సాహిత్యంలో స్త్రీ సాహసం
ఈ కాలపు కథలు, కవితలు, నవలలు (Women of Substance): తాడి ప్రకాష్ పరిచయం
రుబీనా పర్విన్ 'జమిలి పోగు' మీ దగ్గర వుందా? దేవ్లీ కథ చదివినపుడు కడుపులో దేవినట్టు అయిందా?
ఎం. ఎస్. కె కృష్ణజ్యోతి 'సముద్రం పిల్లాడు' చదివి ఒక మూగవేదనతో దిగులుగా మిగిలిపోయారా?
ఆ విశాఖలో కత్తి పద్మ అనే పదునైన ఆయుధం ఒకటి వుంటుంది. చీకటిపువ్వుల్ని కత్తులు చేసి గుండెల్లో దింపేస్తుంది. 'హస్బెండ్ స్టిచ్' లాంటి దారుణమైన కథలు రాసే డాక్టర్ గీతాంజలి రచనలు మీకు పరిచయమేనా? మారెటైల్ రేప్ (Marital Rape) మీద ఆమె రాసిన ‘విత్ యువర్ పర్మిషన్’ చదివి తీరాలి. మాదాసు వినోదిని తెలుసుగా, కథలు చదివితే 'కట్ట'లు తెగిపోతాయి. మానస ఎండ్లూరి అనే మరో ప్రమాదకరమైన అమ్మాయి రాస్తోంది. 'విషప్ప్రేమ' రుచి చూశారా? ఉషాజ్యోతి బంధం 'మోహరుతువు' మీకు ఎరుకేనా? ఆమె ‘ఉన్మత్త’ కవిత్వం మరిచిపోవడం సాధ్యమా? శ్రీసుధ మోదుగు 'జాగృత స్వప్నం', 'డిస్టోపియా' మిమ్మల్ని డిస్టర్బ్ చేశాయా?
'మహిత' కథలో మతి పోగొట్టిన సామాన్య రాసిన 'పుష్పవర్ణమాసం' చదివారా?
'నల్లకోడి పెట్ట' రాసిన ఎండ్లపల్లి భారతి 'ఎండనీళ్ళు ' చదివి తీరవలసిన కథ. భారతి ‘దేవరహస్యాలు’ ఎప్పటికీ గుర్తుండి పోతుంది. గుండె కింద కన్నీటి తడిగా మిగిలిపోయే ‘దేవుడమ్మ’, 'నీరుగట్టోడు' రాసిన ఝాన్సీ పాపుదేశి - ఎంత బాగా రాస్తుందో.... గమనిస్తున్నారా? జూపాక సుభద్ర లాగి కొట్టినట్టుగా రాసిన 'అంటు-ముట్టు' చదివాక మీ మనసు బాధతో విలవిల్లాడిందా? కుప్పిలి పద్మ, కల్పనా రెంటాల, శ్రీ ఊహ, పూర్ణిమ తమ్మిరెడ్డి, సృజన వావిలపల్లి ఎంత మంచి కథలు రాస్తున్నారో! తెలుగు లిటరేచర్ లో కొత్తనీటి వేగాన్ని గమనించారా?
కదిలించే కథలు, మరపురాని కథలు, సీరియస్ సాహిత్యంగా నిలిచే కథలు అన్ని ప్రాంతాల నుంచీ వరదలాగా వచ్చి పడుతున్నాయి. ఏ ఒక్కరమూ అన్ని కథలూ చదవలేం. అందరిపేర్లూ గుర్తు పెట్టుకోనూ లేము. 'బాగా రాస్తున్నారు' అనే వాళ్ళ పేర్లూ, భలే రాస్తున్నారు అని పాపులర్ అయిన వాళ్ళ పేర్లు - నాకు తెలిసినవి- మాత్రమే రాస్తున్నాను.
తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర - ఏ ప్రాంతం అయినా, ఏ రకమైన జీవితాన్ని అయినా యిప్పటి రచయిత్రులు ఎంత నిశితంగా చూస్తున్నారు? ఏ దృక్పథంతో రాస్తున్నారు? ఎంత ఎఫెక్టివ్ గా ప్రెజెంట్ చేయగలుగుతున్నారు అనేదే కదా ముఖ్యం! సి. సుజాత, విమల, కాళ్ళకూరి శైలజ, ఉమా నూతక్కి, గోగు శ్యామల కథ నడిపించే తీరు మనల్ని కట్టిపడేస్తుంది.
