
తిరుమలలో విమానాలు ఎగరకూడదా !?
ఊరూర గుళ్లున్నాయి...నోఫ్లైన్ జోన్ అడుగుతారా?
తిరుమల ఆలయ సమీపంలో విమాన శబ్దం వినిపిస్తే చాలు, కలకలం మొదలవుతుంది. తాజాగా గత శుక్రవారం(ఫిబ్రవరి 28) ఆలయం పైన రెండు విమానాలు తిరిగాయని హడావిడి మొదలైంది. తిరుమల ఆలయం పై విమానాలు ఎగర కూడదని ఏదైనా చట్టం ఉన్నదా? అంటే అలాంటిది ఏమీ లేదు. చట్టంలో లేనప్పుడు ఎందుకీ హడావిడి?
తిరుమల ఆలయంపైన విమానాలు ఎగర కూడదని ఆగమ శాస్త్రాలు చెపుతున్నాయని మరొక వాదన తీసుకొస్తారు. ఏ ఆగమ శాస్త్రంలో ఎక్కడ ఉందో ఎవరూ చెప్పరు. అసలు ఆగమ శాస్త్రాలు అంటే ఏమిటి? ఆగమ శాస్త్రాల్లో విమానాల గురించి ఉంటాయా? ఆగమశాస్త్రాలు అంటే ఆలయ పూజా విధానాలు చెప్పేవి.
ఆగమ శాస్త్రాలు ప్రధానంగా రెండు రకాలు. ఒకటి శైవాలయాల్లో పూజలు చేసే విధానాన్ని తెలిపే ఆగమ శాస్త్రాలు, రెండవది వైష్ణవాలయంలో పూజా విధానాలు తెలిపే ఆగమ శాస్త్రాలు. వైష్ణవాలయంలో పూజావిధానాలు తెలిపే ఆగమ శాస్త్రాల్లో వైఖానస ఆగమం, పాంచరాత్రాగమం అనే రెండు రకాలు ఉన్నాయి. ఎక్కువ ఆలయాలు వైఖానస ఆగమ విధానాన్ని అనుసరించేవే.
తిరుమల ఆలయం వైఖానస ఆగమ విధానం కాగా, తిరుపతిలో ఉండే అలమేలు మంగాపురం; అంటే తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం పూజలు జరుగుతాయి. చిన్న జియరు స్వామి ఈ పాంచారాత్ర ఆగమ విధానానికి చెందిన వారు. ఇవి కాకుండా ఆలయ నిర్మాణానికి సంబంధించి వాస్తు ఆగమం కూడా ఉంటుంది. అంటే ఆలయ నిర్మాణా న్ని ఎలా చేపట్టాలో నిర్దేశించేవి.
ఆలయం పైన విమానాలు ఎగర కూడదంటారు. అలా చట్టంలో ఉందా అంటే ఆగమ శాస్త్రం చెపుతోందంటారు. ఆగమ శాస్త్రంలో ఎక్కడుందంటే, పైన విమానాలు ఎగిరితే ఆలయ పవిత్రత దెబ్బతింటుందంటారు. ఆగమ శాస్త్రాలన్నీ దాదాపు వెయ్యేళ్ళ క్రితం నాటివి. అప్పటికి విమానాలు లేవు. విమానాలు లేని రోజుల్లో రాసిన ఆగమ శాస్త్రాల్లో విమానాలు ఎగర కూడదని ఎలా ఉంటాయి?
ఒక వేళ ఆలయం పైన విమానాలు తిరిగితే ఆలయ పవిత్రత ఎలా దెబ్బతింటుందని అడిగితే, వాళ్ళకు గయోపాఖ్యానం గుర్తుకు వస్తుంది. గయుడు పుష్పక విమానంలో వెళుతూ, నోట్లో నములుతున్న తమలపాకులు కిందకు ఉమ్ముతాడు. అది కాస్తా సూర్యుడికి ఆర్ఘ్యం వదులుతున్న శ్రీ కష్ణుడి చేతిలో పడుతుంది. ఇది పౌరాణిక గాథ. గయుడు లాగా విమానాల్లో ప్రయాణించే వాళ్ళు ఉమ్మితేనో, మల మూత్ర విసర్జన చేస్తోనో ఆలయం పైన పడి, దాని పవిత్రత దెబ్బతింటుందని వారి భయం, అంతే.
