మీరంతా సరండర్‌ అయిన వారి లోటు పూరించడానికి తుపాకి పడతారా?
x
అడవులనుంచి వెనుదిరిగివస్తున్న అన్నలు , అక్కలు

మీరంతా సరండర్‌ అయిన వారి లోటు పూరించడానికి తుపాకి పడతారా?

మార్క్సిజంలో వున్న చలన సూత్రాలు ఏవి? అవి సమాజ చలనాలను పసికట్టినదెంత?


మావోయిస్టులు తిరిగి స్వగృహానికి తరలి వస్తున్నారు. వారిని స్వాగతిద్దాం. ఇంతదాక కష్ట పడింది చాలు. సమాజానికి అవసరమైతే వారే కదులుతారు. అయ్యో అంటూ విప్లవం గురించి వాపోయే వారు తాము విప్లవం చేయాలి. వారెందుకు విప్లవం చేయడం లేదు? ఇతరులే విప్లవం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు.

విప్లవం సమాజ చలన స్వభావం అయినప్పుడు వారంతా అందులో విప్లవించాలి కదా! అలా కాకుండా విప్లవం గురించి మాట్లాడుతూ ఆ పేరు చెప్పుకొని, ప్రచారం చేసుకుంటూ భార్యా పిల్లలతో బతుకుతూ ఉద్యోగాలు చేస్తూ దశాబ్దాలు పని చేసిన అనుభవాలు అలసటతో వచ్చే విమర్శించడం దేనికి?

విమర్శించేవాళ్ళు సరండర్‌ అయి వస్తున్న వారి లోటును పూరించడానికి విప్లవంలో చేరి పని చేయాలి. అంతేగాని నలభై యేళ్ళు జీవితాలను అంకితం చేసి పని చేసి అలసి ఇక ఈ కష్టాలు చాలు అని స్వగృహ ప్రవేశం చేస్తున్న వారిని విమర్శించడం మానవత్వం ఉన్న మనుషులు చేసే పనేనా?

నేను కూడా 14 ఏళ్లు విప్లవంలో ఉన్నా...

1977 నుండి 1990 దాకా మార్క్సిజాన్ని నమ్మి 14 ఏళ్లు పార్టీకోసం పని చేసి తిరిగి పాత ఉద్యోగంలో చేరాను. అప్పుడు కూడా నన్ను ఇలాగే దిగజారిపోయాడు. వగైరా పదాలతో విమర్శించినవాళ్ళంతా ఉద్యమం చేయనివాళ్ళే. హాయిగా కుటుంబంతో రకరకాల వృత్తి వ్యాపారాలు, ఉద్యోగాలతో బతుకుతున్నవాళ్ళే. అందువల్ల ఈ సమస్య ఇప్పుడు సరండర్‌ అవుతున్న వాళ్ళది మాత్రమే కాదు. ఇలాంటి సందర్భాలను ఎలా అర్థం చేసుకోవాలో నా జీవిత అనుభవం చెప్తున్నది. వాళ్ళు తమ స్వార్థం కోసం, కీర్తి ప్రతిష్ఠల కోసం ఇతరులు ఉద్యమాలు చేయాలి. మేము దాన్ని ప్రచారం చేసుకుంటూ, పేరు చెప్పుకుంటూ బతకాలి అనేవాళ్ళే నూటికి తొంబైతొమ్మిది మంది అసలు మార్క్సిజంలో ఉన్న సమాజ చలన సూత్రాలు ఎన్ని అనేది ఏమేరకు పట్టించుకున్నది. ఏవేవి వదిలేసినవి అనే విషయాలను నా అధ్యయనం, అనుభవాల ద్వారా తెలుసుకున్న విషయాలను ఈ వ్యాసంలో సంక్షిప్తంగా పరిచయం చేస్తాను.

మార్క్సు జ్ఞానం

తన కాలంలో వున్న సమాజ చలనాలను పసికట్టడానికి జీవితమంతా తీవ్ర కృషి చేశారు. లండన్‌ లైబ్రరీలో వేలాది పుస్తకాలు చదివారు. అలా మానవాళి సాధించిన జ్ఞానాన్ని, వారి ప్రత్యక్ష అనుభవాలను పరోక్ష జ్ఞానం ద్వారా అంది పుచ్చుకున్నారు. తనలో భాగం చేసుకున్నాక ఆ జ్ఞానమంతా తన సొంత అనుభవాల నుండి వచ్చిన జ్ఞానం అనుకునే దశకు చేరుకున్నాడు. కవులు తానే ప్రపంచమై ప్రపంచం తరఫున నుడివినట్టు మార్క్సు నుడివారు. తన పూర్వీకుల కృషిపట్ల క్రమంగా నిర్లక్ష్యం ఏర్పడింది.

