
వ్యవసాయ రంగంలో GST తగ్గింపు ప్రభావం ఉంటుందా ?
8 ఏళ్లుగా జీఎస్‌టీ పేరుతో ప్రజలను, రాష్ట్రాలను కొల్లగొట్టి ఇప్పుడు గిఫ్ట్ అనడం అతిపెద్ద మోసం.
2014 లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం పన్నుల సంస్కరణల పేరుతో 2017 జులై 1 నుండీ అమలులోకి తెచ్చిన వస్తు, సేవల పన్ను (GST) విధానం ఇకపై కొత్త రూపంలో అమలులోకి రానుంది. ఇప్పటి వరకూ నాలుగు శ్లాబులుగా ( 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం) ఉన్న GST ఈ సంవత్సరం సెప్టెంబర్ 22 నుండీ రెండు శ్లాబులుగా (5 శాతం,18 శాతం) గా ఉండ నుంది.
GST శ్లాబుల తగ్గింపు విధానం ద్వారా దీపావళి, దసరా పండుగ సందర్భంగా అతి పెద్ద బహుమతి దేశ ప్రజలకు అందిస్తున్నట్లు మోదీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి భుజం కాస్తున్న మీడియా సంస్థలు ఊదర గొట్టేస్తున్నాయి. గత 8 ఏళ్లుగా GST పేరుతో మోదీ ప్రభుత్వం దేశ ప్రజలను, రాష్ట్రాలను కొల్ల గొట్టిన విషయం దాచి పెట్టి, ఇంత కాలం అసలేమీ జరగనట్లుగా కళ్లుగప్పి, ఇప్పుడు దేశ ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించుకోవడమే ఇందులో అతి పెద్ద మోసం.
ఈ GST పన్నుల విధానానికి వ్యతిరేకంగా గత 8 ఏళ్లుగా ప్రజలు మాట్లాడారు. ప్రతి పక్ష పార్టీలు మాట్లాడాయి. ప్రజాపక్ష మేధావులు మాట్లాడారు. రైతు,కార్మిక, మహిళా సంఘాలు, వినియోగ దారుల సంఘాలు మాట్లాడాయి.అన్నిటికీ మించి, తమకు జరిగిన అన్యాయాన్ని గురించి రాష్ట్ర ప్రభుత్వాలు గగ్గోలు పెట్టాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా నోట్ల రద్దు గురించీ, తప్పుడు GST అమలు గురించీ, వీటి ఫలితంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నష్ట పోవడం గురించీ, చాలా చిన్న వ్యాపారాలు, పరిశ్రమలు మూత పడడం గురించీ పదేపదే చట్ట సభలలోనూ, బహిరంగ సభల్లోనూ ప్రస్తావించాడు.
మోయలేని పన్నులు, సెస్సుల భారాన్ని దేశ పజలపై మోపిన మోదీ ప్రభుత్వం, ఇప్పుడు, ఈ GST తగ్గింపు కారణంగా రైతులకు, ప్రజలకు కలిగే మేలు గురించి ఊదర గొడుతోంది. GST తగ్గింపు కారణంగా వ్యవసాయ రంగంలో రైతులు సంక్షోభం నుండీ బయట పడి పోతారన్నట్లుగా బిల్డప్ ఇస్తోంది. మీడియా సంస్థలు కూడా ఈ GST తగ్గింపు వల్ల వ్యవసాయ రంగం పుంజుకుంటుందనీ, రైతులకు గొప్ప మేలు జరుగుతుందనీ కథనాలు ప్రచురిస్తున్నాయి.
నిజంగా ఈ చర్య రైతులకు నిజమైన మేలు చేస్తుందా? రైతులకు ఏ మేరకు లాభం జరుగుతుంది. లోతుగా పరిశీలించాల్సిన అంశం ఇది. రైతులు వ్యవసాయ రంగంలో ఉన్న GST పన్నుల వల్ల ఎక్కువ నష్ట పోతున్నారా ? రైతుల పంటలకు సరైన ధరలు అందక పోవడం వల్ల, కేంద్ర ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత లేకపోవడం వల్ల, డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల ఎక్కువ నష్ట పోతున్నారా? అనేది లోతుగా చూడాలి.
