రాష్ట్ర బడ్జెట్ అమలు తీరు అంచనాలను అందుకుందా ?
x

రాష్ట్ర బడ్జెట్ అమలు తీరు అంచనాలను అందుకుందా ?

సంవత్సరానికి ఒకసారి ప్రవేశ పెట్టే రాష్ట్ర వార్షిక బడ్జెట్ పై సామాజిక కార్యకర్త కన్నెగంటి రవి శిశ్లేషణ

నిజమైన ప్రజాస్వామిక వ్యవస్థలో ఐదేళ్ల కొకసారి చట్ట సభలకు జరిగే ఎన్నికలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, చట్ట సభల్లో సంవత్సరానికి ఒకసారి ప్రవేశ పెట్టే రాష్ట్ర వార్షిక బడ్జెట్ కు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. కానీ చట్టసభలకు జరిగే ఎన్నికలు ఆచరణలో ఎంత అప్రజాస్వామికంగా తయారయ్యాయో , బడ్జెట్ కేటాయింపులు, నిధుల విడుదలకు మార్గదర్శకాలు తయారీ , పథకాల అమలు కోసం నిధుల విడుదల కూడా అంతే అన్యాయ పూరితంగా మారిపోయాయి.

ఎన్నికల హామీలకు ఎలా అయితే చట్ట బద్ధత లేదో, బడ్జెట్ కేటాయింపులకు, ఖర్చులకు కూడా చట్టబద్ధత లేదు. ఎన్నికలు పూర్తయ్యాక, రాజకీయ పార్టీలకు ఎలా ప్రాధాన్యతలు మారిపోతున్నాయో, బడ్జెట్ కేటాయింపులు చేశాక కూడా అధికార ప్రభుత్వం ప్రాధాన్యతలు మారిపోతున్నాయి.

ఫలితంగా గత పదేళ్ళ తెలంగాణ పాలనలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు, నిధుల కేటాయింపులకు అర్థం లేకుండా పోయింది. ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు అమలు కాలేదు. షెడ్యూల్డ్ కులాలకు, తరగతులకు చేసిన చట్ట బద్ధ కేటాయింపులు 50 శాతం కూడా ఖర్చు కాలేదు. సాధారణ ప్రజలకు చేసిన కేటాయింపులకు కాకుండా, కాంట్రాక్టర్ ల మేలు కోసం నిధులు విడుదల చేయడం అందరం గమనించిందే.

ఈ నేపధ్యంలో 2023 డిసెంబర్ 7 న అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తన పాలన మొదటి ఆర్ధిక సంవత్సరం 2024-2025 లో చేసిన బడ్జెట్ కేటాయింపులను గుర్తు చేసుకోవడం, ఎన్నికలలో ఆ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను,నిధుల కేటాయింపులను పోల్చి చూడడం, గత సంవత్సర కాలంగా ఆయా హామీలకు కేటాయించిన నిధులు సక్రమంగా ఖర్చు అవుతున్నాయా లేదా అనేది పరిశీలించి వ్యాఖ్యానించడం, వచ్చే ఆర్ధిక సంవత్సరం, అంటే 2025-2026 బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉండాలో స్పష్టం చేయడం ఈ వ్యాసాల ప్రధాన ఉద్దేశ్యం.

2024- 2025 బడ్జెట్ ప్రవేశ పెట్టే ముందు, ఈ సంవత్సరానికి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిని( GSDP) 16,50,000 కోట్లుగా అంచనా వేశారు. 2023-2024 తో పోల్చినప్పుడు ఇది 12.5 శాతం ఎక్కువ. ఈ బడ్జెట్ ద్వారా మొత్తం 2,74,058 కోట్లు ఖర్చు చేస్తామనీ, ఇది 2023-2024 సంవత్సర బడ్జెట్ అంచనా ఖర్చు కంటే 25 శాతం ఎక్కువనీ, ఈ ఖర్చులే కాక మరో 17,101 కోట్ల రాష్ట్ర రుణాలు కూడా తీరుస్తామని ప్రకటించారు.

రాష్ట్ర అన్ని రకాల పన్నుల, ఇతర ఆదాయం కూడా 2,24,802 కోట్లకు చేరుకుంటుందనీ, 2023-2024 రివైజ్డ్ అంచనాలతో పోల్చినప్పుడు ఇది 33 శాతం ఎక్కువనీ అంచనాలు ప్రకటించారు. 2023-2024 తో పోల్చినప్పుడు ద్రవ్య లోటు కూడా కొద్దిగా తగ్గుతుందని ప్రకటించారు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు వేసిన ఆశాజనక అంచనాలు.

