
బీసీల రిజర్వేషన్ల పోరాటం మీద విప్లవ పార్టీల ఆలస్య స్పందన ఎందుకు?
ప్రజలు రిజర్వేషన్ల సాధన కోసం రకరకాల ఆందోళనలు చేస్తుంటే, విప్లవ శక్తులు మౌనంగా ఉండటం ఎందుకు?
- పాపని నాగరాజు, కొంకల వెంకటనారాయణ (సత్యశోధక మహాసభ)
భారత దేశ సమాజంలో కుల వ్యవస్థ అనేది వర్గ వ్యవస్థలో అంతర్లీనంగా ఉంది. ఆ వ్యవస్థ పీడిత కులాలను, వర్గాలను శాశ్వతంగా విడగొట్టి అణచివేస్తున్నది. ఇది భయంకరమైనది. ఈ కులవ్యవస్థను నిర్మూలించడం, లేదా కనీసం ఆ కుల వ్యవస్థ ప్రభావాన్ని తగ్గించడం కోసం జరిగే పోరాటాలు విప్లవోద్యమాలలో అంతర్భాగమే.
అయితే, ఇటీవలి కాలంలో బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (బీసీలు) రిజర్వేషన్ల సాధన కోసం నిర్వహిస్తున్న ఉద్యమాలపై సీపీఐ (మావోయిస్టు) పార్టీ మద్దతు ప్రకటించడం ఒక వైపు స్వాగతించదగినది కాగా, మరోవైపు దీని ఆలస్యత్వం పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది.
అక్టోబర్ 18, 2025 నిర్వహించిన బందుకు మద్దతు తెలపడం ద్వారా పార్టీ తన బాధ్యతను గుర్తుచేసుకుంది, కానీ ఇది ఆలస్యమైన స్పందన మాత్రమే. ఈ అంశాన్ని విమర్శాత్మకంగా పరిశీలిస్తూ, విప్లవ పార్టీలు, వామపక్ష శక్తులు పీడిత ప్రజల మౌలిక సమస్యలపై ఎలా స్పందించాలో చర్చించాలి. ఇది కేవలం విమర్శ మాత్రమే కాదు, స్వయంవిమర్శ కూడా. ఎందుకంటే విప్లవోద్యమాలు స్వయం సమీక్ష ద్వారానే బలపడతాయి.
కుల గణన, బీసీల నిరసనల ఒక నేపథ్యం : తెలంగాణ సమాజంలో 2024-2025 సంవత్సరాల మధ్య కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన అనంతరం జరిపిన ఇంటింటి సర్వే పేరుతో కుల గణన లేదా జనాభా లెక్కలు సేకరణ అనేది మొత్తం దేశ వ్యాపితంగా ప్రజల మధ్యలో వైరుధ్యాలు ఉన్నవని మరింత స్పష్టంగా బయటపెట్టాయి.
ఈ క్రమంలోఎవరి జనాభా ఎంత ఉందో అసమగ్రమైనప్పటికి బీసీల లెక్క తేలిపోయింది. కానీ రాష్ట్ర అసెంబ్లీలో బీసీ కులాల జనాభా లెక్కలు తగ్గిపోవడం, అదే సమయంలో ఓపెన్ కేటగిరీ (ఓసీ) అగ్రకులాల జనాభా పెరుగుదల ఎలా జరిగిందని చర్పతో బైటపడి పోయింది.
అయితే ఇవి కేవలం గణాంకాలు మాత్రమే కాదు, అవి పాలక వర్గాల ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి జరిగిన మార్పులు. ఈ లెక్కలు బీసీలకు రిజర్వేషన్లు తగ్గించడానికి మార్గం సుగమం చేస్తాయన్న భయంతో, బీసీలు తమ గళాన్ని బిగ్గరగా ఎత్తారు. వారు తమదైన పద్ధతిలో ఉద్యమాలు నిర్మించారు. నిరసనలు, ఆందోళనలు, ప్రెస్‌మీట్‌లు, రౌండ్‌టేబుల్ సమావేశాలు పేరుతో కొంత ఆందోళన జరిగన మాట వాస్తవం.
