భారత్ లో విస్తరిస్తున్న‘ఆకలిరాజ్యం’
x

భారత్ లో విస్తరిస్తున్న‘ఆకలిరాజ్యం’

శ్రమించే కులాలకు చెందిన కోట్లాది మందిని భూమికి, ఉత్పత్తికి దూరం చేసి దేశం ఆర్థికశక్తిగా ఎదగడం సాధ్యం కాదంటున్నారు దళిత బహుజన తత్వవేత్త డా. కత్తి పద్మారావు


డా. కత్తి పద్మారావు *


2024 వ సంవత్సరానికి ప్రకటించిన ఆకలి సూచి (Global Hunger Index) లో 127 దేశాల్లో 105 వ స్థానంలో భారత్ నిలవడానికి కారణమేమిటి ? కన్సర్న్ వరల్డ్ వైడ్ (Concern worldwide , వెల్త్ హంగర్ లైఫ్ (wealthhungerlife.org) సంస్థలు సంయుక్తంగా జిహెచ్ ఐ (GHI) వివరాలను ఏటా ప్రచురిస్తున్నాయి. మన పొరుగునున్న నేపాల్ , శ్రీలంక , మయన్మార్ , పాకిస్తాన్ , ఆఫ్ఘనిస్తాన్ కంటే కూడా ఇండియా వెనుకబడి వుంది. ఆ హారానికి సంబంధించిన నాలుగు అంశాలను పరిగణనలోనికి తీసుకుని ఈ నివేదిక 100 భాగాల స్కేలు మీద భారత్ స్కోర్ 27.3 గా నిర్ణయించింది. 2016 లో 29.3 శాతంగా ఉండింది. వుంది. అంటే సుమారు ఈ 8 సంవత్సరాలలో 2 శాతమే పెరిగింది. నిజానికి మన పాలకులు ఏ దేశాలయితే పేదరికంలో కూరుకుపోయాయని చెపుతున్నారో ఆ చిన్న చిన్న దేశాలు మనకంటే ముందుండడం బాధాకరం.


దీనికంతటికి కారణం గ్రామీణ భారతాన్ని నిర్లక్ష్యం చేయడమే. మానవ వనరులలో భారత్ ప్రపంచదేశాలన్నిటికంటే అత్యుత్తమంగా వుంది. నదులు , కొండలు , లోయలు , మైదానాలు , అడవులు ఇవన్ని కూడా మన ఆర్థిక సంపద. మానవ జీవన వికాసానికి వాటితో మానవ శ్రమను సమన్వయం చేయటం ద్వారా ఉత్పత్తి రంగాన్ని బలోపేతం చేసుకుని దేశ సంపదను పెంచుకోవాలి.


మనదేశ సంపద పెరగకపోవడానికి ఒక ముఖ్యకారణం దళితులను అస్పృశ్యతకు గురిచేసి వారికి భూ వసతి కల్పించకపోవడం వలన వారు వ్యవసాయక స్వీయ ఉత్పత్తిలో భాగస్వామ్యం కాలేకపోతున్నారు. భారతదేశంలో కుల మత బేదాలు లేకుండా భూమి పంపకం జరగాలి. పరిశ్రమల్లో , విద్యా వ్యవస్థల్లో దళిత బహుజనులకు సమానమైన వాటా కావాల్సి వుంది.


దళితులకు భూముల పంపకం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియమావళి 306 నిబంధన క్రింద రాష్ట్రంలో ప్రభుత్వ మిగులు భూములు , బంజరు భూములు సేద్యం చేయగలిగిన పేదలకు పంపిణి " అనే అంశంపైన ది. 18-7-2002న ప్రతి పక్షాల చొరవతో అసెంబ్లీలో చర్చ జరిగింది. ఇందుకు రెవెన్యూ మంత్రి అశోక్ గజపతిరాజు జవాబుగా , 2002 ఏప్రిల్ 1 వ తేదీ వరకు 24 , 43 , 170 మందికి 43,11,000 ఎకరాలకు పైగా ప్రభుత్వ మిగులు భూములు , 5.22,351 మంది లబ్దిదారులకు 5,78,728 ఎకరాల సీలింగు ల్యాండును పంపిణీ చేసామని , ఇంకా 32,629 ఎకరాల భూమిని పంపిణీ చేయవలసి వున్నదని నమ్మబలికారు.




