![భారత్ ని అమెరికా అవమానిస్తుంటే మోదీ సర్కార్ ఏం చేస్తుంది? భారత్ ని అమెరికా అవమానిస్తుంటే మోదీ సర్కార్ ఏం చేస్తుంది?](https://telangana.thefederal.com/h-upload/2025/02/07/511059-chained.webp)
భారత్ ని అమెరికా అవమానిస్తుంటే మోదీ సర్కార్ ఏం చేస్తుంది?
హిందువుల పట్ల మోదీ సర్కార్ ప్రేమ ఏమైనది? దేశభక్తి ఏది? హిందూ మత భక్తి ఏమైనది?
ట్రంప్ ఎవరు పశువుల్లా సంకెళ్లు వేసి తన సైనిక విమానాల్లో అమృత సర్ లో దింపడానికి?
మోదీ మౌనం వహిస్తాడు, భారతదేశ సార్వభౌమాదికారాన్ని ప్రపంచ యవనిక పై అవమానిస్తుంటే?
ఇదేనా మన దేశం పట్ల మోడీ సర్కార్ దేశభక్తి?
ఇదేనా హిందువుల పట్ల హిందుత్వ సర్కార్ ప్రేమ?
మన దేశ విద్యార్థి లోకం అమెరికా పట్ల బంగారు కలలు కంటోంది. వారి ఊహాజనిత "స్వర్గం" ఓ పేక మేడలా కూలుతోంది. ఆ శకలాల క్రిందనే మన వాళ్ళ జీవితాలు నలిగే దుస్థితి ఏర్పడింది.
బ్రిటీష్ వలస పాలన మిగిల్చిన చేదు గుర్తుల్లో జలియన్ వాలా బాగ్ ఒకటి. అది అమృతసర్ లోనిది. అమెరికాలో మన విద్యాధికుల్ని జంతువుల్లా వేటాడి, బంధించి, సంకెళ్లు వేసి, తన సైనిక విమానాల్లో తెచ్చి అమృత సర్ లో అమెరికా దింపింది. దీంతో ప్రపంచ యవనిక మీద భారత్ పరువు బజారు పాలవుతోంది. "ట్రంప్ అమెరికా" ఎదుట "మోడీ భారత్" లొంగిన దుస్థితి విశ్వవీధుల్లో మన దేశానికి తలవంపు తెస్తున్నది.
'ఇండియా' కంటే 'భారత్' పదం భారతీయతకు అద్దం పడుతుందని పనికి మాలిన పదాల కోసం వాదోపవాదాలు చేసే మోడీ సర్కార్ కి ఇప్పుడు ఎందుకు రోషం రాలేదు?
స్వదేశీ దోపిడీ ప్రభుత్వ విధానాల పై ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పోరాడడానికి బదులు విదేశీ వ్యామోహంతో లక్షలాది మంది విద్యాధిక యువతీ యువకులు అమెరికా, యూరోప్, కెనడా, ఆస్ట్రేలియా వంటి సుదూర దేశాలకు వెళ్లడం తెల్సిందే. దేశం విడిచి వెళ్ళడానికి ప్రధాన కారణం కుహనా స్వదేశీ పాలక వర్గాల విధానాలే! ముఖ్యంగా గత పదేండ్ల నుండి మోడీ సర్కార్ విధానాలకు వ్యూహాత్మక బాధ్యత వుంది. అలా వెళ్లిన మన యువతకు పరాయి నేల పై ఎన్ని అవమానాలో, ఎన్నెన్ని పరాభవాలో! నేడు ట్రంప్ అధికారానికి రావడంతో అవి పరాకాష్ట దశకు చేరాయి.
అక్రమ వలసదార్ల వల్ల అమెరికన్ కార్పొరేట్లు ఇన్నాళ్లు భారీ లాభాలు గడించాయి. వారి రంగు నలుపైనా, చట్టం అక్రమ వలసదార్లని చెప్పినా, వారి సాంకేతిక నైపుణ్యం అమెరికన్ కార్పొరేట్లకి అంటరానిది కాదు. ట్రంప్ సర్కార్ వచ్చాక మన వాళ్ళను క్రిమినల్స్ లా వేటాడి నిర్భంధించింది. సంకెళ్ళతో అమెరికా సైనిక విమానాల్లో కుక్కి అమృతసర్ లో పడదోసి వెళ్ళింది. అది ఆ 104 మందికి కాదు. 140 కోట్ల ప్రజల్ని అవమానించడం.
మన పిల్లలకు ఇక్కడే నిలబడి ఇక్కడి సర్కార్ల మీద పోరాడి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పోరాడే ఆలోచన లేదు. మన నేల పై సాగే దోపిడీ పీడనల నుండి విముక్తి పొందాలనే ఆలోచన లేదు. అందుకు వారు కారకులు కారు. పలు కారణాలున్నాయి.
