
సీఎం ఇలాకాలో కాలుష్యకారక పరిశ్రమా?
అభివృద్ధి పనులయితే ఓకే కానీ క్యాన్సర్ కారక ఇథనాల్ పరిశ్రమను కూడా పని గట్టుకుని సీఎం తన స్వంత జిల్లాకు తీసుకెళ్లడమేంటి?
అధికారంలో ఉన్న పార్టీ పెద్దలు , తమ స్వంత గ్రామాలను, నియోజక వర్గాలను, జిల్లాలను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక దృష్టి సారించడం సాధారణంగా చూస్తుంటాం. చంద్రబాబు నాయుడు కుప్పం, రాజశేఖర రెడ్డి, జగన్ పులివెందుల, KCR గజ్వేల్, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ కొడంగల్ నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టికి సారించడం మనకు కనపడుతున్నదే. ఆయా రాష్ట్రాలలో మిగిలిన నియోజక వర్గాలకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోయినా, తమ నియోజక వర్గాలకు మాత్రం భారీగా నిధులు కేటాయించుకోవడం, ఏ కొత్త పథకం అయినా, తమ నియోజక వర్గంలో పైలట్ చేయడం, ఏ మౌలిక వసతుల కల్పన కోసం అయినా, తమ స్వంత నియోజక వర్గంలో పునాది రాయి వేయడం కూడా మనం చూస్తుంటాం.
కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ గారు తాజాగా మరో అడుగు ముందుకు వేసి, క్యాన్సర్ కారక ఇథనాల్ పరిశ్రమను కూడా పని గట్టుకుని తన స్వంత జిల్లాకు తీసుకు వెళ్లడమే ఆందోళన కల్గించే విషయం. వికారాబాద్ జిల్లా మోమీన్ పేట మండల కేంద్రంలో రోజుకు 60 కిలోలీటర్ల( రోజుకు 60,000 లీటర్ల ) ఇంధన ఇథనాల్ ఫాక్టరీ నిర్మించే ప్రతిపాదనకు డిసెంబరు 30 నాడు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని ఇప్పటికే అధికారులు ప్రకటించారు.
చట్టం ప్రకారం, స్థానికంగా ఏదైనా ప్రాంతంలో ఒక పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేయాలనుకుంటే, ఆ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా చదివే దినపత్రికలలో స్థానిక ముఖ్యమైన భాషలలొ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు 30 రోజుల ముందు గానే నోటిఫికేషన్ ప్రచురించాలి. రేడియో, టీవీలలో కూడా ప్రకటించాలి. ఫ్యాక్టరీ నెలకొల్పే స్థలానికి 10 కిలో మీటర్ల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలకు అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వాలి. ఆయా గ్రామ పంచాయితీ కార్యాలయాలలో కూడా నోటీసులు అందించాలి. ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, పర్యావరణ అంశాలపై మాట్లాడే సంస్థలకు కూడా సమాచారం ఉండి, పబ్లిక్ హియరింగ్ గురించి, తమ అభిప్రాయం చెప్పడానికి వస్తే, వారికి మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. వారు ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇవ్వాలి. ప్రజలు, ప్రతినిధులు అడిగిన అన్ని రకాల ప్రశ్నలకు తగిన జవాబులు ఇవ్వాలి. స్థానికంగా వచ్చే పరిశ్రమ మంచి చెడుల గురించి ప్రజలకు అవగాహన కలిగించేలా, గ్రామ పంచాయితీ కార్యాలయాలలో తగిన సాహిత్యం స్థానిక భాషలో అందుబాటులో ఉంచాలి.
కానీ విచిత్రం ఏమంటే , డిసెంబర్ 24 నాడు మా ప్రతినిధి బృందం ఆ మండలంలో పర్యటించే వరకూ,స్థానిక ప్రజలకు ఎవ్వరికీ ఈ ప్రాంతంలో ఒక పరిశ్రమ రానుందనీ, దానిపై డిసెంబర్ 30 న ప్రజాభిప్రాయ సేకరణ జరగనుందనీ సమాచారమే లేదు. స్థానిక వ్యవసాయ అధికారి, స్థానిక గ్రామాల సర్పంచ్ లు, ఇతర అధికారులకు కూడా సమాచారం లేదు. అంటే చట్ట ఉల్లంఘన మొదటి దశలోనే ప్రారంభమైందన్నమాట.