The Marx memorial at Highgate Cemetery in north London. Photo: Wikimedia Commons

మార్క్సిజం గురించి చెప్పాల్సి వస్తే మార్క్సుకు సమాజ చలన సూత్రాలు పూర్తిగా అర్థం అయినట్టు లేదు. లండన్‌ లైబ్రరీ అనే అంగట్లకెల్లి గంపల కొద్ది తీసుకవచ్చి కుప్ప వోసి రాసుకుంటపోయిండు. మార్క్సు రాసిందంతా మార్క్సిజం కాదు అని చాలామందికి తెలిసినట్టు లేదు. ఎప్పటికప్పుడు ఆయా సందర్భాల్లో ఎట్ల తోస్తే అట్ల రాసిండు. ఆ తర్వాత అది సర్వకాల సర్వావస్థలకు సార్వత్రిక సూత్రం అని చెంచాలు చెప్పుకుంట వోయిన్రు. తమ మెదడు చిలక్కొయ్యకు తగిలేసిన్రు.

ఒక ఉదాహరణ

‘‘తత్వవేత్తలంతా ఇంత దాకా రకరకాలుగా వ్యాఖ్యానించారు. అసలు విషయం ఏమంటే దాన్ని మార్చడం’’ అని మార్క్సు సత్యం చెప్పాడని ప్రచారం చేస్తారు. యువకుడిగా ఉన్నపుడు మార్క్సు తెలిసీ తెలువక ఏదో రాస్తే అది సత్యం అనడం తప్పు. బుద్దుడు, ఏసుక్రీస్తు, మహమ్మద్‌ ప్రవక్త , గురు నానక్‌, పోతులూరి వీర బ్రహ్మం సమాజాన్ని మార్చడానికే కృషి చేసారు. వారందరి కృషిని మార్క్స్‌ సూత్రీకరణ చరిత్రగా నిరాకరించింది. తన ఒక స్టేట్‌ మెంటు కోసం శతాబ్దాల చరిత్ర పరిణామాన్ని వదిలేసారు. కనక ఈ విషయంలో వారిది , వారిని సమర్థించే వారిది చారిత్రక దృష్టి లోపం. అసలు విషయం ఏమంటే మార్క్సు లైబ్రరీలో చదివి రాసుకుంటూ అదంతా తన సొంత జ్ఞానమే అని భ్రమ పడ్డారు. తప్పు ఆయనది కాదు. ఆయనను అట్లా ప్రచారం చేసిన వాల్లది.

కమ్యూనిజం మార్కెటింగ్

కమ్యూనిజం అనేది అది వస్తుందో రాదో తెలియని ఒక ఊహా ప్రతిపాదన. అది ఎట్లా ఉంటుందో తెలియదు. కానీ ఆ పేరు పెట్టి విస్తృతంగా ప్రచారం చేశారు. లేని స్వర్గం, నరకాలను, పునర్జన్మలను ఉన్నట్టుగా ప్రచారం చేయడానికి కమ్యూనిజం, కమ్యూనిస్టు సమాజం అని ప్రచారం చేయడం రెండూ ఒకటే. రెండూ ఊహలే. సోషలిజం అనే మేరకు కొంత ఊహ ప్రతిపాదనలు హేతుబద్దంగా కనిపిస్తాయి. అయితే సోషలిజాన్ని శాంతియుతంగా సాధించాలని ఫ్రెంచి సోషలిస్టులు ప్రౌధాన్‌ తదితరులు భావించారు. ప్రజాస్వామ్యం ద్వారా, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ద్వారా సోషలిజం కొనసాగుతుందని అనుకున్నారు. మార్క్స్‌, ఎంగెల్స్‌లు ఇందుకు భిన్నంగా ఏకపార్టీ వ్యవస్థ, కమ్యూనిస్టుల నాయకత్వంలో మాత్రమే సోషలిజం వస్తుంది. అది కూడా సాయుధ తిరుగుబాటుతో వస్తుంది. పెట్టుబడిదారులు ఉండరు. కార్మికులే ప్రభుత్వాలను తమ నాయకత్వంలో నడుపుకుంటారు అని అన్నారు. ఏ దేశంలో కూడా ఇప్పటివరకు కార్మికులనుంచి వచ్చినవాళ్ళు ప్రభుత్వ అధినేతలుగా పని చేయడం జరగలేదు. ఎవరో వచ్చి మేము కార్మికవర్గ దృక్పథంతో పని చేస్తున్నాం అని కార్మికుల పేర్లు చెప్పి (చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్టు) తాము అధికారంలోకి వచ్చారు. వారంతా పెట్టిబూర్జువా మధ్య తరగతి సామాజిక వర్గాలవాళ్ళు.

