
Image source: La Transformacion de La Intimidad : Giddens, Anthony. Amazon
ఎందుకలా చంపుకుంటున్నారు?
భార్యని భర్త, భర్తని భార్య, తల్లిని కొడుకు...కుటుంబ సంబంధాలని విచ్ఛిన్నం చేస్తున్నదెవరు?
ఇటీవలి కాలంలో మనం నిత్యం ఎక్కడో ఒకచోట హత్యలు, మానభంగాలు, దోపిడీలు వింటూనే ఉంటాము. మరీ ముఖ్యంగా ఇంకొంత పాపులర్ గా గమనిస్తే ఈ మధ్య కాలంలో ఎక్కువగా భార్యలు భర్తలను, భర్తలు భార్యలను, పిల్లలను హత్య చేసిన సంఘటనలు వరుసగా చూస్తున్నాము. ఇవి కేవలం మన మీడియా చూపిస్తున్నట్లుగా క్రైమ్ రిపోర్టులుగా మాత్రమే కాకుండా, సమాజంలో చోటుచేసుకుంటున్న ప్రధానమైన మార్పులకు సంకేతంగా చూడవలసిన అవసరం ఉంది. చాలా వరకు ఇలాంటి సంఘటనలను మనం వ్యక్తిగత తప్పిదాలుగా మాత్రమే చూస్తాం. కాని ఈ సంఘటనలను ఒక వ్యక్తి తప్పిదాలుగా చూడటం మాత్రమే కాకుండా, సమాజ నిర్మాణాల ప్రతిబింబాలుగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నిజానికి నేరం అనేది ఒక సామాజిక వాస్తవం. ఫ్రెంచ్ సామాజిక శాస్త్రవేత్త దుర్కై మ్ (Emile Durkheim) ఈ సోషల్ ఫ్యాక్ట్(Social fact) అనే భావన గురించి చక్కగా చెప్పారు. దీని ప్రకారం నేరం చేయడం లేదా నేర ప్రవృత్తి అనేది వ్యక్తుల మానసిక వై ఫల్యం కాదు, అది ఆధిపత్యపు సమాజ విలువలు, నిబంధనలు, సామాజిక కట్టుబాట్లు లాంటి సంప్రదాయపు నిర్మాణాల వల్ల ఉద్భవిస్తుంది.
ఈ మధ్య కాలంలో కుటుంబ వ్యవస్థలోని భార్యలు భర్తల మధ్య జరిగే వివాదాలు, హత్యలు లాంటి సంఘటనలు కూడా ఈ కోణంలో జరుగుతున్నవే. కుటుంబ వ్యవస్థలోని వైరుధ్యాలు, లైంగిక సంబంధాలలోని అసమానతలు, ఆధునిక సమాజంలో పెరుగుతున్న ఒత్తిళ్లు కుటుంబ వ్యవస్థలో జరుగుతున్న వివాదాలకు ప్రతిబింబాలు. వివాహం ఒక స్థిరమైన, పవిత్రమైన బంధం అని భారతీయ సమాజం భావిస్తుంది. ఇలాంటి వ్యవస్థ మీద వీటి ప్రభావం పడుతూ ఉంది. ఫలితంగా వివాహ వ్యవస్థ హింసాత్మక పరిణామాలకు వేదిక అవుతోంది.
వాస్తవానికి వైవాహిక సంబంధాలు అనేవి స్థిరమైన, పవిత్రమైన లేదా దైవ సంబంధాలు (పెద్దలు నిర్ణయించే సంప్రదాయమైనది కూడా కాదు) కావు. ప్రస్తుత సమాజంలో ఇద్దరు వ్యక్తుల మధ్య సంబధాలు 'ప్యూర్ రిలేషన్‌షిప్స్'. పవిత్రమయినవిగా భావించే ఈ వైవాహిక సంబంధాలు ప్యూర్ రిలేషన్స్ గా ఎలా మారుతున్నాయో బ్రిటిష్ సామాజికవేత్త అంథోని గిద్దేన్స్ (Anthony Giddens) బాగా వివరించారు.
వివాహం అనేది వంశ పరంపర, ఆర్థిక భద్రత వంటి అంశాల మీద ఆధార పడి ఉండే వ్యవహారం కాదు. అది ప్రధానంగా అంబేద్కర్ (Dr B R Ambedkar) చెప్పినట్లు ఇద్దరు వ్యక్తుల మధ్య అవగాహన ఒప్పందం లాంటిది మాత్రమే. వ్యక్తిగత సంతృప్తి, భావోద్వేగ తృప్తి లాంటి ఆధునిక పోకడల మీద బలంగా ఆధారపడి ఉంటుంది. ఈ సంబంధం భాగస్వాముల మధ్య నమ్మకం, పరస్పర గౌరవం ఉంటేనే నిలుస్తుంది. ఈ బంధాలలో భావోద్వేగ తృప్తి అనేది లేకపోతే ఆ సంబంధం ఎక్కువ కాలం నిలబడదు.