వికారాబాద్ జిల్లాలో గతంలో కూడా యాలాల్ మండలం, జక్కెపల్లి గ్రామం లో RBL (revolution in bio products) రాడికల్ బయో ఆర్గానిక్స్ లిమిటెడ్ పేరుతో ఒక ఇథనాల్ కంపెనీ ఉంది. ఈ ఇథనాల్ ను లిక్కర్ తయారీ కోసం తరలిస్తున్నారు. స్థానిక ప్రజలు చెబుతున్న సమాచారం ప్రకారం, ఈ పరిశ్రమ నుండీ వెలువడే దుర్వాసన అనేక గమలకు విస్తరించింది. పరిశ్రమ నుండీ వెలువడే వ్యర్ధ జలాలు చుట్టూ ఉన్న వ్యవసాయ భూములను నాశనం చేస్తున్నాయి. ప్రతి రోజూ రాత్రి కంపెనీ యాజమాన్యం, వ్యర్ధాలను బయట ప్రాంతాల లోకి వదులుతున్నది. అధికారులు ఈ సమస్యను పట్టించుకోవడం లేదు. ప్రజల ఘోష వినడం లేదు. తాజాగా మరో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
2021 లో మోదీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఇథనాల్ పాలసీ E 20 ప్రకారం దేశ వ్యాపితంగా ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్నారు. 2023 నాటికే మన రాష్టంలో 30 ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. వాటిలో ఒక్కటి మాత్రమే ఇప్పటి వరకూ ఉత్పత్తిని ప్రారంభించింది. జగిత్యాల జిల్లా స్తంభం పల్లి, నిర్మల్ జిల్లా దిలావర్ పూర్, గద్వాల జిల్లా పెద ధణ్వాడ లలో ప్రజలు తమ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న ఇథనాల్ కంపనీలకు వ్యతిరేకంగా స్థానికంగా కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీలను ఏర్పాటు చేసుకుని పోరాడి, ఆయా కంపనీలు నిర్మాణ పనులను ఆపేసేలా విజయం సాధించారు. ఇవన్నీ జరిగినా, ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి గారి స్వంత జిల్లా వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలంలో మరో ఇథనాల్ కంపనీ ఏర్పాటుకు ముందుకు వెళ్ళడం అభ్యతరకరం. పైగా ఈ విషయాలలో ఎలాంటి పారదర్శకత లేకుండా వ్యవహరించడం మరీ అన్యాయం.
2021 పాలసీ ప్రకారం ఇథనాల్ ను పెట్రోలులో 20 శాతం కలిపి ఇ 20 ఇంధనం గా వాహనాలలో వాడతారు. భారత దేశ ఇంధన అవసరాలు తీర్చడానికీ, విదేశాల నుండీ పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాల దిగుమతి భారం తగ్గించడానికీ, వాయు, కర్బన కాలుష్యాలను తగ్గించడానికీ, ఇథనాల్ కలిపిన పెట్రోలు పరిష్కారమని భారత ప్రభుత్వం ప్రకటిస్తున్నది. ఈ పరిశ్రమకు ఎన్నో సబ్సిడీలు, రాయితీలు కల్పించి ప్రోత్సహిస్తున్నది.
ముఖ్యంగా ఆహార పంటలైన బియ్యం, గోధుమలు, మొక్కజొన్నల నుండి ఇథనాల్ ఉత్పత్తి చేయడానికి పర్యావరణ అనుమతులు వేగంగా ఇస్తున్నారు. సబ్సిడీలూ, వడ్డీ రాయితీతో కూడిన రుణాలూ మంజూరు చేసి 2025 నాటికి దేశమంతా సాధారణ పెట్రోల్ బదులుగా, ప్రతి లీటర్ పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోలు ప్రజలకు అమ్మాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.
ఇంధన ఇథనాల్ ఆసలు సమస్యకు సరైన పరిష్కారం కాదు.
మనం ఇప్పటికీ , విదేశాల నుండీ 87 శాతం చమురు దిగుమతిపై ఆధార పడుతున్నాం. దేశీయ పెట్రోలియం ఉత్పత్తి తగ్గి , దేశంలో పెట్రోల్ వాడకం పెరిగి, దిగుమతులు ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నాయి. ఇంధన ఇథనాల్ ను కేవలం పెట్రోలులో మాత్రమే కలపగలం. డీజిల్ లో కలపలేము.
నిజానికి ముడి చమురు నుండి 20 శాతం మాత్రమే పెట్రోలుగా తీస్తున్నాము. దానిలో 20 శాతం ఇథనాల్ కలిపితే ఆదా అయ్యే చమురు కేవలం 4 శాతమే. ఇథనాల్ ఇంధన విలువ పెట్రోలులో 67 శాతమే. అందువల్ల నికరంగా ఆదా అయ్యే చమురు 2.67 శాతం మాత్రమే. అందుకోసం దేశమంతా వందల సంఖ్యలో ఇథనాల్ ప్లాంట్లు నిర్మించి, రైతులు పండించే ఆహార పంటలను ఇంధనం కోసం తరలించి, గ్రామీణ ప్రాంతాలలో జల, వాయు కాలుష్యాలు సృష్టించి పర్యావరణ, ప్రజారోగ్య విధ్వంసాలు చేయాల్సిన అవసరం లేదు.
గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాలను దేశమంతా ప్రోత్సాహిస్తున్నా, మన వాతావరణంలో కర్బన ఉద్గారాలు ఏ మాత్రం తగ్గలేదు. పైగా ప్రతి ఏటా ఈ కర్బన ఉద్గారాలు భారీగా పెరుగుతూనే వున్నాయి.
సబ్సిడీపై బియ్యం ఇస్తే తప్ప ఈ పరిశ్రమ నడవదు :
ఎప్పుడైనా సరే, బియ్యంతో ఇథనాల్ ఉత్పత్తి చేయడం నష్ట దాయకం. ఈ పరిశ్రమకు సబ్సిడీ ధరకు బియ్యం లభిస్తేనే ఇథనాల్ ఉత్పత్తి చేయగలరు. ఈ పరిశ్రమకు మొదటి సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం కిలో ₹20 కి బియ్యం సరఫరా చేసింది. మరుసటి సంవత్సరం దేశానికి ఆఘరా కొరత ఉందనే పేరుతో, భారత ఆహార సంస్థ నుండీ బియ్యం సరఫరా నిలిపి వేసింది. పరిశ్రమ యాజమాన్యాలు గగ్గోలు పెట్టడంతో, ఈ సంవత్సరం మళ్ళీ FCI నుండీ కిలో 22.50 రూపాయలకు బియ్యం సరఫరా చేస్తున్నారు.
దేశంలో ఇప్పుడు ప్రణాళికా చేసిన మొత్తం ఇథనాల్ ఉత్పత్తికి అవసరమైన బియ్యం భారత ఆహార సంస్థ నుండీ ఆ ధరకు లభించదు. కేంద్ర ప్రభుత్వం ఏటా కొంత కోటా నిర్ణయించి, ఆ మేరకే పరిశ్రమకు బియ్యం సరఫరా చేస్తుంది. మిగిలిన బియ్యాన్ని పరిశ్రమలు బయట నుండే కొనుగోలు చేసుకోవలసి ఉంటుంది. లేదా మొక్క జొన్నను బయట దేశాల నుండీ దిగుమతి చేసుకోవలసి ఉంటుంది.
ప్రస్తుతం మోమిన్ పేట లో ఏర్పాటు చేయబోయే పరిశ్రమలో నూకలతో ఇథనాల్ ఉత్పత్తి చేస్తారట. తెలంగాణ రాష్ట్రంలో తాజాగా మోమిన్ పేట ప్లాంట్ ప్రతిపాదనతో కలిపి ఇప్పటికి, రోజుకి 26,00,000 లీటర్ల సామర్ధ్యం గల ప్లాంట్లు ఏర్పాటయ్యే అవకాశం వుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఉన్న గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరం నూకల లభ్యత ఏటా 16 లక్షల టన్నులు మాత్రమే.
ఇతర అవసరాలకి పోగా మిగిలే నూకలు ఎన్ని? రాష్ట్రంలో అన్ని ప్లాంట్లూ నడపడానికి ఏడాదికి 19.04 లక్షల టన్నుల నూకలు కావాలి. ఈ పరిశ్రమలు నడవడానికి ముడి పదార్ధం రాష్ట్రంలో తగినంతగా లేదని తెలుస్తున్నా, కొత్తగా మరో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు ఎందుకింత ఆరాటం పడుతున్నారు? వాతావరణ మార్పు నేపధ్యంలో, సాగు నీరు సకాలంలో తగినంత అందక రాష్ట్రంలో వరి లాంటి పంటల విస్తీర్ణం తగ్గితే యీ కంపెనీలేమవుతాయి?
ఈ పరిశ్రమ నడవడానికి చాలా నీరు కావాలి
ఈ ఇథనాల్ పరిశ్రమ నిర్వహణకు చాలా నీరు కావాలి. మన జిల్లాలో, రాష్ట్రంలో నీటి లభ్యత కూడా అతి పెద్ద సమస్య. లీటరు ఇథనాల్ తయారీకి 4 లీటర్ల నీరు మాత్రమే వాడతామని కాగితాలపై వుంటుంది. కానీ ఆచరణలో ఈ పరిశ్రమలకు అంత సమర్ధమైన సాంకేతికతా, నిర్వహణా కూడా లేవు.