అయితే బలమైన ప్రజా ఉద్యమం గ్రామీణ స్థాయిలో నిర్మాణం కాలేదు. ఇక్కడే పౌరసమాజం, వివిధ ప్రజా ఉద్యమశక్తులు, వామపక్షాలు, ముఖ్యంగా విప్లవ పక్షాలు ఆశించిన స్థాయిలో మేల్కోనలేక పోయింది. అట్లని బీసీలు నిర్మించిన ఆందోళనలు ఉద్యమాలు కాలేక పోవు. ఇవి పీడిత ప్రజల స్వయం పోరాటాలు, కానీ ఇక్కడే ప్రశ్న: విప్లవ పార్టీలు ఎందుకు ముందుండి ఈ పోరాటాలను నడిపించలేదు? బదులుగా, ప్రజలు ముందుకు వచ్చిన తర్వాత మద్దతు తెలపడం ఎందుకు?
గత చరిత్రను పరిశీలిస్తే, మండల్ కమిషన్ సిఫార్సులలో ముఖ్యంగా విద్యా, ఉద్యోగ రంగాల్లో 27% రిజర్వేషన్లు సాధించడానికి జరిగిన ఉద్యమాలలో కూడా విప్లవ శక్తులు ఆలస్యంగానే స్పందించాయి. అప్పటి నుంచి నేటి వరకు, కుల సమస్యపై అందులో బీసీ ప్రజల సమస్యపై విప్లవపక్షాలు, వామపక్షాలు స్పాంటేనియస్‌గా (స్వచ్ఛందంగా) స్పందించిన ఉదాహరణలు చాలా అరుదు. పీడిత ప్రజలు ముందుండి పోరాడుతారు, విప్లవకారులు వెనుకనుంచి మద్దతు ఇస్తారు. కానీ విప్లవం అనేది మద్దతు మాత్రమే కాదు, అది మార్గదర్శకత్వం, నాయకత్వం కూడా. ఇదేందుకు ఈ విప్లవ పార్టీలు మర్చిపోయాయి ?
విప్లవ పార్టీల బాధ్యత ` మౌలిక సమస్యల పరిష్కారం : కమ్యూనిస్టు పార్టీలు, ముఖ్యంగా సీపీఐ (మావోయిస్టు) వంటి విప్లవాత్మక శక్తులు, సమాజంలోని వైరుధ్యాలను పరిష్కరించడానికి నూతన మార్గాలను చూపాలి. మార్క్స్-లెనిన్-మావో భావజాలం ప్రకారం, కుల వ్యవస్థ వర్గ వ్యవస్థలో భాగమే. అందుకే, కుల నిర్మూలన వర్గ పోరాటంలో అంతర్భాగం. బీసీల రిజర్వేషన్లు కేవలం రాజకీయ హక్కులు మాత్రమే కాదు, అవి ఆర్థిక, సామాజిక సమానత్వానికి మార్గం.
పీడిత ప్రజల మౌలిక సమస్యలైన భూమి, పరిశ్రమలు, ఉపాధి, విద్య, ఆరోగ్యం తదితరం, ఇవన్నీ కుల వ్యవస్థతో ముడిపడి ఉన్నాయి. అయితే, గత సంవత్సరాలలో బీసీల ఉద్యమాలపై మావోయిస్టు పార్టీ స్పందించకపోవడం ఒక లోపం. ప్రజలు తమ రిజర్వేషన్ల సాధన కోసం రకరకాల ఆందోళనలు చేస్తుంటే, విప్లవ శక్తులు మౌనంగా ఉండటం ఎందుకు? ఇది పీడితుల పోరాటాన్ని బలహీనపరుస్తుంది. విప్లవ పార్టీలు ముందుండి, ఈ సమస్యలను వర్గ పోరాటంతో ముడిపెట్టి, ఒక సమగ్ర ఉద్యమాన్ని నిర్మించాలి.