ప్రస్తుతం మనం ఎక్కువగా గమనిస్తున్న కుటుంబ కలహాలను ఈ రకమైన 'భావోద్వేగ వైఫల్యం' (Emotional failure) గానే చూడవచ్చు. ఒక వ్యక్తి తను ఉంటున్న సంబంధంలో ఆనందం లేదని భావిస్తే, సాధారణంగా వ్యక్తుల అంగీకారంతో విడిపోవడం ఒక సామాజిక పరిష్కారం. కానీ భారతీయ సమాజంలో విడాకులకు ఉన్న ప్రతికూల దృక్కోణం, కుటుంబ వ్యవస్థలో ఆర్థికంగా ఒకరికొకరు ఆధారపడడం, సామాజిక అపహాస్యం అనేటటువంటి కారణాల వల్ల సంబంధ బాంధవ్యాలు కుచించుకుపోతున్నాయి. ఈ పరిస్థితియే ఎక్కువగా హింసకు దారితీస్తున్నది.
ఇదే అంశాన్ని జిగ్ముంట్ బౌమన్ (Zygmunt Bauman) అనే ఇంకో యూరోపియన్ సామాజికవేత్త మరొక కోణం చూపించారు. ఆయన లిక్విడ్ మాడేర్నిటి (Liquid modernity) అనే పద ప్రయోగం చేశాడు. ఆధునిక సమాజంలో సంబంధాలు స్థిరంగా ఉండవు, అవి ద్రవంలా నిత్యం మారుతూ ఉంటాయి. అంటే ఎప్పటికప్పుడు సమాజంలో జరుగుతున్న మార్పులకు లోనవుతాయి. అందుకే మనదంతా ‘లిక్విడ్ మోడేర్నిటి’ అన్నాడు. ఈ వేగవంతమైన మార్పుల వలనే దాంపత్య సంబంధాలు కూడా ఇప్పుడు తాత్కాలికమైపోయాయి. వాటిని నిలబెట్టేది ‘సమాజం’ కాదు, వ్యక్తిగత నిర్ణయాలు మాత్రమే (అంటే పూర్వంలాగా సమాజంలోని కులం, వర్గం లేదా దాని బలోపేతానికి వంతపాడే పెద్దలు తీసుకునే నిర్ణయాలు నిలబెట్టవు). ఈ అస్థిరత వల్ల చిన్న విభేదాలు కూడా పెద్ద పెద్ద ఘర్షణలకు దారి తీస్తున్నాయి. ఉదాహరణకు, ఇటీవల సోషల్ మీడియా పోస్ట్‌లు లేదా చిన్న ఆర్థిక తగాదాల వల్లే హత్యలు జరిగిన సంఘటనలను కూడా మనం చూస్తూనే ఉన్నాము.
ఈ సంబంధాలను మిచెల్ ఫూకో (Michel Foucault) అనే ఫ్రెంచ్ సామజిక వేత్త ఇంకో కోణంలో చూపించారు. అది ‘పవర్’ (Power) కు సంబంధించిన సామాజిక భావన (Theory of power). పవర్ అనేది కేవలం రాజకీయ లేదా ఆర్థిక రంగాలలోని అంశం మాత్రమే కాదు. ఈ పవర్ ప్రతి సామాజిక సంబంధంలోనూ ఉంటుంది. కుటుంబం వ్యవస్థ కూడా ఒక శక్తి (పవర్) నిర్మాణమే. పితృస్వామ్య సమాజంలో సాంప్రదాయకంగా భర్త లేదా మగవారు ఆధిపత్య స్థానంలో ఉంటారు. భార్య ఎప్పుడూ కూడా భర్తకు విధేయురాలిగా ఉండాలి అన్న నిర్మాణం భారతీయ కుటుంబ వ్యవస్థలో బలంగా ఉంది. ఇదే అంశాన్ని మన మత గ్రంధాలు కూడా నొక్కి చెప్పుతాయి. కానీ ఆధునిక కాలంలో మహిళలు విద్య, ఉద్యోగాలు, ఆర్థిక స్వాతంత్య్రం ద్వారా ఆ ఆధిపత్యానికి సవాలు చేస్తున్నారు. ఈ మార్పు భర్త–భార్య సంబంధంలో శక్తి సమతుల్యతను చెదరగొట్టింది. ఈ శక్తి(పవర్) పోరాటాలు కొన్నిసార్లు హింసాత్మక పరిణామాలకు దారితీస్తున్నాయి. ఇవి కేవలం వ్యక్తిగత లోపాలు కాదు, శక్తి–లింగ సమీకరణల మార్పుల భాగంగా వస్తున్న అంశాలుగా చూడవచ్చు.
ఆధునిక భారతీయ సమాజంలో జరుగుతున్న మార్పుల ప్రతిఫలాలో భాగంగా జరుగుతున్న ఇలాంటి సంఘటనలు ఒక విస్తృత సామాజిక సంక్షోభానికి సంకేతంగా నిలుస్తాయి. కాబట్టి పరిష్కారం కూడా సమాజ స్థాయిలో ఉండాలి. ఇందుకోసం ప్రభుత్వాలు మానసిక ఆరోగ్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవాలి. భార్య–భర్తల మధ్య మధ్యవర్తిత్వం, కౌన్సిలింగ్, సామాజిక మద్దతు వంటి వ్యవస్థలు బలపడాలి. ఆర్థిక అస్థిరతను తగ్గించడానికి సామాజిక భద్రతా చర్యలు తీసుకోవాలి. లింగ సమానత్వం పై కూడా కొత్త సామాజిక చైతన్యం, దాంపత్య బంధాలను ఆధిపత్యం–విధేయత సంబంధాలుగా కాకుండా, భాగస్వామ్య సంబంధాలుగా మలచడం వంటి వాటిపై సామాజిక అవగాహన కల్పించాలి.
Next Story