కూటమిలో రాహుల్ నోట మమత పేరు..బీహార్‌ సీఎంకు ఆగ్రహం తెప్పించిందా?
x

కూటమిలో రాహుల్ నోట మమత పేరు..బీహార్‌ సీఎంకు ఆగ్రహం తెప్పించిందా?

బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ రాహుల్‌పై గుర్రుగా ఉన్నారు. భారత కూటమి వర్చువల్‌ మీట్‌లో అసలేం జరిగింది?


లోక్‌సభ ` 2024 ఎన్నికల నేపథ్యంలో భారత కూటమి సభ్యులు వర్చువల్‌గా సమావేశమయ్యారు. కాంగ్రెస్‌, జేడీ(యూ), ఆర్జేడీ, ఎన్‌సీపీ, డీఎంకే, ఆప్‌, సీపీఎం, సీపీఐ నేతలు పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాల వల్ల సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే వర్చువల్‌ మీట్‌లో పాల్గొనలేదు.

రాహుల్‌పై నితీష్‌కు కోపం ఎందుకు?

భారత కూటమికి చైర్మన్‌, కన్వీనర్‌గా ఎవరెవరు ఉండాలన్న దానిపై చర్చ మొదలైంది. చైర్మన్‌గా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉండేందుకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. కాని కన్వీనర్‌ పోస్టును బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఆశించారు. కాని తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన మమతా బెనర్జీ ఆమోదం పొందిన తర్వాతే అధికారిక ప్రకటన చేయాలని రాహుల్‌ సూచించడంతో నితీష్‌తో పాటు లాలూ, తేజస్వి అసహనం వక్తం చేశారు.

మమతాకు ఇష్టం లేదా?

మమతా గతంలో ఖర్గేని కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని సూచించారు. కానీ నితీష్‌ను కూటమికి కన్వీనర్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. కూటమికి చైర్మన్‌గా ఖర్గే, కన్వీనర్‌గా నితీష్‌ను నియమించడంపై ఇతర భారత కూటమి నేతలకు అభ్యంతరం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి.

జేడీ(యూ) వర్గాల మాటేంటి?

కూటమి కన్వీనర్‌గా నితీష్‌ నియామకంపై బెనర్జీ అభ్యంతరాన్ని అసలు పట్టించుకోవడం లేదని జేడీ(యూ) సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఆమె అభ్యంతరానికి ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని తెలిపాయి. నితీష్‌ గత జూన్‌లో ఆప్‌, తృణమూల్‌ పార్టీలను కూటమిలోకి తీసుకురావడం ప్రారంభించినప్పటి నుంచి ప్రతిపక్ష సమూహంలో ప్రముఖ స్థానం కావాలని కోరుతున్న విషయం తెలిసిందే. భారత కూటమి ఇప్పటికే పాట్నా, బెంగళూరు, బాంబే ఢల్లీిలో నాలుగు సమావేశాలను నిర్వహించిన విషయం తెలిసిందే. గతంలో జరిగిన ఏ సమావేశంలోనూ నితీష్‌ను కన్వీనర్‌గా పేర్కొనలేదు.

ఆమె అభిప్రాయంతో పనిలేదు..

‘‘నితీష్‌ నియామకంపై మమత అభిప్రాయంతో సంబంధం లేకుండా, మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు చైర్మన్‌, కన్వీనర్‌ పేర్లను ప్రకటించాలని నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందును కూటమిలోని మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు నితీష్‌ కుమార్‌ కన్వీనర్‌గా, ఖర్గేను కూటమి చైర్మన్‌గా ప్రకటించాలని నిర్ణయించారు.’’ అని బీహార్‌ ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు తెలిపాయి.

‘‘ఇండియా కూటమిలో అతి తక్కువ సహకార భాగస్వామి మమతా బెనర్జీ. ఆమె స్వతంత్రంగానే ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.’’ అని నితీశ్‌కు సన్నిహితంగా ఉండే సీనియర్‌ జేడీ(యూ) నాయకుడు ఫెడరల్‌తో అన్నారు.

నితీష్‌ మళ్లీ బీజేపీలో చేరుతారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని, అయితే కాంగ్రెస్‌ ఆయనను సంతోషంగా ఉంచలేకపోతే బీహార్‌లో జేడీ(యూ), ఆర్జేడీ ప్రత్యేక కూటమిగా ఏర్పడే అవకాశం ఉందని నితీష్‌ సన్నిహితులు చెబుతున్నారు.

‘‘ఏకాభిప్రాయం లేకుంటే నియామకాలపై చర్చించడంలో అర్థం లేదు. సమావేశానికి పిలవడానికి ముందే ఏకాభిప్రాయం కోసం గ్రౌండ్‌వర్క్‌ పూర్తి చేసి ఉండాలి.’’ అని నితీష్‌ తన వంతుగా సమావేశంలో రాహుల్‌తో చెప్పినట్లు తెలిసింది. కూటమిని చైర్మన్‌గా ఖర్గే నియామకాన్ని నితీష్‌ స్వాగతించారు. కాగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రాహుల్‌ను వెనకేసుకొచ్చారు. కన్వీనర్‌ పోస్టును నితీష్‌ తొలుత తిరస్కరించారని చెప్పుకొచ్చారు.

కుదిరిన ఏకాభిప్రాయం..

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేను భారత కూటమికి చైర్మన్‌గా, నితీశ్‌ను కన్వీనర్‌గా ఎన్నుకోవడంపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. వర్చువల్‌ మీట్‌లో పాల్గొన్న పార్టీ నేతలంతా ఇద్దరి పేర్లపై అభ్యంతరం వ్యక్తం చేయలేదు.

సమావేశం అనంతరం ఖర్గే మాట్లాడుతూ.. చర్చలు సఫలమయ్యాయని, సీట్ల పంపకంపై సానుకూల పురోగతి కనిపిస్తోందని చెప్పారు.

బెనర్జీ సుముఖంగా లేరా?

మమతా బెనర్జీతో సీట్ల పంపకాల చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఇండియా కూటమి నిర్ణయాలకు సంబంధించి ఆమెను లూప్‌లో ఉంచడానికి రాహుల్‌ సిద్ధమవుతున్నట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్‌లోని 42 లోక్‌సభ స్థానాల్లో మూడిరటికి మించి కాంగ్రెస్‌కు ఇవ్వడానికి తృణమూల్‌ సుముఖంగా లేదట.

Read More
Next Story