రైజింగ్ తెలంగాణ విజన్  2047  డాక్యుమెంట్ ను మీరే పాటించరా ?
x

రైజింగ్ తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ ను మీరే పాటించరా ?

తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్-2047ను పాటించట్లేదా? ఎలా? సర్ దగ్గర అప్రూవల్ తీసుకోవాలక్క


ప్రభుత్వం ఒక విధానం ప్రకటించినప్పుడు ఆ విధానాన్ని ముందుగా అమలు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పూనుకోవలసి ఉంటుంది. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. డిసెంబర్ 9 న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ ను విడుదల చేసింది. ఆ డాక్యుమెంట్ ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతంలో కేవలం సర్వీస్ సెక్టార్ మాత్రమే ఉంటుందనీ, ఔటర్ రింగ్ రోడ్డు కూ , రీజనల్ రింగ్ రోడ్డుకూ మధ్య పెరీ అర్బన్ ప్రాంతం పరిశ్రమల కేంద్రంగా ఉంటుందనీ, రీజన్ రింగ్ రోడ్డు ఆవల నుండీ రాష్ట్ర సరిహద్దుల వరకూ వ్యవసాయ ప్రాంతంగా ఉంటుందనీ ప్రకటించారు. అంటే ఈ ప్రాంతంలో పరిశ్రమలకు, ముఖ్యంగా కాలుష్య కారక పరిశ్రమలకు అసలు తావుండదని మనం అనుకుంటాం.

కానీ ప్రభుత్వానికి ఏ మాత్రం విచక్షణ లేకుండా , వ్యవసాయ ప్రాంతంలో కూడా అత్యంత కాలుష్య కారక, రసాయన , ఇథనాల్ పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తున్నది. ఇందుకు తాజా ఉదాహరణగా సంగారెడ్డి జిల్లా, న్యాల్‌కల్ మండలం, మల్గి గ్రామంలోని సర్వే నంబర్ 152/U/2 వద్ద శ్రీ ఆశా ఆల్డిహైడ్స్ అండ్ అడ్హెసివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపనీని చెప్పుకోవచ్చు.

ఈ కంపనీ యాజమాన్యం ఫార్మాల్డిహైడ్ , రెసిన్ లాంటి ప్రమాదకర రసాయనాలను తయారు చేయడానికి ఈ వ్యవసాయక, రూరల్ ప్రాంతంలో, ఒక కంపనీ ఏర్పాటు చేయనుంది. ఈ కంపనీలో తయరయ్యే విష రసాయనాలు గ్రామాలను పాడు చేస్తాయి. నీటిని, పొలాలను, వ్యవసాయాన్ని నాశనం చేస్తాయి. ఆ ప్రాంత భూముల ధరలు పడిపోతాయి. స్థానిక ప్రజల ఆరోగ్యాలను దెబ్బ తీస్తాయి. ఆ ప్రాంత గాలి, నీరు కలుషితమై పోయి క్యాన్సర్ లాంటి జబ్బులు ఈ ప్రాంత ప్రజలను వెంటాడుతాయి. ఈ ప్రాంతంలో ప్రజలు భవిష్యత్తులో బతకలేని పరిస్థితి ఏర్పడుతుంది.

ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా, తెలంగాణ ప్రజల పక్షాన పని చేస్తున్న పౌర సమాజ సంఘాలుగా సైంటిస్ట్స్ ఫర్ పీపుల్., తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సంస్థలు మేము స్థానిక ప్రజల దృష్టికి ఈ పరిశ్రమకు సంబంధించి, కొన్ని ముఖ్యమైన వివరాలను తీసుకు వస్తున్నాయి.

సంగారెడ్డి జిల్లా న్యాలకల్ ప్రాంతంలో వచ్చే పరిశ్రమ అత్యంత ప్రమాదకరమైనది. కానీ ఈ పరిశ్రమ గురించి అన్ని విషయాలూ, ముందుగానే స్థానిక ప్రజలకు చెప్పకుండా, ఈ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి ఆమోదం తీసుకోవడానికి 2026 జనవరి 3 న ఈ ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం కంపెనీ నిర్మికన్హే స్థలంలోనే ఒక సమావేశం జరపాలని ప్రభుత్వ అధికారులు,కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఇప్పటికే నిర్ణయించారు.

