
ప్రత్యేక హోదా కన్నా ప్రతిపక్ష హోదా ముఖ్యమైందా
ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పంచాయతీ పర్యవసానాలు?
-తెలకపల్లి రవి
ప్రధాన పాలక పార్టీలు అవసరమైన అంశాలను వదలిపెట్టి అసందర్భ వివాదాలలో మునిగి తేలడం ఆంధ్ర ప్రదేశ్‌కు శాపంగా తయారైంది, దక్షిణ భారతంలోని అయిదు ప్రధాన రాష్ట్రాలలోనూ ఎక్కడా లేనట్టు ఈ రాష్ట్ర రాజకీయ చర్చ బిజెపి రహితంగా సాగిపోతుంటుంది. ఎందుకంటే పాలక ఎన్‌డీఎ కూటమికి నాయకత్వం వహించే టిడిపి గానీ, కూటమిలోని జనసేన గానీ(బిజెపి సరేసరి) కేంద్రం జోలికి పోవు. తమాషా ఏమంటే ప్రతిపక్షంలోని మాజీ పాలక పార్టీ వైసీపీ కూడా బీజేపీ పేరు తలవదు.మిగిలిన దక్షిణ భారతంలోని మిగిలిన ప్రతిపక్ష పార్టీలతో కలవదు.ఈ రెండు శిబిరాలు ఎప్పటికప్పుడు తమ పరస్పర వివాదాలకే పరిమితమై విద్వేషపూరిత వ్యాఖ్యలతో వేడిపెంచుతుంటారు. ఎపికి ఇప్పుడు కావలసింది రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి, రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలు ప్రకాశం వెనకబాటుపై చర్యల వంటివి. వీటితో సహా ఇతర ఆర్థిక సవాళ్లకు ప్రత్యేకహోదా తప్పనిసరి అని అందరూ అంగీకరిస్తారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ వూసే వినిపించదు. రాష్ట్రానికి ప్రాణప్రదమైన ప్రత్యేకహోదాను వదలిపెట్టి ప్రతిపక్షానికి హోదా ఇవ్వడమా లేదా అనే దానిపైనే ఎడతెగని చర్చ నడిపిస్తుంటారు. కొత్త శాసనసభలో ప్రమాణాల తర్వాత మొదటి సారిగవర్నర్ ప్రసంగానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ హాజరై వాకౌట్ చేయడం,బుధవారం నాడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు హోదాకు అవకాశం లేదని రూలింగ్ ఇవ్వడంతో ఈ చర్చ మరోసారి తారస్థాయికి చేరింది. ఇదే సమయంలో సమాంతరంగా బడ్జెట్‌పై మీడియా తో మాట్లాడిన జగన్ కూడా దాంతో పాటు ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబుపైన, అంతకుమించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పైన చేసిన తీవ్ర వ్యాఖ్యలు కొత్తదుమారానికి దారితీశాయి. తగ్గేదేలేదని ఇరుపక్షాలూ కయ్యానికి కాలు దువ్వుతున్నాయి.
ఎన్నికలు జరిగి శాసనసభ సమావేశాలు ప్రారంభమైనాక స్పీకర్ అయ్యన్న పాత్రుడు మొదటిసారి ప్రతిపక్ష హోదాపై అధికారికంగా స్పందించారు. తనకు జగన్ 2024 జూన్21 రాసిన లేఖ ప్రేలాపనలతో ఆరోపణలతో నిండి ఉందని ఆగ్రహం వెలిబుచ్చారు. అయినా క్షమిస్తున్నట్టు ప్రకటించారు. అయ్యన్న పాత్రుడు స్పీకర్ పదవిలోకి రాకముందు అభ్యంతరకర భాషలో మాట్టాడిన మాట నిజమే కానీ ఇప్పుడు వాటిని ప్రస్తావించి ఉపయోగం నాస్తి. హోదా ఇవ్వడంపై జగన్ హైకోర్టులో వేసిన పిటిషన్ ఇంకా విచారణార్హత ఇంకా తేలలేదు గనక చూద్దామని స్పీకర్ అన్నారు.సభ తరపున మాత్రం హోదా వచ్చే అవకాశం లేదని, సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో పదోవంతు అంటే 18 లేవు కనుక హోదా రాదని తేల్చేశారు.దేవుడు అంటే ప్రజలు సీట్లు ఇవ్వనపుడు పూజారిపై ఆగ్రహించి ఉపయోగమేంటని వ్య్ఖాఖ్యానించారు.
