యోగా అంటే యోగాసనాలు మాత్రమేనా...
x

యోగా అంటే యోగాసనాలు మాత్రమేనా...

అద్దంకి శ్రీరామ కుమార్: నేడు అంతర్జాతీయ యోగా దినం. అసలు యోగా అంటే ఏంటి? యోగాసనాలు కాకుండా యోగ ఇంకా ఎమి చెబుతుంది.


-అద్దంకి శ్రీరామ కుమార్

భారతదేశంలో వందలాది సంవత్సరాలుగా అనేక మంది ఆచరిస్తున్న యోగాను అంతర్జాతీయ దినోత్సవంగా జూన్ 21 వ తేదీన ఆచరించటం ప్రారంభించినప్పటి నుంచి, సామాన్యులు మొదలు, దేశాధినేతల వరకు ఆరోజున ఉత్సాహంగా కొన్ని యోగాసనాలు వేస్తున్నారు. అసలు యోగా అంటే ఏమిటో వివరించే ప్రయత్నం ఇది. మనిషి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక కోణాలన్నింటిని సంయోగపరిచి, స్థిరమైన, సంతృప్తికరమైన, ఆరోగ్యవంతమైన జీవితాన్ని సాధించడానికి దోహదపడేది యోగ. అంతేకాదు ఈశ్వరునిలో ఐక్యమయ్యేందుకు ఓ సాధనం యోగ కూడా.

తొలుత రుగ్వేదంలో, అనంతరం అనేక ఉపనిషత్తుల్లోనూ యోగ ప్రస్తావన జరిగింది. కొన్ని పురాణాల్లో యోగ విద్యను తొలుత పరమేశ్వరుడు పార్వతికి వివరించి, అనంతరం ఋషులకు బోధించారని తెలుపుతున్నాయి. "పతంజలి మహర్షి" శ్రీ కృష్ణుని కాలంలో జీవించిన తపస్వి. తన సాహిత్యం ద్వారా యోగ సూత్రాలను మన తరాలకు అందించిన మహానుభావుడు. మనస్సు, సృహ, చైతన్యం తదితర విషయాలను ఆయన కూలంకషంగా వివరించారు.

పతంజలి మహర్షి యోగ సూత్రాలు 196. వీటిలో అష్టాంగ యోగం ఎంతో ప్రాముఖ్యంలోకి వచ్చింది. అవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి స్థితి. సప్తమహర్షుల్లో ఒకరైన అగస్త్య మహర్షి దేశమంతా పర్యటించి “యోగిక జీవన విధానాన్ని” రూపొందించారు. పలువురు మహర్షులు నాటి కాలంలో అష్టాంగ యోగంలో చెప్పినవి ఆచరిస్తూ, అనేకమందికి భోదిస్తూ, ఎంతోమందిని “యోగాభ్యాసపరులుగా”తీర్చి దిద్దారు.

అష్టాంగ యోగమే కాకుండా బంధాలు, ముద్రలు, షట్ కర్మలు, యుక్త ఆహార, యుక్త కర్మ, మంత్ర జపం మొదలైనవి ఉన్నాయి. యమ అంటే చేయకూడనివి, నియమ అంటే పాటించాల్సినవి. ఆసనాలు శరీరానికి పటుత్వాన్ని, బుద్ధికి స్థిరత్వాన్ని ఇస్తాయి. ప్రాణాయామం అంటే శ్వాసపైన ధ్యాస. పూరక, కుంభక, రేచకాలను చేయడం వల్ల సాధకునిలో ఏకాగ్రత పెరగటమే కాకుండా బుద్ధిని నియంత్రిస్తుంది. ఇక ప్రత్యాహారం అంటే మన మానసిక చేతనను ఇంద్రియాల నుంచి వేరు చేయడం – ధారణ అంటే ఏకాగ్రత చిత్తం. తర్వాత ధ్యానం, వీటి అన్నింటిని అనుసంధానం చేయడం వల్ల వచ్చేది సమాధి స్థితి. షట్ కర్మలు చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మాలిన్యాలను తొలగించవచ్చునని చెబుతారు.

