ఉపఎన్నికలంటే బిఆర్ ఎస్, బిజెపిలకు అంత ఉబలాటమెందుకు?
x

ఉపఎన్నికలంటే బిఆర్ ఎస్, బిజెపిలకు అంత ఉబలాటమెందుకు?

ఉప ఎన్నికలు జరిగితే ఎవరికి లాభం? ఎవరికి నష్టం, అన్నదాని పార్టీల లెక్కలెలా ఉన్నాయంటే...


తెలంగాణ లో ఉప ఎన్నికలు (Byelections) ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ కండువా కప్పుకున్న గులాబీ గూటికి చెందిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? సుప్రీం కోర్ట్ లో అనర్హత పిటీషన్లపై విచారణ సాగుతున్న వేళ ఉప ఎన్నికలపై ఊహాగానాలు షురూ అయ్యాయి. ఉప ఎన్నికలు జరిగితే ఎవరికి లాభం? ఎవరికి నష్టం అన్నదానిపై మాత్రం ఇంకా లెక్కలు కొనసాగుతూనే ఉన్నాయి.

పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయంగా భావిస్తున్న బీఆర్ఎస్ (BRS) ఇప్పటినుంచే ఆయా నియోజకవర్గాలపై దృష్టి పెట్టి పార్టీ శ్రేణులను తిరిగి ఉత్తేజపరిచే పనిలో పడింది. అధికార కాంగ్రెస్ మాత్రం పార్టీ మారిన ఎమ్మెల్యే లపై వేటు పడే అవకాశం లేదనే భావిస్తోంది. గత అనుభవాలను కూడా మేళవించి , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) తాజాగా అసెంబ్లీ వేదికగా ఉప ఎన్నికలు రావని స్పష్టం చేయడం పలు చర్చలకు తావిచ్చింది.అటు బీజేపీ కూడా ఉప ఎన్నికలు రావాలని కోరుకొంటోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోరుతో కొన్ని స్థానాలకైనా ఉప ఎన్నికలు వస్తే మధ్యలో తాము లాభపడకపోతామా అన్నది కమలనాధుల ఆశ.

కాంగ్రెస్ ఎందుకు ఉప ఎన్నికలు కోరుకోవడం లేదంటే..

రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పడం సంచలనమే అయింది. ఎమ్మెల్యేల అనర్హత అంశం కోర్టులో విచారణలో వుండగానే అసెంబ్లీ లోనే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేయడం అందరికీ ఆసక్తిగా మారింది అదే సమయంలో కాంగ్రెస్ ఉప ఎన్నికలు కోరుకోవడం లేదన్నది స్పష్టమవుతోంది. 10 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ సీట్లను సొంతంగానే గెలవొచ్చుకదా అనుకుంటే పొరబాటే. బీఆర్ఎస్ నుంచి ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు కాబట్టి ఇప్పుడా సీట్లన్నీ కాంగ్రెస్ ఖాతాలో వున్నట్లే. కావాలని కోరి ఉప ఎన్నికలు తెచ్చుకోవడం ఎందుకన్నది రేవంత్ ఉద్దేశ్యం. బీఆర్ఎస్ నుంచి గెలిచిన నియోజకవర్గాల్లోనే ఉప ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ప్రభుత్వానికి నష్టం లేకపోయినా నైతికంగా జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ కు అంత సులువైన విషయం కాదు. పది నియోజకవర్గాలకు జరిగే ఉప ఎన్నికల్లో పార్టీ మారిన అభ్యర్థులకే టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. పార్టీ మారినందుకు, తమ తీర్పును ధిక్కరించి వారు వ్యతిరేకించినందుకు ప్రజలు సహజంగా వ్యతిరేకంగా ఉంటారు. పార్టీ మారిన వారికి కూడా కాకుండా కొత్త వారికి సీట్లు ఇచ్చే అవకాశం లేనందున ఇది కాంగ్రెస్ కు మైనస్ గానే చూడాలి. అదీ కాక ఉప ఎన్నికలు వస్తే వాటిని కాంగ్రెస్ ప్రభుత్వానికి రిఫరెండం గానే చూడాల్సి వస్తుంది. ఆరు గ్యారెంటీల అమలు ఇతర విషయాలలో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వుందని విపక్షాలు విమర్శిస్తున్న ఈ సమయంలో ఏకంగా పది సీట్లకు ఉప ఎన్నికలంటే మామూలు విషయం కాదు. రిజల్ట్ అటోఇటో అయితే ప్రభుత్వ ఇజ్జత్ కే సవాలుగా మారుతుంది. ప్రభుత్వం బలహీనపడి, విపక్షాలలో మరింత ఊపువస్తుంది. ఆ సీట్లు గెలిచినా గెలవకున్నా ,సంఖ్యా పరంగా కాంగ్రెస్ కు వచ్చిన నష్టం లేదు. ప్రభుత్వం పడిపోతుందన్న భయం కూడా లేకపోయినా, పార్టీ అధిష్టానం లో చులకన‌, ఎమ్మెల్యేలలో అపనమ్మకం పెరిగే అవకాశం వుంది. అందుకే కాంగ్రెస్ ఉప ఎన్నికలు కోరుకోవడం లేదు.

ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి?

ఉప ఎన్నికలను బీఆర్ఎస్ కోరుకోంటోంది. తమ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన వారిపై అనర్హత వేటు పడితే, అది బీఆర్ఎస్ కు పూర్తి అనుకూలంగా మారుతుంది. మళ్లీ ఆ ఎన్నికలలో తిరిగి ఆ సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంటే, ఒక్కసారిగా బీఆర్ఎస్ బలం పెరిగినట్లు అవుతుంది. పార్టీ శ్రేణులలో నిత్తేజం పోతుంది. ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది అనుకుంటున్న వారికి, ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ లకు సరియైన సమాధానం చెప్పినట్లు అవుతుంది. గతంతో పోలిస్తే సంఖ్యాపరంగా లాభం లేదు. ఉప ఎన్నికల్లో మళ్లీ పది స్థానాలు గెలిస్తేనే బీఆర్ఎస్ కు పట్టు దొరుకుతుంది. తెలంగాణలో ఎన్నికలు జరిగి పదిహేడు నెలలు కావస్తుంది. అనేకహామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని సక్రమంగా అమలు చేయకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి ఉందని బీఆర్ఎస్ భావిస్తోంది. రైతులు, మహిళలు, మధ్యతరగతి ప్రజల్లో ఈ రకమైన అసంతృప్తి తమకు లాభిస్తుందని భావిస్తోంది. అయితే అంకెల పరంగా అనర్హత వేటు పడినా బీఆర్ఎస్ కు అదనంగా వచ్చే లాభమేదీ లేదు. కాంగ్రెస్ కు సంఖ్యాపరంగా జరిగే నష్టమూ లేదు. అయితే ప్రభుత్వంపై అసంతృప్తి విషయం ప్రజాతీర్పు ద్వారా వెల్లడవుతుందని బీఆర్ఎస్ నమ్మకం. అదే సమయంలో కొత్త అభ్యర్థులకు అవకాశమొస్తుంది.. అది కొంత అనుకూలంగా మారే అవకాశముందని గులాబీ పార్టీ నేతలు భావిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సయితం ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని నాయకులకు, క్యాడర్ కు సంకేతాలు పంపారు.

ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ కు మైనస్ పాయింట్లు కూడా వున్నాయి. పార్టీ పరంగా కొత్త అభ్యర్థులను ఎంపిక చేయాలి. పార్టీ పరువు నిలవాలంటే ఖచ్చితంగా గెలిచితీరాలి. ఎన్ని సీట్లలో ఓడినా అన్ని సీట్లు కాంగ్రెసో‌, బీజేపీనో చేతిలో పెట్టినట్లే, ఇప్పుడైతే ఆ పది స్థానాలు మేము గెలిచినవే కాంగ్రెస్ అన్యాయం గా గుంజుకుందని ప్రజలలో చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ను విమర్శించవచ్చు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా వున్న బీఆర్ఎస్ ఉప ఎన్నికలు వచ్చి ఓడిపోతే మొత్తం పార్టీ ఉనికికే ప్రమాదం వచ్చే అవకాశం వుంది.

