ప్రతీకార సుంకాల సునామీ
x

ప్రతీకార సుంకాల సునామీ

టారిఫ్ విరామం వల్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సొంత ఆస్తులు రు.3570 కోట్ల మేరకు పెరిగాయని అంచనా


డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక చేపడుతున్న అనేక చర్యలు ముఖ్యంగా టారిఫ్ ల విధానం ఆర్థిక ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది. చరిత్ర లోనే అతి పెద్ద టారిఫ్ షాక్ కు కారణమైన తర్కాన్ని వివరించడానికి అమెరికా అధికారులు నానా తంటాలు పడుతున్నారు. సుంకాలు విధించబడ్డ దేశాల దౌత్యవేత్తలు, రాజకీయ నాయకులు గందరగోళంలో చిక్కుకుపోయారు. మార్కెట్లు భారీగా పతనమవుతున్న కొద్దీ , కోట్ల కోట్ల ఆస్తులు క్షణాల్లో ఆవిరి అయిపోతున్న కొద్దీ ప్రపంచం లో ఆందోళన పెరుగుతున్నది. అయితే డోనాల్డ్ ట్రంప్ ఆర్థిక సలహాదారుల మధ్య కూడా ఈ చర్యల విషయంలో చాలా విభేదాలు వున్న మాట వాస్తవం.

ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ నేతృత్వంలో ఒక శిబిరం టారిఫ్ లపై "విరామం కావాలని, పలు దేశాలతో చర్చించాలని కోరుతుండగా, పీటర్ నెవ్వారో వంటి అతివాదులు ఈ చర్యలను సమర్థిస్తున్నారు. ప్రపంచం తన అడుగుజాడలలో నడవటం లేదన్న అక్కసుతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దేశాలన్నింటి మీద యుద్ధం ప్రకటించాడు. రెండవ ప్రపంచ యుద్దం తరువాత అత్యంత వినాశకరమైన ఆర్థిక విధానాన్ని ట్రంప్‌ పాటిస్తున్నట్లు అమెరికా మాజీ అర్థిక మంత్రి లారెన్స్‌ సమర్స్‌ వ్యాఖ్యానించాడు.1930దశకం తరువాత అతి పెద్ద వాణిజ్య యుద్ధాన్ని ట్రంప్‌ ప్రారంభించినట్లు చెబుతున్నారు.”1990 లో సోవియట్ రష్యా పతనం తో ఆరంభమైన ప్రపంచీకరణ ఇప్పుడు ట్రంప్ విధించిన సుంకాలతో ముగిసిపోయింది. అంతర్జాతీయ వాణిజ్యం లో ఇది కొత్త శకానికి తెర తీసింది. ఈ వాణిజ్య యుద్ధంలో విజేత అంటూ ఎవరూ ఉండరు ” అని బ్రిటన్ ప్రధాని స్టార్మర్ వ్యాఖ్యానించారు.

అమెరికాను వ్యతిరేకిస్తున్న దేశాల మీద ప్రతీకార పన్నుతో ఏటా ఆరు వందల బిలియన్‌ డాలర్ల మేర రాబడి వస్తుందని చెబుతున్న ట్రంప్‌ రానున్న పది సంవత్సరాల్లో ఐదు లక్షల కోట్ల డాలర్ల మేరకు కార్పొరేట్లు, ధనికులకు పన్ను రాయితీలు ఇచ్చేందుకు తీర్మానం చేయించారు. ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత భారీగా పెరుగుతుందని ఆశించిన ఎలన్‌మస్క్‌ సంపద ఈ టారిఫ్ ల కల్లోలంతో ఇప్పటి వరకు 135 బిలియన్‌ డాలర్లు హరించుకుపోయింది. చైనాతో సహా ఎవరి మీదా పన్నులు వేయవద్దని, పునరాలోచించాలని ట్రంప్‌ను మస్క్‌ గట్టిగా కోరినట్లు వాషింగ్టన్‌ పోస్టు పత్రిక రాసింది. అమెరికాలో పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు అనేక ప్రదర్శనలు జరిగాయి. అనేక లక్షల మంది వారిలో పాల్గొన్నారని వార్తలు.