ఇప్పటికే ఇథనాల్ ఉత్పత్తి చేస్తున్న నారాయణ పేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరు పరిశ్రమలో లీటరు ఇథనాల్ ఉత్పత్తికి దాదాపు ఎనిమిది లీటర్ల నీరు వాడుతున్నారు. ఈ కారణం చేతనే చాలా ఇథనాల్ కంపెనీలను నదులకు దగ్గరలో పెడుతున్నారు.
నిజానికి వికారాబాద్ జిల్లాలో నదీ జలాలు అందుబాటులో లేవు. ఆ ప్రాంత చెరువులు మాత్రమే ఉన్నాయి. ఆ ప్రాంతంలో పారే పెద వాగు నుండీ ఈ చెరువులకు నీరు వస్తున్నది. మోమిన్ పేట ఇథనాల్ పరిశ్రమకు నీళ్ళెక్కడ నుండి తీసుకుంటారో బహిరంగంగా చెప్పలేదు. సాధారణంగా ఇథనాల్ పరిశ్రమల కోసం కొత్తగా బోర్లు వేయడానికి అనుమతించరు.
ఇప్పటికీ వికారాబాద్ జిల్లాలో వ్యవసాయానికి అవసరమైన పూర్తి స్థాయి నీటి వనరులు అందుబాటులో లేవు. ఇప్పటికే ఉన్న కొన్ని చెరువుల క్రింద, బోరు బావుల క్రింద వ్యవసాయం నడుస్తున్నది. ఈ నేపధ్యంలో ఉన్న కొద్దిపాటి చెరువుల నీటిని ఇథనాల్ పరిశ్రమకు సరఫరా చేస్తే, ఈ ప్రాంత వ్యవసాయానికి దెబ్బ తగులుతుంది. అది రైతుల, వ్యవసాయ కూలీల ఉపాధిని, ఆదాయాలను దెబ్బ తీస్తుంది.
పరిశ్రమ వ్యర్ధాల నిర్వహణ సరిగా లేదు :
ఈ ఇథనాల్ కంపనీ నుండీ వ్యర్ధాలుగా వెలువడే చుక్క నీరు కూడా కంపనీ బయటకు వదలబోమని కాగితంపై వుంటుంది. కానీ యాజమాన్యాలు దానిని నిజాయితీగా అమలు చేయడం లేదు. ఇప్పటికే ఇథనాల్ ను ఉత్పత్తి చేస్తున్న చిత్తనూరులో కంపెనీ వదిలిన నీటి కాలుష్యంతో, వాయు కాలుష్యంతో దాదాపు 50 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. స్థానిక వాగులు కాలుష్యంతో నిండి పోయాయి.
ఈ విషయంలో కంపెనీల నిర్వహణ తీరుపై మన రాష్ట్రంలో, దేశంలో ఎలాంటి అధ్యయనాలు లేవు. పరిశ్రమలో ఒకసారి వాడిన నీటిని తిరిగి ఉపయోగించడం ఖర్చుతో కూడిన పని. అందుకే ఈ ఖర్చును తగ్గించుకోవడానికి కంపనీలో వెలువడే వ్యర్ధ జలాలను బయటికి వదలడం అన్ని చోట్లా జరుగుతున్నది. నిర్వీర్యమైన నియంత్రణ వ్యవస్థల ఉదాసీనత, కంపెనీ యాజమాన్యాలు చేసే ఈ నేరాలకు ఊతమిస్తున్నది.
ఇథనాల్ కలిపినా పెట్రోల్ ధరలు తగ్గడం లేదు :
ఇథనాల్ కలపడంతో దేశంలో పెట్రోల్ ధరలు తగ్గిపోతాయని, తద్వారా వాహన వినియోగదారులపై భారం తగ్గుతుందనీ ప్రచారం చేశారు. కేంద్ర మంత్రి గడ్కారీ గతంలో ఇథనాల్ వల్ల, ఇకపై 15 రూపాయలకే లీటరు పెట్రోల్ దొరుకుతుందని కూడా ప్రకటించారు. రైతులు “అన్నదాత”లే కాదు “శక్తి దాత” లవుతారని కూడా పొగిడారు. కానీ ఇథనాల్ పాలసీ వచ్చిన గత నాలుగేళ్లలో పెట్రోల్ ధరలు ఒక్క రూపాయి కూడా తగ్గలేదని మనకు తెలుసు.
