ఇపుడు అందరి చూపు షర్మిల వైపే
x
YS Sharmila vows to revive Congress in Andhra Pradesh

ఇపుడు అందరి చూపు షర్మిల వైపే

కాంగ్రెస్ వాళ్లు ఆమె వైపే చూస్తున్నారు. వైసిపిలోని అసమ్మతి వాదులు ఆమె వైపే చూస్తున్నారు. ఈమె తెచ్చే మార్పేంటని టిడిపి, జనసేనలు ఆమె వైపు చూస్తున్నాయి...


- కె.శరచ్చంద్ర జ్యోతిశ్రీ

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహనరెడ్డికి ఆంధ్రప్రదేశ్ లో అధికార పగ్గాలు చేతికి అందటంలో తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల సహకారం అమూల్యం. ఓదార్పు యాత్రలో, ఎన్నికల ప్రచార క్షేత్రంలో జగన్ కు తల్లీ, చెల్లీ కుడి ఎడమలుగా నిలిచారనేది ఎవరూ తోసెయ్యలేని వాస్తవం. షర్మిల రాజకీయ జీవిత ప్రారంభ ఘట్టాలూ అవే.

జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాకా విజయమ్మ పార్టీ గౌరవ అధ్యక్షులుగా కొంతకాలం కొనసాగారు. కానీ షర్మిల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భాగస్వామి కాలేకపోయారు. అందుకు విశ్లేషకులు చెపుతున్న ప్రధాన కారణం పార్టీలో మరొక పవర్ సెంటర్ ఉండరాదనేది. కారణాలు ఏవైనా షర్మిల ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వేదిక నుండి నిష్క్రమించారు.

ఇక తానేమిటో తన సత్తా ఏపాటిదో నిరూపించుకోవాలి అనుకున్నారు షర్మిల. అందుకు తెలంగాణాను తమ నూతన రాజకీయ కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు. తాను తెలంగాణ వారి ఇంటి కోడల్నని తెలంగాణ అభివృద్ధికి కృషిచేయడం, రాజన్నరాజ్యం తీసుకు వచ్చేందుకు పాటుపడటం తన బాధ్యత అన్నారు. అంతవరకూ రాజీలేని పోరాటం చేస్తానన్నారు. కూతురుకి అండగా ఉండాలని విజయమ్మ నిర్ణయించుకున్నారు. ఆంధ్రలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్ష పదవినుంచి వైదొలిగారు. ప్రజా సమస్యలు, బి ఆర్ ఎస్ (టి ఆర్ ఎస్) ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, కెసిఆర్ కుటుంబ పాలనను ఎండగడుతూ తెలంగాణా లో షర్మిల పాదయాత్ర చేశారు. ఒంటరి పోరాటం చేశారు. ఇంత చేసినా ఆమెకూ ఆమె పార్టీకీ తగిన స్థాయిలో ప్రజల ఆదరణ దక్కలేదు. ఆ వాస్తవాన్ని అర్థం చేసుకున్న షర్మిల రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఏ ఒక్క స్థానం నుండీ పోటీచేయలేదు. ఎన్నికలబరి నుండి పూర్తిగా తప్పుకొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణం తమపార్టీ ఎన్నికలబరినుండి పూర్తిగా నిష్క్రమించి ఆ పార్టీకి సహకరంచడమే, అన్నారు షర్మిల. ఆ విజయం తమ పార్టీ త్యాగం ఫలం అన్నారు. కాంగ్రెస్‌ పార్ట్రీలో వై ఎస్ ఆర్ తెలంగాణా పార్టీని విలీనం చేశామన్నారు.

వైఎస్ కు నిజమైన వారసురాలిగా ప్రమోషన్

కాంగ్రెస్ పార్టీలో షర్మిల బాధ్యతలు ప్రాధాన్యతలు ఏమిటి అనే విషయమై రాజకీయ వర్గాల్లో అనేకానేక ఊహాగానాలు సాగుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో పలు కథనాలు వ్యాప్తిలో ఉన్నాయి. అయితే ఆమెకు ఫలానా బాధ్యతలు ప్రాధాన్యలు ఇవ్వనున్నట్టు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇంతవరకూ ఏలాంటి ప్రకటనా చేయలేదు. ఏ బాధ్యతలను అప్పగించినా శక్తివంచన లేకుండా పనిచేస్తానని షర్మిల అంటున్నారు.

అయితే షర్మిలకు తెలంగాణాలో పార్టీ బాధ్యతలు అప్పగించే ప్రతిపాదనకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సుముఖంగా లేదని ఒక అభిప్రాయం. అందుకు అనుగుణంగా కేంద్ర నాయకత్వం కూడా ఆమెకు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతల్ని అప్పజెప్పవచ్చని కూడా విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు వై.ఎస్. రాజశేఖరరెడ్డి అసలైన రాజకీయ వారసురాలిగా షర్మిలను ఫోకస్ చేయాలనేది కాంగ్రెస్ వ్యూహంగా వారు భావిస్తున్నారు. వై ఎస్ రాజశేఖరరెడ్డి కొడుకుగా అతని వారసుడినని కాంగ్రెస్ పార్టీపై జగన్ కొట్టిన దెబ్బకు ఇది ప్రతి వ్యూహం కావచ్చు. అందుకు షర్మిల అంగీకరించటంలేదని కొందరంటుంటే అదేంలేదని మరికొందరంటున్నారు.

