
సోనియాగాంధీకి ఇష్టమైన పథకానికి తెలంగాణలో తూట్లు
తెలంగాణ లో ఉపాధి హామీ కార్మికులకు పని దినాలు, వేతనాలు తగ్గిపోతున్నాయి
వ్యవసాయంలో పని దొరకని కాలంలో , గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడానికి ఉద్దేశించిమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (Mahatma Gandhi National Rural Employment Guarantee Act :MGNREGA) తెచ్చారు. 2004లో కాంగ్రెస్ నాయకత్వంలోని యునెైటెడ్ ప్రొగ్రెసివ్ ఫ్రంట్ (UPA) అధికారంలోకి వచ్చాక తెచ్చిన ఈ పథకం లబ్దిదారుల సంఖ్యలో గాని, విస్తృతిలోగాని ప్రపంచంలోనే అతి పెద్ద సంక్షేమపథకంగా పేరు పొందింది. ఈ పథకం కింద కూలీలకు ఇస్తున్నాన్ని దినసరి వేతనాన్ని రు.400 కు పెంచాలని, ఏడాదికి అందిస్తున్న ఉపాధిని 150 రోజులకు పెంచాలని కాంగ్రెస్ పార్టీ నేత సోనియా గాంధీ ఈ మార్చిలో పార్లమెంటులో మాట్లాడుతూ డిమాండ్ చేశారు.
అయితే, ఇంత పెద్ద పథకం పై ఇప్పటి వరకూ జరిగినంత దుష్ప్రచారం మరే చట్టం పైనా జరిగి ఉండదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉపాధి పేరుతో, ఉచితంగా నిధులు పంచి పెడుతున్నాయని, పని చేయకపోయినా ఈ పథకం క్రింద వేతనాలు చెల్లిస్తారని, ఈ పథకం కార్మికులలో సోమరితనాన్ని పెంచుతున్నదని అనేకమంది విమర్శలు చేస్తుంటారు. నిజానికి ఈ పథకం క్రింద తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుండీ మరుసటి సంవత్సరం మార్చ్ వరకూ 12 నెలల కాలంలో ఏమి జరుగుతోందో విమర్శించే వారెవరికీ స్పష్టత ఉండదు. సమాచారం ఉండదు. ఓపిక చేసి తెలుసుకునే ప్రయత్నంకూడా చేయరు.
కానీ తెలంగాణ రాష్ట్రంలో 2024-2025 ఆర్ధిక సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఎలా అమలైందో, అమలులో ఉన్న సమస్యలేమిటో “సంఖ్యలలో తెలంగాణ MGNREGA, 2024–25” పేరుతో ఒక నివేదికను లిబ్ టెక్ ఇండియా సంస్థ (LibTech India) 2025 ఏప్రిల్ 18 న విడుదల చేసింది.
లిబ్‌టెక్ సంస్థ అనేది ఇంజనీర్లు, సామాజిక కార్యకర్తలు, సామాజిక శాస్త్రవేత్తల బృందం. భారతదేశంలో ప్రభుత్వం నుండీ ప్రజలకు అందే సేవల సమర్థతను మెరుగు పరచడానికి ఈ సంస్థ పని చేస్తున్నది. తెలంగాణతో సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో 10 సంవత్సరాలకు పైగా ఒక బృందంగా ఈ సంస్థ పని చేస్తున్నది.
ఇప్పుడే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో ఉపాధి హామీ పథకం అమలు తీరు పై ఈ సంస్థ అనేక నివేదికలను విడుదల చేసింది. జాతీయ స్థాయి లోనూ, కొన్ని ఇతర రాష్ట్రాలలో కూడా ఉపాధి హామీ పథకం అమలు తీరుపై నివేదిక లను ఈ సంస్థ ప్రచురించింది. ఈ సంస్థ నివేదికలు కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ స్థాయిలో చర్చకు దారి తీస్తున్నాయి . ఈ సంస్థ చేస్తున్న విధాన సిఫార్సులు రాష్ట్ర ప్రభుత్వాలు,కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (MoRD) లు పట్టించుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆ సిఫార్సులు అమలవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ నేతృత్వం లోని UPA -1 కూటమి ఆమోదించి 2005 నుండీ అమలులోకి తెచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA ) లో ఉన్న కొన్ని ప్రాధమిక అంశాలను మనం అర్థం చేసుకోవాలి..
