గ్రేటర్‌లో 70 సీట్లపై గురి! ఇదేనా MIM టార్గెట్‌?
x

గ్రేటర్‌లో 70 సీట్లపై గురి! ఇదేనా MIM టార్గెట్‌?

ఎంఐఎం ఇంత బలంగా ఉండటానికి కారణం ఏమిటి?


హైదరాబాద్‌ పాతబస్తీ రాజకీయాల్లో దశాబ్దాలుగా తిరుగులేని ప్రాబల్యం.. జాతీయ రాజకీయాల్లోనూ ప్రత్యేక గుర్తింపు.. అధికారంలోకి వచ్చే పార్టీలతో అవసరాన్ని బట్టి రాజకీయ సంబంధాలు! ఇదీ ఆల్‌ ఇండియా మజ్లిస్‌-ఎ-ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (ఎంఐఎం) ప్రస్థానం. ఇప్పుడు రాబోయే మున్సిపల్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి అజెండాతో కొత్త వ్యూహాన్ని తెరపైకి తీసుకొస్తోంది. ఈసారి కేవలం రాజకీయ ప్రసంగాలకే పరిమితం కాకుండా.. అభివృద్ధి, మౌలిక సదుపాయాలను ప్రధాన అజెండాగా ప్రజల్లోకి వెళ్తోంది. ట్రాఫిక్‌ సమస్యలు, రోడ్ల నాణ్యత, పెండింగ్‌ పనులపై పాదయాత్రలు చేస్తూ ప్రజల సమస్యలను ప్రస్తావిస్తోంది. అక్బరుద్దీన్‌ ఓవైసీ స్వయంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేపడుతున్నారు.

చార్మినార్‌ పాదచారుల ప్రాజెక్ట్‌, నైట్‌ బజార్‌, నాంపల్లి–మెహిదీపట్నం ఎలివేటెడ్‌ కారిడార్‌, మెహిదీపట్నం–టప్పాచబుత్రా అండర్‌పాస్‌ వంటి ప్రాజెక్టులను తెరపైకి తీసుకొస్తోంది. అలాగే గోల్కొండ–కుతుబ్‌ షాహీ సమాధుల మధ్య స్కై కేబుల్‌ నిర్మాణం, జల్‌పల్లి మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాల కల్పనను కూడా డిమాండ్‌ చేస్తోంది.

ఈ వ్యూహం వెనుక మూడు ప్రధాన లక్ష్యాలున్నాయి.

1. జీహెచ్‌ఎంసీలో కొత్తగా కలిసిన దక్షిణ శివారు ప్రాంతాల్లో పార్టీ ప్రభావాన్ని విస్తరించడం.

2. పాతబస్తీలో ఉన్న రాజకీయ పట్టును మరింత బలోపేతం చేసుకోవడం.

3. కొత్తగా ఏర్పడిన సైబరాబాద్‌, మల్కాజిగిరి కార్పొరేషన్లలోనూ నిర్ణయాత్మక రాజకీయ శక్తిగా ఎదగడంపై ఎంఐఎం దృష్టి పెట్టింది.

గత రెండు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 150 వార్డులకు గాను 44 స్థానాలు గెలుచుకున్న ఎంఐఎం.. ఇప్పుడు మారిన భౌగోళిక పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తోంది. 65 నుంచి 70 స్థానాలు త‌మ ఖాతాలో వేసుకుంటామ‌ని మ‌జ్లిస్ ధీమాగా చెబుతోంది.

"కొద్ది మంది కార్పొరేటర్లతో మొదలైన ప్రస్థానం క్రమంగా అసెంబ్లీలో ఏడు స్థానాలకు చేరింది. ముస్లిం ప్రజల్లో అసదుద్దీన్‌ ఓవైసీ విశేష ఆదరణ పొందిన నాయకుడిగా ఎదిగారు. ప్రజల మధ్య నిరంతరం ఉండటం, బలమైన పార్టీ క్యాడర్ ఎం.ఐ.ఎం.కు ఉన్నాయని" మాజీ ఎమ్మెల్సీ సయ్యద్ అమీన్ ఉల్ హసన్ జాఫ్రీ చెప్పారు.

1927లో హైదరాబాద్‌లో మజ్లిస్‌ సంస్థగా ప్రారంభమైన ఎంఐఎం.. 1958లో అబ్దుల్‌ వహీద్‌ ఓవైసీ ద్వారా పునరుద్ధరించబడింది. ఆ తర్వాత సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఓవైసీ నాయకత్వంలో హైదరాబాద్‌ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదిగింది.

1984లో సలావుద్దీన్‌ ఓవైసీ తొలిసారి హైదరాబాద్‌ ఎంపీగా గెలిచారు. అప్పటి నుంచి ఈ లోక్‌సభ స్థానంపై పార్టీ తన పట్టును కొనసాగిస్తోంది.