ఉదాహరణకు, తెలంగాణలో గతంలో జరిగిన భూమి పోరాటాలలో కుల సమస్యలను ఏకీకృతం చేసినట్లు, ఇక్కడ కూడా చేయవచ్చు. కానీ ఈ ఆలస్య స్పందన ద్వారా, పార్టీ తన బాధ్యతను నిర్వర్తించలేదని భావించాల్సి ఉంటుంది. వారికి ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీనీ స్పందన రావాలి. ఎందుకుంటే ఇదే పార్టీ అధికార ప్రతినిధి ఖండిస్తు ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిస్తు ప్రకటించారు. అంతేకాదు ఆ భావజాలంతో పనిచేసే సంస్థలు, మేధావులు, వివిధ రచయితలు స్పందించలేదు. ఇది కేవలం మావోయిస్టులకు మాత్రమే పరిమితం కాదు. ఇతర వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎంలో కూడా ఇలాంటి లోపాలే ఉన్నాయి. ఈ వామపక్షాలు పార్లమెంటరీ రాజకీయాల్లో మునిగిపోయి, విప్లవాత్మక మార్గాన్ని విస్మరించాయి. ఫలితంగా, పీడితులు స్వయం ఉద్యమాలు నిర్మించుకోవాల్సి వస్తోంది.
పౌర సమాజం మౌనం ` ఒక విస్తృత సమస్య : ఈ మౌనం విప్లవ పార్టీలకు మాత్రమే పరిమితం కాదు. పౌర సమాజంలోని అనేక కుల సంఘాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, దళిత సంఘాలు, మైనారిటీలు, గిరిజన సంఘాలు, మహిళా సంఘాలు, విశ్వవిద్యాలయాలు, కాలేజీలు, టీచర్స్ యూనియన్లు, లాయర్లు, డాక్టర్లు ఇలా ఒకరేమిటీ అందరూ బీసీల సమస్యలపై మౌనం వహిస్తున్నారు. ఎందుకంటే సమాజం కుల ఆధిపత్యంలో మునిగిపోయింది. అగ్రకులాలు అధికారాన్ని చేపట్టి, ఇతరులను అణచివేస్తున్నాయి. ఈ మౌనం ఒక రకమైన అగ్రకులాధికారం సుస్థిరం చేయడంకు సహకారం చేస్తున్నారని భావించాల్సి వస్తుంది.
బీసీలను వారి మానాన వారిని వదిలేయడం ద్వారా పాలకులపై ఆధారపడి జీవించేట్లు అవుతుంది. దీంతో హిందూ, కుల లేదా మరో మతతత్వం కోరలకు బలైపోవడం ఆవైపు కొట్టుక పోవడం జరుగుతుంది. బీసీలకు దశ దిశను విప్లవ శక్తులు చూపి పోరాటాలను చేయక పోవడంతో వారు పాలక వర్గాలను, కుల మత తత్వశక్తులను బుజానవేసుకుంటున్నారు. ఉదాహరణకు, దళితులు, గిరిజనులు తమ సమస్యలపై, కుల వివక్షత, దాడులు, హత్యలు, కుల బహిష్కరణలు, అంటరానితనం, మతంపేరుతో హత్యలు, దాడులు జరుపుతున్నా మౌనం వహిస్తుండడం జరుగుతుంది.
దళిత, గిరిజన, మైనార్టీల, మహిళల పోరాడుతున్నప్పుడు బీసీలు మద్దతు ఇవ్వలేకున్నారు. తెలంగాణలో జరిగిన దళిత యువకుల పరువుహత్యలలో గానీ, బీసీ యువతి యువకుల పరువు హత్యలో పౌరసమాజంగానీ, ఆయా కులాలు కులాల పోరాటవాదులు కూడా మౌనం వహించారు. అదేవిధంగా బీసీల సమస్యలపై ఇతరులు మౌనం. ఇది పీడితుల మధ్య విభజన. పాలకులు కోరుకునేది ఇదే. విప్లవ శక్తులు ఈ విభజనను విచ్ఛిన్నం చేసి ఏకీకృతం చేయాలి, ఒక సమగ్ర పోరాటాన్ని నిర్మించాలి.
స్వయం విమర్శలో ` విప్లవ ఉద్యమాలు ఎక్కడ తప్పాయి? : ఇక్కడే స్వయంవిమర్శ అవసరం. విప్లవ పార్టీలు, ముఖ్యంగా మావోయిస్టులు, తమను తాము ఎందుకు ఆలస్యంగా స్పందిస్తున్నాం అని సమీక్షించుకోవాలి. సాయుధ పోరాటం ఇతర అంశాలపై మీ పోకస్ వుంటే ఉండని గాక. కానీ సామాజిక ఉద్యమాలను విస్మరించరాదు.