రాష్ట్రంలో అనేకమంది పేద ప్రజలు వ్యవసాయ భూమి లేక అల్లాడుతుండగా , 10 శాతం మంది భూస్వాముల అధీనంలో 70 శాతం భూములున్నాయని బి.జె.పి. సభ్యుడు డా. కె. లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణాలో వేలాది ఎకరాల భూమి ఆక్రణలకు గురై , బీడుగా మారిందని మిగులు భూములను కొనుగోలు చేసేందుకు ఎస్.టి. , ఎస్.సి. , బి.సి. , కార్పొరేషన్లు నుంచి నిధులు తీసుకోవచ్చని , ఆ కార్పోరేషన్లకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక గ్రాంటులనిస్తుందని ఆయన సూచించారు. డా . కె. లక్ష్మణ్ కాంగ్రెస్ పాలనలో వున్నప్పుడు ఈ ఆరోపణ చేశారు. ఇప్పుడు బిజెపి పాలన వచ్చిన తరువాత బిజెపి కార్పోరేట్ వ్యవస్థనే నడుపుతుందే కాని దళితులకు భూమి పంచటం లేదు. ముఖ్యంగా దళిత ద్వేషం పెరిగింది. మరోప్రక్క కమ్మ , రెడ్డి , వెలమ పాలనల్లో కులాధిపత్య పంచాయితీ రాజ్యంగా మిగిలిపోయింది. ముఖ్యంగా దళితులకు పంచాయితీ నిధుల్లో ఏ విధమైన కేటాయింపులు లేవు. వారికి కనీసం స్మశాన భూములు కూడా లేవు. శుభ్రమైన నీరు లేదు. మురుగు కాలువల నిర్మాణం లేదు. గ్రంథాలయాలు లేవు. అంతే కాకుండా స్త్రీలకు మరుగు దొడ్ల వసతి లేదు.

అసైన్డ్ భూములు కూడా ఆక్రమించేశారు

అగ్రకుల భూస్వామ్య వర్గం గ్రామీణ వ్యవస్థలో కులతత్వం పెత్తందారి తనానికీ ఆయువు పోస్తుంది. గ్రామాల్లో వుండే దళిత స్త్రీలకు పౌష్టిక ఆహారం లేదు. రక్తలేమితో వారు నీరసంగా వున్నారు. భూస్వామ్య కులాలు వారిని అతి తక్కువ కూలికే ఎక్కువటైం పని చేయించుకుంటున్నారు. ఏ రాజ్యాంగ సూత్రాన్ని అగ్రకుల పెత్తందారులు పాటించటం లేదు. వారు అబద్ధాన్ని , అవినీతిని , దురాక్రమాలను నిరంతరంగా కొనసాగిస్తున్నారు. దళితుల ఎసైన్డ్ భూములను ఆక్రమించి క్షత్రీయులు , కమ్మవారు , ఇంజనీరింగ్ కాలేజీలు కట్టుకున్నారు. దళితులను దూరంగా నెట్టివేసి అందులో ఫ్యూన్ పని కూడా వారికి ఇవ్వకుండా సొంత కులాలతో నింపుకున్నారు. దళితులకు బ్రిటీష్ వారు ఇచ్చిన ఎసైన్డ్ భూములపై సిబిఐ విచారణ గాని మనం వేయగలిగితే వీరికి కొన్ని లక్షల ఎకరాలు తిరిగి వారికి చెందుతాయి.


కులవ్యవస్థ ఉండాలంటున్నారు

కుల వివక్షపై ఎన్డీఏ ప్రభుత్వమే కాదు , సంఘ పరివార్ విధానం కూడా సుస్పష్టం. కుల భావననీ , కుల వివక్షనీ హిందూ భావజాలంలో భాగంగా ఆదర్శీకరిస్తున్నారు. కులంలేని హిందూభావజాలం గింజలేని గుజ్జు లాంటిదని అందరికి తెలుసు. అంచేత శ్రీ గిరిరాజ్ కిషోర్ వంటి బిజెపి అధికార ప్రతినిధులు ( డెక్కన్ క్రానికల్ 13 , మే ) , కులం తొలగించబడితే హిందూ సామాజిక క్రమంలో ఒక ప్రాధమిక ‘హక్కు’ని పోగొట్టుకోవడం అనే వాదాన్ని లేవనెత్తారు. బహుశా శ్రీ గిరిరాజ్ కిశోర్కి , భారత కుల వ్యవస్థ వల్ల అగ్ర కులాలకి కొన్నివిశేష సదుపాయాలు అందుతున్నాయనే అభిప్రాయమున్నట్లుంది. కులాలు రూపుమాసిపోతే ఆ విశేష వసతులు పోతాయని ఆందోళణ ఉండి ఉండవచ్చు. అయితే దళిత కార్యకర్తలు , మానవ హక్కుల సంఘాలు కుల వివక్షని భారతదేశానికే పరిమితమైన సమస్యగా కాకుండా , అంతర్జాతీయ మానవ హక్కుల్లో భాగంగా గణిస్తున్నారు.


