ఏపీ ఎన్నికల్లో నెగెటివ్ ఓటు ప్రభావం ఎలా ఉంటుంది?
x

ఏపీ ఎన్నికల్లో నెగెటివ్ ఓటు ప్రభావం ఎలా ఉంటుంది?

ఆంధ్రలో ఎన్నికల జాతరకు సమయమాసన్నమైంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికలపై నెగిటివ్ ఓట్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు వాతావరణం కనిపిస్తోంది.ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం (ఇటీవలి కాలంలో ఒడిశా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనే దానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది.

వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న అమ్మఒడి, జగనన్న దీవెన, చేయూత, పేదలకు ఇళ్ల స్థలాలు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక వంటి అనేక పథకాలు పారదర్శకంగా లబ్దిదారులకు చేరి అనేక మంది జీవితాలలో మార్పు తెచ్చాయనటంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే విద్య, వైద్య రంగంలో సంస్కరణలు సిబ్బంది కొరత కారణంగా లక్ష్యాలు నెరవేరకపోయినా, కొంతమేర మంచే చేశాయి. అయితే అదే సమయంలో, పెద్ద సంఖ్యలో… దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇస్తున్న ఈ పథకాల వల్ల తీవ్రమైన నిధుల కొరత ఏర్పడి అభివృద్ధి చతికిలపడింది. దీని ప్రభావం రాష్ట్రంలోని ఎన్నో రంగాల వ్యక్తులపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావం చూపింది. దీనితో ఈ పథకాల దుష్పరిణామాలతో నష్టపోయిగానీ, ఇతర కారణాలవల్లగానీ జగన్‌ను వ్యతిరేకించేవారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంది.

మధ్యతరగతి ప్రజానీకం

ఎక్కడెక్కడ ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి సంక్షేమ పథకాల కోసం మళ్ళించడంతో ప్రభుత్వోద్యోగుల జీతాల కోసం పన్నులు విపరీతంగా పెంచేసింది వైసీపీ ప్రభుత్వం. తమ దగ్గర నుంచి జగన్ పన్నుల రూపంలో కొల్లగొట్టి ఓట్లు కొనుక్కుంటున్నాడని, పైగా పేదలను బద్ధకస్తులుగా మారుస్తున్నాడని మధ్యతరగతి ప్రజానీకం భావిస్తోంది. వారు వైసీపీపై కసిగా ఉన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు - టీచర్‌లు

సీపీఎస్ రద్దు తదితర విషయాలలో 2019 ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలపై మాట మార్చడం, నెల నెలా జీతాలు సక్రమంగా ఇవ్వకపోవటంతో ఉద్యోగులు అత్యంత కసిగా ఉన్న వర్గంగా మారారు. మరోవైపు బోధన కాకుండా తమకు సవాలక్ష పనులు అప్పజెప్పటంతో ప్రభుత్వ టీచర్లలో అసంతృప్తి ఎక్కవగానే ఉంది. అదీ కాక, రిక్రూట్మెంట్ లేకపోవటంతో సిబ్బంది కొరత పాఠశాలల్లో బాగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు వేల బడుల్లో సింగిల్ టీచరే ఐదు తరగతులనూ నడుపుతున్నారు. వారి బాధ వర్ణనాతీతం.

ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన విద్యారంగ సంస్కరణలు ఉపాధ్యాయుల కొరతతో చతికిలబడ్డాయి. లక్షలతో బాగుచేసిన పాఠశాల భవనాలు, సమీపంలోని హైస్కూల్స్‌లో మెర్జ్ చేయటంతో పాడుబడిపోతున్నాయి. బోధనకాకుండా తమకు అప్పజెబుతున్న పనులన్నీ చేయలేక రిటైర్మెంటుకు దగ్గరగా ఉన్న టీచర్లు పలువురు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుంటున్నారు. మరోవైపు ఆ రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం వారు చకోర పక్షుల్లా చూడాల్సిన పరిస్థితి.

యువత-నిరుద్యోగులు

కేవలం సంక్షేమంపై దృష్టి పెట్టి, అభివృద్ధిని ఇసుమంతైనా పట్టించుకోలేదని విద్యావంతులు అందరిలో జగన్ పరిపాలనపై అసంతృప్తి తీవ్రంగా ఉంది. నిధులన్నీ సంక్షేమానికి కేటాయించి రహదారుల వంటి మౌలిక వసతులను నిర్లక్ష్యం చేశాడని, పన్నులను తారాస్థాయిలో పెంచేశాడని వారు ఆగ్రహంలో ఉన్నారు. మరోవైపు జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ విషయాలలో వాగ్దానాలను తుంగలో తొక్కడం కూడా వారి ఆగ్రహానికి కారణమయింది.