ఈ ఆర్ధిక సంవత్సర పూర్తిగణాంకాలు మనకు అందుబాటులో లేవు కాబట్టి,ఈ అంచనాలు ఏ మేరకు నిజమయ్యాయో మనం విశ్లేషణ చేయలేము.కానీ, ఈ ఆర్ధిక సంవత్సరం నడక చూస్తే, పన్నుల ఆదాయంతో సహా, రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరగలేదు.అప్పులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆశించనంతగా లభించలేదు. ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నామని చెప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకమైన తక్షణ అవసరాలకు కూడా అప్పులపై ఆధార పడవలసిన స్థితి చాలా సార్లు ఎదుర్కున్నది. ఈ సంవత్సరం కేంద్ర పన్నుల వాటా కూడా అనుకున్నంతగా రాలేదు. రాష్ట్ర పన్నుల ఆదాయంలో, కొత్తగా చేసిన అప్పులలో ఎక్కువ భాగం, గత ప్రభుత్వం చేసిన పాత రుణాలు, వడ్డీలు తీర్చడానికి ఖర్చయ్యాయని రాష్ట్ర ప్రభుత్వమే అసెంబ్లీలో ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల లోక్ సభలో ఒక ప్రకటన చేస్తూ, 2020-2021 నుండీ 2024-2025( డిసెంబర్ 2024 వరకూ) తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి వివిధ పన్నుల రూపంలో 2,39,489 కోట్లు చెల్లించిందనీ, ఇందులో 60,504 కోట్లు CGST అనీ, 78,888 కోట్లు SGST అనీ, 70,888 కోట్లు IGSTఅనీ, 29,135 కోట్లు సెస్సు అనీ కూడా వివరాలు ఇచ్చింది.

ఇదే కాలంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 1,76,000 కోట్ల రూపాయల నిధులు వివిధ రూపాలలో అందించిందని కూడా ప్రకటించింది. 2020-2021 నుండీ 2025 జనవరి వరకూ 97,401 కోట్ల రూపాయలు కేంద్ర పన్నుల వాటాగా తెలంగాణ రాష్ట్రానికి అందించిందనీ, కేంద్ర ప్రాయోజిత పథకాల క్రింద 2025 ఫిబ్రవరి 2 వరకూ తెలంగాణ కు మరో 78,859.87 కోట్లు సహాయం చేసిందనీ లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్రం వివరణ ఇచ్చింది.

తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేంద్రానికి భారీగా పన్నుల రూపంలో, సెస్సుల రూపంలో నిధులు జమ చేస్తున్నప్పటికీ, కేంద్ర బడ్జెట్ లో మాత్రం తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టుల కోసం, ముఖ్యంగా ప్రజల సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన పథకాల కోసం కేంద్రం నిధులు కేటాయించడం లేదు. ఇందులో రాజకీయ కోణం కూడా దాగి ఉంది. మోడీ ప్రభుత్వానికి దక్షిణాది రాష్ట్రాల పట్ల ఉండే వివక్ష మాత్రమే కాదు, ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న చోట , మోడీ నేతృత్వంలోని బీజేపీ పార్టీ వివక్షా పూరితంగా వ్యవహరిస్తూ, నిధులు మంజూరు చేయకుండా మోకాలు అడ్డుతున్నది. నిజానికి కేంద్రానికి మనం చెల్లించే పన్నులు ఎక్కువ, మన రాష్ట్రానికి వెనక్కు వచ్చే వాటా తక్కువ. మోడీ దయతోనో, కేంద్ర ప్రభుత్వ మెహర్భానీ తోనో తెలంగాణ రాష్ట్రం నడవడం లేదన్నది స్పష్టం గా అర్థమవుతుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేవలం కేంద్రానికి చెల్లించే పన్నులే కాదు, ఇతర అనేక రాష్ట్ర పన్నులను కూడా చెల్లిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం పన్నుల ఆదాయంలో రాష్ట్ర స్వంత పన్నుల ఆదాయం (SOTR) 88 శాతంగా ఉందని, ఇది దేశంలోనే అత్యుత్తమమని తాజా ఎకనామిక్ సర్వే 2024-2025 (2023-2024 పన్నుల ఆదాయం గణాంకాల ప్రకారం) నివేదిక చాటి చెప్పింది. కర్ణాటక, హర్యానా 86 శాతంతో రెండవ స్థానంలో ఉన్నాయి. అంటే తెలంగాణ ప్రజలు భారీగా తమ వీపులపై ప్రతి సంవత్సరం పన్నుల భారాన్ని మోస్తున్నారన్నమాట. రాష్ట్ర స్వంత పన్నుల ఆదాయం అంటే “VAT”( ఎక్సైజ్ పన్ను, పెట్రోలియం ఉత్పత్తులపై పన్ను), స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీస్, భూమి శిస్తు, వాహన పన్ను, వాణిజ్య పన్నులు, అమ్మకపు పన్నులు,ఇతర కొన్ని పన్నులు.