సుదీర్ఘ కాలంగా దేశ, రాష్ట్ర వ్యవసాయ రంగం నష్టాల లోనే ఉంటోంది. వ్యవసాయ రంగం నష్టాలలో ఉందంటే అర్థం, ఆ రంగంపై ఆధారపడి ఉన్న వాళ్ళందరూ నష్టాల లోనే ఉన్నారని అర్థం కాదు. వ్యవసాయ భూమి కౌలుకు ఇచ్చిన భూ యజమానులు, వ్యవసాయ ఉపకరణాలను, ముఖ్యంగా విత్తనాలు, రసాయన ఎరువులు, పురుగులు,తెగుళ్ళు ,కలుపు విషాలు తయారు చేసే కంపనీలు, వాటిని రైతులకు అమ్మే వ్యాపారులు, వ్యవసాయ యంత్రాలను తయారు చేసే, వాటిని అమ్మే డీలర్లు, వ్యవసాయ పరిశోధనా రంగంలో పని చేసే శాస్త్రవేత్తలు, వ్యవసాయ రంగ విద్యను బోధించే ఉపాధ్యాయులు, వ్యవసాయ విస్తరణలో పని చేసే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, రైతుల నుండీ వ్యవసాయ ఉత్పత్తులను బల్క్ గా కొనుగోలు చేసే దళారీలు, వ్యాపారులు, ప్రాసెసింగ్ కంపనీలు, బడా రిటైల్ చైన్ల యజమానులు, వ్యవసాయ ఉత్పత్తుల ఆధారిత కిరాణా దుకాణాలను నడిపే వ్యాపారులు – అందరూ లాభదాయకంగానే ఉన్నారు. సుస్థిర ఆదాయాలను స్థిరంగా పొందుతున్నారు. వ్యవసాయ రంగ సంక్షోభానికి బయట తమ జీవితాలను బాగానే గడుపుతున్నారు.
మరి నిజంగా సంక్షోభంలో ఉన్నదెవరు ? పంటలను పండించే రైతులు- ముఖ్యంగా సన్న, చిన్నకారు, మధ్యతరగతి రైతులు, కౌలు రైతులు ఈ సంక్షోభ భారాన్ని మోస్తున్నారు. వారికి ఖర్చులు ఎక్కువ, ఆదాయాలు తక్కువ. పైగా అప్పుల భారం కూడా ఎక్కువే. తెలంగాణా లో 91 శాతం రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకు పోయి ఉన్నాయని, NSSO నివేదిక చెప్పింది. ఐదెకరాల లోపు సన్న, చిన్నకారు రైతు కుటుంబాల నెలసరి సగటు ఆదాయం 9400 రూపాయలు మాత్రమే అని కూడా ఆ నివేదిక చెప్పింది. మన దేశంలో , రాష్ట్రంలో నూటికి 75 మంది రైతులు సన్న, చిన్నకారు రైతులేనన్న విషయం అందరూ గుర్తుంచుకోవాలి. ఇలాంటి దశలో GST గురించీ, GST శ్లాబుల మార్పు గురించీ మాత్రమే పరిమితమై చర్చను కొనసాగిస్తే, నిజమైన గ్రామీణ రైతులకు అన్యాయం చేసినట్లే అవుతుంది.
ఏయే వ్యవసాయ ఉత్పత్తులు GST నుండీ మినహాయింపు పొందాయి ?
భారతదేశ వ్యవసాయ రంగం లో తాజా చేపలు, పాల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలను ( వాటిని ఎలాంటి ప్రాసెస్ చేయనప్పుడు) వ్యవసాయ ఉత్పత్తులుగా పరిగణించి, GST నుండీ మినహాయించారు. అంటే రైతులు, తమ వ్యవసాయ రంగ ఉత్పత్తులను ,ముఖ్యంగా ధాన్యాలు లాంటి ముడి ఉత్పత్తులు, లేదా పండ్లు, కూరగాయలు లాంటి ఉద్యాన పంటల ఉత్పత్తులు తాజా స్థితిలో నేరుగా విక్రయిస్తే వాటిపై GST చెల్లించనవసరం లేదు.
రైతులు పంటలు సాగు చేయడానికి వినియోగించే విత్తనాలను కూడా GST నుండీ మినహాయించారు. పాలు, వెన్న, చీజ్, నెయ్యి లాంటి పాల ఉత్పత్తులపై కూడా GST తొలగించారు. కాకపోతే ఈ ఉత్పత్తులను కంపనీలు వినియోగాదారులకు అమ్మేటప్పుడు, బ్రాండింగ్, రవాణా లాంటి ఖర్చులు అదనంగా అవుతాయి కనుక, వాటిపై GST లేకపోయినా వాటి ధరలు మార్కెట్ లో నిజంగా ఎంత తగ్గుతాయో ఇప్పుడే చెప్పలేము. అలాగే కంపనీల లాభాల మార్జిన్ పై ఎలాంటి పరిమితులు లేవు కనుక, GST తగ్గింపు, మినహాయింపు ప్రయోజనాలు ఏ మేరకు వినియోగదారులకు చేరతాయో కూడా తెలీదు.