మాక్సిం గోర్కీ 'నా బాల్యసేవ' లో పుస్తకాల గురించీ, జీవితం గురించీ యిలా అన్నారు: "పుస్తకాలు నాకు వేరే రకం జీవితాన్ని, ఉత్కృ ష్ట వాంఛలతో, ఉద్వేగ భరిత భావనలతో ప్రజలను వీరత్వాన్ని, నేరాలవైపు పురికొల్పే జీవితాన్ని చూపాయి. నా చుట్టు పక్కల వున్న ప్రజలు నేరాలు చేయడానికి గానీ, వీరోచిత కార్యాలు చేయడానికి గానీ సమర్థులు కారని గుర్తించాను. గ్రంథస్థ విషయాలకు వారు దూరం. వారి జీవితాల్లో ఆసక్తి కలిగించే విషయాలేవో గ్రహించడం అతి కష్టం... ఒకటి మాత్రం నేను గ్రహించాను. వారు బతుకులు గడుపుతున్నట్లు బతకడం నాకిష్టం. లేదు"
ఇలా బతుకులోని ఆనందాన్నీ, విషాదాన్నీ తరచి చూసి, గుండెలవిసి పోయేలా రాస్తున్న రచయిత్రులకి ఇప్పుడు కొదవేమీ లేదు. తగినంత చదువూ, లోతైన అవగాహన, తమదైన సొంత చూపుతో, కరుణతో సహానుభూతితో కవ్వించేలా కథ చెప్పగలిగే లాఘవమూ, నైపుణ్యం ఇప్పటి తెలుగు కథని కొత్త వెలుతురుదారుల్లో నడిపిస్తున్నాయి. తెలుగు కథ ఔన్నత్యాన్ని చాటి చెబుతున్నాయి. కళ్యాణసుందరీ జగన్నాథ్, ఆర్. వసుంధరాదేవి, పి.సత్యవతి ,అబ్బూరి ఛాయాదేవి, ఉమా నూతక్కిల కథల సౌందర్యాన్నీ, రిచ్ నెస్ నీ గుర్తు చేస్తున్నాయి .
ఇక కవిత్వం విషయానికొస్తే, నరాల తీగల మీద సంగీతం పలికించే, నెత్తురు పరిగెత్తించే భావోద్వేగంతో అక్షరాలని వెలిగిస్తున్నారు. ప్రేమ, వేదన, ఎడబాటు, వైఫల్యం, నిరాశల చిరు చీకటిలో చిన్న చిన్న ప్రమిదల్ని వెలిగించి, కన్నీటి కాల్వల్లో వెన్నెల పూలు పూయిస్తున్నారు. ‘కొన్ని నక్షత్రాలు, కాసిన్ని కన్నీళ్లు’ అనే ఊపిరాడనివ్వని కథలు రాసిన విమల, ‘వగరుపూల నవ్వు’ అనే కలకాలం నిలిచిపోయే కొత్త కవితా సంపుటి ఈ మధ్యనే వచ్చింది.
ఆధునిక తెలుగు కవిత్వంలో ఇప్పుడు వీస్తున్న గాలి పేరు మెర్సీ మార్గరేట్. ఆమె కొద్ది పాటి చీకటినీ, పొగలు కక్కే కాఫీనీ , కెరటాల నురుగునీ, ఎక్కాల పుస్తకాన్నీ యిట్టే కవిత్వంగా మార్చేస్తుంది. అతి మామూలు పిచ్చి పదాలకి రంగుల రెక్కలు తొడిగి పారిజాత పుష్పాలుగా మార్చివేయగల ప్రమాదకరమైన మంత్రగత్తె మెర్సీ. కవిత్వం చదివే వెర్రిమొర్రి పాఠకులు వొట్టి సన్నాసులని ఆమెకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదని నా మూఢనమ్మకం!
విరహగీతాల స్పెషలిస్టుగా ప్రసిద్ధి చెందిన ఆర్ రమాదేవి, “ఓయ్ ...ఇక ఎప్పటికీ కలవడం కుదరదంటావా?” అని సూటిగా కళ్ళలోకి చూస్తూ అడుగుతుంది. అదే ఎడబాటుని, ఎదురుచూపుని, తలవొంచుకు వెళ్ళిపోయిన మధురక్షణాల్ని వంద కవితలుగా రాయగల నేర్పరి రమాదేవి!
జూపాక సుభద్ర కైతల దొంతులు అంటూ ‘తెలంగాణి’ సంపుటి తెచ్చింది. నేను నీటి సుక్కను, సబ్బండ జీవ కోటికి కూటిదక్కును-మిన్నోడి ఎద మీద సందమామ సాపేసుకొని-సుక్కలుగా పరుసుకున్న సూడిగింజను -మబ్బు మరుల్ల నీళ్ళు బోసుకుని సమద్రాలుగా నీల్లాడి కొండోడి కొమ్మున ఎగదన్నుకొని -నదుల్ని నడి కట్టేసుకుని పల్లాల పదునుకోసం నగ్నంగా వురికే వూరేగింపును ...అని రాయగల చేవ, తెగింపు ఆమె సొంతం!