ఇందులో అర్థం స్పష్టం. మేమెక్కడో నిధులు తోడుకొచ్చి, ప్రజలకు ధార బోస్తున్నామని పాలకులు చెప్పే మాటలు పెద్ద బోగస్ అన్నమాట. మేమేదో కొద్దిమందిమి మధ్యతరగతి ప్రజలం, ప్రభుత్వానికి ఆదాయ పన్ను చెల్లిస్తుంటే, ఆ నిధులను, ఉచితాల పేరుతో ప్రభుత్వాలు ప్రజలకు ముఖ్యంగా పేదలకు దోచి పెట్టి, వారిని సోమరిపోతులుగా తయారు చేస్తున్నాయని మధ్యతరగతి ప్రజలు మీడియా పరంగా చేసే వాదనలు కూడా అసత్యమని ప్రభుత్వాలు చెప్పే పన్నుల ఆదాయం లెక్కలే స్పష్టం చేస్తున్నాయి.

సాధారణ ప్రజలనుండీ వివిధ రూపాలలో వసూలు చేస్తున్న పన్నుల ఆదాయాలను, అదే సాధారణ ప్రజల మేలు కోసం ప్రభుత్వాలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతే కానీ, పథకాల మార్గదర్శకాలను మార్చేసి, ఇష్టమొచ్చినట్లుగా అనర్హులకు పప్పు బెల్లాలు పంచినట్లుగా పంచకూడదని కూడా ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్ర పన్నుల ఆదాయాన్ని గురించి తాజా ఆర్ధిక సర్వే గొప్పగా చెప్పినప్పటికీ, నిజానికి 2024-2025 లో మూడవ త్రైమాసికం ముగిసేసరికి ( డిసెంబర్ 2024) రాష్ట్ర రెవెన్యూ లోటు 19,892 కోట్లు గా ఉంది. మరో వైపు 2024-2025 లో అంచనా వేసిన రెవెన్యూ ఆదాయంలో 2024 సెప్టెంబర్ 30 నాటికి 34.1 శాతం తక్కువగా రాష్ట్ర పన్నుల ఆదాయం కేవలం 75,454 కోట్లు మాత్రమే ఉంది. రాష్ట్ర అమ్మకపు పన్ను ఆదాయం 16,081 కోట్లు ( అంచనా వేసిన ఆదాయంలో 48.08 శాతం మాత్రమే) గా ఉంది.

నిజానికి 2024 - 2025 బడ్జెట్ లో రాష్ట్ర GST గా 50,763 కోట్లు ( అంతకు ముందు సంవత్సరం కంటే 29 శాతం ఎక్కువ), అమ్మకపు పన్ను గా 33,449 కోట్లు ( అంతకు ముందు సంవత్సరం కంటే 12 శాతం ఎక్కువ) రాష్ట్ర ఎక్సైజ్ పన్నుగా 25,618 కోట్లు ( అంతకు ముందు సంవత్సరం కంటే 26 శాతం ఎక్కువ), స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ పన్నుగా 18,229 కోట్లు( అంతకు ముందు సంవత్సరం కంటే 28 శాతం ఎక్కువ),వాహన పన్నుగా 8,478 కోట్లు ( గతం కంటే 19 శాతం ఎక్కువ), విద్యుత్ పై పన్నులు , ఇతర డ్యూటీల క్రింద 716 కోట్లు ( గతం కంటే 4081 శాతం ఎక్కువ) అంచనా వేశారు.