Dr. Katti Padmarao, Senior Fellow. ICSSR, New Delhi


కులం కేవలం దళితుల సమస్యే కాదు


కుల వివక్ష అన్నది కేవలం దళితులకే సంబంధించిన అంశం కాదు. ఇది మొత్తం హిందూసమాజానికి సంబంధించిన సమస్య. అంతర్జాతీయంగా సామాజిక శాస్త్రవేత్తలు తెలుగు రాష్ట్రాలలో కమ్మ , రెడ్డి , రాజు , క్షత్రియ కులాల్లోని దురాక్రమణ చూసి విస్తుబోతున్నారు. దళితులకు బహుజనులకు భూములు పంచకపోగా వారి భూములను ఆక్రమిస్తున్న ధోరణి సమాజా గుండెలకు గాయం చేస్తుంది. నిజానికి కొంతమంది వాదించినట్లు రిజర్వేషన్ ఫలితాలను పొందుతున్న దళితులు బి.సి.లు తమ గ్రామాల వైపు తొంగి చూడటంలేదు. వారు పట్టణాలను ఆశ్రయిస్తున్నారు. అంబేడ్కర్ ఈ విషయంలో ఆవేదన చెందాడు. ఎందుకంటే వారు అగ్రకుల సంస్కృతిలోకి నెట్టబడుతున్నారు అని తేలింది.


దళితులకు భూముల్లో , పరిశ్రమల్లో , విద్యలో అన్ని ఉత్పత్తి రంగాల్లో సరైన వాటా కల్పించినట్లయితే భారతదేశంలో ఆకలి వుండదని అంబేడ్కర్ చెప్పాడు. వాళ్లందరిని ఉత్పత్తిలో భాగస్వాములనుచేయాలి. అలా జరగడం లేదు. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసినవారు కుల , మత , వివక్షతతో జీవిస్తూ , నటిస్తూ రాజ్యాంగాన్నే ఛాలెంజ్ చేస్తున్నారు. దీనివలన దేశంలో ఆకలి , అవిద్యను పెంచటమే తప్ప అభివృద్ధి ఏమి ఉండదు. ముఖ్యంగా పాలిచ్చే తల్లికి పాలివ్వగలిగిన శక్తి లేదు. ఆమె ఒక గ్లాస్ పాలుత్రాగే పరిస్థితులు లేవు. ఆమె నాటు వేసినా ఆమెకు ఒక సెంటు భూమి లేదు. మగ్గం మీద నేతనేసే స్త్రీకి సరైన వస్త్రం లేదు. చేపలు పట్టే వారికి చేపలు లేవు. పిల్లల్ని చదివించుకోలేక పోతున్నారు. బాల్యంలోనే క్వారీల్లో రాళ్ళు కొట్టేవారు , స్టేషన్లలో కాగితాలు ఏరేవారు , హోటల్లో కప్పులు కడిగేవారు బలవంతపు వెట్టి చాకిరిలో బాలురు వున్నారు. దళిత వర్గాల్లో బాలికల పరిస్థితి దారుణంగా వుంది.

మహిళ పరిస్థితి మరీ దారుణం

2001 లెక్కల ప్రకారం పురుషులలో అక్షరాస్యత 75.26 % వుండగా స్త్రీలలో 53.67 % వుంది. గ్రామీణ స్త్రీల అక్షరాస్యత మరీ హీనంగా 13.7 % వుంది. దాదాపు ఇండియాలోని 45 జిల్లాలలో మహిళా అక్షరాస్యత 30 శాతం కంటే తక్కువగా వుంది. ఇంచుమించు భారతదేశంలోని 15 జిల్లాలలో , ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ , బీహార్ , మధ్యప్రదేశ్ , రాజస్థాన్ , ఉత్తర ప్రదేశ్లో దళిత స్త్రీల అక్షరాస్యత 5 % కంటే తక్కువగా వుంది.. పాఠశాలలకు వెళ్ళే బాలుర సంఖ్య కంటే బాలికల సంఖ్య చాలా తక్కువ. బడిలో నమోదుకాని పిల్లల సంఖ్యల్లో ముప్పాతిక వంతు అమ్మాయిలే. ( 1970-80 ) బడి మానివేసే పిల్లలలో కూడ బాలికల సంఖ్యే ఎక్కువ. ప్రాథమిక స్థాయిలోగాని , మాధ్యమిక స్థాయిలోగాని , ఉన్నత పాఠశాల స్థాయిలోగాని బడిమానేసే అమ్మాయిల సంఖ్యే ఎక్కువ. సమాజంలోని కార్మిక బలగంలో పావువంతు మహిళలే ఉన్నారు. కాని వారికి పురుషులకిచ్చే వేతనంలో 60 శాతం మాత్రమే ఇస్తున్నారు. అధికశ్రమ , తక్కువ జీతం ఇచ్చే పనులలో స్త్రీలు ఎక్కువ సంఖ్యలో క్రిక్కిరిసి వున్నారు. 94 శాతం స్త్రీలు అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. అందులో 81.4 శాతం వ్యవసాయరంగంలో , 12.6 ఇతర రంగాలలో వున్నారు. అదే సంఘటితరంగంలో అతి తక్కువ , సూక్ష్మాతి సూక్ష్మమైన సంఖ్యలో స్త్రీలు ఉన్నతోద్యోగాలలో అనగా స్వయం నిర్ణయాధికారం గల ఉద్యోగాలలో వున్నారు. ఏదైనా ఆర్థిక సంక్షోభం కలిగినప్పుడు అందరికంటే ముందు ఉద్యోగాలూడేవి స్త్రీలవే.