మార్క్సిస్టు సిద్దాంతం భావజాలం ప్రకారం ప్రజల వారి సమస్యలను ఏకీకృతం పరిష్కారం చేయాలి. కానీ గత సంవత్సరాలలో, బీసీల ఉద్యమాలలో మా పాత్ర లోపభూయిష్టం. ఇది ఒక తప్పు అని గ్రహించాలి, సరిచేసుకోవాలి. బీసీలే కాదు, మిగితా అణగారిన కులాల వర్గాల ప్రజలు జరిపే పోరాటాలకు భవిష్యత్తులో, విప్లవ శక్తులు ముందుండి పోరాడాలి. బీసీల రిజర్వేషన్లు సాధించడం కోసం మాత్రమే కాదు, కుల వ్యవస్థను నిర్మూలించడం కోసం ఒక సమగ్ర ఉద్యమాన్ని నిర్మించాలి. పౌర సమాజ మౌనాన్ని భగ్నం చేయడానికి కృషిచేయాలి. ఇలా వామపక్షవిప్లవ శక్తుల పట్ల ఇంత తీవ్రమైన మా విమర్శకు ఇంకో బలమైన కారణం ఉంది.
అదేమంటే ... 1. తెలంగాణ ఉద్యమ కాలంలో సామాజిక ప్రజాస్వామ్య విప్లవ శక్తులు ప్రత్యామ్నాయంగా ఉండాలని ఆనాడు సామాజిక తెలంగాణ మహాసభ నిర్ధ్వందంగా చేప్పింది. కానీ ఆనాడు భౌగోళిక తెలంగాణవాదంకు వంతపాడి (బైటికి ప్రత్యామ్నాయంగా మాట్లాడినా, లోలోపల మాత్రం పాలకులకు ఉపయోగపడే వాదంతో అంటకాగారు. అంతటితో ఆగలేదు, చివరకు ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యారు.) నారు. 2. అమరుడు మారోజు వీరన్న సారధ్యంలోని సిపియుఎస్‌ఐ డిబిఎస్‌వి పార్టీ కుల సమస్యను విప్లవీకరించే క్రమంలో మేమంత మందిమో మాకంతా వాటా కావాలని, స్వయంగౌరవం, సామాజిక న్యాయం, ప్రత్యామ్నాయంగా రాజ్యాధికారం అంతిమంగా కులనిర్మూలన జరగాలన్నప్పుడు ఇదే సామాజిక విప్లవ కారులు పోస్టుమోడ్రనిస్టులని హేలన చేసి చివరకు వారే కుల సమస్యను భుజానేసుకోన్నారన్న విషయం మర్చి పోలేనిది. కనుకా ఇప్పుడుకూడా బీసీల మౌళిక సమస్యల పరిష్కారం కోరకు స్వతంత్ర ప్రత్యామ్నాయ ఉద్యమశక్తులు బలమైన ఉద్యమవేదికతో ముందుండి పోరాడటం తప్పుకాదు, తప్ఫని సరి.
చివరగా, సామాజిక విప్లవ మార్గం వైపు : బీసీల బంద్ కు మావోయిస్టు, ఇతర విప్లవ, వామపక్షాల మద్దతు ఒక మంచి అడుగు. కానీ ఇది మొదటి అడుగు మాత్రమే. వామ పక్షా విప్లవ పార్టీలు పీడితుల పోరాటాలను బుజానేసుకోని నడిపించాలేకాని మద్దతు మాత్రమే ఇవ్వకూడదు. అందుకే మొత్తం శోషిత శ్రామికుల ప్రగతిశీల ఉద్యమాలను నిర్మించి ఉందుండాల్సిన అవసరం ఉంది. దళారీ శక్తులు ప్రజలను మొసగించవు. ఈ విషయం గ్రహింపు ద్వారా అణగారిన ప్రజలు వారి హక్కుల సాధించబడుతాయి.
Next Story

