మద్దతు ధరలు రైతులను నిజంగా ఆదుకుంటున్నాయా?
x

మద్దతు ధరలు రైతులను నిజంగా ఆదుకుంటున్నాయా?

రైతులకు మద్దతు ధరలు కల్పించే విషయంలో ముచ్చటగా మూడోసారి కూడా బీజేపీ ప్రభుత్వం మోసం చేసింది. లెక్కేయాల్సిన తీరు వేరు వీరు లెక్కేస్తున్న తీరు వేరు.


లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యాయి. మళ్ళీ నరేంద్ర మోదీ ప్రభుత్వమే కొలువు తీరింది. జూన్ 19 న జరిగిన మొదటి క్యాబినెట్ సమావేశంలో దేశ వ్యాప్తంగా వానాకాలం (ఖరీఫ్ ) లో పండే 14 రకాల పంటలకు 2024-2025 సంవత్సరానికి కనీస మద్దతు ధరలు (MSP) ప్రకటించింది. వ్యవసాయ ఉత్పత్తుల ఖర్చుల, ధరల నిర్ణాయక కమిషన్ (CACP) సిఫార్సులను అనుసరించి, ఈ ధరలను కేంద్రం ప్రకటించింది.

సమగ్ర ఉత్పత్తి ఖర్చులకు ( సి2 ) 50 శాతం అదనంగా కలిపి పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటించాలని 2007 లో స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసింది. రైతులు అప్పటి నుండి దీనిని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

2014 ఎన్నికల సందర్భంగా బీజీపీ పార్టీ, స్వామినాథన్ కమిషన్ సిఫారసును అమలు చేస్తామని హామీ అయితే ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక , రైతులను మోసం చేస్తూ , ఈ సిఫారసును అమలు చేయలేమని సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసింది . రైతు నేరుగా చెల్లించే ఖర్చులకు ( ఏ2 ) రైతు స్వంత కుటుంబ సభ్యుల శ్రమ విలువ (FL) కలిపిన మొత్తాన్ని (ఏ2 +FL) ప్రస్తుతం ఎం‌ఎస్‌పి ప్రకటనకు ప్రాతిపదికగా తీసుకుంటున్నది . దీనికి మాత్రమే 50 శాతం లాభాన్ని కలిపి ధర ప్రకటిస్తున్నది.

2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం కనీస మద్దతు ధరలను ప్రకటిస్తామని, ఆ ధరలకు చట్టబద్ధత కల్పిస్తామని కూడా హామీ ఇచ్చింది. కానీ ఈ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం మద్దతు ధరల విషయంలో రైతుల డిమాండ్‌ను పట్టించుకోలేదు. ఫలితంగా వివిధ రాష్ట్రాలలో రైతులు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి ఓడించారు. ముఖ్యంగా రైతు ఉద్యమాన్ని అత్యంత బలంగా నడిపించిన పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర , కేరళ, తమిళనాడు రాష్ట్రాల రైతులు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేసిన విషయం మనం చూశాం. దీంతో స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ సాధించలేక బీజేపీ 240 స్థానాలకే పరిమితమైంది. అతి తక్కువ మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది . కానీ రైతులు కొట్టిన దెబ్బను మళ్ళీ మర్చిపోయి, ఈ సారి కూడా పాత పద్ధతిలోనే కనీస మద్దతు ధరలను ప్రకటించి, మరోసారి మోసం చేసింది.

2024-2025 సంవత్సరానికి వరి సాధారణ ధాన్యానికి క్వింటాలుకు 2300 రూపాయలు, A గ్రేడ్ ధాన్యానికి 2320 రూపాయలు, జొన్న 3421 రూపాయలు, సజ్జ 2625 రూపాయలు, మొక్క జొన్న 2225 రూపాయలు, రాగి 4290 రూపాయలు, కంది 7550 రూపాయలు, పెసర 8682 రూపాయలు, మినుము 7400 రూపాయలు, వేరుశనగ 6783 రూపాయలు, సోయాబీన్ 4892 రూపాయలు, పొద్దు తిరుగుడు 7280 రూపాయలు, నువ్వులు 9267 రూపాయలు, పత్తి లాంగ్ స్టేపుల్ 7521 రూపాయలు కనీస మద్దతు ధరలుగా కేంద్రం ప్రకటించింది . సమగ్ర ఉత్పత్తి ఖర్చులతో పోల్చినప్పుడు, ప్రకటించిన కనీస మద్దతు ధరలు తెలంగాణ రైతులకు గిట్టుబాటు కావు. రైతు కుటుంబాలను అప్పుల ఊబి నుంచి బయట పడవేయలేవు.