తహతహ లాడుతున్న బీజేపీ

తెలంగాణ లో ఉప ఎన్నికల చర్చలో బీజేపీ ముందు వరుసలో వుంటోంది. ఉప ఎన్నికలు రావని చెప్పడానికి ముఖ్యమంత్రి ఏమన్నా న్యాయమూర్తా అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ నేత లక్ష్మణ్ విరుచుకు పడ్డారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చి రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తే అవి తమ పార్టీకి లాభిస్తుందని బీజేపీ నేతలు సంబరపడుతున్నారు. పది సీట్లలో ఒకటి, రెండు సీట్లు గెలుచుకున్నా బీజేపీ బలం పెరుగుతుంది. ఇప్పటికే రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూడా గెలిచి ఊపుమీదున్న కమలనాధులు ఉప ఎన్నికలు వస్తే తమ పార్టీ విజయం తప్పదన్న ధీమాతో వున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక అధికార కాంగ్రెస్, డీలాపడి వున్న బీఆర్ఎస్ మధ్య పోటీలో బీజేపీ లాభపడుతుందని, వచ్చే ఎన్నికలకు పార్టీని మరింత బలంగా ప్రజలలోకి తీసుకెళ్లవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వున్నారు . ఉప ఎన్నికలు వస్తే ఆ సంఖ్య పెరిగితే పెరుగుతుందేగాని, ఆ పార్టీకి వచ్చే నష్టం లేదు .లక్కుంటే లాభమేనన్న రీతిలో ఉప ఎన్నికలు రావాలని కోరుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో గనక గెలిస్తే , తమ పార్టీ వైపు వచ్చే వలసలూ పెరుగుతాయని చెబుతున్నారు.

డోలాయమానంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు

కారు దిగి అధికార పార్టీ చేయి పట్టుకున్నామన్న కొంత తృప్తేగాని.. ఇంతవరకు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు లాభించిన విషయం ఏమీలేదు. ఒకరిద్దరికి కొంత లబ్థి చేకూరినా , సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా వారి విషయంలో వేచిచూడాలని రేవంత్ ప్రభుత్వం కూడా భావిస్తోంది. దాంతో పార్టీ మారి అధికార పార్టీ లోకి వెళ్లిన వెంటనే పదవులు వస్తాయని భావించిన వారి ఆశలు నెరవేరలేదు. దానికి తోడు తమపై అనర్హత వేటు పడుతుందా.. అన్న భయం వెంటాడుతోంది. అధికార పార్టీలోకే మారాం కాబట్టి స్పీకర్ నిర్ణయం తమకే అనుకూలంగా వుంటుందన్న ధీమా తప్పించి, సుప్రీం కోర్టు తీర్పు ఎలా వుంటుందో.. దాని పర్యవసానాలేంటన్న దానిపై తర్జనభర్జనలు పడుతున్నారు.

కొందరు ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని చెప్పుకుంటూ ,వేటు పడకుండా జాగ్రత్తపడుతున్నారు. తమపై వేటు పడి , తిరిగి పోటీ చేయాల్సి వస్తే, తిరిగి గెలుస్తామో లేదోనన్న టెన్షన్.. దానికి తోడు భయపెడుతున్న ఎన్నికల ఖర్చు, రెంటికీ చెడిన రేవడిలా.. ఏమి చేయాలన్న దానిపై చర్చలు జరుపుతున్నారు.

పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ముందుగా బీఆర్ఎస్ హైకోర్టు ను ఆశ్రయించింది. ఆ తరువాత హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు లో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని బీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. సుప్రీంకోర్టు అనర్హత వేటు పది మంది ఎమ్మెల్యేలపై వేస్తే ఉప ఎన్నికలు రావడం ఖాయమని భావిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీకి గతంలో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తాజాగా స్పీకర్ కు కూడా తగిన నిర్ణయం తీసుకోవాలని , నిర్ణయం కోర్టుకు తెలపాలని సూచించింది.

మొత్తం మీద సుప్రీంకోర్టు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. త్వరలోనే దీనికి తెరపడనుంది.

Read More
Next Story