ఊహాజనితమైన పౌరాణిక పుష్పక విమానాలలో మినహాయిస్తే, ఆధునిక విమానాల్లో ప్రయాణీకులు కిందకు ఉమ్మే అవకాశం లేదు. విసర్జించిన మల మూత్రాలు కింద పడవు. అలాంటప్పుడు ఆలయ పవిత్రత ఎలా దెబ్బతింటుంది? అన్నది ప్రశ్న. ఆలయం పైన విహరించే పక్షులు రెట్టలు వేసినప్పడు ఆలయ పవిత్రత దెబ్బతినదా? ఒక వేళ విమానాలనే నిషేధించారనుకుందాం. ఆలయం పై భాగాన పక్షులు ఎగరకుండా ఎలా నిషేధించగలుగుతారు?
తిరుమల ఆలయం పైన విమానాలు విహరించకుండా చట్టం ద్వారా నిషేధం విధిస్తే దాని పవిత్రతను కాపాడతారనుకుందాం. తిరుమల ఆలయం పవిత్రమైనప్పుడు, తిరుచానూరులో ఉన్న అల మేలుమంగమ్మ ఆలయం పవిత్రమైంది కాదా? తిరుపతికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాళహస్తి ఆలయం పవిత్రమైంది కాదా?
తిరుమల ఆలయం పవిత్రమైనది అయినప్పుడు రాష్ట్రంలోని సింహాద్రి అప్పన్న ఆలయం, అన్నవర దేవాలయం, తెలంగాణాలోని భద్రాద్రి రామాలయం పవిత్రమైనవి కావా? ఇవే కాకుండా ఉత్తర భారత దేశంలోని కాశీ విశ్వేశ్వరాలయం, తమిళనాడులోని మధుర మీనాక్షి ఆలయం; ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆలయాలున్నాయి. ఒక్క తిరుమలలో విమానాలను నిషేధిస్తే ఇతర ఆలయాల సంగతి ఏమిటి?
ప్రసిద్ధ ఆయలయాల్లోనే కాదు, దేశంలోని ప్రతి నగరంలో, పట్టణంలో, దాదాపు ప్రతి గ్రామంలో ఏదో ఒక ఆలయం ఉంటుంది. తిరుమల ఆలయ పవిత్రత గురించి వాదనను ముందుకు తెస్తే, వాటి పవిత్రత ఏమిటి? అంటే దేశంలో ఎక్కడా, ఏ నగరం పైన, ఏ పట్టణం పైన, ఏ పల్లె పైనా విమానాలు తిరగకుండా నిషేధించాలి. అలా నిషేధిస్తే మళ్ళీ మనం పురాణ కాలంలోకి వెనక్కి వెళ్ళిపోవలిసి వస్తుంది. అంటే దేశాన్ని వెయ్యేళ్ళ వెనక్కి నడిపించదలిచారా?
తిరుమలలో విమానాల శబ్దం వినిపించగానే హడావిడి తొలుత జర్నలిస్టుల్లో మొదలై, తరువాత భక్తులకు వ్యాపిస్తుంది. ఆ తరువాత ఆలయ నిర్వాహకులను ఖంగారు పెడుతుంది. తిరుమలను ‘నోఫ్లయింగ్ జోన్’ గా ప్రకటించాలని టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు తాజాగా కేంద్ర పౌరవిమానా శాఖా మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకు లేఖ రాశారు. కేంద్రాన్ని ఇలా కోరడం ఇది కొత్తేమీ కాదు.
కొబ్బరి చెట్టు ఎందుకెక్కావంటే, దూడ గడ్డికోసం ఎక్కానన్నాడట వెనుకటికి ఒకడు. కొబ్బరి చెట్టు పైన గడ్డి ఉంటుందా అంటే, ఉండదు కనుకనే కిందకు దిగి వస్తున్నా కదా అన్నాడట. అలా ఉంటాయి వీళ్ళ వాదనలు. తిరుమలలో దర్శనాల కోసం దేశం నలుమూలల నుంచి పిల్లా పాపలతో వచ్చే సామాన్య భక్తుల గురించి ఆలోచించ కుండా, అర్థం పర్థం లేని ‘నో ఫ్లైయింగ్ జోన్’ వాదనలతో అసలు సమస్యలను పక్కదారి పట్టించడానికి కాకపోతే మరి దేనికీ హడావిడి?
Next Story