
సింగరేణి కాంట్రాక్టర్లు బీఆర్ఎస్ నేతల బంధువులేనా ? లిస్ట్ బయటపెట్టిన కాంగ్రెస్
ఆరోపణలకు మద్దతుగా కాంగ్రెస్ అధికారప్రతినిధి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ శుక్రవారం కొన్ని ఉదాహరణలను కూడా బయటపెట్టారు
సింగరేణి టెండర్ల విషయంలో సైట్ విజిట్ సర్టిఫికేట్ పెద్ద వివాదంగా మారింది. ఈ వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నేతలు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వాన్ని తప్పుపడుతుండగా, కాంగ్రెస్ అధికార ప్రతినిధులు బీఆర్ఎస్(BRS) నేతలపైన ఎదురుదాడులు చేస్తున్నారు. తన బావమరిదికి నైనీ కోల్ మైన్ తవ్వకాల కాంట్రాక్టు(Naine Coal Mine) ఇచ్చుకోవటానికే రేవంత్ సింగరేణి(Singareni)లో సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధన తెచ్చారని కేటీఆర్ అండ్ కో పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. ఇదేసమయంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధులు మాట్లాడుతు ఇప్పటివరకు ఈనిబంధన కింద కాంట్రాక్టులు పొందినవారంతా బీఆర్ఎస్ నేతలకు దగ్గర బంధులు లేదా పార్టీ నేతలే అని రివర్స్ ఆరోపణలు మొదలుపెట్టారు. తన ఆరోపణలకు మద్దతుగా కాంగ్రెస్ అధికారప్రతినిధి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ శుక్రవారం కొన్ని ఉదాహరణలను కూడా బయటపెట్టారు.
ఆ ఉదాహరణల ప్రకారం ఇప్పటివరకు ఈ నిబంధన కింద వివిధ గనుల తవ్వకాలకు సింగరేణి సంస్ధ నాలుగు సార్లు టెండర్లు పిలిచింది. ఆ నాలుగు టెండర్లను దక్కించుకున్నది బీఆర్ఎస్ సంబంధిత కాంట్రాక్ట్ సంస్ధలే అని చరణ్ తెలిపారు.
1. వీకేఓసీ-1, కొత్తగూడెం కాంట్రాక్టును సోధా కన్సస్ట్రక్షన్ ప్రైవేటు లిమిటెడ్ దక్కించుకున్నది. దీనికి ఎండీ దీప్తిరెడ్డి అని చెప్పారు. దీప్తిరెడ్డి ఎవరంటే బీఆర్ఎస్ మాజీ ఎంఎల్ఏ కందాళం ఉపేందర్ రెడ్డి కూతురు. ఇదే కంపెనీకి ఈ గని పక్కనే ఉన్న వీకేఓసీ-2 ప్రాజెక్టును 2023, నవంబర్ లో 10 శాతం అధిక రేటుతో కేటాయించినట్లు తెలిపారు.
2. మందమర్రిలోని కల్యాణ ఖని ఓపెన్ క్యాస్ట్ ప్రాజెక్టు కోసం 12 సంస్ధలు పాల్గొన్నాయి. అందరికీ సంస్ధ సైట్ విజిట్ సర్టిఫికేట్ జారీచేసింది. కాంట్రాక్ట్ పొందిన సంస్ధ ఎక్స్ ప్రెస్ వే ఆర్వీఎస్ఆర్ జేవీ సంస్ధ. దీనికి ఎండీలు దిక్షిత్ రావు, ప్రతిమా శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ రావు మేనల్లుడు.
3. ఆర్జీఓసీ-11 టెండర్ల కోసం 6 సంస్ధలు పాల్గొన్నాయి. సైట్ విజిట్ సర్టిఫికేట్ అందిన తర్వాత కాంట్రాక్ట్ పొందిన సంస్ధ సీ5 ఇంటజనీరింగ్ ప్రైవేటు లిమిటెడ్. దీనిలో నిశాంత్ రావు, మదన్ రావు డైరెక్టర్లు. నిశాంతరావు బీఆర్ఎస్ మాజీ ఎంఎల్సీ సుధాకర్ రావు కొడుకు. సుధాకర్ రావుకు కేసీఆర్, హరీష్ ఇద్దరితోను దగ్గరి బంధుత్వముంది.
