కర్ణాటకలో రోహిత్ వేముల చట్టం? తెలంగాణ లోనూ తెస్తారా?
x

కర్ణాటకలో రోహిత్ వేముల చట్టం? తెలంగాణ లోనూ తెస్తారా?

రోహిత్ వేముల చట్టంతో విద్యాసంస్థల్లో వేళ్లూనిన కుల వివక్ష పోతుందా?


విద్యాలయాలలో కుల వివక్షకు అడ్డుకట్టవేసేలా రోహిత్ వేముల చట్టం(Rohit Vemula Act)ను తన సుకు వచ్చేందుకు కర్ణాటక లోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. రోహిత్ వేముల చట్టాన్ని త్వరలోనే కర్ణాటక అసెంబ్లీ ఆమోదిస్తుందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఎక్స్ వేదికగా ప్రకటించారు కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ (Rahul Gandhi) సూచనను త్వరలో అమలు చేస్తామన్నారు.కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదుతున్న రోహిల్ వేముల 2016లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని పోరాటానికి స్ఫూర్తి గా ఇప్పుడు కర్ణాటక లోని కాంగ్రెస్ ప్రభుత్వం రోహిత్ వేముల చట్టం తెస్తోంది.

పార్లమెంట్‌లో శుక్రవారం రాహుల్ గాంధీని కర్ణాటక నుంచి వెళ్లిన దళిత, ఆదివాసీ, ఓబీసీ విద్యార్ధి సంఘాల ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా విద్యలో కుల వివక్షకు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపాలని రాహుల్ ను కోరారు. పోరాడాలని వారు కోరారు. దీంతో రోహిత్ వేముల చట్టాన్ని తీసుకువచ్చి అమలు చేయాలని కోరుతూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాహుల్ లేఖ రాశారు. చదువు చెప్పే ప్రదేశంలో ఏ పిల్లవాడు కూడా కుల వివక్షను ఎదుర్కోకూడదని కాంగ్రేస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.కులవివక్ష నివారించేందుకు ఈ చట్టం తీసుకురావడం అత్యవసరం అని పేర్కొన్నారు.ఈ మేరకు ఈ నెల 16న లేఖ రాశారు. దానిని శుక్రవారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.

‘‘ప్రతిభావంతులైన రోహిత్‌ వేముల (తెలంగాణకు), పాయల్‌ తడ్వీ (మహారాష్ట్ర), దర్శన్‌ సోలంకీ (ముంబై) ఆత్మహత్యలను ఎంత మాత్రం ఆమోదించలేం. దీనికి అంతం పలకడానికి ఇదే సమయం. అంబేడ్కర్‌, రోహిత్‌ సహా కోట్ల మందిలా మరే ఏ పిల్లవాడూ వివక్ష ఎదుర్కోకుండా రోహిత్‌ వేముల చట్టం చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరుతున్నా’’ అని రాహుల్ పేర్కొన్నారు.

రాహుల్ విజ్ఞప్తి కి స్పందించిన కర్ణాటక ప్రభుత్వం

స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా భారత విద్యావ్యవస్థలో కులవివక్ష పోలేదని.. దీనికి స్వస్తి పలికేందుకు కర్ణాటకలో ‘రోహిత్‌ వేముల చట్టం’ తీసుకురావాలన్న రాహుల్‌గాంధీ విజ్ఞప్తి కి సీఎం సిద్దరామయ్య స్పందించారు.

"కులం, తరగతి లేదా మతం ఆధారంగా ఏ విద్యార్థి వివక్షను ఎదుర్కోకుండా చూసుకోవడానికి - కర్ణాటకలో రోహిత్ వేముల చట్టాన్ని అమలు చేయాలనే సంకల్పంలో మా ప్రభుత్వం దృఢంగా ఉంది. రోహిత్, పాయల్, దర్శన్ ఆత్మహత్యలకు బదులుగా గౌరవానికి అర్హులైన లెక్కలేనన్ని ఇతరుల కలలను గౌరవించడానికి మేము ఈ చట్టాన్ని వీలైనంత త్వరగా తీసుకువస్తాము" అని ముఖ్యమంత్రి Xలో పేర్కొన్నారు.. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దార్శనికతను సాకారం చేసుకునేందుకు ఇది ఒక అడుగు అవుతుందని ఆయన అన్నారు.