చేయి తిరిగిన తెలంగాణ కవయిత్రి దాసోజు లలిత.'దాతి' ఆమె కవిత్వ సంపుటం."దాతి" అంటే వస్తువు. వస్తువు నుండి వస్తువు తయారుచెయ్యడం ఈ దాతి లక్షణం. కార్తులు, కాలాలు , ప్రజలు ఈ దాతి చుట్టూ తిరుగటమే ఎప్పటికప్పుడు కొత్తసాలు. ఇది సబ్బండ జాతుల ఐక్యలాగం” అంటారు లలిత. దాతి కవిత్వం చేతివృత్తుల వారి లలితసంగీతం.
ఇప్పుడు మంచి కవిత్వం రాస్తున్న వాళ్ళలో మందరపు హైమవతి ఒకరు. “ఆమె కవితలు మన మనస్సులో ఏవో ఆలోచనలు కలిగించడం వల్లో, అనుభూతులను స్పందించడం వల్లనో, అట్టడుగు జ్ఞాపకాలను కెరలించడం వల్లనో ఒక పట్టాన మన్ని వదలవు”అన్నారు చేకూరి రామారావు.
ఈ మధ్య వచ్చిన కొని చదవదగ్గ కవిత్వం:
వైష్ణవి శ్రీ- రెండు ప్రపంచాల మధ్య
లక్ష్మి కందిమళ్ళ- కొంత దూరం వచ్చాక
నస్రీన్ ఖాన్ - జఖ్మి
రాళ్లబండి శశిశ్రీ - అనుమంద్రం
రూపా రుక్మిణి - కె - అనీడ
పోర్షియాదేవి - మాట్లాడే సమయం
నిర్మలారాణి తోట -అద్దం నా చిరునామా కాదు
ఫణిమాధవి కన్నోజు -సామభేద
కవిత కుందుర్తి - జస్ట్ ఎ హౌస్ వైఫ్
మానస చామర్తి - 'పరవశ',
వసుధారాణి - దేవ కాంచనం నీడన... ఇవి మంచి కవితా సంపుటాలు
"అంగారస్వప్నం’ సంపుటితో విశిష్టమైన కవిగా పేరు పొందిన ఊర్మిళ (శోభా భట్)కొత్త కవిత్వ పుస్తకం ‘ఒక్క నేనే’.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన ఈ ఎర్రంరాజు శోభారాణి, ఆధునిక తెలుగు కవిత్వానికి కొత్త వ్యాకరణం కనిపెట్టి, పదాలకు పరిమళం అద్దుతోందా అన్నట్టు రాయగల గొప్ప కవి. గంగవరపు సునీత కవితలు చదివి తీరాలి. షాజహానా ‘తన్మయ’లో “ఎన్నెన్ని పాపాలు చేసినవారు స్వేచ్చగా వున్నారు బయట ఏ పాపం చేయకుండా నాకింత శిక్షా?”అని అడుగుతున్నారు. ఉద్యమాల్లోనూ నడుస్తున్నారు. అటు జీవితోత్సవాన్నీ సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ కవులు కలల్లో తేలిపోవడమే కాదు, అర్థవంతమైన ఆగ్రహంతో రాస్తున్నారు.
“మేఘాల నీలాల్లోకి …”అనే పేరుతో మహిళా కవిత్వ అవలోకనం వ్యాససంపుటి తెచ్చారు ఫణిమాధవి కన్నోజు. ఈ విలువైన వ్యాసాలు తప్పక చదవదగ్గవి. డాక్టర్ గీతాంజలి అనువాద కవితలు అద్భుతంగా వుంటున్నాయి . తాజాగా ఆమె తెచ్చిన పాలస్తీనా కవితల పుస్తకం కొని, చదివి,దాచుకోదగ్గది.
బాగా పాపులర్ అయ్యి. ప్రపంచంలో మూడు లక్షల కాపీలు అమ్ముడుపోయిన బెన్యామిన్ నవల ‘మేక బతుకు’ అనే పేరుతో స్వర్ణ కిలారు అనువాదం చేశారు. ఇదొక గొప్ప గాథ. గల్ఫ్ లో కష్టాలూ కన్నీటి వ్యథ. మరణం చివరి అంచున నిలబడి దిగంతాల్లోకి చూస్తూ స్వేచ్చనీ బతుకునీ కలగన్న ఒక పోరాట యోధుడి జీవితేచ్చ. ఆశ మనిషికి ఎంత అవసరమో చెప్పే ఒక నిజజీవిత గాథ”అన్నారు స్వర్ణ. అకాల మరణం చెందిన బాల మేధావి ఎడ్మండ్ థామస్ క్లింట్ జీవిత కథ ‘లిప్త కాలపు స్వప్నం’ స్వర్ణ గారే అనువాదం చేసిన నిజ జీవిత విషాద కథ. అమ్మూ నాయర్ రాసిన, ’ఏ బ్రీఫ్ అవర్ ఆఫ్ బ్యూటీ’ కి పూర్తి న్యాయం చేసిన తర్జుమా. ‘చూపు’ కాత్యాయని,అరుణాప్రసాద్ అనువాదకులుగా రాణిస్తున్నారు.
