నేరం ఎవరిదైనా శిక్ష పడేది కాశ్మీర్ లోయప్రజలకే!
x

నేరం ఎవరిదైనా శిక్ష పడేది కాశ్మీర్ లోయప్రజలకే!

"పహల్గామ్ దుర్ఘటనకు ఎవరు ఎందుకు పాల్పడ్డారని కాదు, దాని ఫలితాలు ఏమిటనేది ముఖ్యం"

ఈ క్రూరాతి క్రూర నేరం ఎవరు చేసినా, ఘోరాతి ఘోరం వెనక ఎవరున్నా, ఈ దారుణమైన పరమ పాపానికి పాల్పడింది ఎవరైనా, తాము చేయని నేరానికి దారుణమైన శిక్షల్ని అనుభవించేది మాత్రం కాశ్మీర్ లోయకు చెందిన నిరుపేద ప్రజలే! ఉగ్రవాదం, తీవ్రవాదం, భీభత్సవాదం వంటి ఏ పేర్లతో పిలిచినా, వాటికి వాస్తవంగా మొట్టమొదట బలయ్యేది దుక్కిదున్ని పంటలు పండించుకునే కాశ్మీర్ లోయకు చెందిన పేద సన్నకారు, చిన్న రైతాంగమే. వీటి వలన అంతిమంగా లాభపడేది ఆదానీ, అంబానీ నుండి ఎలాన్ మాస్క్ వంటి స్వదేశీ, విదేశీ కార్పొరేట్ కంపెనీలే! ఆ భస్మాసుర కంపెనీల బొజ్జలకి లోయ డ్రైఫ్రూట్స్ భూములు, ఆపిల్ పండ్ల తోటలు, కుంకుమ పువ్వు తోటలు అప్పగించడానికే!