అసలు ఎవరీ రోహిత్ వేముల, ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు?

రోహిత్ చక్రవర్తి వేముల హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి విద్యార్థి. 2015 జూలై నుంచి విశ్వవిద్యాలయం రోహిత్‌కు 25,000 ఉపకారవేతనాన్ని నిలిపివేసింది. అంతకు ముందు క్యాంపస్‌లో రోహిత్ వేముల కొన్ని ఆందోళనల్లో పాల్గొనడం జరిగింది. ఆగస్టు 5న ఎన్. సుశీల్ కుమార్ అనే విద్యార్థి తనపై రోహిత్ వేముల, మరో నలుగురు విద్యార్థులు దాడి చేసారని ఆరోపించాడు. ఆ ఘటన తరువాత అప్పట్లో బీజేపీ నేత అయిన బండారు దత్తాత్రేయ విశ్వవిద్యాలయంలో కులపరమైన, తీవ్రవాద, దేశద్రోహ రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయంటూ అప్పటి కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి లేఖ రాయడం జరిగింది . విద్యార్థిగా రోహిత్ అంబేడ్కర్ స్టూడెంట్ అసోసియేషన్ సభ్యుడు కాబట్టే కావాలనే కొందరు రోహిత్ వేముల ను టార్గెట్ చేశారని అందుకే స్కాలర్ షిప్ ఆగిపోవడం లాంటి పరిణామాలు జరిగాయని రోహిత్ మిత్రులు ఆరోపించారు.

విశ్వవిద్యాలయం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. ఉపకారవేతన నిలుపుదలకు కారణం "పేపర్‌వర్క్"లో జరిగిన ఆలస్యమని చెప్పింది. కేంద్ర మంత్రి జోక్యం, విచారణ పర్యవసానంగా రోహిత్ తో పాటు ఐదుగురు విద్యార్థులను విశ్వవిద్యాలయం సస్పెండ్ చేసింది. డిసెంబర్ 17న ఈ నిర్ణయంపై మార్పుండదని విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది. సస్పెండ్ చేయటం వలన చదువు నిలిచిపోతుంది.దాని భరించలేక రోహిత్ 2016 జనవరి 17న ఆత్మహత్య చేసుకున్నాడు.

రోహిత్ ఆత్మహత్య జరిగిన తరువాత దేశవ్యాప్తంగా నిరసనలు, ప్రదర్శనలు జరిగాయి. దళితులకు విరుద్ధంగా జరుగుతున్న వివక్షకు ఉదాహరణగా ఈ ఆత్మహత్యను అభివర్ణించారు. యూనివర్సిటీ యాజమాన్యంతోపాటు, బీజేపీ నాయకత్వం, ఏబీవీపీ విద్యార్థి సంఘాల ప్రతినిధుల వేధింపుల వల్లే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ విద్యార్ధి సంఘాలు చాలాకాలంపాటు ఆందోళనలు నిర్వహించాయి.

అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఎస్ఏ) ఈ ఆందోళనల్లో చురుగ్గా పాల్గొంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, అప్పటి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు హైదరాబాద్ హెసీయూ కి వచ్చి ఈ ఆందోళనలకు మద్దతిచ్చారు.

అయితే, రోహిత్ ఆత్మహత్యకు, యూనివర్సిటీ యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదని, వ్యక్తిగత కారణాలతో రోహిత్ ఆత్మహత్యకు పాల్పడితే దానికి దానికి కులం రంగు పులిమారని బీజేపీ, ఏబీవీపీలు తమపై వచ్చిన ఆరోపణలను ఖండించాయి. రోహిత్ దళితుడు కాదని బీజేపీ వాదించింది.ఈ ఆత్మహత్య ఘటనపై యూనివర్సిటీ హాస్టల్ వార్డెన్‌తోపాటు విద్యార్ధి సంఘం నాయకుడు దొంత ప్రశాంత్ ఇచ్చిన ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.

ఆ తరువాత ఈ కేసు హైకోర్టు దాకా వెళ్లడంతో బీజేపీ నాయకులకు కేసుతో సంబంధం వుందనడానికి ఆధారాలు లేవంటూ కోర్టు కొట్టివేసింది. 2024 దాకా కొనసాగుతూ వచ్చిన ఈ కేసును ముగిస్తున్నట్లు కోర్టుకు పోలీసులు నివేదిక ఇవ్వగా, దానిపైనా వివాదం చెలరేగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని రోహిత్ తల్లి కలిసి కేసు విచారణ కొనసాగించాలని కోరడంతో ,ఆ కేసు ను పునర్విచారణ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమైంది.