పంటల ధరలను ప్రకటించడానికి వీలుగా ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియలో సి‌ఏ‌సి‌పి సంస్థ దేశ వ్యాపితంగా వానాకాలంలో 14 రకాల పంటలకు గాను అన్ని రాష్ట్రాల నుండి స్వయంగా ఉత్పత్తి ఖర్చులను సేకరిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో “కాస్ట్ ఆఫ్ కల్టివేషన్” విభాగం సి‌ఏ‌సి‌పి కోసం తెలంగాణలోని 30 గ్రామాల నుండి 300 మంది రైతుల దగ్గర ఉత్పత్తి ఖర్చులు, పంట దిగుబడుల వివరాలు సేకరిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 12,500 గ్రామ పంచాయతీలు, 69 లక్షల మంది రైతులు ఉన్నప్పుడు CACP ఉత్పత్తి ఖర్చులను లెక్కించేందుకు ఈ శాంపిల్ సైజ్ చాలా తక్కువ.

ఎంపిక చేసిన గ్రామాలలో భూమి కలిగిన రైతుల సర్వే నంబర్ల నుండి రాండంగా 10 మంది రైతుల సర్వే నంబర్లను ఎంపిక చేస్తారు. సంవత్సరం పొడవునా, సి‌ఏ‌సి‌పి తరపున ఒక వ్యక్తి ఆ గ్రామంలో ఉండి , ఎంపికైన రైతులతో మాట్లాడుతూ మొత్తం ఉత్పత్తి ఖర్చులను నమోదు చేస్తారు. భూమి లేని కౌలు రైతులు ఈ ప్రక్రియలో భాగంగా ఉండరు. కాబట్టి కౌలు రైతుల అదనపు ఖర్చులు నమోదు చేసే అవకాశం చాలా తక్కువ.

ఆయా రాష్ట్రాల వ్యవసాయ శాఖలు కూడా తాము విడిగా ప్రతి సంవత్సరం సేకరించిన ఆయా పంటల సమగ్ర ఉత్పత్తి ఖర్చుల (సి2) వివరాలను సి‌ఏ‌సి‌పి సంస్థకు పంపిస్తాయి. వీటి ఆధారంగా స్వామినాథన్ కమీషన్ సిఫారసులకు అనుగుణంగా ఎం‌ఎస్‌పి చెల్లించాలని కోరుతూ, కేంద్రానికి మన రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉత్తరం కూడా రాస్తుంది .

కానీ, కనీస మద్దతు ధరల నిర్ణయం సమయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖలు పంపించే ఉత్పత్తి ఖర్చులను సి‌ఏ‌సి‌పి అసలు పరిగణనలో పెట్టుకోదు. స్వయంగా తాను సేకరించిన ఉత్పత్తి ఖర్చులనే ప్రాతిపదికగా పెట్టుకుని పరిశీలిస్తుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖలు పంపే సమగ్ర ఉత్పత్తి ఖర్చుల వివరాలను మాత్రం తన నివేదికలో ఇస్తుంది.

2024- 2025 సంవత్సరానికి ఎం‌ఎస్‌పి ప్రకటించడానికి 2020- 2021, 2021-2022 , 2022-2023 సంవత్సరాల సాగు ఖర్చులను ప్రాతిపదికగా పెట్టుకుంటారు. దీని వల్ల, ప్రతి సీజన్‌లోనూ పెరిగి పోతున్న పంట ఉత్పత్తి ఖర్చులు పూర్తిగా నమోదు కావు. ఫలితంగా రైతులకు నష్టం జరుగుతుంది.