రెండవ ఉదాహరణ

‘‘చరిత్రంతా వర్గ పోరాటాల చరిత్రే’’ అనడం. పోరాటం లేకుండా శాంతియుతంగా సమాజం సంస్కృతి మారుతూ వస్తుంది. బుద్దుడు శాంతియుత పరిణామంతో 13 శతాబ్ది దాకా ప్రభావితం చేస్తూ నే వున్నాడు. ఆనాటి బౌద్ద విశ్వ విద్యాలయాలు అహింసాయుత శాంతియు పరివర్తనన వేగంతం చేశాయి. వ్యక్తి సంస్కారం, పంచశీల, అష్టాంగ మార్గం, యోగ ధ్యానం , ప్రేమ కరుణ, పరోపకారం, విద్య వైద్య సేవల ద్వారా ,జ్ఞానాన్ని అందించడం వెలుగులు నింపారు. మనుషుల మనస్సులను గెలుచుకున్నారు. ఇలా పోరాటం లేకుండా బతికే సమాజానికి జీవితం లేదని చరిత్ర లేదని చెప్పడం తప్పు. మార్క్సిజానికి అధికారంలోకి రావడమే పరమావధి. సేవా అనే పదం వారు వాడడమే లేదు. బౌద్ధం, క్రైస్తవం, సేవా అనే పదాన్ని విద్యా, వైద్య సేవలతో ముందుకు నడిచి ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. శాంతియుత పరివర్తనతో సమాజాన్ని మార్చారు.

మూడవ ఉదాహరణ

మార్క్సిజంలో అర్థ శాస్త్రం అందులో మౌలికాంశం. వారి ఉద్యమాలు కార్య క్రమాలు, కార్మిక వర్గ నియంతృత్వం అనే ప్రతిపాదన దీనిమీదే నిర్మిత మయ్యాయి.

అదనపు విలువ కేవలం శ్రామికుడి శ్రమశక్తి యొక్క అదనపు విలువ అనడం చాలా తప్పు. అందులో ఇంటి వద్ద సేవలందించే స్త్రీల శ్రమ ఉంది. సైమన్‌ ది బోవర్‌ అదనపు విలువ సిద్దాంతం డైలెక్టికల్‌ మెటేరియలిజం పితృస్వామిక పురుషాధిపత్య వాదమే తప్ప మొత్తం మానవాళికి చెందినది కాదు తన సెకండ్‌ సెక్సు పుస్తకంలో నిర్దారించారు.

సైన్సు టెక్నాలజీ వల్ల అదనపు విలువ సంపద పెరుగుతున్నది. అది కేవలం కార్మికులది కాదు. అది మొత్తం మానవాళికి చెందినది. ఎపుడైతే మొత్తం మానవాళి సంచయమని అనుకుంటామో అపుడు కార్మిక వర్గ నియంతృత్వ వ్యవస్థ అనే ప్రతిపాదనకే అర్థం వుండదు.