1. నమోదిత గ్రామీణ కుటుంబాలకు 100 రోజుల ఉపాధికి గ్యారంటీ
2. ఉపాధి అందించ లేకపోతే ఆయా కుటుంబాలకు నిరుద్యోగ భృతిగా పరిహారం చెల్లించడం.
3. పని పూర్తయిన 15 రోజుల లోపు కార్మికులకు వేతనాలు చెల్లించడం.
4. 15 రోజుల లోపు కార్మికులకు వేతనాలు చెల్లించకపోతే వారికి ఆలస్య పరిహారం కూడా చెల్లించడం.
5. స్త్రీ , పురుషులకు వేత్తనాలలో వివక్ష లేకుండా ఒకే వేతనాన్ని నిర్ణయించి అందించే ఏకైక చట్టం ఇది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో ఉపాధి హామీ పథకం అమలు తీరును లిబ్ టెక్ నివేదిక విశ్లేశించింది. 2023-2024 ఆర్థిక సంవత్సరం డేటాతో కూడా 2024-2025 పథకం అమలు తీరును ఈ నివేదిక పోల్చి చూసింది. తెలంగాణ లో పథకం పని తీరును అర్థం చేసుకోవడానికి జాతీయ స్థాయి లో పథకం అమలు ను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.
జాతీయ స్థాయిలో ఉపాధి హామీ చట్టం లేదా పథకం ఒక డిమాండ్-డ్రివన్ ఉపాధి కార్యక్రమం . కార్మికుల వేతన, ఉపాధి అవసరాలకు స్పందించేలా ఇది రూపొందించ బడింది. అయితే, ఇటీవలి సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులపై ప్రతి సంవత్సరం నియంత్రణ విధిస్తున్నది. రాష్ట్రాలలో ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న చోట, లేదా ఆయా ప్రభుత్వాల పరిపాలనా సమర్ఢ్యంలో లోపం వల్ల నిధుల కేటాయింపులో కూడా తేడాలున్నాయి. ఇవి మొత్తం ఉపాధి హామీ కార్యక్రమ అమలును గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ అడ్డంకులు పథకాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేసేటప్పుడు స్పష్టంగా ప్రభావితం చేస్తాయి.
ఈ సందర్భంలో, తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకం ఎలా పనిచేస్తుందో అంచనా వేయడానికి ఉపాధి సంబంధిత డేటాను ఈ బృందం విశ్లేషించింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ముఖ్యమైన ఉపాధి గణాంకాలను, 2023–24 గణాంకాలతో పోల్చి చూసింది. జాతీయ స్థాయి లో పథకం అమలైన తీరును, తెలంగాణ లో పథకం అమలు తీరును సందర్భోచితంగా అంచనా వేసింది.
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో నమోదైన కుటుంబాలు 2023- 2024 లో 53 లక్షల 02 వేలు కాగా, 2024-2025 నాటికి ఈ కుటుంబాల సంఖ్య 53 లక్షల 08 వేలకు పెరిగింది.
ఈ పథకం క్రింద పని చేసిన కుటుంబాలు 2023-2024 లో 25 లక్షల 33 వేలు కాగా, 2024-2025 లో పనిలో పాల్గొన్న కుటుంబాల సంఖ్య 26 లక్షల 68 వేలు. ఈ పథకం క్రింద ఉపాధి పొందిన కార్మికులు 2023-2024 లో 40 లక్షల 62 వేలు కాగా, 2024-2025 లో 42 లక్షల 44 వేలు.
తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకం క్రింద 2023-2024 తో పోల్చినప్పుడు 2024-2025 లో స్వల్పంగా పెరిగాయి. కానీ అదే సమయంలో 100 రోజుల పని పూర్తి చేసిన కుటుంబాల సంఖ్య బాగా తగ్గింది.
ఉపాధి హమీ పథకంలో పనిచేసిన కుటుంబాలు 2023-2024 లో (లక్షల్లో) | 25 లక్షల 33 వేలు కాగా, 2024-2025 లో ఈ కుటుంబాల సంఖ్య 26 లక్షల 68 వేలు. ఈ కుటుంబాలు చేసిన పని దినాలు 2023-2024 లో 1208 లక్షల 58 వేలు కాగా 2024-2025 లో 1222 లక్షల 11 వేలు. అంటే సగటు పని దినాల సంఖ్య 2023-2024 లో 47.71 రోజులు కాగా, ఇది 2024-2025 నాటికి 45.80 రోజులకు తగ్గింది.
ఇకపోతే ఈ పథకం హామీ ఇచ్చిన విధంగా 100 రోజుల ఉపాధి పని పూర్తి చేసిన కుటుంబాలు 2023-2024 లో 1 లక్షా 35 వేలు కాగా ,అది 2024-2025 నాటికి 93 వేలకు పడిపోయింది. ఈ పథకం లో 100 రోజుల ఉపాధి పని పూర్తి చేసిన కుటుంబాల శాతం 2023-2024 లో 5.33 శాతం కాగా, అది 2024-2025 నాటికి 3.49 శాతానికి పడిపోయింది. జాతీయా సగటు తో పోల్చినప్పుడు ఈ ధోరణి తెలంగాణ లో ఎక్కువగా కనపడడం ఆందోళన కలిగించే విషయంగా అధ్యయన బృందం వ్యాఖ్యానించింది.
ఉపాధి హామీ పథకం లో ములుగు జిల్లా పని దినాలలో 36.5 శాతం పెరుగుదలను నమోదు చేసింది. కానీ హైదరాబాద్ కు పక్కనే ఉండే మేడ్చల్ జిల్లా 25.3 శాతం తగ్గుదలతో అత్యంత తీవ్రమైన పతనాన్ని నమోదు చేసింది, ఇది తెలంగాణలో రాష్ట్ర ప్[రాభూత్వా అభివృద్ధి నమూనాకు సూచికగా కనపడుతుంది. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలలో ఎక్కువ గ్రామ పంచాయితీలను నగరాలలో కలిపేయడం కూడా ఈ పథకం అమలు దిగజారిపోవడానికి ఒక కారణంగా ఉండవచ్చు. దీనిని మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది.
జూన్ 2024 నుండి మార్చి 2025 వరకు పని దినాలు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే బాగా తగ్గుతూ వచ్చాయి. నవంబర్‌లో అత్యధిక తగ్గుదల 82 శాతం. ఈ ధోరణి ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. ఉపాధి హామీ పథకం పనుల వల్ల, కూలీలు, సీజన్ లో వ్యవసాయ కార్య కలాపాలలో పాల్గొనడం లేదనే విమర్శ ఎంత బూటకమో ఈ వివరాలు స్పష్టం చేస్తున్నాయి.
మే 24, 2024న, భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి ఉపాధి హామీ పథకం అమలులో ఉల్లంఘనలను ఉదహరిస్తూ కొన్ని సలహాలు ఇచ్చింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై కేవలం ఏడు వారాల్లో ఈ సలహా జారీ చేయడం అసాధారణమైనది. ఇది ఆ సంవత్సరంలో మిగిలిన ఉపాధి కల్పనను తీవ్రంగా పరిమితం చేసింది. అంటే రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు ఉపాధి హమే చట్టం అమలు పై చేస్తున్న డిమాండ్లకు తలొగ్గి, ఇలాంటి సలహాలు కేంద్రం ఇస్తుందని మనం అనుకోవాల్సి ఉంటుంది. కాకపోతే, దీని ప్రభావం కూలీల వేతన ఆదాయం పై నేరుగా పడుతున్నది.