బంధాలు, ముద్రలు ప్రాణాయామానికి సంబంధించినవి. వీటిని సరిగ్గా ఆచరిస్తే సాధకుని అత్యున్నత స్థాయికి తీసుకువెళతాయి. చాలా మందికి యోగా అంటే యోగాసనాలు అని మాత్రమే తెలుసు. యోగ సూత్రాలు అనే గ్రంథంలో మూడు సూత్రాలు మాత్రమే హఠ – అసనాలు గురించి వివరించాయి. హఠయోగం అంటే మన శరీరాన్ని అత్యున్నత శక్తి కేంద్రంగా మార్చే ప్రాథమిక దశ. శరీరం, శ్వాస, బుద్ధి, ఆపైన మనలోని అంతర్గత శక్తిని స్వయంగా సాధించడమే యోగ. గురు శిష్య పరంపరలో వివిధ యోగా సిద్ధాంతాలు, అభ్యాసాలు వాడుకలోకి వచ్చాయి. జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మ యోగం, భక్తి యోగం, ధ్యానయోగం, పతంజలి యోగం, కుండలనీ యోగం, హఠయోగం, మంత్రయోగం, బౌద్ధ యోగం, జైనయోగం – వీటన్నింటి లక్ష్యం ఒక్కటే. యోగా ద్వారా అత్యున్నత స్థితిని పొందడం.

ఆచార్య త్రయంగా ఖ్యాతి గాంచిన శ్రీ ఆదిశంకర, భగవద్రామానుజ, శ్రీ మధ్వాచార్యులు తమ, తమ బోధనల ద్వారా యోగశాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు. సూరదాసు, తులసీదాసు, పురందరదాసు, మీరాబాయి తదితరులు భక్తియోగానికి మార్గదర్శకులైతే; మత్యేంద్రనాథుడు, గోరఖ్ నాధుడు, గౌరంగనాధుడు, స్వాత్మారామ సూరి, శ్రీనివాస భట్టు తదితరులు హఠయోగ పద్ధతులకు ప్రాచుర్యం కల్పించారు. శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ రమణ మహర్షి, శ్రీ పరమహంస యోగానంద, స్వామి వివేకానంద మొదలైనవారు రాజయోగ మార్గాన్ని వృద్ధి చేశారు. ప్రత్యేకించి 1700-1900 సంవత్సరాల మధ్యకాలంలో వేదాంత, భక్తి, హఠయోగాలు బాగా వర్ధిల్లాయి.

ప్రస్తుత కాలంలో యోగ సాధన వల్ల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పొందవచ్చనే విషయం అందరికీ తెలిసి చాలామంది ఆచరిస్తున్నారు. అభ్యసిస్తున్నారు. మన దేశానికి చెందిన ఎందరో గురువుల కృషి కారణంగా, యోగ సాధన ప్రపంచమంతా వ్యాపించింది. స్వామిశిలానంద, టి.కృష్ణమాచార్యస్వామి, కువలయానంద, శ్రీయోగేంద్ర, స్వామి రామా, అరవింద మహర్షి, స్వామి సత్యానంద సరస్వతి, ఆచార్య రజనేష్, మహర్షి మహేష్ యోగి, పట్టాభి జోయిస్ తదితరులు ఎందరో ఉన్నారు. బి.కె.ఎస్ అయ్యంగార్ గా ప్రసిద్ధిగాంచిన బెల్లురు కృష్ణమాచార్ సుందర్ రాజ అయ్యంగార్, “అయ్యంగార్ యోగ” అనే యోగ శైలిని ప్రారంభించారు. ప్రపంచంలోని యోగా గురువుల్లో ఒకరిగా కీర్తిగాంచిన టి.కృష్ణామాచార్య శిష్యులు. బి.కె.ఎస్.అయ్యంగార్ పాశ్చాత్య దేశాల్లో విస్తృతంగా యోగా గురించి ప్రచారం నిర్వహించి, వేలాది మందికి శిక్షణ ఇచ్చారు.

అదే మాదిరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని కానుమూలు గ్రామంలో అద్దంకి శ్రీరంగాచార్యులు ఏడు దశాబ్దాల కిందట నయా గురుకుల్ అనే యోగా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి, వేలాది మందికి శిక్షణ ఇవ్వడమే కాకుండా, 1944లో 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఉయ్యూరులో నిర్వహించిన మిలటరీ శిబిరంలో సైనికులకు యోగాసనాలను నేర్పడం మరీ విశేషం. ఇలా ఎంతో ఘన చరిత్ర కలిగిన మన యోగా ఈరోజున అంతర్జాతీయంగా యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం మనకు గర్వకారణం.


(వ్యాసరచయిత విశ్రాంత వార్తా ప్రతినిధి, ఆకాశవాణి కేంద్రం–హైదరాబాద్)

Read More
Next Story