నాలుగవ ఉదాహరణ

తాను చేయని, తాను వ్యతిరేకించిన ఫ్రెంచి విప్లవం చేసిన బ్లాంకిస్టులు గెలిచి తర్వాత ఓడి పోయినపుడు... మనదైన సాయుధ సైన్యం ఉండాలె అని అన్నాడు మార్క్స్‌ అన్నాడు. ఇపుడున్న సైన్యాన్ని, పోలీసులను కూడ మనవైపు తిప్పుకోవాలె చెప్పితే సరిపోయేది. భారత మొదటి స్వాతంత్ర యుద్దంలో 1857లో అదే తరిగింది. దీనిని మార్క్స్‌ పరిగణనలోకి తీసుకోలేదు. ఫ్రెంచి సోషలిస్టుల మీద కోపంతో, ఆధిక్యత ప్రదర్శించాలని, బ్లాంకిస్టుల పోరాటానిని వియతిరేకించి తప్పును కపిపి పుచ్చు కోవడానికి వాల్ల కన్నా అతిగా పొగిడి సొంత సైన్యం కావాలని అన్నాడు. అలా ఫ్రెంచి సోషలిస్టుల మీద పైచేయి సాధించే ప్రయత్నం లో అలా అన్నాడు మార్క్స్‌! దాన్ని సార్వత్రికం చేసారు కొందరు. ఫ్రాన్స్‌ సోషలిస్టులు, ప్రౌధాన్‌ తదితరులు శాంతియుతంగా సాగాలన్నారు. దాన్ని వ్యతిరేకిండంతో సోషలిస్టులు కమ్యూనిస్టులు ప్రపంచ వ్యాప్తంగా రెండు శిబిరాలయ్యాయి.

ఐదవ ఉదాహరణ

కాంట్‌ కన్నా, హెగెల్‌ కన్నా, అంతకుముందే చెప్పిన ఆచార్య నాగార్జునుడి కన్నా, అరిస్టాటిల్‌ కన్నా, ప్లేటో కన్నా మనకు సత్యమే ప్రామాణికం. అయినా మార్క్స్‌, ఎంగెల్స్‌లు హెగెల్‌ నుండి డైలెక్టిక్సును తీసుకొని ముందుకు సాగారు గనుక హెగెల్‌ చెప్పిన విషయాలు చూద్దాము. హెగెల్‌ పాతది పోయి కొత్తది వస్తుంది అన్నాడు. దీన్ని నెగేషన్‌, నెగేషన్‌ ఆఫ్‌ నెగేషన్‌ సూత్రీకరణ అంటారు.. దీనిప్రకారం మార్క్సు సమాజ పరిణాలకు అన్యించి ఇలా అన్నారు. మతృ స్వామిక సమాజం పోయి పితృస్వామిక పురుషాధిపత్య సమాజం వచ్చింది.

గణ తెగల సమాజం పోయి బానిస సమాజం వచ్చింది. బానిస సమజం పోయి ఫూడల్‌ సమాజం వచ్చింది. ఫ్యూడల్‌ సమాజం పోయి పారిశ్రామిక పెట్టుబడిదారీ కార్మిక సమాజం వచ్చింది. ఈ క్రమంలో పెట్టుబడిదారుల సమాజం పోయి కార్మికుల సమాజం వస్తుంది. అది కార్మిక వర్గ నియంతృ త్వంగా వుంటుంది వుండాలి అని ప్రతిపాదించారు. ఆ తరువాత అది వర్గాలు లేని కమ్యూనిజం సమాజంగా ‘‘శాంతియుతం’’గా పరివర్తన చెందుతుంది అన్నారు. ఈ దశ మాత్రమే శాంతియుతంగా సాగుతదట!. సోషలిజం మాత్రం శాంతియుతంగా రాదట!.

ఐతే హెగెల్‌ రెండో సూత్రం కూడ చెప్పాడు. పాతదీ వుంటుంది. కొత్తదీ వుంటుంది అన్నాడు. దాన్ని సబ్‌లేషన్‌ అన్నాడు. ఇలా హెగెల్‌ నెగేషన్‌, సబ్లేషన్‌ రెండూ చెప్తే మొదటిదొకటే పట్టుకొని చారిత్రక భౌతిక వాదం, భౌతిక వాదం, పెట్టుబడి దారీ సమాజం పోయి కార్మికవర్గ నియంతృత్వం వస్తుందన్నారు.