విస్తరిస్తున్న ఆకలి రాజ్యం


ప్రపంచ వ్యాప్తంగా సామాజిక ఆర్థిక సంక్షోభం పెరగడం కూడా మధ్య తరగతుల్లోనూ కొద్దిపాటి రైతుల్లో కూడా ఆకలిగా వుండే వారి సంఖ్య పెరుగుతుంది. ప్రపంచంలో అనేక సందర్భాలలో ఆర్థిక ప్రతిష్టంభన వచ్చిందని ప్రపంచ ఆర్థిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 1974-1975 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో అమెరికా , పశ్చిమ యూరప్ , జపాన్ లో దాదాపు ఏకకాలంలో ఉత్పత్తి పడిపోయింది. ఆ దశలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆ ఆర్థిక సంక్షోభంతోబాటు అతి తీవ్రమైన ఇంధన , ముడి పదార్థాల సంక్షోభాలు జమిలిగా ప్రజ్వరిల్లాయి. మరి కొద్ది సంవత్సరాల్లో మరో సంక్షోభం దాపురించబోయే భయంకర ప్రమాద చిహ్నాలు కానవచ్చాయి. అమితోత్పత్తి భయంకర సంభావ్యత మరోసారి వాస్తవం అవుతోంది. నిపుణుల అంచనా ప్రకారం ప్రస్తుత దశాబ్దాంతంలో పశ్చిమ దేశాల్లో తీవ్ర పరిస్థితి సడలేందుకు బదులు , పెట్టుబడిదారీ వ్యవస్థ మరిన్ని కొత్త కష్టాల సుడిగుండంలో చిక్కుకుంటుంది.

అయితే వీటన్నిటిలో తట్టుకుని నిలబడాలంటే భారతదేశంలో ఉత్పత్తి రంగాన్ని విస్తరింపచేయాలి. ఇది జరగాలంటే బి.ఆర్. అంబేడ్కర్ చెప్పినట్లు రాజ్యాంగ సూత్రాల ప్రకారం గ్రామ పట్టణాల్లో కుల వివక్షను నిర్మూలిస్తూ పరిపాలన సాగించాల్సిన చారిత్రక అవసరం ముందుకు వచ్చింది. ప్రజలు ఆకలితో అలమటించడం భారతదేశానికి మంచిది కాదు.

ఏ ప్రజలు అయితే నీకు ఓటు వేశారో ఆ ప్రజలందరికి ఉత్పత్తి రంగంలో భాగస్వామ్యం కల్పించి స్వతంత్రంగా స్వేచ్ఛగా తమ భూవనరులలో తామే పనిచేసుకుని ఫలసాయం పొందేలా చూడాలి. అపుడు వారు తమ పిల్లల్ని వెట్టిలోకి పంపకుండా చదివించుకుని సుఖ సంతోషాలతో జీవించే పరిస్థితులు ఏర్పడతాయి. ఇలా అన్ని కులాల వారిని ఉత్పత్తి రంగం భాగస్వాముల్ని చేసి ఆర్థిక వ్యవస్థ విస్తరించేలా చేస్తే ప్రపంచ దేశాల్లో భారతీయుడు తలెత్తుకుని నిలబడతాడు. ఆనాడే ఆకలి భారతంగా కాక , ఆర్థిక సంపదున్న అభ్యుదయ భారతం మన కళ్లముందు ప్రత్యక్ష మవుతుంది,


* డాక్టర్ కత్తి పద్మారావు, అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ , అంబేద్కర్ కాలనీ , పొన్నూరు పోస్ట్ , గుంటూరు జిల్లా , ఆంధ్రప్రదేశ్)


Read More
Next Story