కాంగ్రెస్ తీర్మానం

విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థలలో కుల వివక్ష కొనసాగుతోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ, 2023 లో రాయ్ పూర్ లో జరిగిన ఏఐసీసీ ప్లీనరీలో రోహిత్ వేముల ఆత్మహత్య , హెచ్ సీయూ , ఇతర విద్యా సంస్థలలో ఘటనలపైనా చర్చించింది.

తాము అధికారంలోకి వస్తే కుల వివక్ష ఆరోపణలపై జనవరి 17, 2016న ఆత్మహత్య చేసుకున్న 26 ఏళ్ల హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థి రోహిత్ వేముల పేరు మీద ప్రత్యేక చట్టం చేస్తామని హామీ ఇస్తూ ఆ ప్లీనరీలో ఒక తీర్మానాన్ని కాంగ్రెస్ ఆమోదించింది.ఈ చట్టం, దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన తరగతులు మైనారిటీల విద్యా హక్కును రక్షించడం , పరిరక్షించడం లక్ష్యంగా పెట్టుకుందని తీర్మానంలో పేర్కొన్నారు.

రోహిత్ వేముల అంశంతో పాటు,మే 22, 2019న జరిగిన మహారాష్ట్ర బివైఎల్ నాయర్ ఆసుపత్రిలో రెండవ సంవత్సరం రెసిడెంట్ డాక్టర్ పాయల్ సలీం తడ్వి ఆత్మహత్య, ఫిబ్రవరి 12, 2023న జరిగిన ఐఐటీ-బొంబాయి18 ఏళ్ల విద్యార్థి దర్శన్ సోలంకి ఆత్మహత్య ఘటనను ప్లీనరీ లో చర్చించి, విద్యాలయాలలో కులవివక్ష కొనసాగుతోందని , దానిని రూపుమాపాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది.

తెలంగాణ లోనూ రోహిత్ వేముల చట్టం?

కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కర్ణాటక లో రోహిత్ వేముల చట్టాన్ని తేవడానికి అక్కడి ప్రభుత్వం సిధ్ధమైన నేపధ్యంలో కాంగ్రెస్సే అధికారంలో వున్న తెలంగాణ లోనూ ఆ చట్టాన్ని తీసుకు వచ్చే అవకాశం వుందా అనేది పెద్ద ప్రశ్న. రోహిత్ వేముల సంఘటన, అనంతరం ఉవ్వెత్తున లేచిన ఉద్యం తెలంగాణలో చరిత్ర కాబట్టి ఈరాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయిన దాదాపు ఏడాదిన్నర అవుతున్నా అలాంటి డిమాండ్ బడుగు వర్గాలనుంచి రాలేదు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆ లైన్ లో ఆలోచించినట్లు లేదు.

కర్ణాటక విద్యార్ధి సంఘాల నేతలు కలిసిన సందర్భంగా రాహుల్ కర్ణాటక ప్రభుత్వానికి రోహిత్ వేముల చట్టాన్ని తేవాలని సూచించినా, ఆ సూచనా తెలంగాణ కు వర్తిస్తుంది. తాము అధికారంలోకి వస్తే ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు కులవివక్ష కు గురికాకుండా చట్టం తెచ్చి అండగా వుంటామని ఏఐసీసీ ప్లీనరీలో తీర్మానం చేశారు. త్వరలోనే రేవంత్ ప్రభుత్వం కూడా రోహిత్ వేముల చట్టం తెస్తుందేమో చూడాలి. ఇప్పటికే రోహిత్ తల్లి విజ్ఞప్తి మేరకు రేవంత్ సర్కార్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసునూ తిరిగి విచారించాలని నిర్ణయించింది. ఇపుడున్న పరిస్థితుల్లో రోహిత్ వేముల చట్టం తీసుకురావడం కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా అవసరం. కర్నాటకలో రోహిత్ చట్టం వస్తే, రేవంత్ ప్రభుత్వం మీద వత్తిడి కూడా పెరగవచ్చు.

Read More
Next Story