విదేశాల నుండీ దిగుమతి చేసి కేంద్ర పెట్రోలియం శాఖ పెట్రోలు డీలర్లకు సరఫరా చేసే పెట్రోలు ధర లీటర్ కు 50-55 రూపాయల మధ్య వుంటుంది. దానిలో డీలరు కి 3 శాతం మాత్రమే కమీషను యిస్తారు. వినియోగదారులకు లీటర్ పెట్రోల్ 109 రూపాయలకు అమ్ముతారు. ప్రస్తుతం లీటరు ఇథనాల్ ను బియ్యం నుండీ తయారు చేస్తే లీటర్ 64 రూపాయలకూ, మొక్క జొన్న నుండీ తయారు చేస్తే 72 రూపాయాలకూ చమురు కంపెనీలు ఇథనాల్ కంపనీల నుండీ కొంటున్నాయి.
అంటే, ఇథనాల్ కలిపిన పెట్రోల్ అందుబాటులోకి వచ్చినా, ధరలు తగ్గక పోవడానికి కారణం ఒక్కటే. మిగిలిన డబ్బులన్నీ, కేంద్ర ప్రభుత్వం టాక్సులు, సెస్ ల రూపంలో ప్రజల నుండీ గుంజుతుందన్నమాట. అంటే ఈ పాలసీ వల్ల వినియోగదారులకు ఏ మాత్రం లాభం లేకపోగా, తక్కువ ధర వున్న పెట్రోలులో ఎక్కువ ధర వున్న ఇథనాల్ కలిపి అదే పాత ధరకు మిశ్రమ ఇంధనం వినియోగదారులకు అమ్మితే చమురు కంపెనీలకు నష్టమే కదా?
ఇథనాల్ కలిపిన పెట్రోల్ తో వాహనాలకు కూడా నష్టం :
వినియోగ దారుల విషయానికొస్తే పాత వాహనాలేవీ మిశ్రమ ఇంధన వాడకానికి అనువైనవి కావు. అందుకే వాహనాలు తరచూ రిపేరుకి వస్తున్నాయి. E20 పెట్రోలుతో వాహన మైలేజీ కూడా 7-8 శాతం పడి పోతున్నది. వినియోగదారులపై ఇంధన ఖర్చు కూడా పెరుగుతున్నది.
ముడి సరుకుగా రైతుల నుండీ ధాన్యం కొంటామని చెప్పే మాట పచ్చి అబద్ధం:
కొన్ని ఇథనాల్ కంపెనీలు, గతంలో తాము పరిశ్రమ నడపడానికి రైతుల దగ్గర నుండీ నేరుగా వరి ధాన్యం కొంటామని ప్రకటించాయి. కానీ, ఇప్పటి వరకూ ఒక్క కంపెనీ కూడా ఒక్క కిలో ధాన్యం కూడా రైతుల నుండీ నేరుగా కొనలేదు. అలా కొంటే ఆ పరిశ్రమకు గిట్టుబాటు కాదు. అందుకే కొనరు.
ఇథనాల్ పరిశ్రమలతో ఇన్ని సమస్యలు ఉన్న నేపధ్యంలో ఎవరి ప్రయోజనం కోసం ఇథనాల్ నూ, కొత్తగా ఇథనాల్ పరిశ్రమలనూ ఏర్పాటు చేస్తున్నారు? ప్రోత్సహిస్తున్నారు ?
మోమిన్ పేట లో ప్రతిపాదించిన ఇథనాల్ ప్లాంట్ గురించి కొన్ని ప్రశ్నలు :
2025 డిసెంబరు 30 నాడు మోమిన్ పేట మండలంలో జరిగే ప్రజాభిప్రాయ సేకరణ కంపెనీ సమర్పించిన పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక ( EIA ) ప్రాతిపదికగా జరుగుతుంది. ప్రధానంగా ఆ రోజు ఈ నివేదిక పైనే చర్చ జరగాలి.
నిపుణులు తయారు చేసే నివేదిక యీ ఫాక్టరీ ఏర్పాటు వల్ల ఉత్పన్నమయ్యే అనుకూల, ప్రతికూల ప్రభావాలను శాస్త్రీయంగా, నిజాయితీగా అంచనా వేయాలి. కానీ కంపెనీయే డబ్బు లిచ్చి రాయించుకున్న నివేదిక గనుక ఇది కంపెనీకి అనుకూలంగానే వుంటుంది. అది అనివార్యం. అందువల్ల ప్రజలే అప్రమత్తతతో ఉండి నివేదికలో ఉన్న లోపాలనూ, దాచిన అంశాలనూ గుర్తించి ప్రజాభిప్రాయ సేకరణ సభలో బహిర్గతం చేయాలి.
