
రేవంత్ ను దీవించిన నల్లపోచమ్మ, కాంగ్రెస్ ఖాతాలో 91 మున్సిపాలిటీలు
17 మున్సిపాలిటీలను మాత్రమే గెలుచుకున్న పార్టీ నేతలు 91 మున్సిపాలిటీలను గెలుచుకున్న పార్టీని ఎగతాళి చేయటం అంటే కేటీఆర్, హరీష్ కు మాత్రమే చెల్లింది
మూడురోజులు క్రితం అంటే 13వ తేదీన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు మాట్లాడుతు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని అపహాస్యం చేశారు. ఈ ఎన్నికల్లో 74 మున్సిపాలిటీలను గెలుచుకోవటం కూడా ఒక గెలుపేనా అని ఎగతాళిచేశారు. తమ హయాంలో 90శాతం మున్సిపాలిటీలను గెలుచుకున్నట్లు గుర్తుచేశారు.
90 శాతం తెచ్చుకోని గెలుపు ఒక గెలుపే కాదని బాగా ఎద్దేవా చేశారు. నిజానికి కేటీఆర్ మాట్లాడేటప్పటికి ఫైనల్ రిజల్ట్స్ రాలేదు. తుది ఫలితాలను చూస్తే 116 మున్సిపాలిటీల్లో 84 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలిచింది. కేటీఆర్, హరీష్ ఏమన్నారంటే తాము అధికారంలో ఉన్నపుడు 90శాతం మున్సిపాలిటీల్లో గెలిచాము కాబట్టి ఇపుడు కాంగ్రెస్ ది అసలు గెలుపే కాదన్నారు.
తుది ఫలితాల తర్వాత చూస్తే వాళ్ళ చెప్పినట్లు 90 మున్సిపాలిటీలకు కాంగ్రెస్ 6 మున్సిపాలిటీల దూరంలో ఉండిపోయింది. సరే 16వ తేదీన ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, మేయర్లు, డిప్యుటీ మేయర్ల ఎన్నిక జరిగింది. 116 మున్సిపాలిటీల్లో 105 చోట్ల ఎన్నికలు సాఫీగా జరిగిపోయి 11 చోట్ల 17వ తేదీకి వాయిదాపడింది. ఈరోజు జరిగిన ఎన్నికలో మళ్ళీ రెండుచోట్ల వాయిదాపడి 9 చోట్ల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరిగిపోయింది. 9 మున్సిపాలిటీల్లో ఏడు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. దాంతో కేటీఆర్, హరీష్ రావు కోరికను రేవంత్ రూపంలో పోచమ్మ తీర్చేసినట్లయ్యింది. ఎలాగంటే 114 మున్సిపాలిటీల్లో 91 మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి.
మొదటినుండి రేవంత్ కు పోచమ్మ తల్లి అంటే అపారమైన భక్తి. చాలా బహిరంగసభల్లో పోచమ్మ ప్రస్తావనను రేవంత్ తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. రేవంత్ లెక్కప్రకారం ఈ మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ 91 చోట్ల గెలవటం కూడా పోచమ్మ తల్లి ఆశీర్వాద బలమే. రేవంతేమో అంతా పోచమ్మ తల్లి ఆశీర్వాదం అంటే కేటీఆర్, హరీష్ మాత్రం పదేపదే ఎగతాళిగా మాట్లాడారు.
ఇపుడేమైంది, చూస్తుండగానే కాంగ్రెస్ 91 మున్సిపాలిటీలను గెలుచుకున్నది. శాతంలో 90శాతం రానప్పటికీ లెక్క ప్రకారం చూసినా కాంగ్రెస్ 91 మున్సిపాలిటీలను గెలుచుకోవటం చిన్న విషయంకాదు. కాంగ్రెస్ గెలుచుకున్న 91 మున్సిపాలిటీలను అపహాస్యం చేస్తున్న కేటీఆర్, హరీష్ తమ పార్టీ గెలుచుకున్నది 17 మున్సిపాలిటీలను మాత్రమే అన్న విషయాన్ని కన్వీనియంట్ గా మరచిపోతున్నారు. 17 మున్సిపాలిటీలను మాత్రమే గెలుచుకున్న పార్టీ నేతలు 91 మున్సిపాలిటీలను గెలుచుకున్న పార్టీని ఎగతాళి చేయటం అంటే కేటీఆర్, హరీష్ కు మాత్రమే చెల్లింది.
వీళ్ళ మాటల్లో ఏమి అర్ధమవుతున్నది అంటే ప్రత్యర్ధి గెలుపును తక్కువగా చూడటమే కాదు ఓటర్ల తీర్పును కూడా అంగీకరించలేకపోతున్నారు. మొత్తానికి తాను నమ్ముక్కున్న పోచమ్మ తల్లి రేవంత్ ను దీవించటంతో కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్ష విజయం అందినట్లే అర్ధమవుతోంది.