4. ఎస్ఆర్పీ-ఓసీ 11 ప్రాజెక్టు. దీని కాంట్రాక్ట్ కోసం 12 మంది టెండర్లు దాఖలు చేస్తే హర్షా కన్స్ స్ట్రక్షన్స్ ప్రైవేటు లిమిటెడ్ టెండర్లు దక్కించుకుంది. ఇదే సంస్ధ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక సాగునీటి ప్రాజెక్టులను చేసింది. ఈ కంపెనీకి బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ శాఖలో చక్రంతిప్పిన ఈఎన్సీ మురళీధర్ రావుతో దగ్గరి సంబంధాలున్నట్లు డాక్టర్ చరణ్ వివరించారు.
చరణ్ అందించిన వివరాల ప్రకారం చూస్తే పైన పేర్కొన్న సంస్ధలన్నీ బీఆర్ఎస్ కు బాగా దగ్గర అలాగే కారుపార్టీ కీలకనేతలతో దగ్గరి బంధుత్వాలున్నట్లు అర్ధమవుతోంది. కాంట్రాక్టు పొందేముందు ఏ సంస్ధ కూడా తమకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వలేదని సింగరేణి యాజమాన్యంపై ఆరోపణలు చేయలేదన్నారు. 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి టెండర్లను ప్రభావితం చేయాలని భావిస్తే బీఆర్ఎస్ తో దగ్గరి సంబంధాలున్న సంస్ధలను ఏదో రకంగా ప్రభావితం చేసేందుకు ప్రయత్నంచేసేవే కదా అని చరణ్ బీఆర్ఎస్ నేతలను సూటిగా ప్రశ్నించారు. చరణ్ అడిగిన ప్రశ్నలో లాజిక్ ఉందనే అనిపిస్తోంది.
చరణ్ చెప్పిన వివరాలతో బీజేపీ నేతలు విభేదిస్తున్నారు. ఎలాగంటే సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధన కేంద్రప్రభుత్వంలో ఎప్పటినుండో ఉన్నదే అని అంగీకరించిన కమలదళం నేతలు మరో ప్రశ్న వేస్తున్నారు. అదేమిటంటే కేంద్ర ప్రభుత్వం ప్రకారం కోల్ ఇండియా లిమిటెడ్ టెండర్లలో పాల్గొనే సంస్ధలు మైన్స్ ను విజిట్ చేసినట్లు సెల్ప్ అటెస్టెడ్ సర్టిఫికేట్లు ఇస్తే సరిపోతుంది. టెండర్ దాఖలుతో పాటు తాము సైట్ ను విజిట్ చేశామనే అండర్ టేకింగ్ ఇచ్చుకంటే సరిపోతుంది. కాని ఇపుడు సింగరేణి సంస్ధ పెట్టిన నిబంధన ప్రకారం సంస్ధ మైన్స్ ను కంపెనీలు విజిట్ చేసినట్లు సెల్ప్ సర్టిఫికేషన్ ఇచ్చుకుంటే కుదరదు. పలానా కంపెనీ సైట్ ను విజిట్ చేసినట్లుగా సింగరేణి యాజమాన్యం సర్టిఫికేట్ జారీచేయాలి.
ఆ సర్టిఫికేట్ నిబంధనను సింగరేణి యాజమాన్యం కొత్తగా ఎందుకు పెట్టింది అని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనికి రేవంత్ ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిందే. అలాగే బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు కూడా తప్పే. తమకు కావాల్సిన సంస్ధకు కాంట్రాక్ట్ ఇచ్చుకునేందుకు మిగిలిన టెండర్లను సింగరేణి యాజమాన్యం రద్దుచేసిందన్న బీఆర్ఎస్ నేతల ఆరోపణలు తప్పని సింగరేణి ఉన్నతాధికారులు చెప్పారు. టెండర్లు వేయటానికి 22-29 మధ్య గడువు ప్రకటించినట్లు చెప్పారు. టెండర్ల దాఖలే 22వ తేదీ అంటే శుక్రవారం నుండి మొదలవుతుంటే అప్పుడే సంస్ధలు దాఖలు చేసిన టెండర్లను రద్దుచేసిందన్న ఆరోపణల్లో పసలేదని అధికారులు అంటున్నారు. మరి నైనీ కాంట్రాక్టు వివాదం ఎక్కడికి దారితీస్తుందో చూడాల్సిందే.