కొలంబియా ప్రభుత్వం లాండింగ్ కి అనుమతి ఇచ్చేది లేదని ట్రంప్ సర్కార్ కి తేల్చిచెప్పింది. 140 కోట్ల జనాభా గల దేశాన్ని పాలించే మోడీ సర్కార్ వెన్నెముక లేని వానపాముగా మారింది.
అమృతసర్ లో దింపిన 104 మందిలో మెజారిటీ హిందువులే. శిఖులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, బౌద్దులు, జైన్లు, పార్సీల సంఖ్య నామమాత్రమే. హిందువుల శ్రేయస్సు కోసం పని చేస్తున్నట్లు చెప్పుకునే మోడీ సర్కార్ అంబానీ, ఆదానీలకు తప్ప హుందువులకు రక్షణ కల్పించింది లేదు.
చరిత్ర గమనం ఎగుడు దిగుళ్ళు, చీకటివెలుగుల మధ్య సాగుతుంది. కొన్ని సార్లు చీకట్ల నుండి చిమ్మ చీకట్ల దశ ఏర్పడవచ్చు. తిరిగి వెలుగు రవ్వలతో కొత్త కాంతులతో దారి జిగేల్ మనవచ్చు. ఏది ఏమైనా చరిత్ర గమనం అంతిమంగా ముందుకే సాగుతుంది.
కొన్నిసార్లు ఏండ్ల తరబడి విప్లవోద్యమాల్లో స్తబ్దత కొనసాగుతుంది. కొన్ని సార్లు కొన్ని నెలలలోనే అనూహ్య విప్లవాత్మక మార్పు సంభవిస్తుంది. ఇంకొన్నిసార్లు వారాల్లో సైతం సాధ్యమే. గంటలు, నిముషాల్లో కూడా భౌతిక స్థితిగతుల్లో మార్పుల్ని గుర్తిస్తూ తగు కర్తవ్యాల్ని రూపొందించుకోవాల్సి రావచ్చు. ఈ దృష్టితో చరిత్ర గమన సూత్రాల్ని అర్ధం చేసుకుంటే, అది సృష్టించే అవకాశాలను సరిగ్గా సద్వినియోగం చేసుకోవచ్చును.
ఏకకాలంలో ఈ క్రింది మూడు ఆయుధాల్ని పురోగమన శక్తులకు వర్తమాన 'చరిత్ర అందించింది.
1-ట్రంప్ సర్కార్ దేశాన్ని అవమానిస్తున్నా మోడీ సర్కార్ దేశ ప్రజల గౌరవ ప్రతిష్టల్ని కాపాడలేదని మరోసారి రుజువైనది. ప్రజల్ని దేశభక్తియుతంగా మేల్కొలపడానికి చరిత్ర ఇచ్చిన సదవకాశమిది.
2--హిందువులపై ప్రేమ ఉందని మోడీ హిందుత్వ సర్కార్ జపం చేస్తున్నది. సాధారణ హిందువుల్ని మోడీ హిందుత్వ సర్కార్ కాపాడలేదని మరోసారి రుజువైనది. సంకెళ్లతో తెచ్చిన భారతీయుల్లో హిందువుల శాతమే ఎక్కువ. సాధారణ హిందువులకూ హిందుత్వ శక్తులకూ మధ్య వర్గ వైరుధ్యం వుంది. దాని ఆధారంగా వర్గ పోరాటాలతో పాటు ప్రజాతంత్ర పోరాటాల్లోకి వారిని సమీకరించాల్సి వుంది. అందుకు చరిత్ర అవకాశన్ని కల్పించింది.
3--విద్యార్థి లోకాన్ని ఊహజగత్తు నుండి వాస్తవ ప్రపంచంలోకి తేవడానికి అవకాశం లభించింది. వారి నిన్నటి అమెరికా వ్యామోహన్ని వెక్కిరించి వేళాకోళాలతో మానసికంగా గాయపరిచే వైఖరి చేపట్టకుండా తగు మెలకువలు పాటించడం మన కర్తవ్యం. ఇన్నాళ్లు మన మాట వినకుండా అమెరికా, యూరోప్ మోజులో మునిగారనే భావన వ్యక్తీకరణకు అవకాశం ఇవ్వరాదు. అక్కడ భంగపడడమే కాకుండా బందించబడి సంకెళ్ళతో గెంటివేతకు గురైన బాదితుల్ని మన పిల్లలుగా హత్తుకుందాం. తద్వారా వారి విశ్వాసం పొందగలం.
ఏకకాలంలో మూడు కర్తవ్యాల్ని చేపట్టడానికి వర్తమాన చరిత్ర చక్కని అవకాశం కల్పించింది. వాటిని సద్వినియోగం చేసుకుందాం.
Next Story