
మోదీ అమెరికా పర్యటన... భారత్ మీద చమురు భారం పెరుగుతుందా?
రష్యా నుండి దిగుమతులు తగ్గి అమెరికాతో కొనుగోళ్లు పెరిగితే ఏమవుతుంది?
సాధారణంగా పిలుపు లేని చోటికి వెళ్లకూడదంటుంటారు. అలాగే పిలిపించుకుని వెళ్తే అలా వెళ్లిన వ్యక్తి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేందుకు దక్షయజ్ఞం కథ మొదలు ఎన్నో నీతికథలు మనకున్నాయి. పిలవని పేరంటం అన్న సామెతకు కూడా ఇలాంటి మూలాలే ఉన్నాయి.
పిలిచినా పిలవకపోయినా పిలిపించుకుని వెళ్లటం బూర్జువా సమాజపు వైపరీత్యం. దీన్నే చొరవ అని కూడా అంటుంటాము. ఇంకా కొందరైతే ఈ చొరవ చూపించే వారిని బట్టి, వారి పట్ల వీరికున్న భక్తిని బట్టి దార్శనికత అని కూడ అంటుంటారు. అటువంటి దార్శనికత చూపించిని వ్యక్తిగా ప్రధాని మోడీని నేడు చెప్పుకుంటున్నారు.
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ నిజానికి ప్రమాణస్వీకార మహోత్సవానికే ఆహ్వానం అందుతుందని మన ప్రధాని మోడీ గారు ఎదురుచూసినట్లున్నారు. పిలవని పేరంటానికి వెళ్లినట్లు భారత విదేశాంగ శాఖ మంత్రి హాజరయ్యారు. ట్రంప్ గారి ప్రమాణ స్వీకార మహోత్సవం పట్ల మోడీ సంతసిస్తున్నట్లు విన్నవించుకున్నారని వార్తలు వచ్చాయి. (మధ్యయుగాల కాలంలో కలవటానికి తిరస్కరించిన చక్రవర్తిగారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించిన విధంగా) ఇప్పటికీ అంతో ఇంతో సార్వభౌమత్వ లక్షణాలు కలిగిన దేశంగా ఉన్న భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ఈ విధంగా వ్యవహరించటం దేశ ప్రతిష్టకు భంగం కలిగించే అంశమని పలువురు రాజకీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా రష్యా మిత్రులను సమీకరించుకునేందుకు అనేక పద్ధతులు పాటించింది. వ్యూహాలు అమలు చేసింది. అదేసమయంలో రష్యా ఎగుమతి చేసే సరుకులు దిగుమతి చేసుకునేవారికి డాలర్‌లో కాకుండా రూబుల్‌లోనే చెల్లింపులకు అవకాశం ఇచ్చింది. అంతర్జాతీయ వాణిజ్యంలో ఇది పెద్ద వ్యూహాత్మక చర్య. పుతిన్ పిలుపనందుకున్న మోడీ దేశానికి కావల్సిన చమురు నిల్వలు రష్యా నుండి ఎక్కవగా దిగుమతి చేసుకోవటం మొదలు పెట్టారు. దౌత్య ర్థిక నిపుణులు రెండేళ్ల క్రితం మోడీ ప్రభుత్వ నిర్ణయం అద్భుతం అనీ దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పతనం కానీయకుండా అడ్డుకోవటంలో ప్రశంసనీయ పాత్ర పోషిందనీ, దేశ ద్రవ్య లోటు తగ్గించటంలో ఈ నిర్ణయం కీలకపాత్ర పోషించిందని కూడా వ్యాఖ్యానించారు. విశ్లేషణలు రాశారు.
కానీ భారత విదేశీవాణిజ్య వ్యూహకర్తలు మారుతున్న పరిస్తితులను వేగంగా గమనిస్తున్నారనిపిస్తోంది. ట్రంప్ ఎన్నిక, దిగుమతి సుంకాలు, మారుతున్న అమెరికా వాణిజ్య వ్యూపలు గమనించిన భారత చమురు శాఖ అధికారులు, విదేశీ వాణిజ్య వ్యూహకర్తలు ముందుగానే మేలుకొన్నారు. డిశంబరు 2024 నాటికి అమెరికా నుండి రోజుకి 70600 బారెల్ చమురు దిగుమతి చేసుకుంటుంది. కానీ జనవరి వచ్చేసరికి మూడు రెట్లు పెరిగి 318400 బారెళ్ల చమురు అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నారు. రష్యా నుండి దిగుమతులు ఏ మేరకు తగ్గి ఏ మేరుకు అమెరికా కొనుగోళ్లుపెరుగుతాయన్నదాన్ని బట్టి ఈ దేశంలో ప్రజలపై పెరగనున్న ఆర్థిక భారం, ధరల పెరుగుదల వంటి విషయాలు ఆధారపడి ఉంటాయి. ప్రఖ్యాత అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ విశ్లేషణ ప్రకారం భారతదేశం దిగుమతి చేసుకునే చమురు ధరల భారం దాదాపు పది బిలియన్ డాలర్ల మేర పెరగనున్నది. గత నెలలో రష్యా నుండి రోజుకు 1.58 మిలియన్ బారెల్స్ చమురు దిగుమతి చేసుకుంది భారతదేశం.