ఇఐఎ నివేదికలో చాలా విషయాలు దాచారు
1. అతి ప్రధానమైన దగా యీ ప్లాంట్లు విడుదలచేసే హాని కర రసాయన వాయు కాలుష్యం చూపకపోవడం. యీ కంపెనీలకు ToR జారీ చేసిన రాష్ట్ర నిపుణుల కమిటీ కూడా ఈ కాలుష్యాన్ని గుర్తించ లేదు. ఇది అతి పెద్ద దౌర్భాగ్యం.
2. ఇథనాల్ ప్లాంట్ల నుండి కొన్ని ప్రమాదకర రసాయన వాయువులు వాతావరణంలోకి విడుదలవుతాయి. వీటిని హానికర వాయు కాలుష్య కారకాలు (HAPs) అంటారు. ముఖ్యంగా ఎసిటాల్డిహైడ్, ఫార్మాల్డిహైడ్, అక్రోలిన్, మిథనాల్ వంటి వాయువులు ఇథనాల్ తయారీ ప్రక్రియలో -కిణ్వ ప్రక్రియ (ఫెర్మెంటేషన్), స్వేదనం (డిస్టిలేషన్), ఎండబెట్టే (డ్రైయింగ్) దశల్లో - వెలువడుతాయి. ఈస్ట్‌తో జరిగే కిణ్వ ప్రక్రియలో సహజంగా ఏర్పడే ఎసిటాల్డిహైడ్ నిల్వ ట్యాంకులు, ప్రాసెస్ వెంట్లు, స్వేదన స్తంభాల ద్వారా బయటకు రావడం ప్రత్యేక ఆందోళన కలిగించే విషయం.
3. ఇథనాల్‌ను శిలాజ ఇంధనాల కంటే పర్యావరణానికి మంచిదిగా తరచూ ప్రచారం చేస్తారు.కానీ ఈ వాయు కాలుష్యంతో స్వల్ప కాలంలో కన్ను, ముక్కు, గొంతు దురద ఉంటాయి. తల నొప్పి, వికారం ఉంటాయి. వాంతులు కూడా కావచ్చు. అలాగే ఊపిరి ఆడనట్లుగా అవుతుంది. దీర్ఘ కాలంలో ఈ వాయు కాలుష్యం క్యాన్సర్ కు కారణం కావచ్చు. మనిషిలో ఉబ్బసానికి దారి తీస్తుంది. దీర్ఘ కాలిక శ్వాస నాళాల, శ్లేష్మస్తర వాపు ( క్రానిక్ బ్రాంకైటిస్ )రావచ్చు. వాయు కోశాలు వ్యాకోచించవచ్చు. ఈ కాలుష్యం గర్భస్థ శిశువులపై ప్రభావం చూపుతుంది. పిల్లలు బలహీనంగా, తక్కువ బరువుతో పుడతారు. అలాగే భూ-స్థాయి ఓజోన్ ఏర్పడటానికి దోహద పడటం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి.
4. అందుకే, అమెరికాలో EPA (ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) క్లీన్ ఎయిర్ యాక్ట్ కింద ఇథనాల్ ప్లాంట్ల ఉద్గారాలను నియంత్రిస్తుంది. ప్లాంట్లు MACT (గరిష్ట సాధ్యమైన నియంత్రణ సాంకేతికత) ప్రమాణాలను అమలు చేయాలి. వీటిలో సాధారణంగా థర్మల్ ఆక్సిడైజర్లు, కండెన్సర్లు, అలాగే సరైన ప్రాసెస్ నియంత్రణలు ఉంటాయి.
5. కొత్త తరహా డ్రై-మిల్ ఇథనాల్ ప్లాంట్లు మెరుగైన డిజైన్ , కాలుష్య నియంత్రణ పరికరాలతో ఈ వాయు ఉద్గారాలను గణనీయంగా తగ్గించాయి. అయినప్పటికీ, ఈ ప్లాంట్ల సమీపంలో నివసించే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు నిరంతర పర్యవేక్షణ, కఠినమైన నిబంధనల అమలు ఇప్పటికీ అత్యంత ముఖ్యమైన పర్యావరణ ఆందోళనలుగానే ఉన్నాయి.
6. ఇప్పటికే దేశంలో అనుమతిచ్చిన వందల ఇథనాల్ ప్లాంట్లలో హానికర రసాయన కాలుష్యాన్ని ఇప్పటి వరకూ గుర్తించనే లేదు. కంపెనీలపై ఎలాంటి నియంత్రణ నిబంధనలు విధించ లేదు. అందుకే వీటి పరిసర ప్రాంతాలలో తీవ్రమైన దుర్గంధం వస్తుంది. వాటిపై ఫిర్యాదు చేసినా అధికారులు, యాజమాన్యాలు పట్టించుకోని దౌర్భాగ్యం అన్ని చోట్లా ఉంది.