లండన్‌, పారిస్‌ వంటి ఇతర దేశాల నగరాల్లో కూడా నిరసన తెలిపారు. మిస్టర్ ట్రంప్ ఇష్టానుసారం టారిఫ్ వ్యూహం నడవడం లేదు. ద్రవ్య పెట్టుబడిదారుల వ్యతిరేకత, నిరసనలతో 9-ఏప్రిల్ న ట్రంప్ తన "పరస్పర" టారిఫ్ లకు 90 రోజుల విరామం ప్రకటించాల్సి వచ్చింది. స్మార్ట్ ఫోన్లు, లాప్ టాప్ లు, సెమీ కండక్టర్, చిఅప్పుల వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకి దిగుమతులపై ఆధారపడి వుండటం వల్ల అడ్డగోలు పన్నులతో వీటి ధర ఆకాశాన్ని అంటుతోంది. సామాన్య పౌరులే కాదు టెక్ దిగ్గజాలైన యాపిల్, శాంసంగ్ వంటి సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యం లో 12-ఏప్రిల్ న చైనాతో సహా ఇతరుల నుంచి దిగుమతి అవుతున్న వీటికి సుంకాల నుంచి మినహాయింపు ప్రకటించారు. దీనితో గందరగోళంలో కాస్త ఉపశమనం లభించింది. టారిఫ్ విరామం వల్ల ఆయన సొంత ఆస్తులు రూ.3570 కోట్ల మేరకు పెరిగాయని అంచనా వేస్తున్నారు.

జరిగిన నష్టాన్ని పూడ్చడం సులభం కాదు. మార్కెట్ మాంద్యం నుంచి కాస్త కోలుకుంటున్నాయి. కానీ ట్రంప్ మాత్రం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే కట్టుబాట్లను పక్కనపెట్టి అసాధారణ అస్థిరత, గందర గోళాన్ని ప్రవేశపెట్టారు. “మనం గందరగోళ యుగంలో ఉన్నాము. వాస్తవ ప్రపంచంలో అదొక విపత్తు. ట్రంప్ కు ఉన్న అయోమయమైన నమ్మకాలు, వాటిలోని వైరుధ్యాలు అనేక ద్వైపాక్షిక చర్చలకు ఆటంకమే.” అని అనేకమంది అమెరికా ఆర్ధిక విశ్లేషకులు బాహాటంగా ప్రకటిస్తున్నారు. ట్రంప్ విధిస్తున్న సుంకాలు అమెరికాకు మేలు చేస్తాయని తాను భావించటం లేదని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించాడు. అయినా “ఈ సుంకాల పెంపు వల్ల మా బేరమాడే స్థితి మెరుగయ్యింది.

ఇప్పుడు అన్ని దేశాలు మమ్మల్ని సంప్రదిస్తున్నాయి. అమెరికా మళ్ళీ డ్రైవర్ సీట్ లోకి వచ్చింది” అని ట్రంప్ సంతోషిస్తున్నాడు.”అమెరికాతో పోలిస్తే చైనాకు పెద్ద దెబ్బ తగిలింది. చైనాతో పాటు అనేక దేశాలు మనతో అన్యాయంగా ప్రవర్తించాయి. ఇక పై ఆ పరిస్థితి ఉండదు. అమెరికా నిస్సహాయ స్థితిలో ఉండదు” అని సమర్థించు కుంటున్నాడు. అమెరికా పౌరసత్వాన్ని ఐదు మిలియన్ల డాలర్ల అమ్మకపు సరుకుగా మార్చిన వ్యాపారస్తుడు కదా!

అమెరికా చైనాతో క్రూరమైన వాణిజ్య యుద్ధం లో నిమగ్నమై ఉంది. రెండు దేశాల సుంకాలు ఇప్పుడు వరుసగా 145%, 125%గా పతాక స్థాయిలో ఉన్నాయి. ట్రంప్ వెనక్కి తగ్గడం గురించి ఆలోచించడం లేదు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ దాన్ని ఎదుర్కొంటున్నాడు. అనేక ఆటంకాలు,కుట్రలు ఎదుర్కొంటూ తన సోషలిస్టు నిర్మాణ పథంలో వేగంగా ఎదుగుతున్నది చైనా. కార్పొరేట్, గుత్త పెట్టుబడి విష కౌగిలిలో పతనమై పోతు న్న సామ్రాజ్యవాద వ్యవస్థతో తన ప్రాభవం కోల్పోతున్నది అమెరికా.2024 లో అమెరికా జిడిపి 29.2లక్షల కోట్లు కాగా చైనాది 18.9లక్షల కోట్లు. వృద్ధి రేటు వరసగా 2.8%, 5% చొప్పున ఉన్నాయి. అంటే త్వరలో అమెరికాను దాటి చైనా అగ్రస్థానం చేరుకోనుంది. దీన్నితన అగ్రరాజ్య హోదాకు పోటీగా,ముప్పుగా భావించి చైనా అభివృద్ధిని నిరోధించడానికే డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రయత్నిస్తున్నాడు.

