కాంగ్రెస్, బీఆర్ఎస్ జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నాయా ?
x
BRS MLAs as Congress coordinators for municipal elections in Telangana

కాంగ్రెస్, బీఆర్ఎస్ జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నాయా ?

పార్టీల పరంగా జరుగుతున్న విచిత్రాలు చూస్తే ఓట్లేసి గెలిపించిన జనాలను పార్టీలు పిచ్చోళ్ళను చేస్తున్నాయి అన్న విషయం స్పష్టమవుతుంది


రాజకీయ పార్టీలు ఓట్లేసిన జనాలను పిచ్చోళ్ళు అనుకుంటున్నట్లున్నాయి. అందుకనే ఓట్లేసిన జనాల తీర్పుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటాయి. ఈ విషయం గతంలో చాలాసార్లు నిరూపణైంది. తాజా జరిగిన మరో డెవలప్మెంటే దీనికి సరికొత్త ఉదాహరణ. (BRS)బీఆర్ఎస్ నుండి పదిమంది ఎంఎల్ఏలు కాంగ్రెస్ లోకి ఫిరాయించారని, వారిపైన అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నాయకత్వంలో కొందరు కారుపార్టీ ఎంఎల్ఏలు సుప్రింకోర్టులో కేసులు దాఖలుచేశారు. వీరిపైన అనర్హత వేటుపడుతుందా లేదా అన్నది కాలమే సమాధానం చెప్పాలి. అయితే పార్టీల పరంగా జరుగుతున్న విచిత్రాలు చూస్తే ఓట్లేసి గెలిపించిన జనాలను పార్టీలు పిచ్చోళ్ళను చేస్తున్నది అన్న విషయం స్పష్టమవుతుంది.

ఇంతకీ విషయం ఏమిటంటే ఇపుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్లను నియమించింది. ఇంతవరకు ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన పనిలేదు. అయితే ఆ జాబితాలో ముగ్గురు బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏలు ఉండటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నిజామాబాద్ కార్పొరేషన్ కో ఆర్డినేటర్ గా శేరిలింగంపల్లి ఎంఎల్ఏ అరెకపూడి గాంధీని, షాద్ నగర్ మున్సిపాలిటీకి రాజేంద్రనగర్ ఎంఎల్ఏ ప్రకాష్ గౌడ్, భద్రాచలం మున్సిపాలిటీకి తెల్లం వెంకటరావును కోఆర్డినేటర్లుగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి ప్రకటించింది. పీసీసీ అధికారికంగా ప్రకటించిన జాబితాలోనే పై ముగ్గురు పేర్లుండటం గమనార్హం.

బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కాంగ్రెస్ కోఆర్డినేటర్లా ?


2023 అసెంబ్లీ ఎన్నికల్లో అరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి నుండి ఎంఎల్ఏగా గెలిచారు. అలాగే రాజేంద్రనగర్ నియోజకవర్గం నుండి ప్రకాష్ గౌడ్, భద్రాచలం నియోజకవర్గంలో తెల్లం వెంకటరావు బీఆర్ఎస్ ఎంఎల్ఏలుగా గెలిచారు. అనర్హత వేటు వేయించేందుకు బీఆర్ఎస్ పోరాటంచేస్తున్న పదిమంది ఎంఎల్ఏల్లో పై ముగ్గురు కూడా ఉన్నారు. వీళ్ళపై అనర్హత వేటు వేయించేందుకు బీఆర్ఎస్ సుప్రింకోర్టులో పోరాటం చేస్తున్న విషయం తెలిసీ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్లుగా పై ముగ్గురిని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఎలా నియమించారు అన్నదే అర్ధంకావటంలేదు.

బీఆర్ఎస్ ఎంఎల్ఏలను కాంగ్రెస్ కోఆర్డినేటర్లుగా చూపితే పార్టీ ఫిరాయించారు అనేందుకు ఈ జాబితాను డాక్యుమెంటరీ ఎవిడెన్సుగా బీఆర్ఎస్ రేపు విచారణ సందర్భంగా కోర్టులో చూపించుకుంటుందన్న ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీలో లేదా అనే అనుమానం వస్తోంది. ఎంఎల్ఏల విచారణ పూర్తిచేసిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన తీర్పులో ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కాంగ్రెస్ లోకి ఫిరాయించారు అనేందుకు కారుపార్టీ ఆధారాలను చూపలేదు అని తేల్చేశారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పదిమందిలో జగిత్యాల ఎంఎల్ఏ సంజయ్ కుమార్, పటాన్ చెరు ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎంఎల్ఏ తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని పదేపదే చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పుకుంటున్నా తిరుగుతున్నది మాత్రం కాంగ్రెస్ పార్టీతోనే.

బీఆర్ఎస్ ఎందుకు షోకాజ్ నోటీసులు ఇవ్వలేదు ?

ఇక బీఆర్ఎస్ కోణం చూస్తే ఈ పార్టీ నాయకత్వం మరీ విచిత్రంగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ పార్టీలోకి పదిమంది ఎంఎల్ఏలు ఫిరాయించారని కేటీఆర్ ప్రతిరోజు గోలగోల చేస్తున్నారు. అయితే పార్టీ ఫిరాయింపుల మీద ఈ పదిమందికి పార్టీ ఎందుకు షోకాజ్ నోటీసులు జారీచేయలేదో అర్ధంకావటంలేదు. పార్టీ ఫిరాయింపుల పైన పదిమంది ఎంఎల్ఏలకు షోకాజ్ నోటీసులు జారీచేసి ఇప్పటివరకు సమాధానాలు కోరలేదు. ఇంతకన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎంఎల్ఏలుగా పదిమంది అసెంబ్లీ నుండి అందుకుంటున్న జీతాల్లో నుండి ప్రతినెలా రు. 5 వేల చొప్పున పార్టీ ఫండ్ కట్ చేస్తోంది. ఒకవైపు పార్టీ ఫండ్ వసూలుచేస్తు మరోవైపు ఈ పదిమంది ఎంఎల్ఏలు పార్టీ ఫిరాయించారని కేసీఆర్, కేటీఆర్ ఎలా చెబుతున్నారు ?

పదిమంది ఎంఎల్ఏల మీద నిజంగానే అనర్హత వేటు వేయించాలని బీఆర్ఎస్ నాయకత్వానికి ఉంటే వాళ్ళ జీతాల్లో నుండి ప్రతినెలా పార్టీ ఫండును కట్ చేయకూడదు. అలాగే పదిమందికి పార్టీ తరపున షోకాజ్ నోటీసులు జారీచేసి సమాధానాలను అడిగి ఉండాలి. ఈ రెండు పార్టీ చేయలేదు కాబట్టే టెక్నికల్ గా తాము బీఆర్ఎస్ ఎంఎల్ఏలమే అని పదిమంది చెప్పుకోవటానికి అవకాశం వచ్చింది. జరుగుతున్నది చూస్తుంటే బీఆర్ఎస్ కావాలనే ఎంఎల్ఏల జీతాల్లో నుండి పార్టీ ఫండ్ కట్ చేస్తున్నట్లు కనబడుతోంది. సో, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య జరుగుతున్నది చూస్తుంటే ఓట్లేసి గెలిపించిన జనాలను పిచ్చోళ్ళను చేస్తున్నాయి అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

Read More
Next Story