ఈ పరిశ్రమ ఏర్పాటు కోసం కంపనీ యాజమాన్యం కోరిక మేరకు ఒక కన్సల్టెన్సీ సంస్థ పర్యావరణ ప్రభావ అంచనా (ఇఐఎ) ఒక నివేదిక ఇచ్చింది. అన్ని వివరాలూ లేని ఈ నివేదికలో, కంపనీ చుట్టూ తెలంగాణ రాష్ట్ర పరిధిలో 10 కిలోమీటర్ల ప్రాంతంలో చేసిన అధ్యయనం, అంచనాలలో తీవ్రమైన లోపాలున్నాయి.

ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం బీదర్ కు అతి సమీపంలో నిర్మించ తలపెట్టిన ఈ కంపెనీ గురించి, కర్ణాటక రాష్ట్ర ప్రజలకు అసలు సమాచారం ఇవ్వలేదు. కానీ ఈ నివేదిక ఆధారంగా 2026 జనవరి 3 న తెలంగాణ పరిధిలో స్థానికంగా ఒక పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

10 కి. మీ అధ్యయన ప్రాంతం కర్ణాటకలోకి గణనీయంగా విస్తరించి ఉంది. కర్ణాటక సరిహద్దు ప్రాజెక్ట్ సైట్ నుండి కేవలం 0.38 కి.మీ దూరంలో ఉందని ఇఐఎ స్వయంగా నివేదించింది. అంత ర్రాష్ట్ర సరిహద్దు క్రమరహితంగా ఉంది, సరళ రేఖ కాదు మరియు బహుళ దిశలలో లోపలికి వంగి ఉంది. 10 కి.మీ వ్యాసార్థంలో ఒక పెద్ద భాగం కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఉంది.అధ్యయన ప్రాంతం మ్యాప్ (పేజీ 79) కర్ణాటక వైపు స్పష్టంగా పెద్ద నివాస, అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని చూపుతుంది. రెండు లక్షలకు పైగా జనాభా ఉన్న బీదర్ నగరం ప్రాజెక్ట్ సైట్ నుండి కేవలం 4.59 కి.మీ దూరంలో ఉంది.

ఈ భౌగోళిక వాస్తవికత ఉన్నప్పటికీ, ఇఐఎ కర్ణాటకలో బేస్‌లైన్ పర్యవేక్షణ (గాలి, నీరు, మట్టి, శబ్దం) నిర్వహించలేదు. కర్ణాటక వైపు ఎటువంటి హైడ్రోలాజికల్, ఎకోలాజికల్ లేదా పర్యావరణ సున్నితత్వాలను మ్యాప్ చేయలేదు. ఉన్న పరిశ్రమల జాబితాలో కర్ణాటక పరిశ్రమలేవీ చేర్చబడలేదు. అధ్యయన ప్రాంతంలోని కర్ణాటక గ్రామాల కోసం సామాజిక-ఆర్థిక లేదా ఆరోగ్య సంబంధిత బేస్‌లైన్ సిద్ధం చేయలేదు.

ఒక అధ్యయన ప్రాంతాన్ని పాక్షికంగా అంచనా వేయలేము. ఈ విస్మరణ దాదాపు సగం ప్రభావిత భౌగోళిక ప్రాంతం బేస్‌లైన్ మరియు ప్రభావ విశ్లేషణను చెల్లకుండా చేస్తుంది. ఇది అంతర్రాష్ట్ర ప్రాజెక్టు. దీనికి రాష్ట్ర స్థాయిలో అనుమతి ఇవ్వలేరు. ఇది కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధి లోని విషయము.

అధిక ప్రభావిత గ్రామాలూ, జనాభాలో మెజారిటీ కర్ణాటకలో ఉన్నాయి, EIA 10 కి. మీ అధ్యయన ప్రాంతంలో 48 గ్రామాలను జాబితా చేసింది: ఇందులో కర్ణాటకలో 28 గ్రామాలు (బీదర్ జిల్లా)ఉన్నాయి. తెలంగాణలో 20 గ్రామాలు (న్యాల్‌కల్ మండలం). కానీ ఇఐఎ కర్ణాటక గ్రామాలకు జనాభా గణాంకాలను అందించలేదు. అధ్యయన ప్రాంతంలో బీదర్ నగరం ఉనికిని అంగీకరించారు, కానీ దాని జనాభాను విశ్లేషించలేదు. కర్ణాటక జనాభా డేటా లేకపోవడం మానవ బహిర్గతం (exposure), ఆరోగ్య ప్రమాదం లేదా సామాజిక ప్రభావం యొక్క వాస్తవిక అంచనాను నిరోధిస్తుంది. రాష్ట్రాల వారీగా జనాభా డేటాను వదిలేయడం వల్ల ప్రభావిత జనాభాలో ఎక్కువ భాగం కర్ణాటకలో నివసిస్తున్నారనే వాస్తవాన్ని సమర్థవంతంగా దాచిపెడుతుంది.

