వైసీపీ అధికారంలోకి రాగానే మొదట అరెస్టయ్యేది లోకేషే
x
Nara Lokesh

వైసీపీ అధికారంలోకి రాగానే మొదట అరెస్టయ్యేది లోకేషే

లోకేష్ రెడ్ బుక్ పాలన ఆయన మెడకే చుట్టుకుంటుందని చెప్పారు


ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే రెడ్ బుక్ ప్రకారమే పాలన జరుగుతుందని 2024 ఎన్నికలకు ముందు పాదయాత్రలో నారా లోకేష్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పిన లోకేష్ అధికారంలోకి రావటమే ఆలస్యం వెంటనే రెడ్ బుక్ పాలన మొదలుపెట్టినట్లే ఉన్నారు. అందుకనే ప్రతిపక్ష వైసీపీ నేతలు, కార్యకర్తలపై అనేక కేసులు పెడుతున్నారు పోలీసులు. ఇదే విషయమై ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆదివారం నివాళులు అర్పించిన లక్ష్మీపార్వతి మాట్లాడుతు లోకేష్ రెడ్ బుక్ పాలన ఆయన మెడకే చుట్టుకుంటుందని చెప్పారు. లోకేష్ రెడ్ బుక్ పాలనపై తాను ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాయబోతున్నట్లు చెప్పారు.

లోకేష్ లాంటివాళ్ళని ప్రోత్సహించవద్దని మోదీకి లేఖలో సూచన ఇవ్వబోతున్నట్లు తెలిపారు. హంతకులు, అవినీతిలో కూరుకుపోయిన వాళ్ళు మోదీకి స్నేహితులా అని ఆమె ఆశ్చర్యపోయారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మొదటి అరెస్ట్ అయ్యేది లోకేషే అని ఆమె చేసిన ప్రకటన సంచలనంగా మారింది. బతికున్నపుడే ఎన్టీఆర్ ను చంపేశారని చంద్రబాబునాయుడుపై ధ్వజమెత్తారు. ఇపుడు విగ్రహం పెడతానని చంద్రబాబు డ్రామాలాడుతున్నట్లు ఎద్దేవాచేశారు. చంద్రబాబుకు చేతనైతే ఎన్టీఆర్ కు భారతరత్న ఇప్పించాలని సవాలు చేశారు.

ఏపీలో అరాచకపాలన సాగుతోందన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు, లోకేష్ నీచరాజకీయాలు చేస్తున్నట్లు మండిపడ్డారు. లక్షల కోట్ల రూపాయలు దండుకుని ఇతర దేశాల్లో దాస్తున్నట్లు ఆరోపించారు. ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించిన చంద్రబాబు ఇపుడు విగ్రహాల పేరుతో రాజకీయం చేస్తున్నట్లు ఎద్దేవా చేశారు. చంద్రబాబు వెన్నుపోటుకు 30 ఏళ్ళు గడిచాయని గుర్తుచేశారు. మహానాయుకుడు ఎన్టీఆర్ మీద చంద్రబాబు చెప్పులు వేయించిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. ప్రతిష్ట దిగజారుతోందని అనుమానం వచ్చినప్పుడల్లా వెంటనే చంద్రబాబు ఎన్టీఆర్ పేరును వాడుకుంటాడన్న విషయం అందరికీ తెలిసిందే అని చెప్పారు. ఎన్టీఆర్ కు చంద్రబాబు చేసిన ద్రోహం గురించి అందరు తెలుసుకోవాలన్నారు.

నిజమైన ఎన్టీఆర్ అభిమానులు ఎవరూ చంద్రబాబు మాటలను నమ్మరని లక్ష్మీపార్వతి చెప్పారు. చంద్రబాబు నైజం గురించి ఎన్టీఆర్ చివరి ఇంటర్వ్యూలో ఏమిచెప్పారన్న విషయాన్ని అందరు తెలుసుకోవాలని అన్నారు. ప్రజలను మోసంచేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చినట్లు ఆమె తెలిపారు. తండ్రి, కొడుకులకు దోపిడీ తప్ప ఇచ్చిన హామీలను నెరవేర్చే ఆసక్తిలేదన్నారు.

ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో జగన్మోహన్ రెడ్డి దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచినట్లు గుర్తుచేశారు. జగన్ మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రజలందరు కోరుకుంటున్నట్లు లక్ష్మీపార్వతి తెలిపారు. రాష్ట్రంలో ఎవరికీ పండుగ సంతోషం లేదని చెప్పారు. పండుగల పేరుతో రాష్ట్రంలో జూదాలు, పందేలు, రికార్డింగు డ్యాన్సులు విచ్చలవిడిగా ప్రోత్సహిస్తున్నట్లు మండిపోయారు.

Read More
Next Story