
అజారుద్దీన్ మంత్రి పదవి ఉంటుందా? ఊడుతుందా?
గవర్నర్ శివప్రతాప్ శుక్లా స్పందన ఏంటి?
మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ రాజకీయ భవిష్యత్ కు ‘డెడ్ లైన్’ దగ్గర పడుతోంది. ఒక వైపు సుప్రీంకోర్టు తీర్పు, మరో వైపు చట్టసభ సభ్యత్వం ఈ రెండింటి మధ్య ఆయన మంత్రి పదవి ఊగిసలాడుతోంది. రాజ్యాంగం (అర్టికల్ 75(5)) ప్రకారం ఎమ్మెల్యే గానీ, ఎమ్మెల్సీ గానీ కాకుండా మంత్రి అయిన వ్యక్తి 6 నెలల్లోపే ఏదో ఒక సభకు ఎన్నిక కావాలి. 2025 అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్ 30 ఏప్రిల్ 2026 నాటికి ఉభయ సభల్లో ఏదేని ఒకదానిలో సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంది. అయితే ఆ డెడ్‌లైన్ ఏప్రిల్ చివరితో ముగియనుంది. దీంతో అజారుద్దీన్ ఫ్యూచర్ ఏంటి? ఇంతకు ఆయన మంత్రి పదవి ఉంటుందా? ఊడుతుందా?
ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో అజారుద్దీన్ ఎమ్మెల్సీగా ఎన్నికవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే కోదండరామ్, అజారుద్దీన్ పేర్లను సుప్రీంకోర్టు పెండింగ్‌లో పెట్టింది. ఏప్రిల్ లోపు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే అజారుద్దీన్ ఎమ్మెల్సీ అయ్యే అవకాశం ఉండదు. ఈ ఏడాది నవంబర్ వరకు కొత్తగా ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. 2026 నవంబర్‌లో గోరటి వెంకన్న, బసవరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్ పదవీకాలం ముగుస్తుంది. కేవలం గవర్నర్ కోటా మాత్రమే ఆయనకు ఉన్న ఏకైక మార్గం. అజారుద్దీన్‌కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వస్తే సమస్య తీరిపోతుంది. కానీ తీర్పు ఆలస్యమైతే లేదా ప్రతికూలంగా వస్తే మాత్రం ఆయన మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సిందే.
1) సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉన్నందున గత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ ఫైల్‌పై నిర్ణయం తీసుకోలేదు. అయితే, ఫిబ్రవరి 3న సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ, గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చని, కోర్టు విచారణ దానికి అడ్డంకి కాదని స్పష్టం చేసింది. దీంతో అజారుద్దీన్ ఎమ్మెల్సీ నియామకం సుగమం అవుతుందని ప్రభుత్వం భావించినా, అప్పటి గవర్నర్ బదిలీ కావడంతో ఫైల్ మళ్లీ పెండింగ్‌లోకి వెళ్లింది. ప్రస్తుతం కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
కొత్త గవర్నర్ ప్రభుత్వం పంపిన సిఫార్సులను యథాతథంగా ఆమోదిస్తే రేవంత్ రెడ్డి సర్కార్‌కు పెద్ద ఊరట లభిస్తుంది. ఒకవేళ గవర్నర్ మళ్ళీ ఏవైనా కొర్రీలు పెడితే మాత్రం, అది ప్రభుత్వం వర్సెస్ రాజ్‌భవన్ వివాదానికి దారితీస్తుంది. అజారుద్దీన్ తన మంత్రి పదవిని కోల్పోవడం ఖాయం.
2) బీఆర్‌ఎస్ పార్టీ నుంచి విబేధించిన కల్వకుంట్ల కవిత రాజీనామాతో ఓ ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉన్నప్పటికీ అది స్థానిక సంస్థల ఎన్నికల కోటా కావడంతో పరిషత్ ఎన్నికల తర్వాతే అక్కడ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. ఆమె నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ స్థానం మళ్లీ నింపాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలి. 42% రిజర్వేషన్ల పంచాయితీ తెగకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం అసాధ్యం.
3) మరో ఆప్షన్ పై గాంధీభవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న బల్మూరి వెంకట్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరి చేత రాజీనామా చేయించి ఆ స్థానానికి అజారుద్దీన్‍ను పంపించే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే ఇటీవల బల్మూరి వెంకట్‍కు, ప్రభుత్వం మండలిలో విప్ గా అవకాశం కల్పించింది. దీంతో బల్మూరి రాజీనామా అంశాన్ని అధికార పార్టీ పక్కన పెట్టింది.
ఇక మహేశ్ కుమార్ గౌడ్ పేరు వినిపిస్తున్నా పీసీసీ చీఫ్‍గా ఉన్నందునా అయన చేత రాజీనామా చేయిస్తారా అనేది అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
"అవసరం అనుకుంటే ప్రభుత్వం అజారుద్దీన్ కు మరో ఆరు నెలల అదనపు పొడిగింపు ఇవ్వగలదు. కానీ ఆ నిర్ణయం తీసుకోకపోవచ్చు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్‌ని కలుసుకుని ఈ విషయాన్ని వివరించారు", అని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం. పద్మనాభ రెడ్డి ఫెడరల్ తెలంగాణాతో చెప్పారు. ఆయన అంచనా ప్రకారం, గవర్నర్ సానుకూలంగా స్పందించే అవకాశముంది.
“మంత్రివర్గంలో ఉన్న ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలి. అజారుద్దీన్ విషయంలో రాజ్యాంగ సంబంధమైన సమస్య వచ్చినప్పటికీ, ఆయన రాజీనామా చేస్తారు. తర్వాత ప్రభుత్వం మళ్లీ ఆయన్ను నియమిస్తుంది. ఈ విధంగా ఆయనకు మంత్రి పదవిలో ఎలాంటి ఇబ్బంది రాదు,” అని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆర్‌వీ చంద్రవదన్ తెలిపారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసిన దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణల పేర్లను గవర్నర్ తిరస్కరించడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదం కొనసాగుతుండగానే, రేవంత్ ప్రభుత్వం కోదండరామ్, అజారుద్దీన్ పేర్లను గవర్నర్ కోటాకు సిఫారసు చేసింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ నియామకాలపై ఇప్పటివరకు సుప్రీంకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇదే అజారుద్దీన్‌కు అతిపెద్ద అడ్డంకిగా మారింది. అజారుద్దీన్ ను కంటిన్యూ చేసేందుకు రేవంత్ సర్కార్ ఎలాంటి ఏర్పాట్లతో ఉందనేది ఆసక్తిగా మారింది. ఏప్రిల్ నెలాఖరు లోపు అజారుద్దీన్ ఎమ్మెల్సీగా ప్రమాణం చేయకపోతే, ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వానికి నైతికంగా ఇబ్బందికరంగా మారుతుంది.