ఏ అంశం అధ్యయనం కోసం కూడా కర్ణాటక నుండి బేస్‌లైన్ నమూనాలు లేవు. అన్ని బేస్‌లైన్ అధ్యాయాల సమీక్ష ప్రకారం ఒక్క శాంప్లింగ్ ప్రదేశం (గాలి, భూగర్భ జలం, ఉపరితల జలం, మట్టి, శబ్దం, జీవవైవిధ్యం) కూడా కర్ణాటకలో లేదు. అన్ని మానిటరింగ్ ప్రదేశాలూ తెలంగాణకే పరిమితమయ్యాయి. ఇది ఇఐఎ పద్ధతుల ప్రాథమిక ఉల్లంఘన. రాష్ట్ర సరిహద్దులతో సంబంధం లేకుండా 10 కి.మీ అధ్యయన ప్రాంతాన్ని మొత్తం వ్యాసార్థం అంతటా ఒకేలా అంచనా వేయాలి.

ఉమ్మడి-ప్రభావ అంచనా (Cumulative-impact assessment) నుండి కర్ణాటక పరిశ్రమలను మినహాయించారు. తెలంగాణలోని మల్గి గ్రామానికి సమీపంలో ఉన్న కొన్ని చిన్న అగ్రో-ప్రాసెసింగ్ యూనిట్లను మాత్రమే ఇఐఎ జాబితా చేసింది. కానీ బీదర్ నగరంలోని పరిశ్రమలను, బీదర్ పరిధిలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలను, అధ్యయన ప్రాంతంలోని కర్ణాటక భాగంలో ఉన్న ఏవైనా పారిశ్రామిక క్లస్టర్లను లిస్టు లో చేర్చలేదు. బీదర్ నుండి వెలువడే ఉమ్మడి ఉద్గారాలూ, VOC లోడింగ్, ఆల్డిహైడ్ నేపథ్య స్థాయిలూ, ట్రాఫిక్ సంబంధిత కాలుష్యమూ, కర్ణాటక పారిశ్రామిక వాడలూ పూర్తిగా మినహాయించబడ్డాయి.

ప్రాజెక్టులో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయి . వీటిలో ఫార్మాల్డిహైడ్ (క్యాన్సర్ కారకం, గ్రూప్ 1) అసిటాల్డిహైడ్ (సంభావ్య క్యాన్సర్ కారకం) మిథనాల్ (విషపూరితమైనది, మండే స్వభావం కలది) ఫినోలిక్ మరియు రెసిన్ ఇంటర్మీడియట్స్ లాంటివి ముఖ్యమైనవి.

అయినప్పటికీ ఇఐఎ నివేదిక వీటిని ప్రస్తావించలేదు. ప్రజలకు చెప్పడంలేదు. పూర్తి ప్రమాదకర రసాయన జాబితా (Inventory) ఇవ్వలేదు. గరిష్ట ఆన్‌సైట్ నిల్వ పరిమాణాలు నిర్దేశించలేదు. వాస్తవిక దృశ్యం-ఆధారిత QRA మోడలింగ్ కూడా చేయలేదు. బీదర్ నగరం, కర్ణాటక గ్రామాలపై విష పూరిత పొగమంచు (Toxic-plume)పై మోడలింగ్ అధ్యయనం చేయలేదు. కర్ణాటక జనాభా పైన ఎలాంటి ఆరోగ్య ప్రభావ అంచనా వేయలేదు. దట్టమైన జనాభా కలిగిన పట్టణ ప్రాంతానికి సమీపంలో క్యాన్సర్ కారకమూ, తీవ్రమైన విష రసాయనాలతో కూడిన ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వడం ఆమోదయోగ్యం కాదు.