ఎందుకంటే.....
5-8-2019 తేదీన పార్లమెంటును మూసి ఆర్టికల్ 370, 35A ల్ని రద్దు చేసిన విషయం తెల్సిందే! దానితో కాశ్మీర్ లోయలో బయటి వాళ్ళు భూముల్ని కొనే అవకాశం వచ్చింది. ఆ బయటి వాళ్ళల్లో తెలుగింటి మల్లయ్య, తమిలింటి తంబీయార్, కన్నడిగు నంజప్ప, మలయాళ నంబియార్, ఒడియా సాహు, ఇంకా ఇలాంటి ఎవరెవరో లోయకు వెళ్లి భూములు కొనుక్కోరు. వాటిని కొనేది కేవలం కార్పొరేట్లు మాత్రమే.
ఆదివాసీల భూముల పరిరక్షణ కోసం తెచ్చిన "వన్ ఆఫ్ సెవెంటీ చట్టం" (1/70) తెల్సిందే. దాని ప్రకారం ఆదివాసీల భూముల్ని బయటి సంపన్న వర్గాలు కొనే అవకాశం లేదు. ఒకవేళ దాన్ని రద్దు చేశారని అనుకుందాం. అక్కడి భూముల్ని కొనేవాళ్ళు వస్తారు. పేదరికం వల్ల అమ్ముకునే పేదవాళ్ళు వుంటారు. ఇక ఆదివాసీ ప్రాంతాలు రాబందుల పాలు కావడం నిజం.
పేదరికంతో భూముల్ని అమ్ముకునే ఈ అమ్మక సూత్రం కాశ్మీరు లోయలో ఫలించలేదు. కార్పొరేట్ల అంచనా తలక్రిందులై పోయింది. ఏం చేయాలో దిక్కుతోచక రకరకాల వ్యూహాల గూర్చి బడా కార్పొరేట్లు, వారి పక్షాన రాజకీయ ప్రాతినిధ్యం వహించే ఎన్డీఎ ప్రభుత్వం ఆలోచించే పరిస్థితుల్లో తాజా నరమేధ ఘటన జరిగింది.
ఏ ఘటన వెనక ఏ ఉద్దేశ్యాలున్నాయిని కాదు, వాటి ఫలితాలు ఏమిటో ముఖ్యమని లెనిన్ అంటాడు. ఈ దుర్గటనకు ఎవరు ఎందుకు పాల్పడ్డారని కాదు, దాని ఫలితాలు ఏమిటో ముఖ్యమైనది.
కాశ్మీరు లోయలో 370 రద్దు ద్వారా 2019 లో భూముల్ని కొనుక్కునే అవకాశాన్ని అంబానీ, ఆదానీ వంటి కార్పొరేట్లకి మోడీ సర్కార్ మాత్రం కట్టబెట్టింది. కానీ వాళ్ళ అంచనాలు తారుమారు ఐపోయాయి. ఐదేండ్లు గడిచింది. ఇంతవరకూ ఒక్క ఎకరం భూమినైనా ఒక్క రైతు అమ్మడానికి ముందుకు రాలేదు. బడా కార్పొరేట్ల ఆశలు అన్నీ అడియాసలయ్యాయి.
దీనితో కక్ష కట్టిన మోడీ సర్కార్ లోయ రైతాంగం పండించిన ఆపిల్ పండ్ల రవాణాపై దెబ్బ తీసింది. లోయ నుండి ఇండియా రవాణా కావడానికి గల ఏకైక హైవేని ఏదో కుంటి సాకులతో స్థంభనకు గురిచేసింది. గత ఐదేండ్ల కాలంలో అనేకసార్లు వేల ట్రక్కుల ఆపిల్ పండ్ల లోడ్లు వారాల తరబడి కృత్రిమ ట్రాఫిక్ జామ్స్ లో చిక్కిపోయింది. సరుకు మురిగిపోయింది. అది పనికి రాకుండాపోయి లోయ రైతాంగం తీవ్రంగా నష్ట పోయింది. దాంతో నిరాశకు గురై లోయకు చెందిన చిన్న, సన్నకారు రైతులు తమ భూముల్ని అమ్ముకుంటారని బడా కార్పొరేట్లు గుంటనక్కల్లా పొంచి చూశాయి. ఐనా కార్పొరేట్ల అంచనాలు బేడీసికొట్టాయి.
కాశ్మీరులో సుమారు పదిహేను లక్షల వరకు భూకమతాలు వుంటే, అందులో సన్నకారు రైతుల కమతాల సంఖ్య 81 శాతం వుంది. చిన్న రైతుల కమతాల సంఖ్య 12 శాతం వుంది. ఐదు ఎకరాలు మించిన పెద్ద రైతుల కమతాల సంఖ్య 6 శాతం మాత్రమే వుంది. ముఖ్యంగా సన్నకారు, చిన్న రైతులు పేదరికంతో రకరకాల ఇబ్బందులు అనుభవిస్తూ కూడా తమ భూముల్ని అమ్మకుండా ఐక్యంగా నిలబడ్డారు.