భవన నిర్మాణ కార్మికులు

జగన్ ప్రభుత్వం తెచ్చిన ఇసుక విధానం, ఏపీలో రియల్ ఎస్టేట్ కుదేలైపోవటంతో భవన నిర్మాణ పనులు అనేకచోట్ల నిలిచిపోయి ఈ రంగంలోని కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్రవ్యాప్తంగా వీరి సంఖ్య 30 లక్షలదాకా ఉంటుంది. కొత్త ఇసుక విధానం కారణంగా రాష్ట్రంలో తీవ్రమైన ఇసుక కొరత ఏర్పడటం, భవన నిర్మాణ సామాగ్రి ధరలు విపరీతంగా పెరిగిపోవటంతో పనులు బాగా నిలిచిపోయాయి. వారంలో మూడు నాలుగు రోజులు మాత్రమే పని ఉంటోందని, అరకొర పనులతో కడుపు నిండటంలేదని కార్మికులు వాపోతున్నారు. జగన్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు.

సర్పంచ్‌లు

జగనే అంతా తానై పాలిస్తుండటంతో, సర్పంచ్‌ల దగ్గరనుంచి మొదలుపెడితే ఎమ్మెల్యే, ఎంపీల వరకు అంతా నామమాత్రమై పోయారు. ముఖ్యంగా సర్పంచ్‌ల పరిస్థితి దారుణంగా మారింది. వారు జగన్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమ పదవి రబ్బర్ స్టాంపులాగా మారిపోవటం, గ్రామాలలో సొంత డబ్బుతో చేసిన చిన్న చిన్న అభివృద్ధి పనులకు బిల్లులు రాకపోవటంతో జగన్‌ను తీవ్రంగా దుయ్యబడుతున్నారు. వీరు కాకుండా ఇంకా ఆంధ్రాలో అనేక వర్గాలు జగన్‌పై ఆగ్రహంతో ఉన్నాయి. కమ్మ, కాపు వంటి వైసీపీ వ్యతిరేక వర్గాలతో పాటు వైశ్యులు, రాజులు(క్షత్రియులు) వర్గాల కోపాన్ని కూడా జగన్ మూటగట్టుకున్నాడు. ఒంగోలులో సుబ్బారావు అనే వైశ్యుడిని వైసీపీ నాయకులు చితకబాదటం కొన్ని రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

దానితో వైశ్యులు జగన్‌పై గుర్రుగా ఉన్నారు. ఇక రఘురామకృష్ణంరాజును రౌడీషీటర్‌ను బాదినట్లు బాదటంతో రాజుల ఓట్లు వైసీపీకి పడటం కల్లే. రాష్ట్ర వ్యాప్తంగా కొన్నిచోట్ల హిందూ దేవాలయాలకు అవమానం జరగటం, తిరుమలలో క్రైస్తవ మత ప్రచారంవలన హిందువులలో కూడా జగన్‌పై అసంతృప్తి బాగానే ఉంది. చేసిన పనులకు బిల్లులను చెల్లించకపోవటంతో కాంట్రాక్టర్లు రగిలిపోతున్నారు. వీరందరూ ఒక ఎత్తయితే, సాయంత్రమవగానే రిలాక్స్ అవ్వాలంటూ మద్యం దుకాణాన్ని దర్శించుకునే మందుబాబులు మరో ఎత్తు. నాసిరకం మద్యం, విపరీతంగా పెరిగిన ధరల ప్రభావాన్ని రోజువారీగా చూస్తున్న వీరు ఏ పక్కనుంటారో ప్రత్యేకించి చెప్పనవసరంలేదుకదా!

జగన్ ఇన్ని వర్గాల ఆగ్రహాన్ని మూటగట్టుకున్న నేపథ్యంలో, అతను గెలవాలి అని భావించే పాజిటివ్ ఓటర్లకంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ గెలవకూడదు అని కసిగా సంకల్పించుకున్న నెగిటివ్ ఓటర్ల ప్రభావమే ఈ సారి బలంగా ఉందనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలట్ పోలింగ్‌లో ఆ దిశగా సంకేతాలు కనిపించిన సంగతి తెలిసిందే.

Read More
Next Story