GST పరిధిలోకి వచ్చే వ్యవసాయ రంగ ఉత్పత్తులు, ఉపకరణాలు:
సాధారణంగా వ్యవసాయ రంగంలో భాగంగా పెద్ద ఎత్తున సాగించే పశు పోషణ, కోళ్ల పెంపకం వంటివి వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తుల పరంగా GST పరిధి లోకి వస్తాయి.కాబట్టి వీటిని ఏర్పాటు చేసేవారు, GST కౌన్సిల్ దగ్గర తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.తమ ఉత్పత్తులపై GST ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
కలపనూ , గడ్డినీ కత్తిరించడం, పండ్లు సేకరించడం, కృత్రిమ అడవులు పెంచడం, మొక్కలు, నారు మళ్ళు పెంచడం వంటి కార్యకలాపాలను కూడా రైతులు చేసే సాధారణ వ్యవసాయంగా చూడరు. ఫలితంగా ఈ కార్యకలాపాలు సాగించే వారు కూడా GST పరిధిలోకి వస్తారు.
ఈ రకమైన వ్యవసాయ కార్యకలాపాలు, వ్యాపారాలు చేసేవారు GST క్రింద తమ పేరు తప్పకుండా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, తమను తాము నమోదు చేసుకుని, GST రిటర్న్ దాఖలు చేసిన తర్వాత, ఈ వ్యాపారాలు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ITC) పొందడానికి అర్హత పొందుతాయి.
వ్యవసాయ రంగంలో GST తగ్గింపు ప్రభావం ఉంటుందా ?
వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు (Agricultural Equipment):
1. ట్రాక్టర్లు (Tractors), హార్వెస్టర్లు (Harvesters), పవర్ టిల్లర్లు (Power Tillers), | థ్రెషర్లు (Threshers), సీడ్ డ్రిల్లు/ఫర్టిలైజర్ డ్రిల్లు (Seed/Fertilizer Drills), పవర్ వీడర్లు (Power Weeder), రోటావేటర్లు (Rotavators), సూపర్ సీడర్/హ్యాపీ సీడర్ (Super/Happy Seeder), మల్చర్ (Mulcher), కట్టర్ బార్ (Cutter Bar for Harvester), ఆటోమేటిక్ ప్లాంటర్లు (Automatic Planters) కొనుగోలు సమయంలో ఇప్పటి వరకూ చెల్లిస్తున్న28 శాతం GST ప్రస్తుతం 5 శాతానికి తగ్గింది.
2. ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం 35 హెచ్‌పీ ట్రాక్టర్ ధర గతంలో రూ. 6,50,000 ఉండగా GST తగ్గింపు వల్ల 6,09, 000 రూపాయలకు తగ్గుతుంది.
3. 45 హెచ్‌పీ ట్రాక్టర్ ధర 7,20,000 నుండీ రూ. 6,75,000 కు తగ్గుతుంది.
4. 75 హెచ్‌పీ ట్రాక్టర్ ధర రూ. 10,00,000 నుండీ రూ. 9,37,000 కు తగ్గుతుంది.
5. 50 హెచ్‌పీ ట్రాక్టర్ ధర రూ. 8,50,000 నుండీ రూ. 7,97,000 కు తగ్గుతుంది.
6. GST తగ్గింపు వల్ల, రైతులకు వ్యవసాయ ఉపకరణాల కొనుగోళ్లలో నిజానికి 10 నుండీ 20 శాతం ఆదా అవ్వాలి. కానీ వ్యవసాయ ఉపకరణాలు తయారు చేసే కంపనీలు రకరకాల పేర్లు చెప్పి, ధరలు తగ్గించకుండా, రైతులపై అదే భారాన్ని కొనసాగిస్తారా ? యంత్రాల ధరలు తగ్గిస్తారా అనేది ఆచరణలో చూడాల్సి ఉంటుంది.
7. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ధరలు తగ్గడం లేదు. డీజిల్, పెట్రోల్ లను GST పరిధిలోకి తీసుకు రాలేదు. ఇలాంటి స్థితిలో సన్న, చిన్న కారు రైతులు స్వయంగా యంత్రాలను కొనుగోలు చేయలేక, కిరాయికి మాట్లాడుకుంటారు కాబట్టి , వ్యవసాయ యంత్రాలపై GST తగ్గింపు వల్ల, యంత్రాల కిరాయిలు తగ్గి, రైతులపై భారం తగ్గుతుందా లేదా అనేది ఆచరణలో చూడాల్సి ఉంటుంది.
8. పైగా ఈ వ్యవసాయ ఉపకరణాలన్నీ , మొత్తం వ్యవసాయ సమాజంలో అతి కొద్ది మంది మాత్రమే కొనుగోలు చేస్తారని దృష్టిలో ఉంచుకోవాలి. రైతులకు కొంత లాభం జరగాలంటే, 10 ఎకరాల లోపు రైతులకు, మెజారిటీ సన్న, చిన్నకారు రైతులతో ఏర్పడిన రైతు, మహిళా సహకార సంఘాలకు, రైతు ఉత్పత్తిదారుల కంపెనీలకు కూడా వ్యవసాయ ఉపకరణాల కొనుగోలుపై మొత్తం GST నుండీ మినహాయింపు ఇస్తే ఉపయోగకరంగా ఉండేది. కానీ అలాంటి మినహాయింపు ఇప్పుడు కూడా కేంద్రం ఇవ్వలేదు.
బయో పెస్టిసైడ్స్ (bio Fertilizers & Bio-Pesticides)
1. బయో-పెస్టిసైడ్లు (Bio-Pesticides, 12 రకాలు), మైక్రో-న్యూట్రియంట్స్ (Micro-Nutrients), అమ్మోనియా, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ (Raw Materials for Fertilizers) పై ఇప్పటి వరకూ ఉన్న 18 శాతం GSTని 5 శాతానికి తగ్గించారు. బయో-ఫర్టిలైజర్లు (Bio-Fertilizers పై ఇప్పటి వరకూ ఉన్న 5 శాతం GST ని పూర్తిగా రద్దు చేశారు
2. ఈ చర్య సేంద్రియ / సహజ వ్యవసాయ ప్రోత్సాహానికి తప్పకుండా ఉపయోగపడుతుంది. కానీ, ఇప్పటి వరకూ సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంలో ఉన్న ఆచరణ ఏమిటంటే, ఎక్కువమంది సేంద్రియ వ్యవసాయం చేసే సన్న, చిన్న కారు, మహిళా రైతులు పంట సాగు ఖర్చులను తగ్గించుకోవడానికి, స్వయంగా సేంద్రియ ఎరువులను, బయో పెస్టిసైడ్స్ ను తామే తయారు చేసుకుంటున్నారు. అలా కాకుండా, ఈ ఉత్పత్తులన్నీ మార్కెట్లో కంపనీల నుండీ కొనాలంటే, వారిపై పంట సాగు ఖర్చుల భారాన్ని పెంచడమే.
3. ఇప్పటికే సేంద్రియ వ్యవసాయంలో మనుషుల శారీరక శ్రమ ఎక్కువ ఉంటుందనీ, పెద్దగా మిగులు ఉండడం లేదనే అభిప్రాయం సర్వత్రా ఉండి, ఎక్కువమంది రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు రావడం లేదు. సేంద్రియ వ్యవసాయంలో ఎదురవుతున్న మిగిలిన కీలక సమస్యలను పరిష్కరించకుండా, GST లో ఇచ్చే ఈ కొద్దిపాటి మినహాయింపులు, తగ్గింపులు రైతులను ఏ మేరకు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళిస్తాయన్నది అనుమానమే.
రసాయన ఎరువులు, పురుగు విషాల పై :
1. రసాయన ఎరువుల ముడి పదార్థాలు (Chemical Fertilizer Inputs) పై ఇప్పటి వరకూ ఉన్న 12 శాతం GSTని 5 శాతానికి తగ్గించారు.
2. రసాయన ఎరువులపై కూడా GST 5 శాతానికి తగ్గింది.
3. రసాయన పురుగు విషాలపై మాత్రం 18 శాతం GST ఉంటుంది.