నవలలు రాస్తున్న వాళ్ళు మాత్రం తెలుగులో అతితక్కువమంది వున్నారు. విశాఖ రచయిత్రి కె.ఎన్.మల్లీశ్వరి ప్రతిభావంతంగా రాస్తున్నారు. శ్రీసుధమోదుగు ‘అంతర్హిత’ నవల తప్పక చదవదగినదని విన్నాను. ఒకనాటి నక్సలైట్ నాయకుడు పటేల్ సుధాకర్ రెడ్డి సహచరి వనజ. ఉత్తర తెలంగాణలో రాడికల్ ఉద్యమాలతో ప్రేరణ పొందిన వనజ రాసిన ‘అడవిపుత్రిక’ నవలని పర్స్పెక్టివ్ ఆర్కే మళ్ళీ కొత్తగా ప్రచురించారు. వరంగల్ కి చెందిన వనజ ఈ నవలని 28 ఏళ్ల క్రితం రాశారు. ఇది ఆత్మకథాత్మక నవల. “ఇది ప్రజాయుద్ధంలో రాటుదేలిన మానవి కథ. సులుకుపోట్ల గాయాల బతుకులోంచి విప్లవోద్యమంలోకి నడిచిన మట్టిమనిషి కథ. ఆమెది కష్టాల కొలిమిలోంచి నడిచిన వచ్చిన జీవితం. కాలానికి ఎదురీదిన సాహసం”అన్నారు రచయిత శివరాత్రి సుధాకర్. ఇంకా సంధ్యా విప్లవ్ రాసిన ‘త్రికాల’, కడలి సత్యనారాయణ ‘చిక్ లిట్’ నవలల్ని ‘అన్వీక్షికి’ సంస్థ ప్రచురించింది.
ప్రసిద్ధ రచయిత్రి వోల్గా ‘విముక్తి’ నవలను గౌరి కృపానందన్ తమిళంలోకి అనువదించారు. గీతారామస్వామి ఆత్మకథ, LAND ,GUNS, CASTE, WOMEN (THE MEMOIR OF LAPSED REVOLUTIONARY)ని ప్రభాకర్ మందార తెలుగులోకి తర్జుమా చేశారు. వేమన వసంతలక్ష్మి, కాకర్ల సజయ,కాత్యాయనీ విద్మహే ,పింగళి చైతన్య, కొన్ని కథలూ,నవలలూ తెలుగులోకి అనువదించారు.
అలనాటి రచయిత్రి మన్నెం శారద కొత్త నవల ‘మన కథ నిజం కాదా?’ మీ దృష్టికి వచ్చిందా?
మైకేల్ షోలహోవ్ రష్యన్ క్లాసిక్ And Quiet Flows The Don నోబెల్ ప్రైజ్ పొందిన పాత నవలని రచన శృంగవరపు అనువాదం చేస్తున్నారు. సుధా భరద్వాజ్ రాసిన పుస్తకాన్ని ‘ఉరి వార్డు నుండి’ అని కె ఉషారాణి అనువదించారు.
ఫిక్షనూ, పల్ప్ ఫిక్షనూ అనేకమంది రాస్తున్నారు. నాన్ ఫిక్షన్ ప్రోజ్ అందంగా రాయగలిగే వాళ్ళంటే నాక్కొంచెం ఎక్కువ ప్రేమ. అంటే వాడ్రేవు వీరలక్ష్మీ దేవి, జూపాక సుభద్రలాగా రాయగలగాలి.
హైదరాబాద్ బుక్ (డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 29) ఫెయిర్ లో వేలల్లో పుస్తకాలు... నేషనల్ బుక్ ట్రస్ట్ నుంచి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ దాకా. కొనాల్సిన పుస్తకాలు లెక్కలేనన్ని వుంటాయి. అన్నీ కొనలేం. కొన్నా అన్నీ చదవలేం. ఇళ్ళల్లో పొగుపడి వున్న పుస్తకాలకే దిక్కు లేదు. కనుక కొన్ని మంచి పుస్తకాలు , కొంతమంది చక్కని రచయిత్రుల పేర్లు మీకు గుర్తుచేసే ప్రయత్నం చేశాను. చాలామంది పేర్లు మర్చిపోయి వుంటాను. లేదా గుర్తు చేసుకోలేకపోయాను.
మరోసారి .........
(On The Eve of Hyderabad Book Fair)
Next Story