
భూకుంభకోణం ఆరోపణలపై దద్దరిల్లిన అసెంబ్లీ
కొంతకాలంగా అసెంబ్లీ సమావేశాలంటే అధికార-ప్రతిపక్షాల మధ్య బలప్రదర్శనకు వేదికగా మారిపోయింది
ఒకపుడు అసెంబ్లీ సమావేశాలంటే ప్రజాసమస్యలపై చర్చించి పరిష్కారాలను కనుక్కునే వేదికగా జనాలు భావించేవారు. కాని కొంతకాలంగా అసెంబ్లీ సమావేశాలంటే అధికార-ప్రతిపక్షాల మధ్య బలప్రదర్శనకు వేదికగా మారిపోయింది. ఇపుడు విషయం ఏమిటంటే తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో శని, ఆదివారాలు సమావేశాలు జరిగిన తీరుచూస్తుంటే అందరిలోను ఇదే అభిప్రాయపం పెరిగిపోతోంది. శనివారం సభలో మైనింగ్ అక్రమాలపై నానా గోల జరిగితే, ఆదివారం సభలో భూకుంభకోణాలపై ఆరోపణలు, ప్రత్యారోపణలతో దద్దరిల్లిపోయింది. ‘మీరు అధికారంలోకి వచ్చిన రెండేళ్ళల్లో అక్రమమైనింగ్, భూకుంభకోణాలు జరిగాయి’ అని బీఆర్ఎస్ సభ్యులు ఆరోపించారు. దానికి జవాబు చెప్పాల్సిన అధికారపక్షం, ‘తొమ్మిదిన్నరేళ్ళ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ తో పాటు మరికొందరు పాల్పడిన అక్రమమైనింగ్, భూకుంభకోణాల మాటేమిటంటూ’ అని ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంఎల్ఏలు ఎదురుదాడికి దిగారు.
మీరు అక్రమమైనింగ్, భూకుంభకోణాలకు పాల్పడ్డారంటే కాదు కాదు మీరే అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటు సభలో గందరగోళం పెరిగిపోయింది. అందుకనే భూకుంభకోణాలపై హౌస్ కమిటి వేద్దామన్న రేవంత్, మంత్రుల ప్రతిపాదనకు బీఆర్ఎస్ సభ్యులు నోరెత్తలేదు. దాంతో అధికారసభ్యులు మరింతగా రెచ్చిపోయారు. ఈ నేపధ్యంలోనే కారుపార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ పైన బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎంఎల్ఏల్లో కడియం శ్రీహరి, దానం నాగేందర్ మరింతగా రెచ్చిపోయారు. బీఆర్ఎస్ నేతల భూకుంభకోణాలపై హౌస్ కమిటి వేయాల్సింది అని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను పదేపదే డిమాండ్ చేశారు.
దానం మాట్లాడుతు తన సొంతభూములను కేటీఆర్ కంపెనీకి రాయించేసుకున్న విషయాన్ని బయటపెట్టారు. అప్పట్లో ఏమీమాట్లాడలేక నోరుమూసుకుని కూర్చున్నట్లు చెప్పారు. కడియం మాట్లాడుతు అధికారంలో ఉన్నంత కాలం లక్షల ఎకరాల భూకుంభకోణాలకు పాల్పడిన బీఆర్ఎస్ కీలకనేతలు ఇపుడు భూకుంభకోణాలపై సిగ్గులేకుండా మాట్లాడుతున్నారంటు ఆరోపణలు గుప్పించారు. తాము అవినీతి, అక్రమాలకు పాల్పడి ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే చేస్తోందని ఆరోపణలు గుప్పించటం తప్పన్నారు. హౌస్ కమిటి వేస్తే భూకుంభకోణాలన్నీ బయటకు వస్తాయని మంత్రులు, అధికారపక్షం ఎంఎల్ఏలు సభలో గట్టిగా డిమాండ్ చేశారు.
రేవంత్ మాట్లాడుతు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు కీలకవ్యక్తులు ప్రైవేటుభూములను కూడా తమవారికి బదలాయించుకున్నట్లు మండిపడ్డారు. ధరణి పోర్టల్ ద్వారా లక్షలాది ఎకరాలను బీఆర్ఎస్ అక్రమంగా తమకు కావాల్సిన వారికి రాయించేసుకన్నట్లు ఆరోపించారు. చివరకు సేల్ డీడ్ లేకుండానే తమిష్టం వచ్చినవారికి భూములను రాయించేసుకున్నారని రేవంత్ చెప్పారు. మొత్తానికి అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చలు పరిష్కారాలు పక్కకపోయి నేతల భూకుంభకోణాలు, అక్రమ మైనింగ్ వ్యవహారాలపై ఆరోపణలు, ప్రత్యారోపణలకు వేదికగా మారిపోవటం ఆశ్చర్యంగా ఉంది.