తెలంగాణలో పంట సాగు ఖర్చులు లెక్క వేసినా , మొత్తం అన్ని రాష్ట్రాల ఉత్పత్తి ఖర్చుల సగటును మాత్రమే ఎం‌ఎస్‌పి ప్రకటనకు ప్రాతిపదికగా పెట్టుకుంటారు. మన రాష్ట్రంలో ఉత్పత్తి ఖర్చులు ఎక్కువైనా, అందుకు అనుగుణంగా ఎం‌ఎస్‌పి ఉండక పోవడానికి అదే కారణం. ఉత్పత్తి ఖర్చులు తక్కువ ఉండే రాష్ట్రాలకు కేంద్రం ప్రకటించే ఎం‌ఎస్‌పి లాభదాయకంగా ఉండొచ్చు కానీ, తెలంగాణలో పంటల ఉత్పత్తి ఖర్చులు ఎక్కువ కావడం వల్ల మన రాష్ట్ర రైతులకు కేంద్రం ప్రకటించే ధరలు గిట్టుబాటు కావడం లేదు.

రైతు స్వంత భూమికి కౌలు విలువను ఉత్పత్తి ఖర్చుల లెక్క సందర్భంగా చూపిస్తున్నారు. కానీ మద్దతు ధరల ప్రకటన సమయంలో దానిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. అలాగే రైతు పొలంలో పెట్టె స్థిర పెట్టుబడిని కానీ ( ట్రాక్టర్ కొనుగోలు, బోర్లు వేయడం , పొలంలో భవనం కట్టడం, నీళ్ళ కోసం పైప్ లైన్ వేయడం) , ఈ పెట్టుబడి పై వడ్డీని కానీ మద్దతు ధరల సమయంలో పరిగణనలో పెట్టుకోవడం లేదు. నిజానికి ఈ రెండు విలువలనూ కలిపితే మాత్రమే సమగ్ర ఉత్పత్తి ఖర్చు ( సి2 ) అవుతుంది . దీనికే 50 శాతం లాభం కలిపి ఇవ్వాలని స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం దీనిని అమలు చేయడం లేదు. ఉత్పత్తి ఖర్చుల లెక్కింపులో ఈ గోల్ మాల్ వల్ల , ప్రతి సీజన్‌లో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు.

ఉత్పత్తి ఖర్చుల లెక్కింపులో వాస్తవ ఖర్చులను కూడా సి‌ఏ‌సి‌పి సరిగా నమోదు చేయడం లేదు . తక్కువగా నమోదు చేస్తున్నది . కొన్ని ఖర్చులను అసలు లెక్క వేయడం లేదు . ముఖ్యంగా పంటల బీమా ప్రీమియం ఖర్చును లెక్క వేయడం లేదు. పంట నూర్పిడికి / కోతకు అయ్యే కూలీ ఖర్చును కూడా లెక్క వేయడం లేదు . ధాన్యం లేదా ఇతర పంటలు ఆరబోయడానికి , క్లీనింగ్‌కు అయ్యే ఖర్చులను , పొలం నుండి ఇంటికి , ఇంటి నుండి మార్కెట్‌కు రవాణా ఖర్చులను కూడా లెక్కించడం లేదు . ఈ అన్ని కారణాల వల్లనే రైతులు ఎంత కష్టపడినా నికర మిగులు ఉండడం లేదు. 2024 -2025 సంవత్సరానికి మద్దతు ధరల ప్రకటన సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు మరోసారి ఈ అన్యాయమే చేసింది .

2024-2025 సంవత్సరానికి వివిధ పంటలకు సి‌ఏ‌సి‌పి అంచనా వేస్తున్న ఉత్పత్తి ఖర్చులు :

2024-2025 సంవత్సరానికి సి‌ఏ‌సి‌పి దేశ వ్యాపిత సగటుతో అంచనా వేస్తున్న పంటల ఉత్పత్తి ఖర్చులు ఇవి. స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం సమగ్ర ఉత్పత్తి ఖర్చు(సి2) అంచనా వేస్తున్నా , దానిని మద్దతు ధరల ప్రకటనకు ప్రాతిపదికగా పెట్టుకోకుండా, కేవలం ఏ2 +ఎఫ్‌ఎల్ నే ప్రాతిపదికగా పెట్టుకుంటున్నారు .