కొనుక్కొనే రాబందులకు మోదీ నేతృత్వంలోని ఎన్ డి ఎ సర్కార్ ఆర్టికల్ 370 35 A రద్దు ద్వారా అవకాశం కల్పించింది. కానీ కాశ్మీరు జాతీయ సమైక్యతతో భూముల్ని అమ్మకూడదని స్వచ్చంద కట్టుబాటు లోయలో కొనసాగుతోంది. వారు అంబానీ, ఆదానీ వంటి రాబంధులకు ఎరగా మారడం లేదు. వారిలో తిండి లేని పేదలకు సాటి ప్రజల్లో కలిగిన దాంట్లో ఓ ముద్ద పెడుతూ పరస్పర సహకారంతో నేడు అదో ఆదర్శవంతమైన గొప్ప ఉద్యమంగా సాగుతోంది. అలా వర్దిల్లుతోన్న కాశ్మీర్ జాతీయ సమైక్యతా ఉద్యమాన్ని దెబ్బతీసే పధకాల కోసం రకరకాల వ్యూహ రచనల్ని బడా కార్పొరేట్లు చేసే వేళలో తాజా దుర్గటన జరగడం గమనార్హం!
ఇళ్ల నుండి రైతుల్ని సైనికులతో ఈడ్చుకొని రిజిస్టార్ ఆఫీసులకు తీసుకోచ్చి కార్పొరేట్ కంపెనీలకు భూముల్ని అమ్ముతూ బలవంతంగా సంతకాలు చేయించడం కోసం బడా కార్పొరేట్లు వ్యూహం పన్నుతున్న పరిస్థితుల్లో తాజా దుర్గటన జరిగింది. అలా తప్ప అక్కడి పేద రైతుల భూముల్ని కబ్జా చేయడం కార్పొరేట్లకు అవకాశం లేని పరిస్థితుల్లో తాజా దుర్గటన జరిగింది. వారు ఉగ్రవాదులకు అండగా నిలబడ్డారనే వంకతో వారిని బలవంతంగా ఇళ్ల నుండి సైనికులతో గుంజుకొచ్చి సంతకాలు చేయించాల్సిన ప్రత్యేక అవసరం ఏర్పడ్డ వేళలో ఈ దుర్గటన జరిగింది. అట్టి ఫాసిస్ట్ ప్రక్రియకు భారతదేశ ప్రజల మద్దతు ఎన్ డిఎ సర్కార్ కి విధిగా అవసరమైన పరిస్థితుల్లో తాజా దుర్గటన జరిగింది.
ఈ నేరం, దారుణం, పాపం, ఘోరం ఎవరు చేసినా ఫలితం ఏమిటో ముఖ్యం. దీనిని బూచిగా చూపించి రేపటి ఫాసిస్ట్ దాడి ఎవరి మీద గురి పెడతారో తెలియనిది కాదు.
కగార్ పేరిట అడవుల్ని రక్తసిక్తం చేస్తున్న పరిస్థితి తెల్సిందే! ఆదివాసీ ప్రజల్ని దారుణ మారణహోమానికి గురి చేస్తున్నది. గత రెండు రోజులుగా వేల సైనిక బలగాలతో తాజా దాడి తెల్సిందే! ఆదివాసీల హననం కోసం డ్రోన్స్ ని సైతం వాడుతున్నది. చెట్లు, పుట్టలు, గుట్టలు, కొండలు, కోనలు, వాగులు, వంకలు జల్లెడ పట్టడానికి శాస్త్ర, సాంకేతిక వ్యవస్థల్ని వినియోగిస్తోంది. మరి పహాలగాంలో యాత్రకు వెళ్లిన పర్యాటకులకు మోడీ సర్కార్ ఎందుకు రక్షణ కల్పించడంలో వైఫల్యం చెందింది? ఈ అనుమానం ఎవరికీ రాకుండా ఉంటుందా?
ఒకవైపు అడవుల కబ్జా కోసం కగార్ ఆపరేషన్ కొనసాగిస్తూ, మరోవైపు కాశ్మీరు ఆపరేషన్ కోసం వ్యూహం పన్నుతున్న పరిస్థితి అర్ధమౌతుంది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి ముక్త కంఠంతో ఖండిద్దాం. దీనిని పాక్ బేస్డ్ ఉగ్రవాద సంస్థ చేసిందా? ఇండియన్ డీప్ స్టేట్ చేయించిందా? ఇందులో ఏది నిజమో రేపటి చరిత్ర రుజువు చేస్తుంది. ఇది ఎవరు చేసినా, బలయ్యేది లోయ రైతాంగమే. లోయ ప్రజలే! కార్పొరేట్లకు లాభం కలిగించిదే! ఈ స్ఫూర్తితో ఇటు కగార్ ఆపరేషన్, అటు లోయ ఆపరేషన్ కి వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడదాం.


(The Federal seeks to present views and opinions from all sides of the spectrum.The information, ideas or opinions in the articles are of the author and do not necessarily reflect the views of The Federal)


Read More
Next Story