అన్ని దేశాలకు వడ్డించిన 10% సుంకానికి అదనంగా చైనా వస్తువుల మీద 145% పన్నులు విధించిన ట్రంప్‌కు సుంకాలు ఇంకా పెంచి చైనాని కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని సలహా ఇస్తున్నవారు కూడా అక్కడ వున్నారు. “మీ అరుపులకు, బెదిరింపులకు, బ్లాక్ మెయిల్ కు భయపడేది లేదని” తాపీగా చైనా తన దారిని తాను పోతున్నది. తాను కూడా ప్రతిస్పందన సుంకాలు విధిస్తున్నది. సుంకాల అమలును 90 రోజుల పాటు నిలిపివేసిన అమెరికా చైనాకు మాత్రం ఆ మినహాయింపు ఇవ్వకపోవటంతో దాన్ని చైనా తీవ్రమైన ఆర్ధిక బెదిరింపుగా పరిగణిస్తున్నది. అంతర్జాతీయ వాణిజ్య చట్టాలను ఉల్లంఘించడమేనని భావిస్తున్నది. అమెరికా మార్కెట్ల మీద ఆధార పడటం తగ్గించుకుని అంతర్గత మార్కెట్‌ను విస్తరించే మార్గం అనుసరిస్తున్నది.2018 లో ట్రంప్‌ వాణిజ్య పోరును ప్రారంభించిన నాటి నుంచి చైనా తన అస్త్రాలన్నింటినీ అవసరాల మేరకు ప్రయోగిస్తున్నది. అమెరికా నుంచి ఎగుమతి, దిగుమతులను తగ్గించింది, అమెరికా కంపెనీలను నియంత్రించటమో, నిషేధిత జాబితాలో చేర్చడమో చేస్తున్నది.

మరో పక్క అమెరికా పౌరులు వినియోగించే వాటిలో 90% దిగుమతులపై ఆధారపడినవే ఉంటాయి. తయారీ రంగం ఎప్పుడో చైనా తదితర దేశాలకు తరలిపోయింది. ఇప్పుడు సుంకాలు పెరగటంతో అమెరికా మార్కెట్ లో వస్తువుల ధరలు బాగా పెరిగిపోతాయి. నిత్యావసరాల కోసమే నెల వారి 30-40% అదనపు భారం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది అమెరికాలో కల్లోలం రేపుతోంది. ఈ పోరు ప్రపంచ, అమెరికా ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తుందని బడా వాణిజ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి. తక్షణమే చర్చలు జరపాలని అమెరికా-చైనా వాణిజ్య మండలి పిలుపు ఇచ్చింది.

బీజింగ్‌ను ఒంటరి చేసేందుకు ట్రంప్‌, అనేక దేశాల మీద సుంకాలను తగ్గించటం లేక రద్దు చేయడానికి కూడా పూనుకుంటున్నాడు. దేశానికో రకం పన్ను విధిస్తున్నాడు. 2 ఏప్రిల్ న ఇశ్రాయేలు పై 17%, వియత్నాం పై 46% ఇండియా పై 26% సుంకాల ను విధించాడు. ఈ ముగ్గురి తో ప్రత్యేక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి సంప్రతింపులు చేస్తున్నారు. రెండు వారాల క్రితమే అమెరికా వాణిజ్య మంత్రి ఇండియాలో పర్యటించారు.

గత కొన్ని వారాలుగా, భారతదేశం తన టారిఫ్ విధానాన్ని సమూలంగా మార్చింది, బోర్బన్ విస్కీ, హార్లే-డేవిడ్సన్ తయారు చేసిన హై-ఎండ్ మోటారు సైకిళ్ల తో సహా సుమారు 8,500 అమెరికా పారిశ్రామిక వస్తువులపై దిగుమతి సుంకాలను తగ్గించింది. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా, ఎక్స్‌ తదితర కంపెనీలకు లబ్ది కలిగేలా డిజిటల్‌ సర్వీసు పన్ను రద్దు చేసింది. ద్వైపాక్షిక వాణిజ్య మిగులును తగ్గించుకోవడానికి అమెరికన్ చమురు, ఎల్ఎన్జీ, రక్షణ పరికరాలను కొనుగోలు చేయడానికి భారత్ సుముఖత వ్యక్తం చేసింది. చర్చల్లో భాగంగా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ లో సుంకాలు తగ్గించాలన్న అమెరికా డిమాండ్ ను భారత్ పరిశీలిస్తోందని బ్లూమ్ బర్గ్ న్యూస్ గత వారం నివేదించింది. ఇదే జరిగితే భారత వ్యవసాయ రంగానికి, పాడి పరిశ్రమకు ఎంతోనష్టం. ఇన్ని రాయితీలు ఇస్తూ అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్ ప్రయత్నిస్తోంది కానీ అమెరికా నుంచి దిగుమతులపై ప్రతిస్పందన సుంకం వేయడానికి సిద్ధపడటం లేదు.