జగన్‌కు వైసీపీకి ఈ విషయంలో సమాధానం ఇవ్వా ల్సిన అవసరాన్ని కూటమి గుర్తించడం ఇక్కడ గమనించదగింది. ఆయన పట్ల తాము మర్యాదగానే వ్యవహరించామని కూడా స్పీకర్ చెప్పడం కూడా ఆసక్తికరం. మంత్రులు అయిన వెంటనే తనతో ప్రమాణస్వీకారం చేయించడం, సభలో ముందు వరసలో సీట్లు కేటాయించడం ఇందులో భాగమే.బహుశా ఏదైనా సమాధానం చట్ట ప్రకారం ఇవ్వాలని కేంద్రం నుంచి సూచన వచ్చి వుండొచ్చు. లోక్‌సభ ప్రకటించిన సెక్షన్121(సి) ప్రకారం పదోవంతు స్థానాలు లేకుండా హోదా ప్రసక్తిలేదని తేల్చేశారు.
ఇక ఉమ్మడి ఎపి శాసనసభ చట్టం 1953 సెక్షన్ 12 బి ప్రకారం సభాపతి గుర్తించిన వ్యక్తికే ప్రతిపక్ష హోదా వస్తుందని స్పీకర్ స్పష్టం చేశారు. దీనిపై చర్చలో పాల్గొన్న మంత్రి నారాలోకేశ్,మంత్రి మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా సాంకేతిక పరిభాషలోనే సమాధానమిచ్చారు.జగన్ స్పీకర్‌కు రాసిన లేఖను బహిర్గతం చేయాలని కూడా కొందరన్నారు. నిజానికి దాని వివరాలు పత్రికల్లో వచ్చినవే.ఇంకోసారి దుర్భాషలాడితే ఏం చేయాలో సభలో చర్చించి నిర్ణయించాలన్న మాట మాత్రం భవిష్యత్తులో వేటు వేయడానికి సంబంధించిన సంకేతమా అన్న సందేహం కలుగుతుంది.
దీనిపై జగన్ మీడియా గోష్టిలో షరా మూమూలుగా తన వాదనలు వినిపించడమే గాక ఎదురుదాడి గా పరిణమించింది. హోదా ఇవ్వడానికి నిబంధనలున్నాయి గానీ ఇవ్వకూడదని ఎక్కడా లేదు కదా అనేది ఆయన ప్రధాన వాదన. ఢల్లీ శాసనసభలో బిజెపికి మూడు స్థానాలే వున్నా ఆప్ ప్రభుత్వం అప్పట్లో హోదా ఇచ్చిందని పదేపదే చెబుతున్న మాట మళ్లీ వినిపించారు,. అయితే సాధారణ సంబంధాలే లేని సంఘర్షణలో ఆ తరహా సుహృద్భావం ఎలా ఆశిస్తాం? పైగా గత సభలో టీడీపీ కి వున్న 23 మంది సభ్యుల్లో ఆరుగురిని లాగేస్తే చంద్రబాబు ప్రతిపక్షహోదా కూడా ఉండదని తానన్నమాటను సభలో అధికార పార్టీవారు గుర్తు చేశారు. తమాషా ఏమంటే జగన్ దాన్ని పునరుద్ఘాటించడమే గాక అయిదుగురు పక్కన కూర్చున్నా ఆయనకు హోదా కొనసాగించానని గొప్పగా చెప్పారు.(18మంది వుంటే హోదా పోదు నిజానికి) అంతకంటే తీవ్రమైంది పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్య. పవన్ ఈ విషయమై గౌరవంగానే స్పందిస్తూ సభకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. కాకపోతే చివరలో మాత్రం జగన్‌కు హోదానే కావాలంటే జర్మనీకి పోవాలన్నారు. జర్మనీలో దామాషా ప్రాతినిధ్యం వుంది గనక వైసీపీకి వచ్చిన 40 శాతం ఓట్లకు అధిక సాథనాలు వస్తాయనే పవన్ పాయింట్ నిజానికి వీరికే అనుకూలమైంది.