జీవ వైవిధ్యం:
మోమిన్ పేట లో ఏర్పాటుకు ప్రతిపాదించిన సువిరా ఇథనాల్ ప్లాంట్‌కు సిద్ధం చేసిన పర్యావరణ ప్రభావ అంచనా (EIA) నివేదికలో జీవ వైవిధ్యం, ఇకాలజీలపై ఇచ్చిన అధ్యయనం సరైన ప్రాథమిక (బేస్‌లైన్) అంచనాగా పరిగణించదగినది కాదు. జీవ వైవిధ్య సర్వేలు గాలి, నీరు, నేల వంటి ఇతర పర్యావరణ బేస్‌లైన్ అధ్యయనాలతో సమకాలీనంగా నిర్వహించబడ్డాయన్న స్పష్టమైన తేదీలు లేదా వివరాలు ఇవ్వలేదు.
1. ToR లు ఏప్రిల్ నెలలో మంజూరై, సెప్టెంబరు నాటికి EIA నివేదిక సమర్పించినప్పటికీ, జీవ వైవిధ్య సర్వేలు “వింటర్ సీజన్‌లో నిర్వహించాం” అని మాత్రమే పేర్కొనడం స్పష్టత లేకుండా ఉంది. ఏ సంవత్సరపు వింటర్‌లో, ఎంత కాలం పాటు, ఏ విధమైన ఫీల్డ్ సర్వేలు నిర్వహించారన్న వివరాలు ఇవ్వలేదు. ఈ పరిస్థితిలో, జీవ వైవిధ్య అధ్యయనం ToRల తర్వాత ప్రాజెక్ట్‌కు ప్రత్యేకంగా నిర్వహించబడిందా అనే విషయంలో న్యాయసమ్మతమైన సందేహాలు తలెత్తుతున్నాయి.
2. పక్షులు, ఉభయచరాలు, సరీసృపాలు, సీతాకోకచిలుకల జాబితాలు ప్రధానంగా సాహిత్య ఆధారిత ద్వితీయ సమాచారం మీద ఆధారపడ్డట్లు కనిపిస్తున్నాయి; ప్రాజెక్ట్ స్థలానికి ప్రత్యేకమైన ట్రాన్సెక్ట్‌లు, సర్వే శ్రమ, జీపీఎస్ స్థానాలు లేదా ఫీల్డ్ రికార్డులు లేవు. అదనంగా, కేవలం ఒక్క సీజన్‌లో చేసిన సర్వే ఆధారంగా 10 కి.మీ పరిధిలోని జీవ వైవిధ్యాన్ని పూర్తిగా ప్రతిబింబించలేం. ముఖ్యంగా నీటి వనరులు మరియు వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలు ఉన్న ప్రాంతంలో. అందువల్ల, ఈ అధ్యయనం ఆధారంగా “ప్రాముఖ్యమైన ప్రభావం లేదు” అన్న నిర్ణయాలు శాస్త్రీయంగా నమ్మదగినవిగా లేవు. నియంత్రణ సంస్థల పరిశీలనకు తగిన సమాచారం అందించడం లేదు.
ఇక నివేదికలోని ముఖ్యమైన తప్పులూ, లోపాలు :
1. కార్బన్ డయాక్సైడ్ (CO₂) : ఇథనాల్ కిణ్వ ప్రక్రియలో ప్రతి లీటరు ఇథనాల్ ఉత్పత్తికి సుమారు 0.76 కిలోల కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. ఈ లెక్కన సువిరా ప్లాంట్‌లో రోజుకు సుమారు 46 టన్నులు CO₂ ఉత్పత్తి కావాలి. అయితే ఇఐఎ నివేదికలో కేవలం 30 టన్నులు మాత్రమే చూపించారు. మిగిలిన కార్బన్ డయాక్సైడ్ ఎలా నిర్వహించబడుతుందో, అది గాలిలోకి వదిలేస్తున్నారా లేదా అన్న స్పష్టత లేదు. గాలిలో పట్టుకునే CO₂ను ఏ రూపంలో నిల్వ చేస్తారు ? ఎక్కడికి ? ఎలా ? తరలిస్తారు. విక్రయిస్తే దానికి సంబంధించిన భద్రతా చర్యలేమిటి ? అన్న వివరాలు పూర్తిగా లేవు. అంతేకాదు, భారీ పరిమాణంలో CO₂ ఉత్పత్తి, నిల్వ, లీకేజీల వల్ల కలిగే ప్రమాదాలపై ఎలాంటి ప్రమాద అంచనా (risk assessment) కూడా చేయలేదు. ఇది నివేదికలోని ఒక తీవ్రమైన లోపం.