2024 – 25 లో తెలంగాణ రాష్ట్రంలో జాబ్ కార్డ్ నమోదు లు స్థిరంగా ఉన్నాయి. కానీ కార్మికుల సంఖ్యలో నికర తగ్గుదల ఉంది. 2024–25లో, తెలంగాణ ఉపాధి హామీ పథకం లో జాబ్‌కార్డ్ జారీ, కార్మికుల జోడింపు ప్రక్రియలో ఉన్న లోపాలను కూడా ఈ ధోరణి బయట పెడుతుంది. రాష్ట్రం జాబ్ కార్డ్ ల జారీ లో స్వల్ప నికర పెరుగుదలను నమోదు చేసింది. ఈ పథకం నుండీ తొలగించిన కుటుంబాల కంటే, ఎక్కువ కుటుంబాలు జోడించబడ్డాయని గణాంకాలు సూచిస్తున్నాయి. మరో వైపు ఈ స్పష్టమైన పెరుగుదల, అసలు సమస్యను మరుగు పరుస్తుంది. కార్మికుల సంఖ్య పరంగా రాష్ట్రం లో నికర తగ్గుదల నమోదైంది. పథకానికి జోడించిన వారి కంటే, ఎక్కువ మంది కార్మికులు తొలగించ బడ్డారు .
ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తూ, తెలంగాణ రాష్ట్రం తప్పనిసరి ABPS (ఆధార్-ఆధారిత చెల్లింపు వ్యవస్థ) అమలు చేసిన కారణంగా తప్పుడు పద్ధతిలో తొలగించ బడిన కుటుంబాలను, కార్మికులను తిరిగి పథకం క్రిందికి తీసుకు రావడానికి పెద్ద ఎత్తున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. గత మూడు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం లో కార్మికులు,కుటుంబాల సంఖ్యలో గణనీయమైన తొలగింపులను నమోదు చేసింది. సుమారు 6 లక్షల 10 వేల కుటుంబాలు, 21 లక్షల మంది కార్మికులు తొలగించ బడ్డారు. ఇది గ్రామీణ పేద కుటుంబాలకు పనిని పొందే అవకాశాలను తీవ్రంగా తగ్గించింది. ఉపాధి హామీ చట్టం కార్మికులకు ఇచ్చిన హక్కులను దెబ్బతీసింది .
చాలా రాష్ట్రాలు కార్మికులను చురుకుగా పునరుద్ధరిస్తున్నప్పటికీ, తెలంగాణ నిష్క్రియత కు కారణం రాజకీయమైనది.ఉపాధి హామీ పథకం లో నమోదును పరిమితం చేయడానికి ప్రధాన కారణం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నగదు బదిలీ స్కీమ్ కింద అర్హులను తగ్గించడం. ఎందుకంటే, ఈ కొత్త పథకం అమలుకు ఉపాధి హామీ పథకంలో కుటుంబం నమోదు తప్పనిసరి.
2024-2025 సంవత్సరంలో తెలంగాణ లో తొలగించిన జాబ్ కార్డ్ లు 80 వేలు కాగా, జోడించిన జాబ్ కార్డ్ లు 85 వేలు. తొలగించిన కార్మికులు 3 లక్షల 31వేలు కాగా , జోడించిన కార్మికులు 2 లక్షల 40 వేలు. అంటే 91 వేల మంది కార్మికులు తగ్గించబడ్డారు. భారత దేశంలో ధోరణి ధీనికి భిన్నంగా ఉంది. 2024-2025 లో తొలగించిన జాబ్ కార్డ్ లు 39 లక్షల 32 వేలు కాగా, జోడించిన జాబ్ కార్డ్ లు 153 లక్షల 71 వేలు. తొలగించిన కార్మికుల సంఖ్య 113 లక్షల 16 వేలు కాగా, జోడించిన కార్మికుల సంఖ్య 232 లక్షల 19 వేలు.