ఈ సంఘటన అంతర్జాతీయ రాజకీయాల్లో పెరుగుతున్న వైషమ్యం వాణిజ్య సంబంధాల్లో వ్యక్తమవుతుందన్న వాస్తవాన్ని ధృవీకరిస్తుంది. ట్రంప్ ఎన్నికవ్వగానే ట్రంప్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుకు తెచ్చిన అనేక విధానపరమైన అంశాలకు అనుగుణంగా వివిధ దేశాలు తమ అంతర్జాతీయ వాణిజ్య వ్యూహాలను పున:సమీక్షించుకోవడం మొదలు పెట్టాయి. అప్పటి వరకూ రష్యా నుండి తక్కువ ధరకూ, అందులోనూ రష్యా రూబుల్ భారత ప్రభుత్వరంగంలో ఉన్న చమురు శద్ధి కర్మాగాలన్నీ ఇప్పుడు తమ దిగుమతులకు అమెరికా కేంద్రం అని నమ్మసాగాయి. భారతదేశం ఒక్కటే కాదు. పలు దిగుమతి ఆధారిత చమురు వనరులపై ఆధారపడ్డ దేశాలన్నీ ఇప్పుడు చడీచప్పుడు కాకుండా అటువంటి ముడి చమురు అమెరికా నుండి దిగుమతి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాయి. అమెరికా ఈ విధంగా తమ ప్రైమరీ కమోడిటీస్ మార్కెట్ కోసం ఇతర దేశాలను బ్లాక్ మెయిల్ చేయటం ఇదే మొదటిసారి కాదు.
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను నిలువరించటానికి అమెరికా, నాటో కూటములు ఏకపక్షంగా షరతులు విధించాయి. ఈ షరతలు ప్రకారం రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై అమెరికా అపరాధ సుంకాలు విధిస్తుంది. నాటోలో భాగస్వామి అయినప్పటకి ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు దొడ్డి దారిన రష్యాతో వాణిజ్య ఒప్పందాలు కొనసాగించాయి. దిగుమతులు ప్రత్యేకించి చమురు, సహజవాయువు దిగుమతులు కొనసాగించాయి. కానీ ఆయా దేశాలు ట్రంప్ ప్రకటనలతో కలవపడలేదు. ఇంకా సూటిగా చెప్పాలంటే భారతదేశం కలవరపడినంతగా కలవరడపలేదు. ఆయా దేశాలకు ట్రంప్‌తో ఉన్న సమ్యలు ఉధృతి, లోతుపాతులు మరింత ఎక్కువే. (దీనికి సంబంధించిన మాజీ విదేశాంగ శాఖ అధికారి ఎంకె భద్రకుమార్ విశ్లేషణలకు ఇక్కడ చూడవచ్చు)
అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికను ధృవీకరించగానే అప్పటి వరకూ అమెరికాయేతర చమురు దిగుమతులపై దృష్టి సారించిన భారత విదేశాంగ శాఖ తన దిగుమతుల వ్యూహాన్ని సమీక్షించుకుని దారి మార్చుకుంది. రష్యా నుండి వచ్చే దిగుమతుల విషయంలో సన్నాయి నొక్కులు నొక్కడం మొదలు ఎట్టింది. ఫలితంగా రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్న చమురు వనరులు విలువ నిలకడగా ఉంటే రష్యాయేతర వనరులు, ప్రత్యేకించి పశ్చిమాసియా దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న చమురు వనరుల విలువ జనవరి 2025 నాటికి రోజుకుని 5.1 మిలియన్ బారెళ్లకు పెరిగింది. ఇక్కడ మరో విషయాన్ని పాఠకులకు గుర్తు చేయాలి. రష్యా నుండి చౌకగా చమురు దొరుకుతుందన్న కారణంగా ఏప్రిల్ 2024 నుండి జనవరి 2025 వరకూ రోజుకు 4.8 మిలియన్ బారెళ్లకు పెరిగింది. గత దశాబ్ది కాలంలో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాలనూ, భూగర్భ చమురు నిల్వ కేంద్రాలనూ అభివృద్ధి చేయటానికి ప్రాధాన్యత ఇవ్వటాన్ని ఈ అంతర్జాతీయ రాజకీయ భూగోళం నేపథ్యంలోనే అర్థం చేసుకోవాల్సి ఉంది.
ట్రంప్ షరతుల భారంతో చమురు దిగుమతి వ్యూహాన్ని అమెరికా ఆశించినదానికంటే వేగంగానే మార్చుకున్న మోడీ ప్రభుత్వం ఇతర రంగాల్లోనూ ఇదే ధోరణిని కొనసాగిస్తే ఆర్థిక వ్యవస్థ ప్రాధాన్యతలు ఇంకా ఎన్ని ఏయే రూపాల్లో మారనున్నాయో వేచి చూడాలి.