అయితే జగన్ జర్మనీకి వెళ్లాలని చెప్పిన దానిపై కినుక వహించిన జగన్ పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ,మంత్రికి తక్కువ అని ఉద్దేశపూర్వక వ్యాఖ్యలతో వివాదం పెంచారు. ఉపముఖ్యమంత్రి హోదా కార్పొరేటర్‌కంటే తక్కువని మాజీ ముఖ్యమంత్రి ఉద్దేశమైతే హాస్యాస్పదమే. పవన్ సనాతన రాజకీయాలు, ప్రధాని మోడీకి భజన చేయడం వంటివాటిని ఎంతైనా విమర్శించవచ్చు గానీ ఆయన స్థానాన్ని చులకన చేయడం ఎలా కుదురుతుంది?
పవన్ శాసనసభ గేట్లు కూడా తాకలేడన్న జగన్ ఇప్పుడు ఆయన పోటీ చేసిన 21 స్థానాలు గెలిచి కీలక పదవిలోకి వచ్చారని ఒప్పుకోవాల్సిందే. ప్రభుత్వ కార్యాలయాల్లో జగన్ ఫోటో స్థానంలో చంద్రబాబు ఫోటో రాగా పక్కన పవన్ కూడా వుంటారు. ఎంత అపహాస్యం చేసిన నిజాలు మారవు.గతంలో కూడా వ్యక్తిగత ఆరోపణలు వ్యాఖ్యానాలలో ఈ ఉభయులూ చాలా దూరం వెళ్లారు. కాకపోతే ఎన్‌డిఎకు నాయకత్వం వహిస్తున్న బిజెపిని ఏమీ అనకుండా జగన్ రాజకీయ సర్కస్ చేయడం ఇక్కడ ఆసక్తికరం.ఇది వారి మధ్య అవగాహన ఫలితమని వైసీపీ నేతలు కొందరంటారు. పవన్‌పై ఆయన వ్యాఖ్యల దుమారంలో ముఖ్యమంత్రిని ఏకంగా రాక్షసుడని తిట్టిపోసిన తీరు చర్చకు రాకుండా పోవడం కూడా విశేషమే. ఏదైనా ఈ పరిణామం తర్వాత కొన్ని అంశాలు తేటతెల్లమవుతున్నాయి.జగన్‌కు హోదా వివాదం మరిన్ని పరిణామాలకు దారితీసే అవకాశముంది, ఇందులో స్పీకర్‌ను అవమానించారనే ఆరోపణపై అనర్హత వేటు వేయడం కూడా వుంటుందా అనేది చూడాలి.
శాసనమండలిలో వైసీపి ఎదురుదాడి తీవ్రం కావడంతోప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ ఫోకస్ లోకి వస్తున్నారు. గతంలో తను సభకు వెళ్లకపోవడమే గాక మిగిలిన వారిని కూడా వెళ్లకుండా చేసిన జగన్ ఇప్పుడు మండలిలోనూ ఆ వ్యూహం పునరావృతం చేస్తే పరిస్థితి మరోలా ఉంటుంది. జగన్ సభకు వెళ్లి సంభాషించాలనీ సవాలు చేయాలని ప్రజలు కోరుకుంటారు. వైసీపీ వారికి పనులు చేయొద్దని చంద్రబాబు చిత్తూరు జిల్లా సభలో చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేసే వైసీపీ అధినేత ఇక్కడ తన చేతిలో వున్న అవకాశాన్ని కూడా ఎందుకు వదులుకుంటున్నట్టు? మీడియా గోష్టిలో అన్నట్టు బడ్జెట్‌పై మాట్లాడేందుకు గంటన్నర సమయం ఎవరిస్తారు? ఆ పోరాటం సభలో చేయాల్సిందే గాని బయట ఎంత మాట్లాడినా ఫలితమేముంటుంది?ముందే చెప్పినట్టు ఇవన్నీ రాష్ట్రానికి సంబంధించిన నిజమైన సమస్యలతో నిమిత్తం లేని వృథా వివాదాలే. తమిళనాడులో అన్ని పార్టీలూ సీట్ల తగ్గింపుతో సహా వివిధ సమస్యలపై అఖిలపక్ష చర్చలు జరుపుతున్నారు. ఎపిలో మాత్రం ప్రత్యేకహోదా కోసం ఉమ్మడిగా పోరాడే బదులు ప్రతిపక్ష హోదాపైనే మల్లగుల్లాలు పడుతున్నారు.