అమెరికాకు భారత్ ఎగుమతులు 30-33 బిలియన్ డాలర్లు పడిపోవచ్చని, ఇది స్థూల దేశీయోత్పత్తిలో 0.8-0.9 శాతానికి సమానమని ఆర్థికవేత్త మాధవి అరోరా అంచనా వేశారు. అమెరికా చర్య ఇప్పటికే బలహీనంగా ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. వృద్ధికి ఊతమిచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించింది. అమెరికా సుంకాలతో మన ఎగుమతులు గణనీయంగా తగ్గే అవకాశం వుందని అది జీడీపీ వృద్ధి పైన ప్రతికూల ప్రభావం చూపుతుందని “ ప్రపంచ ఆర్ధిక ప్రగతి పై అనిశ్చితి మబ్బులు కమ్ముకున్నాయని” మన ఆర్బిఐ గవర్నర్ మల్హోత్రా వ్యాఖ్యానించారు. “చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ వంటి ప్రధాన పోటీదారుల కంటే భారత్ పై పరస్పర సుంకం తక్కువగా ఉందని, కనుక ఇది భారతీయ ఎగుమతులు ముఖ్యంగా దుస్తులు, పాదరక్షల వంటి రంగాలకు సహాయపడుతుందని” ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ ఆశ పడుతున్నారు. అమెరికా చర్యలు భారత్ కు మేలు చేస్తాయని ,లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల నుండి పెట్టుబడిదారులు ఇండియాకు వస్తారని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి గ్లోబల్ ఇండియా బిజినెస్ ఫోరం సదస్సులో ప్రకటించాడు. అమెరికా ఎక్కువ పన్నులు విధించిన దేశాల [ఉదా. చైనా] నుంచి సరకులను దిగుమతి చేసుకొని వాటికి మన ముద్ర వేసి తిరిగి ఎగుమతి చేయవద్దని మన వాణిజ్య మంత్రి పియూష్‌ గోయల్‌ మన ఎగుమతిదార్లను హెచ్చరించారు. ఇది అమెరికా మెప్పు పొందేందుకే అన్నది స్పష్టం. ఇరు దేశాలు త్వరగా వాణిజ్య ఒప్పందం కుదుర్చు కోవాలని మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ అమెరికా మంత్రి మార్కో రూబియో కు ఫోన్లు చేస్తున్నారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చు కోవడం అత్యంత ఆవశ్యకమైన విషయంగా ఇండియా భావిస్తున్నది.

2021-22నుంచి 2023-24 వరకు భారత్ కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి గా ఉంది. భారత్ చేసే వస్తువుల ఎగుమతుల్లో 18%, దిగుమతుల్లో 6.22% అమెరికా వాటా ఉంది. ట్రంప్ మొదటి పాలనా కాలంలో అమెరికాతో నాలుగేళ్లు చర్చలు జరిపినా కూడా ఒప్పందం కుదరలేదని ఈసారి అవకాశం సద్వినియోగం చేసుకుంటా మని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ తెలిపారు. మోడీ ,ట్రంప్ ఇటీవల సమావేశంలో ఈ ఏడాది చివరినాటికి మొదటి విడత వాణిజ్య ఒప్పందాన్ని ముగించాలని, 2023లో 127 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు పెంచాలని స్థూలంగా నిర్ణయించారు. ఈ సంబంధాల వల్ల ఇప్పుడు 26% దిగుమతి సుంకం వేసిన కిమ్మనకుండా అమెరికా వంక ఆశగా ఎదురు చూస్తున్నది ఇండియా. “మోడీ చాలా చతురుడు. నాకంటే బాగా బేరసారాలు ఆడగలనని స్వయంగా ట్రంప్ కితాబు ఇచ్చిన విషయాన్ని తలచుకుని మురిసిపోతున్నారు కానీ ‘ఎక్కడైనా బావే కానీ వంగతోట కాడ కాదు” అన్న తీరులోనే ట్రంప్ వ్యవహారం వుంది.

Read More
Next Story