
Image source: AIOBCSA
ఓబిసి రిజర్వేషన్లు: పౌరసమాజం, విద్యార్ధుల మౌనం
-పాపని నాగరాజు
2025లో రిజర్వేషన్ అంశం భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణలో, తీవ్ర ఉద్రిక్తలకు కారణమైంది. తెలంగాణలో 42% బీసీ (బ్యాక్‌వర్డ్ క్లాసెస్) రిజర్వేషన్‌పై హైకోర్టు స్టే ఆర్డర్, అక్టోబర్ 18 బంద్‌లు ఈ అంశం యొక్క సంక్లిష్టతను హైలైట్ చేశాయి. ఇతర రాష్ట్రాల్లో - మహారాష్ట్రలో మరాఠా కోటా వివాదం, ఉత్తరప్రదేశ్‌లో హాస్టల్ కోట నిరసనలు, బిహార్‌లో ఎక్స్‌ట్రీమ్‌లీ (అత్యంత) బ్యాక్‌వర్డ్ క్లాసెస్ కోటా, కర్ణాటకలో ఇంటర్నల్ ఎస్సీ కోట - ఇలాంటి ఆందోళనలు కొనసాగుతున్నాయి.
అయితే, ఈ ఆందోళనలలో పౌరసమాజం (యూనివర్శిటీలు, లాయర్లు, మేధావులు, కార్మిక సంఘాలు) విద్యార్థి సంఘాలు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాయి? ఈ నిశ్శబ్దతకు కారణాలు ఏమిటి? వీటిని ఉద్యమాలుగా మార్చడానికి ఏం చేయాలి? అనే అంశాలను విశ్లేషించాలి.
పౌరసమాజం యొక్క నిశ్శబ్దత: కారణాలు : పౌరసమాజం - యూనివర్సిటీలు, లాయర్లు, మేధావులు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు - సామాజిక న్యాయం కోసం స్వతంత్రంగా మాట్లాడాల్సిన సంస్థలు. అయితే, రిజర్వేషన్ ఆందోళనలలో వీటి నిశ్శబ్దతకు ప్రధాన కారణాలు ఈ క్రిందివి: రాజకీయ ఒత్తిడి, ఫండిరగ్ ఆధారం: తెలంగాణలో బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ ఆరోపణలు ఆందోళనలను హింసాత్మకంగా మార్చాయి. యూనివర్శిటీలు, విద్యార్థి సంఘాలు తమ ఆర్థిక మద్దతు కోసం వివిధ రాజకీయ పార్టీలపై గాని, వివిధరాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉండడంతో వాటిపై ఆధారపడుతున్నాయి, దీనివల్ల స్వతంత్రంగా మాట్లాడలేకపోతున్నాయి. వారికి రాజకీయ దృక్పదం అందించేవి. కనుక వీటి కనుసన్నల్లో నడుచుకుంటాయి. వివిధ యూనివర్శిటీలో ఉన్న విద్యార్థి సంఘాలు రాజకీయ ఫండిరగ్ వల్ల పరిమితమైన డిమాండ్‌లకు మాత్రమే పరిమితమయ్యాయి. లాయర్లు, మేధావులు కూడా రాజకీయ పదవులు, కేసులు, గ్రాంట్ల కోసం ఆశపడుతున్నారు. కొద్దిమంది రాజకీయ ఒత్తిడికి లోనవుతున్నారు.
అవగాహన లోపం, కుల విభజన: రిజర్వేషన్‌పై అవగాహన లేకపోవడం పౌరసమాజం నిశ్శబ్దతకు ప్రధాన కారణం. విద్యార్థి సంఘాలకు మండల్ కమిషన్, 50% కోట క్యాప్ (ఇంద్రా సహ్నీ తీర్పు), బీసీ/ఓబీసీ సామాజిక అసమానతలపై పూర్తి అవగాహన లేదు. అదే సమయంలో, రాజకీయాలు, మీడియా రిజర్వేషన్‌ను ‘కుల యుద్ధం’గా చిత్రీకరిస్తున్నాయి. మహారాష్ట్రలో మరాఠా వర్సెస్ ఓబీసీ ఘర్షణలు ఈ విభజనకు ఉదాహరణ. తెలంగాణలో బీసీలలోని ఉప-కులాలైన గొల్ల, కురుమ, పద్మశాలి, ముదిరాజు, గౌడ, ఇతర తక్కువ జనాభాగల కులాల మధ్య ఐక్యత లేకపోవడం ఉద్యమాన్ని బలహీనపరుస్తోంది.