షర్మిల ఆంధ్రా రాజకీయాల్లోకి తిరిగి ప్రవేశిస్తే...

ఆ పరిణామాలు వాటి ఫలితాలు ఎలావుంటాయి అనేదే రాజకీయ పక్షాల అసలైన ఆసక్తి.

నిజానికి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే తెలుగుదేశం - వై ఎస్ అర్ కాంగ్రెస్ పార్టీల మధ్య స్పష్టమైన రాజకీయ విభజన జరిగిపోయింది. రాష్ట్రంలో ఉన్న ఇతర రాజకీయ పార్టీలు వీరిద్దరిలో ఎవరి పక్షం వహిస్తారు అనేది వారికి సంబంధించిన విషయం. జనసేన తెలుగు దేశంతోనే తన ప్రయాణం అని ప్రకటించింది. జనసేనతో జత కట్టేందుకు తెలుగుదేశం అంగీకరించింది. బి.జె.పి ముసుగు ఇంకా తొలగలేదు. తెలుగు దేశం పార్టీ, (మేం ఒంటరి వారమే అని ఎంత చెప్పినా)వై ఎస్ ఆర్ సి పి రెండు పార్టీలూ బిజెపితో పరోక్ష పొత్తులోనే ఉన్నాయి. ఆంధ్రలో కొద్ది మంది లీడర్లు తప్ప ఓటర్లు లేని బిజెపి తో పరోక్ష పొత్తును ఎందుకు కోరుకుంటున్నరు అంటే, ఎవరి అవసరాలు వారివి. బిజెపితో పొత్తు లేకుంటే టిడిపి తో కలిసి ఎన్నికల బరిలోకొస్తామని కమ్యూనిస్టులు అంటున్నా టిడిపి నాయకత్వం పెదవి విప్పడం లేదు.

కాంగ్రెస్ దీనావస్థ

ఇక కాంగ్రెస్ పార్టీ కి ఆంధ్ర రాష్ట్రంలో ఒక స్థాయి కలిగిన నాయకులూ కార్యకర్తలూ ఓటర్లూ పెద్దగా లేరు. రాష్ట్ర విభజనలో కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానాలు అందుకు ఒక కారణం. కాంగ్రెస్ పార్టీలోని బడా నాయకులను, సాంప్రదాయక ఓటర్లను జగన్మోహన్ రెడ్డి అప్పుడే తనవైపు తిప్పుకొన్నారు. ఇది మరో కారణం. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదీ బిజెపిదీ ఒకటే పరిస్థితి. ఆ పార్టీలకు చెప్పుకోతగ్గ పెద్ద నాయకులూ లేరు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలూ లేరు. ఇక ఓటర్లు ఎందరుంటారు? తమ అస్తిత్వాన్ని నిలుపుకొనేందుకు పదేళ్ళుగా ఆ పార్టీలు చేస్తున్న ఏ ప్రయత్నాలూ ఫలించడంలేదు.

అన్ని పార్టీల అసమ్మతి వాదులంతా ఆమె వైపే చూస్తున్నారు

ఇప్పుడు షర్మిల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో తిరిగి పట్టు సాధించేందుకు కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం భావిస్తోదని మీడియా వర్గాల కథనాలు. స్థానిక అంశాల కారణంగా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తి ఉన్న నాయకులు, కార్యకర్తలు, రానున్న ఎన్నికల్లో తిరిగిపోటీ చేసేందుకు ఆ పార్టీ టికెట్టు పొందలేకపోయిన ప్రస్తుత శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు అసమ్మతి వాదులూ తిరిగి తమ పార్టీ వైపు వస్తారని, అందుకు షర్మిల నాయకత్వం కూడా దోహద పడగలదని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. అలాంటి హడావుడి కొంత మీడియా ద్వారా బయటకొచ్చింది. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ లో ఉన్న కొందరు నాయకులు, కర్యకర్తలపై ఆమె ప్రభావం తప్పక ఉంటుందని ఒక అంచన. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర విభజ కాలంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి తాము కట్టుబడివున్నామని కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం చెప్పనుంది. ఏదేమైనా ఇప్పటికిప్పుడు (రానున్న ఎన్నికల్లో) ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని ఒక కీలక శక్తిగా షర్మిల నిలబెట్టగలరా!? అనేది వెయ్యి డాలర్ల ప్రశ్నగా నిలుస్తోంది.


(ఇందులో వ్యక్తీకరించిన అభిప్రాయాలన్నీ రచయిత వ్యక్తిగతం. వాటిని ఫెడరల్ తెలంగాణ ఏకీభవించాల్సిన అవసరం లేదు)


Read More
Next Story