ఉదాహరణకు వరి సేద్యం సమగ్ర ఉత్పత్తి ఖర్చు (సి2) క్వింటాలుకు 2008 రూపాయలు. దీనికి స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం 50 శాతం లాభం కలిపితే ప్రకటించాల్సిన కనీస మద్దతు ధర క్వింటాలుకు 3004 రూపాయలు. కానీ ఏ2 +ఎఫ్‌. ఎల్‌ను ప్రాతిపదికగా పెట్టుకోవడం వల్ల క్వింటాలు ఉత్పత్తి ఖర్చును కేవలం 1533 రూపాయలుగా తీసుకున్నారు. దీనికి 50 శాతం కలిపి క్వింటాలుకు 2300 రూపాయలుగా ఎం‌ఎస్‌పి ప్రకటించారు . పత్తి సమగ్ర ఉత్పత్తి ఖర్చు క్వింటాలుకు 6,230 రూపాయలు. స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం ప్రకటించాల్సిన కనీస మద్ధతు ధర 9,345 రూపాయలు. కానీ ఏ2 +ఎఫ్‌. ఎల్ ను ప్రాతిపదికగా పెట్టుకోవడం వల్ల క్వింటాలు పత్తి ఉత్పత్తి ఖర్చును కేవలం 4747 రూపాయలుగా తీసుకున్నారు. దీనికి 50 శాతం కలిపి క్వింటాలుకు మీడియం స్టేపుల్ కాటన్ కు 7,121 రూపాయలు, లాంగ్ స్టేపుల్ కాటన్ కు 7,521 రూపాయలు మాత్రమే ఎం‌ఎస్‌పి గా ప్రకటించారు. మిగిలిన పంటల లోనూ అలాగే జరిగింది.

2024-2025 సంవత్సరానికి కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరలు :

2024 - 2025 సంవత్సరానికి భారీగా మద్దతు ధరలను పెంచామని కేంద్రం చెప్పుకుంటున్నది. కానీ తరచి చూస్తే - గత సంవత్సరం తో పోల్చినప్పుడు వరి ధాన్యం ధర 5.4 శాతం, సజ్జ ధర 5.0 శాతం, రాగి ధర 11.5 శాతం, మొక్క జొన్న ధర 6.5 శాతం, కంది ధర 7.9 శాతం, పెసర ధర 1.4 శాతం , మినుము ధర 6.5 శాతం, వేరుశనగ ధర 6.4 శాతం, పొద్దు తిరుగుడు ధర 7.7 శాతం, నైజర్ సీడ్ ధర 12.7 శాతం , పత్తి ధర 7.1 శాతం మాత్రమే పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సంవత్సరానికి అంచనా వేస్తున్న ద్రవ్యోల్బణం రేటు 4.5 శాతం.

వ్యవసాయ ఉపకరణాల ధరల పెరుగుదలతో పోల్చినప్పుడు ......

2023-2024 ధరలతో పోల్చి చూస్తే 2024-2025 లో వ్యవసాయ ఉపకరణాల ధరల సూచీ ఎక్కువ ఉండబోతున్నది. మనుషుల కూలీ ఖర్చు 6.0 శాతం , ఎద్దు,నాగళ్ళ కిరాయిలు 8.3 శాతం, యంత్రాల కిరాయిలు 6.3 శాతం, విత్తనాల ధరలు 7.0 శాతం, రసాయన ఎరువుల ధరలు 4.9 శాతం సేంద్రీయ ఎరువుల ధరలు 5.6 శాతం , పురుగు మందుల ధరలు 2.9 శాతం , నీటి తీరువా ఛార్జీలు 3.8 శాతం, మొత్తంగా వ్యవసాయ ఉపకరణాల రేట్లు 6.1 శాతం పెరగనున్నాయి. గత ఐదేళ్ల అనుభవాలను చూస్తే ఈ పెరుగుదల రేటు మరింత ఎక్కువ ఉండవచ్చు.

Read More
Next Story