సామాజిక భయం, వ్యక్తిగత ప్రయోజనాలు: ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, మేధావులు తమ ఉద్యోగాలు, సామాజిక స్థితిని కాపాడుకోవడానికి పాలకులు వివాదాస్పదంగా మార్చిన వివిధ విధానాల అంశాల్లో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. విద్యార్థులు కూడా రిజర్వేషన్‌ను వ్యక్తిగత ప్రయోజనాల కోసం (ఉద్యోగాలు, సీట్లు) మాత్రమే చూస్తున్నారు, సామాజిక న్యాయంగా కాదు.
యూనివర్శిటీలలో డెమాక్రసీ బలహీనత:2025లో జేఎన్‌యూ ఎలక్షన్స్ ట్రెండ్ చూపినట్టు, యూనివర్శిటీలలో డెమాక్రసీ దెబ్బతినడం వల్ల విద్యార్థి సంఘాలు, మేధావులు స్వతంత్రంగా ఉద్యమించలేకపోతున్నారు. తెలంగాణలో ఓయూ, జేఎన్‌టీయూ లాంటి యూనివర్శిటీలలో రాజకీయ జోక్యం విద్యార్థి ఉద్యమాలను నిర్వీర్యం చేస్తోంది. పాలకులు తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించడంలో కీలక భూమికను పోషించారని గ్రహించి అదే తరహ మరె ఉద్యమం నిర్మాణం కావద్దని కుట్ర కోణం కూడ లేకపోలేదు.
విద్యార్థి ఉద్యమాల నిశ్శబ్దత, కారణాలు, పరిమితులు : విద్యార్థి సంఘాలు రిజర్వేషన్ ఆందోళనలలో చురుకైన పాత్ర పోషించాల్సినవి, కానీ తెలంగాణలో వారి పాత్ర శూన్యమే అని చెప్పవచ్చు. దీనికి కారణాలు లేక పోలేవు, అవగాహన లోపం అనవచ్చు. చాలా మంది విద్యార్థులకు రిజర్వేషన్ చరిత్ర, చట్టపరమైన సంక్లిష్టతలపై అవగాహన లేదు. ఉదాహరణకు, రిజర్వేషన్ పెంచుతు చేసిన బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చమని డిమాండ్ ఉన్నప్పటికీ, దాని సామాజిక, చట్టపరమైన ప్రభావాలపై చర్చలు తక్కువ. తెలంగాణ కోసం ఉద్యమంలో విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలతో ఉద్యమించినట్టు, తెలంగాణలో ఇలాంటి అవగాహన లోపిస్తోంది.
రాజకీయ జోక్యం: విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీల ఫండిరగ్, ఒత్తిడిలో ఉన్నాయి. తెలంగాణలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు బీసీ కోటాను ‘వోట్ బ్యాంక్’గా ఉపయోగిస్తున్నాయి, దీనివల్ల విద్యార్థులు స్వతంత్రంగా ఉద్యమించలేకపోతున్నారు. ఉదాహరణకు, అక్టోబర్ 18 బంద్‌లో విద్యార్థులు రాజకీయ ఎజెండాలకు అనుగుణంగా నడిచారు, స్వతంత్ర ఉద్యమంగా కాదు.
పరిమిత లక్ష్యాలు: విద్యార్థులు రిజర్వేషన్‌ను వ్యక్తిగత ప్రయోజనాల (సీట్లు, ఉద్యోగాలు) కోసం చూస్తున్నారు, సామాజిక న్యాయంగా కాదు. ఇది ఉద్యమాన్ని బలహీనపరుస్తోంది. ఉదాహరణకు, బీసీ కాస్ట్ సర్వే (2025) ఫలితాలను (47% జనాభా) ఉపయోగించి సామాజిక న్యాయం కోసం ఒక విస్తృత ఉద్యమం నిర్మించే అవకాశం విద్యార్థులు వదులుకుంటున్నారు.
ఆందోళనలను ఉద్యమాలుగా మార్చడానికి పరిష్కారాలు : రిజర్వేషన్ ఆర్తనాదాల నుండి ఆందోళనల నుండి స్థిరమైన ప్రజాపోరాటాలుగా మార్చడానికి పౌరసమాజం, విద్యార్థి సంఘాలు చురుకైన పాత్ర పోషించాలి. ఇతర రాష్ట్రాల అనుభవాల నుంచి నేర్చుకొని, ఆచరణాత్మక పరిష్కారాలు అమలు చేయవచ్చు.
