్యమూ పెరిగేదీ అక్కడే. వాటికోసమూ, మొత్తంగా వ్యవసాయంకోసమూ, అప్పులుచేసేవారు పేదరైతులైతే, అప్పులిచ్చేవారు భూస్వాములూ, సంపన్నవర్గాలూ, వారునడిపే ఫైనాన్సు కంపెనీలే. సంస్థాగత రుణాల్లో పేదరైతులకు దక్కేది కొద్దిమాత్రమే. ధాన్యంవ్యాపారాన్ని, వ్యవసాయమార్కెట్లను కంట్రోలుచేసేది సంపన్నవర్గాలే.
ఫుడ్ కార్పొరేషన్ ఉన్నా, అది ఏటా ఆలస్యంగానే రంగ ప్రవేశం చేస్తుంది; ఈలోగా డబ్బుఅత్యవసరమై, అప్పులు తీర్చటానికి అనివార్యంగా పేదరైతులు తమపంటను ప్రైవేటు ధాన్యం వ్యాపారులకూ, రైసుమిల్లర్లకూ అమ్ముకొంటారు. FCI పేదల నుంచి మద్దతుధరతో నేరుగా కొనేది తక్కువే. మధ్యదళారీలూ, మిల్లర్లూ పేదలనుంచి కొన్న ధాన్యాన్ని FCI ఆ తర్వాత కనీస మద్దతుధరతో (MSPతో) కొంటున్నది. వ్యవసాయ వాణిజ్యంలో, రైసుమిల్లుల్లో, వాటిల్లోజరిగే అక్రమవ్యవహారాల్లోనూ పైచేయి సంపన్నవర్గాలదే; సబ్సిడీ బియ్యాన్ని ‘సన్నబియ్యం’గా మిల్లుల్లో మార్చి, అక్రమవ్యాపారంలోకి మళ్ళించి, రైసుమిల్లు యజమానులు కొందరు ఎలా వందల కోట్లు కాజేసారో తెలంగాణలో కొద్దిమేరకు బైటపడింది. ఆంధ్రలోనూ అది జరిగినా, గుట్టుచప్పుడు కాకుండా ‘సర్దుకొన్నట్టుంది. FCI పాత్ర గురించి పైన చూసాం.
ఈ వ్యవహారాల్లో ప్రభుత్వరంగపాత్ర ‘నామ’మాత్రమే, పరిమితమే: పేరుకి ప్రభుత్వరంగపాత్ర ఏమేరకున్నా లోలోపల గ్రామీణ బ్యాంకులనూ, సహకార, వ్యవసాయ మార్కెటు, వివిధ (సీడ్, పొగాకు, కాటన్ వగైరా) కార్పోరేషన్లనూ, తదితర సంస్థలనూ అసలు కంట్రోలుచేసేది, వాటిప్రయోజనం అత్యధికంగా పొందేదీ గ్రామీణ సంపన్నవర్గాల వారే. వారికి అందులో ప్రభుత్వాధికారులు సహకరిస్తుంటారు. గ్రామీణప్రాంతాల్లో వార్డు సభ్యులూ, సర్పంచులనుంచి ఎమ్మెల్యేల వరకూ ఈ రంగాలపై వివిధరూపాల్లో పట్టుకలిగి ఉంటారు. వారి అక్రమాస్తులకు ఇవన్నీ మంచివనరులే.
పై పరిస్థితి అంతా ముఖ్యంగా భారీ ఇరిగేషను వ్యవస్థచుట్టూ అల్లుకొన్నదే. ప్రభుత్వ సహకారంతో, రుణాలూ సబ్సిడీలతో, వ్యవసాయంలో పెట్టుబడిదారీ ప్రవేశంలోఇదొక ముఖ్యభాగం. దానివల్ల గ్రామీణసంపన్నుల బలంపెరిగింది. వారికీ గ్రామీణపేదలకూ అంతరం పెరిగింది. ఇలాటి పెట్టుబడిదారీ వ్యవస్థలో ఈ గ్రామీణ శ్రామికులకు (రూరల్ ప్రోలేటేరియట్) ఉపాధి పెరగలేదు సరికదా తగ్గింది. వారికి సంఘాలూ లేవు: ‘దున్నేవారికి భూమి’ దక్కక , ఉపాధిలేమితో ‘వలసపోయే’ బతుకులూ, అర్ధవలస అనిశ్చితీ తప్పటంలేదు. రైతులకు గిట్టుబాటు ధరల గూర్చి నిత్యం చర్చ, అడపాదడపా ఆందోళనలూ సాగుతుంటాయి. గ్రామీణజనాభాలో సగమూ, కొన్నిప్రాంతాల్లో అంతకన్నా ఎక్కువగానూ ఉన్న పేదరైతు-కూలీలకూ, కౌలుదార్లకూ గిట్టుబాటు అవుతున్నదా అని శాసనసభల్లో, వెలుపలా చర్చించటం ఎప్పుడయినా చూసామా? నిజానికి ఓట్లువేసే వారిలో అత్యధికులు వారే. వామపక్షపార్టీల వారుకూడా (ఏవో కొన్నిప్రకటనలుతప్ప) వారిని ఆచరణలో విస్మరించారంటే అతిశయోక్తి కాదు!
ఒక్కో ప్రాజెక్టులోనూ పదుల వేల కోట్ల అవినీతికి పాల్పడినారని రెండు రాష్ట్రాల్లోనూ చెప్తున్న వాస్తవాలూ, ఆరోపణలూ చర్చించాల్సిందే; ఎన్నికలకై వందలకోట్లు పెట్టుబడిగా భావించి, సీట్లనూ ఓట్లనూకొనే పాలకవర్గ ముఠాలకు వాటిలో ఎక్కువ ఆసక్తి ఉండటం సహజమే. మీడియా నిండా, చర్చలపేరిట స్టూడియోల్లోనూ వారితగవులే. స్వతంత్ర క్షేత్రస్థాయి పరిశీలనలు, కనీసం గ్రామీణ పేదలతో ఇంటర్వ్యూలూ లేవు.
రైతుల ఆత్మహత్యలు బీఆరెస్ పాలనలో 6121 అని కాంగ్రెసు ఆరోపిస్తే, కాంగ్రెసు పాలనలో ఇప్పటికే 700 అని బీఆరెస్ అంటున్నది. ఒకప్పటి ‘ఎండ్రిన్’ స్థానంలో ‘గడ్డిమందు’గా పేరొందిన పురుగుమందు (మోనోక్రోటోఫాస్) ఈ మధ్య ఆత్మహత్యల సాధనంగా ప్రచారంలోకి రావటం విశేషం. విషం మారినా ఆత్మహత్యల్లో తేడాలేదు. ప్రతి ఆత్మహత్య వెనుకా ఎన్నో ప్రయత్నాలూ ఉంటాయని గమనించాలి. ఆత్మహత్యలుకాదు , పోరాటమే మార్గంఅని రైతాంగం చైతన్యవంతం కావాలి. తమరాజకీయప్రయోజనాల కోసం పాలకులు రెచ్చగొడుతున్న ప్రాంతీయ ఉన్మాదం వల్ల రెండురాష్ట్రాల ప్రజలకూ -ముఖ్యంగా ‘పట్టణంలో బడుకుదామని కూలికోసం కూటికోసం’ వలసలు పోయే పేదలకు- ఒరిగేదేమీ లేదు.
(యం.ఉదయభాను. ప్రముఖ రాజకీయ సామాజిక ఆర్థికాంశాల విశ్లేషకుడు)