ప్రకృతిలో సమాజంలో చలనాలు, పరిణామాలు ఎలా సాగాయో చూద్దాము. చెట్టు నుండి వచ్చిన విత్తనాలతో మల్లీ మొక్కలు పెరిగి ఒక వనంలా విస్తరిరిస్తాయి. మానవులు తాత నానమ్మ మొదలకొని కొడుకులు కోడల్లు మనవలు మునిమనవల్లు కలిసే జీవించారు. శిశువులను వారే పెంచి పోషించారు. మాతృత్వ ప్రేమను మించిన ప్రేమ మరొకటి లేదని చరిత్ర తెలపుతున్నది. ఇలా పాతవాల్లు పోయి కొత్త తరాలు రాలేదు. పాత తరాలే కొత్త తరాలను తమ సర్వ్సం ధారపోసి రక్షించుకుంటూ పెంచుకుంటూ వచ్చాయి. జంతువులు పశు పక్ష్యాదులలోను ఇది గమనించవచ్చు. కనక మార్క్సిజం సబలేషన్‌ సూత్రాన్ని కూడా మానవ సమాజ పరిణామం నుండి గాని, హెగెల్‌ నుండి గాని స్వీకరించి వుంటే పాతది వుంటుంది కొత్తది వంటుంది. కనక పెట్టుబడిదారీ సమాజం, కార్మికవర్గం కలిసి జీవిస్తారు. సోషలిస్టు వ్యవస్థ ఫ్రెంచి సోషలిస్టులు చెప్పినట్టు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, ప్రజాస్వామిక వ్యవస్థ అనే పరిణామం సాగుతుంది అని చెప్పే వారు. అలా చెప్ప లేదు. వాస్తవాలను స్వీకరించక తమ ప్రతిపాదనను పట్టుకొని వేల్లాడారు.

ఆరవ ఉదాహరణ

మార్క్సిజంలో ప్రపంచమంతా మాకు తెలుసు అనే భావన కొనసాగు తున్నది. అన్ని నిర్దారణ అయ్యయి. ఇక మేం ఇచ్చిన కార్యక్రమంతో ఉద్యమాలు నిర్మించడమే అనుకుంటారు. అంటారు. ఎదుటి వారి హడల గొట్టి నిజమే ో అనిపిస్తారు. ప్రపంచం లో ప్రధాన వైరుధ్యం పెట్టుబడి దారులకు కార్మికులకు అంటారు. మావో కాస్త వెనకకు వెళ్లి రైతాంగం, వ్యవసాయ సమాజం నుండి వారిని కలపుకొని ముందుకు సాగాలన్నారు. నక్సలైట్లు మావోయిస్టు ఈ భావాన్ని స్వీకరించారు.

అయితే ఇక్కడొక తాత్విక సమస్య ఉంది. ప్లేటో దగ్గరికి వెల్లాలి. ఆవులున్నాయి. అన్ని ఆవులలో వున్న సామాన్య లక్షణాలు ప్రధానం అంటారు. ఒక గొర్రెనో ఆవునో గుర్తించాలంటే దానికి చవు మీదో తలమీదో ఏదో తెలుపో ఎరుపో అనుసరించి గుర్తు పడతాము. కనక యూనివర్సల్‌ లక్షణాల్లో ఇండివీడ్యువల్‌ పర్టికులర్‌ లక్షణాలు స్వభాలను బట్టి గుర్తిస్తారు. కనుక యూనివర్సల్‌ లో పర్టికులర్‌ ప్రధానం అన్నాడు అరిస్టాటిల్‌. బౌద్ద తాత్వికులు తార్కికులు ఈ విషయమై 1500 సంవత్సరాలుగా అరిస్టాటిల్‌ కన్నా మ్నుంనుండి చర్చిస్తున్నారు. చివరకు పర్టికులరే ప్రధామని అంగీకరించారు.

మార్క్సిస్టులు వదిలేసిన ప్రధాన వైరుధ్యం

అంటే మరేం లేదు. చెట్టు అనేది ఏదో ఒక చెట్టు రూపంలో వుంటుంది. అనేక చెట్ల సామాన్య లక్షణాలను బట్టి దానికి చెట్టు అని పేరు పెట్టడం జరిగింది. అడవిని నరకాలంటే ఒక్కొక్క చెట్టు కొట్టేసుకుంటూ పోవాలి. రోగం వస్తే ఒక్కొకరికి మందు ఇవ్వాలి. ప్రతి ఒక్కరిని విద్యావంతం చేస్తేనే సమాజం విద్యావంతం అవుతుంది. అనగా సార్వత్రిక యూనివర్సల్‌ అంశాన్ని గుర్తించినప్పటికీ ప్రతి ఒక్కటి ప్రతి పర్టికులర్‌ను మార్చుకుంటూ పోవాలి. మార్క్సు మార్క్సిస్టులు ఈ విషయం వదిలేసి ప్రధాన వైరుధ్యం చర్చకు ప్రాధాన్యత ఇస్తూ విడిపోయారు. ఇలా మార్క్సిజం ఆచరణలో ప్లేటో యూనివర్సల్‌ వాదంలో కొనసాగుతున్నది. ప్లేటోను భావ వాదులన్నారు. మార్క్సిజంలా భావ వాదంగా ఆచరణలో కొసాగుతున్నది. అందువల్ల వారు ఆయా పర్టికులర్‌లా రూపంలో కనసాగుతున్న యూనివర్సల్‌ ను పరిష్కరించడం ద్వారానే యూనివర్సల్‌ యొక్క పరిషారం సాగుతుంది అనే విషయం వదిలేసారు. అధికారం ముందు రావాలి. వచ్చిన తర్వాత సంస్కృతి విప్లవం పేరిట వీటిని నిర్బంధంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలి అని భావించారు. నిజానికి ఇలాంటి కుల, మహిళ సమస్య, పితృస్వామిక ఆధిపత్య సమస్య, మత సమస్య వంటి నిర్ధిష్ఠ సమస్యలను వాళ్ళు ఎందుకు వదిలేస్తున్నారో వారికి తెలుసు అనుకోను. కానీ ప్రధాన వైరుధ్యం పేరిట మిగతా వైరుధ్యాలను వదిలేశారు.