ప్రజాభిప్రాయ సేకరణ సన్నాహాలు అసంపూర్ణం, నిబంధనలకు విరుద్ధం. ప్రజాభిప్రాయ సేకరణ 03.01.2026న షెడ్యూల్ చేయబడింది, కానీ సన్నాహక ప్రక్రియ ఇప్పటికే లోప భూయిష్టంగా ఉంది. 48 గ్రామాలలో 28 గ్రామాలూ, అతిపెద్ద జనాభా సమూహం (బీదర్ నగరం) కర్ణాటకలో ఉన్నందున, కర్ణాటక నివాసితులు ప్రధాన ప్రభావిత వాటాదారులు అవుతారు. కానీ వాళ్ళకు సమాచారమే లేదు. వారికి ఈ పబ్లిక్ హియరింగ్ పై ఇప్పటి వరకూ నోటీసు ఇవ్వలేదు. వారి బేస్‌లైన్ డేటాను అధ్యయనానికి వీలుగా వారికి అందుబాటులో ఉంచలేదు. ఫలితంగా మొత్తం విచారణకు ముందస్తు పారదర్శకత ప్రక్రియ పూర్తిగా దెబ్బతింది.

వ్యర్థ జలాల నిర్వహణా, మంజీరా నదిపై ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. ఈ ప్రాంతంలో నిర్మించబోయే ప్రతిపాదిత ఫార్మాల్డిహైడ్ తయారీ ప్లాంట్ మంజీరా నదికీ, దానిపై ఆధారపడిన లక్షలాది మందికీ తీవ్రమైన, ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్రతిపాదిత స్థలానికి దగ్గర లోని న్యాల్ కల్, చాకిరి, కోట వాగులు కలిసి పెదవాగుగా మారి మంజీరా నదిలో కలుస్తాయి. ఒక వేళ విష రసాయనాలు ఈ మంజీరా నదిలో కలిస్తే హైదరాబాద్ సహా త్రాగు నీటి సరఫరాకూ, వన్య ప్రాణి సంరక్షణ కేంద్రాలకూ, గ్రామీణ జీవనోపాధులకూ తీవ్ర ముప్పు కలుగుతుంది.

ప్రస్తుతం తయారు చేసిన ఇఐఎ క్రిటికల్ ప్రమాద అంచనాలు లేకుండా ఉంది. అందువల్ల ప్రాజెక్ట్ స్థలాన్ని మార్చాలి. లేదా మొత్తం ఈ ప్రాజెక్టు ను నిరాకరించాలి. ఈ ఇఐఎ నివేదికలో "జీరో లిక్విడ్ డిశ్చార్జ్" (ZLD) ప్లాన్ వాస్తవిక వివరాలను కూడా ప్రజల ముందు ఉంచడం లేదు.

రవాణా మార్గాల విశ్లేషణ లోపం కూడా కనపడుతున్నది.మెథనాల్ వంటి అత్యంత దహనశీల రసాయనాల రవాణా వల్ల కలిగే ప్రమాదాల గురించీ (Transportation Risk Assessment), భారీ ట్యాంకర్ల రాకపోకల వల్ల పెరిగే ట్రాఫిక్ కాలుష్యం గురించీ ఇఐఎలో ప్రస్తావించలేదు.

వన్యప్రాణులు మరియు పక్షులపై ప్రభావం ఉండబోతున్నది. బీదర్ పరిసరాల్లో ఉన్న కృష్ణ జింకల సంరక్షణ కేంద్రాలూ (Blackbuck habitats), స్థానిక జీవవైవిధ్యంపై ఈ రసాయన ఉద్గారాల ప్రభావం గురించీ EIA నివేదిక మౌనంగా ఉంది. ఈ స్థితిలో ప్రస్తుత రూపంలో ఉన్న ఇఐఎ అసంపూర్తిగా, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున అధికారులు తిరస్కరించాలి. అధ్యయన ప్రాంతంలోని కర్ణాటక భాగాన్ని కూడా విశ్లేషించాలి. అన్ని అధ్యయనాల కోసం కర్ణాటక బేస్‌లైన్ శాంప్లింగ్ కూడా ప్రజల ముందు ఉంచాలి. కర్ణాటక ప్రాంత జనాభా వివరాలను విస్మరించకూడదు. కర్ణాటక ప్రాంత పరిశ్రమలను కూడా జాబితా చేయాలి. ప్రమాద, ఆరోగ్య ప్రభావం పూర్తి స్థాయిలో అంచనా వేయాలి. లోపభూయిష్ట ప్రజాభిప్రాయ సేకరణ సన్నాహాలు మానుకోవాలి.

వీటితో సహా తాజా EIA ని సిద్ధం చేయమని ప్రాజెక్ట్ నిర్వాహకులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించాలి. స్థానిక ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇటీవల పౌర సమాజ బృందం ఆయా గ్రామాలకు వెళ్ళి, ప్రజలకు అవగాహన కల్పించింది. జనవరి 3 న జరిగే ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు,స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తమ గొంతు వినిపించాలని కూడా కోరింది.

Read More
Next Story