4. తెలంగాణా రాష్ట్రంలో రసాయన ఎరువులు, పురుగు విషాలు విచ్చలవిడిగా వాడుతున్న విషయం గమనిస్తున్నాం. 2014 లో 1000 తన్నులు ఉన్న పురుగు విషాల వినియోగం 2023 నాటికి ఐదు రెట్లు పెరిగి 5,000 టన్నులకు చేరింది. పంట సాగు ఖర్చుల్లో కూడా ఈ పురుగు , కలుపు విషాల వినియోగం ఖర్చు ఎక్కువ ఉంటున్నది. ఇలాంటి స్థితిలో రైతులు పురుగు విషాలు మానేసి, సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళుతారా, లేదా పురుగు, కలుపు విషాల GST భారాన్ని మోస్తారా అనేది చూడాలి.
డైరీ మరియ పశుపోషణ (Dairy & Animal Husbandry)
1. వెన్న (Butter) పై మాత్రం ఇప్పటి వరకూ 12 శాతం ఉన్న GST ని 5 శాతానికి తగ్గించారు.
2. పాల క్యాన్‌లు (Milk Cans)పై 18 శాతం ఉన్న GST 5 శాతానికి, పశు వైద్య పరికరాలు (Veterinary Equipment) పై 12 శాతం ఉన్న GST 5 శాతానికి తగ్గించారు.
3. పాలు తప్ప, మిగిలిన ఉత్పత్తులన్నీ , రైతులు నేరుగా వినియోగదారులకు అమ్మారు. ఈ వ్యాపారంలో చిన్న వ్యాపారుల నుండీ, పెద్ద కంపెనీల వరకూ అనేక మంది భాగస్వాములుగా ఉన్నారు. పైగా ప్రభుత్వం ప్రోత్సహించి , ఏర్పాటు చేసిన విజయ డైరీ లాంటి సంస్థలను ప్రైవేట్ కంపనీలు, కార్పోరేట్ ల తరహాలో నడిచే అమూల్ లాంటి బడా సహకార సంఘాలు కబళిస్తున్న దశలో, ఈ GST తగ్గింపు నిజంగా రైతులకు ఎంత లాభదాయకమో ఇప్పుడే చెప్పలేము.
ఇతర వ్యవసాయ సంబంధిత అంశాలు (Other Rural & Allied Sectors)
1. డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు (Drip Irrigation Equipment)పై ఇప్పటి వరకూ ఉన్న 18 శాతం GSTని 5 శాతానికి తగ్గించారు.
2. కోల్డ్ స్టోరేజ్ సర్వీసెస్ (Cold Storage Services) పై, ఫుడ్ ప్రాసెసింగ్ (Food Processing Equipment) యునిట్లపై ఇప్పటి వరకూ ఉన్న 18 శాతం GST ని 5 శాతానికి తగ్గించారు
3. ప్రాసెస్ చేయబడిన చేపలు/ఫిష్ ప్రొడక్ట్స్ (Preserved Fish)పై GST ని 12 శాతం నుండీ 5 శాతానికి తగ్గించారు.
4. సహజ తేనె (Natural Honey) పై 5 శాతం ఉన్న GST ని రద్దు చేశారు.
ఇవన్నీ వ్యవసాయ రంగానికి మేలు చేసే చర్యలే. కానీ, సాధారణ చిన్న, సన్నకారు రైతులు , మత్స్య కారులు, సహజ తేనెను సేకరించే ఆదివాసీలు ఇప్పటికీ తమ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి నేరుగా వినియోగదారులకు అమ్ముకునే పరిస్థితి లేదు. అనేక మంది వ్యాపారులు, కంపనీలు ఇలాంటి పనులు చేస్తున్నాయి. నిజంగా రైతులకు, ఇతర ఉత్పత్తి దారులకు, ఆదివాసీ కుటుంబాలకు GST తగ్గింపు, మినహాయింపు వాళ్ళ లాభం జరగాలంటే, ఆయా సమూహాలు, సహకార సంఘాలుగా ఏర్పడి, వాటిని అమ్ముకోగలిగే స్థితి, అందుకు ప్రభుత్వ సహకారం అవసరం. అలాంటి సంఘాలు ఏర్పడి మార్కెట్ చేసుకుంటున్న చోట, ఆయా సంఘాలపై GST పూర్తిగా రద్దు చేయడం రైతులకు , వారి సంఘాలకు మేలు చేస్తుంది. లేనట్లయితే, కేంద్ర ప్రభుత్వ GST తగ్గింపు లాంటి చర్యలు కేవలం ప్రైవేట్ కంపనీలకు ఉపయోగపడతాయి. GST తగ్గింపు, మినహాయింపు, ఫలితాలు బదిలీ కాక, వినియోగదారులకు కూడా పెద్దగా లాభం ఉండకపోవచ్చు.