నోటిఫైడ్ వేతనాలు పెరిగినప్పటికీ, తెలంగాణలో MGNREGA కార్మికులు వేతన లోటు మరియు తక్కువ పని రోజుల కారణంగా వారి సంభావ్య ఆదాయం కంటే చాలా తక్కువ సంపాదించారు.
2024–25లో తెలంగాణలో ఈ పథకం క్రింద నోటిఫైడ్ వేతనాలు రోజుకు 272 రూపాయల నుండి 300 రూపాయలకు పెరిగాయి. కానీ నోటిఫైడ్ వేతనాలు, కార్మికులు వాస్తవంగా అందుకున్న వేతనాల మధ్య నిరంతర అంతరం కారణంగా కార్మికులు గణనీయమైన వేతన ఆదాయాన్ని కోల్పోతున్నారు. 2024-2025 సంవత్సరంలో సగటున, కార్మికులు రోజుకు 213 రూపాయలు మాత్రమే వేతనంగా అందుకున్నారు. ఇది నోటిఫైడ్ వేతనంలో 71 శాతం మాత్రమే. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే, అందుకున్న వేతనాలలో 17.8 శాతం పెరుగుదలను సూచిస్తున్నప్పటికీ, సగటు పని దినాలు 47.7 నుండి 45.8 కి తగ్గడం వల్ల ఈ ప్రయోజనం కార్మికులకు అందకుండా పోయింది. ఫలితంగా కుటుంబ ఆదాయం 8,637 రూపాయల నుండి 9,770 రూపాయలకు అంటే, 1,133 రూపాయలు స్వల్పంగా పెరిగింది (13శాతం), అయితే కార్మికులు అన్ని పని రోజులకు పూర్తి నోటిఫైడ్ వేతనం అందుకుని ఉంటే సంపాదించగలిగిన వేతన ఆదాయం అంచనా ₹13,740 కంటే ఇది చాలా తక్కువ.
ఈ వేతన లోటు కొత్తది కాదు. 2021–22లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పార్లమెంట్‌లో ఇచ్చిన సమాధానం ప్రకారం, తెలంగాణ రాష్ట్రం మొత్తం దేశంలో అత్యల్ప వేతనాలను అందుకున్న రాష్ట్రంగా ఉంది. అప్పటి నుండీ ఈ ట్రెండ్ మారినట్లుగా ఎలాంటి ఋజువులు లేవు. 2024–25లో, ఆంధ్రప్రదేశ్—అదే 300 రూపాయల నోటిఫైడ్ వేతనంతో, సగటు వేతనం 255 రూపాయలుగా నమోదు చేసింది. తెలంగాణ మాత్రం 213 రూపాయల వద్ద గణనీయంగా వెనుకబడి ఉంది.
తెలంగాణలో ఈ పథకం క్రింద 2024–25లో మొత్తం 2,607.01 కోట్లు సంపాదించాయి. సగటు రోజువారీ వేతనం ₹213.32 రూపాయలు. రాష్ట్ర ఉపాధి హామీ పథకం కార్మికులు రోజుకు పూర్తి నోటిఫైడ్ వేతనం 300 రూపాయలు అందుకుని ఉంటే, వారి మొత్తం ఆదాయం 3,666.33 కోట్లుగా ఉండేది.
తెలంగాణ రాష్ట్ర ఉపాధి హామీ కార్మికులకు మరింత ఎక్కువ వేతన ఆదాయం రావాలంటే, వారికి నోటిఫైడ్ వేతనాలు అందాలి . వారికి 100 రోజుల పని దొరకాలి. అర్హులకు జాబ్ కార్డులు జారీ చేయాలి. కార్మికులను ఈ పథకం లో నమోదు చేయాలి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం లబ్ధిదారుల సంఖ్యను అదుపు చేయడానికి, ఉపాధి హామీ పథకం అమలును రాష్ట్ర ప్రభుత్వం నీరు కార్చకుండా ఉండాలి.