అందువల్లనే కుల సమస్యను, స్త్రీల సమస్యను, పురషాధిపత్య సమస్యను, అందరికి విద్య, అందరికి వైద్యం, ఆధునిక అభివృద్దిలో అందరికీ భాగదాయ వాటా ఎప్పటికప్పుడు అందాలి అందించాలి అనే విషయాలు వదిలేశారు. అధికారం సాధిద్దాం సాయుధమవుదాం పద అనుకున్నారు. అందువల్ల వారన్న ప్రాంతాల్లో అభివృద్ది సంక్షేమం, ప్రజల సామాజిక వర్గాల ప్రానిధ్యం అనే అంశాలను వదిలేసారు. అందువల్ల ప్రజలు ఉద్యమాలను, ఉద్యమ కారులను వదిలి వేసారు. తమ సమస్యలను అభివృద్దిని ఎవరు పట్టించుకుంటే, పట్టించు కుంటామని హామీలిస్తే ఓటేసి గెలిపిస్తున్నారు. నచ్చనపుడు ఓడిస్తున్నారు. ఓటు అనేది వారి వద్ద నున్న మహా ఆయుధం. మార్క్స్‌ మార్క్సిజం ప్రజల ఓటు హక్కు శక్తిని గుర్తించలేదు. తాము చెప్పినట్టు విప్లవాలు చేయాలని కోరుకున్నది. ఇవన్ని 1990లో రాసిన ‘‘గతితర్క తత్వదర్శన భూమిక’’ తదితర పుస్తకాల్లో రాసాను. ఇంకా వివరంగా తెలుసుకోవాలనుకునేవారు వాటిని చదవడం మంచిది.

ఇప్పుడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు సామాజిక అభివృద్ధిలో, రాజ్యాధికారంలో, సమస్థ రంగాల్లో తమ జనాభా దామాషా మేరకు ప్రాతినిధ్యం కోరుకుంటున్నారు. ఉద్యమిస్తున్నారు. బీసీలకు 56 శాతం రిజర్వేషన్లు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు చట్టసభల్లో, సైనిక రంగంలో, సైన్స్‌ రంగంలో, పరిపాలనా రంగంలో, విద్యారంగంలో, వైద్య రంగంలో, పారిశ్రామిక రంగంలో, రాజకీయ రంగంలో తమ జనాభా దామాషా మేరకు ప్రాతినిధ్యం ఉండాలని కోరుతున్నారు. ఉద్యమిస్తున్నారు. అందుకు ఓటు హక్కును, దాని విలువను గుర్తించారు. ఓటు హక్కు ద్వారా వీటన్నిటిని మార్చుకోవాలని ఉద్యమిస్తున్నారు. అందువల్ల సమాజం మారాలని ఉద్యమించి విరమిస్తున్నవాళ్ళు అలాగే విప్లవం చేస్తే బాగుండు అని బయట ఉండి మాట్లాడుతున్న వాళ్ళు ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళా ప్రాతినిధ్యం కోరుతున్న ఉద్యమాలతో కలిసిపోవాలి. కలిసి పని చేయాలి. ఈ సమాజమే మళ్లీ కాపాడుకుంటుంది. కుల సమస్య మీద, మహిళా సమస్య మీద నిరాయుధంగా, రోడ్లమీదికి వస్తే వారిపై నిర్బంధాలు ప్రయోగిస్తే ప్రభుత్వాలు కూలిపోవడానికి రోజులు పట్టవు.


Read More
Next Story