2004లో అసదుద్దీన్‌ ఓవైసీ హైదరాబాద్‌ ఎంపీగా బాధ్యతలు చేపట్టారు. 2008లో పార్టీ అధ్యక్షుడయ్యారు. అప్పటి నుంచి ముస్లింల రాజకీయ ప్రాతినిధ్యం, మైనారిటీల హక్కులు, సామాజిక న్యాయం ప్రధాన అజెండాగా పార్టీ రాజకీయాలు కొనసాగుతున్నాయి.

'ప్రజలకు అందుబాటులో ఉండటం, పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ప్రజలను కలవడం తమ రాజకీయ బలానికి కారణమని" అసదుద్దీన్‌ ఓవైసీ చెప్పారు.

“మేం రాజులం కాకపోవచ్చు.. కానీ రాజులను నిర్ణయించే శక్తిగా ఉంటాం.” అక్బరుద్దీన్ చెప్పారు.

ఎంఐఎం ఇంత బలంగా ఉండటానికి కారణం ఏమిటి?

"పాతబస్తీలో ఎంఐఎంకు దశాబ్దాలుగా బలమైన సామాజిక, రాజకీయ పునాది ఉంది. ముస్లింల రాజకీయ ప్రాతినిధ్యానికి ఒక వేదికగా పార్టీ గుర్తింపు పొందింది. స్థానిక సమస్యలపై స్పందించే నాయకత్వం, ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, బలమైన కార్యకర్తల వ్యవస్థ పార్టీకి కలిసొస్తున్నాయని" సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప్ర‌భాక‌ర్‌రావు చెప్పారు.

“పాఠశాలల నుంచి మెడికల్‌, ఇంజినీరింగ్‌, ఫార్మసీ, మేనేజ్‌మెంట్‌ కాలేజీల వరకు ఓవైసీ కుటుంబానికి అనుబంధంగా ఉన్న ట్రస్టులు విద్యాసంస్థల నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ సంస్థల ద్వారా ఏటా వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. విద్య, వైద్యం వంటి రంగాల్లో ఓవైసీ కుటుంబానికి అనుబంధంగా ఉన్న సంస్థలు కూడా స్థానికంగా సామాజిక సంబంధాలను బలోపేతం చేశాయని” ప్ర‌ముఖ విద్యా వేత్త డాక్ట‌ర్ టి.వి.రావు చెప్పారు.

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం ఏడింటిని గెలుచుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ హైదరాబాద్‌ స్థానాన్ని నిలబెట్టుకుంది. అయితే "ఎంఐఎం గెలుపునకు ముస్లిం ఓటర్ల మద్దతుతో పాటు, ప్రత్యర్థి పార్టీల మధ్య ఓట్ల చీలిక వంటి అంశాలు కూడా పనిచేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంబీటీ వంటి పార్టీలు పాతబస్తీలో తమ పట్టును పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ ఎంఐఎంకు ఉన్న స్థిరమైన క్యాడర్‌, స్థానిక రాజకీయ సంబంధాలు వాటికి సవాలుగా మారుతున్నాయని" ప్రముఖ న్యాయవాది, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ ప్రధాన కార్యదర్శి జయ వింధ్యాల చెప్పారు.

ఇక ఎంఐఎం రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన అంశం, అధికార పార్టీలతో సంబంధాలు. "ఎన్నికలకు ముందు సొంత గుర్తింపుతో పోటీ చేయడం.. ఫలితాల తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీతో అవసరాన్ని బట్టి సహకరించడం ఎంఐఎం రాజకీయ వ్యూహంలో కనిపించే అంశం. గతంలో బీఆర్‌ఎస్‌తో రాజకీయ అవగాహన కొనసాగించిన ఎంఐఎం, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంతో సంబంధాలు కొనసాగిస్తోంది. దీని ద్వారా సొంత రాజకీయ గుర్తింపును కాపాడుకుంటూనే ప్రభుత్వంతో చర్చించే అవకాశాన్ని నిలబెట్టుకుంటోంది. అయితే ఈ మద్దతు వెనుక లక్ష్యం ఏమిటంటే తమ నియోజకవర్గాల అభివృద్ధి, రాజకీయ ప్రాధాన్యతను కాపాడుకోవడమే" అని పొలిటిక‌ల్ యాక్టివిస్ట్ డాక్ట‌ర్ ఎ.ఎస్‌.రావు చెప్పారు.

ఇప్పుడు రాబోయే మున్సిపల్‌ ఎన్నికలే ఎంఐఎం తదుపరి లక్ష్యంగా కనిపిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడిన మల్కాజిగిరి, సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికల కోసం పార్టీ ఇప్పటి నుంచే గ్రౌండ్‌ వర్క్‌ మొదలుపెట్టింది. మైనారిటీ ప్రాతినిధ్యం నుంచి అభివృద్ధి అజెండా వరకు, పాతబస్తీ నుంచి కొత్త కార్పొరేషన్ల వరకు తన రాజకీయ పరిధిని విస్తరించుకోవాలని చూస్తోంది. అభివృద్ధి అజెండా ఎంఐఎంకు కొత్త రాజకీయ బలాన్ని ఇస్తుందా? రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో ఆ పార్టీ వ్యూహం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.

Read More
Next Story