ఈ పన్నులలో ఎంత వసూలు చేశారో , రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్ సందర్భంగా చెప్పాలి కానీ, రాష్ట్రంలో బెల్టు షాపులను పూర్తి స్థాయిలో మూసేస్తామని చెప్పిన ప్రభుత్వం ఎక్సైజ్ పన్ను ఆదాయాన్ని మాత్రం విపరీతంగా పెంచి చూపించడం ప్రభుత్వ స్వభావాన్ని బయట పెట్టింది. గత సంవత్సర కాలంగా రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్న తీరు చూస్తుంటే, ఈ ప్రభుత్వానికి ఎక్సైజ్ ఆదాయం పై ఎంత ముందు చూపు ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు షాపుల్లో కంటే వ్యాపారులు, బెల్టు షాపుల్లో మద్యం ఎక్కువ విక్రయిస్తున్నారనే వార్తలు రోజూ మనం వింటున్నాం. ప్రభుత్వానికి పన్నుల ఆదాయం పెరగడం, వ్యాపారులకు లాభాలు పెరగడం- ప్రభుత్వం కూడా ఇదే జరగాలని కోరుకుంటున్నది.

డ్రగ్స్ పై యుద్ధం చేస్తున్నామని చెప్పుకునే ఈ ప్రభుత్వం ఎక్సైజ్ ఆదాయం కోసం మాత్రం విచ్చలవిడిగా మద్యం అమ్మకాలకు తెర తీయడం అన్యాయం. అనైతికం. .

ప్రతి రాష్ట్రానికి తప్పించుకోలేని కొన్ని ఖర్చులు ఉంటాయి. వాటిని తప్పకుండా ఖర్చు పెట్టాల్సిన వాటిగా ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రకటిస్తుంది. ముఖ్యంగా వీటిలో జీతాలు, పెన్షన్ లు,రుణాల తిరిగి చెల్లింపులు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో వీటి వాస్తవ ఖర్చు చూస్తే ఈ క్రింది విధంగా ఉన్నాయి. 2022-2023 లో వాస్తవ లెక్కలుగా వేతనాలు 36,157 కోట్లు, పెన్షన్ లు 15,816 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ రుణాలపై వడ్డీ చెల్లింపులు 21,821 కోట్లు గా ఉన్నాయి. BRS చివరి సంవత్సర పాలన 2023-2024 లో రివైజ్డ్ అంచనాల ప్రకారం పెన్షన్ లు 16,841 కోట్లు, వడ్డీ చెల్లింపులు 23,337 కోట్లుగా చూపించారు. విచిత్రమేమంటే ఆ సంవత్సరంలో వేతనాల బిల్లు ఎంత అయ్యే అవకాశం ఉందో ప్రభుత్వం ప్రత్యేకంగా లెక్క చూపించలేదు. చాలా ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తన మొదటి సంవత్సర బడ్జెట్ 2024-2025 లో ఈ వేతనాల బిల్లు గురించి మౌనంగా ఉంది.

మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీ, ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, రెండవ PRC గురించి హామీలు ఇచ్చిన రేవంత్ సర్కార్ వేతనాల బిల్లు పెరుగుదల గురించి మాట్లాడలేదంటే, అన్ని ఉద్యోగ ఖాళీల పోస్టులు భర్తీ చేసి,వేతనాల చెల్లింపు బాధ్యత తాను తీసుకోబోవడం లేదని చెప్పకనే చెప్పింది. రాష్ట్రంలో గత సంవత్సర కాలంలో 50, 000 పోస్టులు మాత్రమే భర్తీ చేసి, అప్పటికే రిటైర్ అయిన ఉద్యోగుల జీత భత్యాలను, కొత్త వారికి చెల్లించడం చేస్తున్నదన్నమాట. అలాగే రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ చెల్లింపులకు అవసరమైన మొత్తాలను పెంచాల్సిన రాష్ట్ర ప్రభుత్వం 2024-2025 లో పెన్షన్ కోసం కేటాయింపులను గత సంవత్సరాల కంటే అతి తక్కువగా 11,641 కోట్లుగా మాత్రమే చూపించారు.

అందుకే గత సంవత్సర కాలంగా రిటైర్ అయిన ఉద్యోగులకు వెంటనే వారికి రావలసిన బకాయిలను సెటిల్ చేసి చెల్లించడం లేదు. సకాలంలో పెన్షన్ కూడా ఇవ్వడం లేదు. వచ్చే బడ్జెట్ నాటికి ఈ అంచనాలను ఎలా మార్చి చూపిస్తారో వేచి చూడాలి. అసలు బడ్జెట్ లో కేటాయింపులు, అంచనాలు లేకుండా, నిధులు ఖర్చు చేయడం ప్రభుత్వాల నైజంగా ఉంది. ఈ ధోరణి కూడా పాత ప్రభుత్వాల తప్పుడు ధోరణి కొనసాగింపే .

Read More
Next Story