అవగాహన కార్యక్రమాలు: యూనివర్శిటీలలో రిజర్వేషన్ చరిత్ర, చట్టపరమైన అంశాలపై వర్క్‌షాప్‌లు నిర్వహించాలి. ఉదాహరణకు, ‘మండల్ కమిషన్ నుంచి బీసీ సర్వే 2025’ వరకు అంశాలపై సెమినార్లు ఏర్పాటు చేయవచ్చు. బిహార్‌లో కార్మిక-విద్యార్థి ఐక్యత విజయవంతమైనట్టు, తెలంగాణలో బీసీ జాయింట్ యాక్షన్ కమిటీతో విద్యార్థులు కలిసి ‘సామాజిక న్యాయ ఫోరమ్’ ఏర్పాటు చేయాలి. ఇది బీసీ, ఎస్సీ/ఎస్టీల మధ్య కుల విభజనను నివారిస్తుంది, రాజకీయ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో ఎస్సీ విద్యార్థులు హాస్టల్ కోటా విషయంలో శాంతియుత ర్యాలీల ద్వారా ప్రభుత్వ సమీక్షకు దారితీశారు. తెలంగాణలో విద్యార్థులు హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్ వద్ద ‘బీసీ న్యాయ యాత్ర’ లాంటి నిరసనలు నిర్వహించవచ్చు. కర్ణాటకలో ‘దళితులకు న్యాయం చేయాలి’ క్యాంపెయిన్ అవగాహన పెంచింది.
తెలంగాణలో విద్యార్థులు ‘‘బీసీలకు న్యాయం చేయాలి’’ లాంటి నినాదాలతో వివిధ స్థాయిల్లో క్యాంపెయిన్‌లు నడపవచ్చు. బీసీ కాస్ట్ సర్వే ఫలితాలను సామాజిక మాధ్యమాలతో గానీ, పోస్టర్లు, కరపత్రాలు, వాల్‌రైటింగ్, ఫోకస్, వీడియోలు, తదితర రూపాల ద్వారా ప్రచారం చేయవచ్చు. మహారాష్ట్రలో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్‌లు (ఫిల్) మరాఠా కోటా చర్చను ప్రభావితం చేశాయి. తెలంగాణలో లాయర్లు, విద్యార్థులు కలిసి హైకోర్టు స్టే ఆర్డర్‌ను సవాలు చేయడానికి బీసీ సర్వే డేటాను కోర్టులో డిఫెండ్ చేయవచ్చు. కార్మిక, ఉద్యోగ, విద్యార్థి ఐక్యత ఎన్నికల సమయంలో కొంత విజయం సాధించింది.
తెలంగాణలో బీసీజెఏసితో విద్యార్థులు ఐక్యమై, రాజకీయ ఒత్తిడి నుంచి స్వతంత్రంగా ఉద్యమించాలి. ముఖ్యంగా బెంగాల్‌లో తేభాగ ఉద్యమం గాని, కెరళలో పునప్రవాయినాలర్, 1969 నుండి ఉద్బవించిన తెలంగాణా ఉద్యమం గాని, శ్రీకాకుళ గిరిజన రైతాంగా పోరాటంలా బీసీ ఉద్యమాన్ని నిర్మంచిన ఈ రిజర్వేషన్ సమస్య పరిష్కారం వెనువెంటనే జరగక మానదు.
ఉద్యమంగా మార్చే మార్గం : రిజర్వేషన్ ఆందోళనలు తెలంగాణలో పెకమేడల మిగిలిపోకుండా, సామాజిక న్యాయ ఉద్యమంగా మారాలి. పౌరసమాజం మరియు విద్యార్థి సంఘాల నిశ్శబ్దతకు రాజకీయ ఒత్తిడి, అవగాహన లోపం, కుల విభజనలు ప్రధాన కారణాలను చేదించాలి. ఈ సమస్యలను అధిగమించడానికి, ర్యాలీలు, లీగల్ యాక్టివిజం, డిజిటల్ క్యాంపెయిన్‌లను గ్రామాలలో జాగృతం చేయాలి. విద్యార్థులు (50% బాధ్యత), ఉద్యోగులు (30%), పౌరసమాజం (20%) కలిసి ఐక్యత, అవగాహన, ఆందోళనలను ఉద్యమంగా మార్చాలి. 50% కోటా క్యాప్‌ను రీవ్యూ చేయడం, ఇప్పుడు పౌరసమాజం మేల్కొని, రిజర్వేషన్‌ను సమగ్ర సామాజిక న్యాయ ఉద్యమంగా ఎవరి జనాభా ఎంత ఉందో అంత వారికి అందించాలని ఉద్యమించాలి. దళితులు, బీసీలు, గిరిజనులు, మైనార్టీలు, మహిళలు, అగ్రకుల పేదలు ఇలా ఒకరేమిటి అందరు కలగల్సే అవకాశం నేడు వచ్చింది.
(*పాపని నాగరాజు, సత్యశోధక మహసభ)
Next Story