2. ఇథనాల్ నిల్వ , భద్రత : ఇథనాల్ ప్లాంట్ల ఇఐఎ నివేదికల్లో ఇథనాల్ నిల్వ అంశం తీవ్ర లోపభూయిష్టంగా ఉంది. భారీ పరిమాణంలో ఇథనాల్‌ను ఉపరితల ట్యాంకుల్లో నిల్వ చేయనున్నప్పటికీ, ఈ నిల్వలను ప్రధాన ప్రమాద వనరులుగా పరిగణించి చేయవలసిన పరిమాణాత్మక ప్రమాద అంచనా (Quantitative Risk Assessment ) నివేదికలో లేదు. ప్రమాదాల పర్యవసానాలు, వేడి కిరణాల ప్రభావ పరిధులు, పేలుళ్ల వల్ల కలిగే నష్టం వంటి అంశాలపై అంచనాలు ఇవ్వలేదు.
3. ట్యాంకుల సామర్థ్యాల ఎంపిక, వాటి పరస్పర దూరాలు, పరిపాలనా భవనాలు మరియు నియంత్రణ గదులపై ప్రమాద ప్రభావాలు ఎలా ఉంటాయన్న విశ్లేషణ కనిపించదు. డైక్‌లు/బండ్‌ల సామర్థ్యం, ఆవిరి నియంత్రణ వ్యవస్థలు, అధిక స్థాయి అలారాలు, ఆటోమేటిక్ షట్‌డౌన్ వంటి కీలక భద్రతా ఏర్పాట్లపై స్పష్టత లేదు.
4. అగ్నిమాపక నీరు, ఫోమ్ అవసరాల గణనలు, అత్యవసర పరిస్థితుల నిర్వహణ ప్రణాళికలు కూడా సాధారణంగా మాత్రమే పేర్కొన్నారు. ఈ కారణంగా, ఇథనాల్ నిల్వకు సంబంధించిన భద్రతా అంచనా శాస్త్రీయంగా, నియంత్రణ పరంగా అసంపూర్ణంగా ఉంది.
ఇన్ని లోపాలతో ఇథనాల్ ప్లాంట్లకు సమర్పించిన పర్యావరణ ప్రభావ అంచనా నివేదికలు ప్రజాభిప్రాయ సేకరణకు ప్రాతిపదికగా, అర్హమైనవిగా పరిగణించలేం. నివేదికలో ప్రాజెక్ట్ కు సంబంధించిన కీలక నియంత్రణ సందర్భం, ప్రాథమిక పర్యావరణ డేటా సమకాలీనత, జీవ వైవిధ్య అధ్యయనాల విశ్వసనీయత, పదార్థ, కార్బన్ సమ తుల్యాలు, ప్రమాద అంచనా, సమష్టి ప్రభావాల వంటి మూలాంశాలు అసంపూర్ణంగా లేదా అస్పష్టంగా ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితులలో ప్రజలు పూర్తి సమాచారంతో కూడిన అభిప్రాయం వ్యక్తం చేయడం సాధ్యం కాదు. అందువల్ల, ఈ ఇఐఎ నివేదిక నాణ్యతా పరంగా ప్రజాభిప్రాయ సేకరణకు అవసరమైన కనీస ప్రమాణాలను కూడా తీరుస్తుందని చెప్పలేం; లోపాల సవరణతో సమగ్రంగా పునఃసిద్ధం చేసిన తర్వాత మాత్రమే ప్రజాభిప్రాయ సేకరణ జరపడం న్యాయం.
మనం రైతులం, కౌలు రైతులం, వ్యవసాయ కూలీలం, మహిళలం, మన భవిష్యత్ జీవితం బాగుండడం కోసం కాలుష్య కారక పరిశ్రమలను వ్యతిరేకించాలి. మన గ్రామాలు, మన వ్యవసాయం, మన పిల్లల భవిష్యత్తు , మన ఆరోగ్యం – అన్నీ కూడా మన ఐక్యత, చైతన్యం, ప్రశ్నించే తత్వం తోనే కాపాడుకోగలం.
రాజకీయ పార్టీలకు, కుల మతాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా మాట్లాడాలి. పోరాడాలి. ప్రజాభిప్రాయ సేకరణ దశలోనే, ఈ కాలుష్య కారక పరిశ్రమలలను ఈ ప్రాంతం నుండీ తరిమేయాలి. మోమిన్ పేట మండల ప్రజలు కూడా , స్థానికంగా రానున్న ఇథనాల్ కంపనీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరముంది.

